Previous Page Next Page 
భారతి పేజి 6

    భారతి ముఖం త్రిప్పి  రాధమ్మవైపు  ఓరగా  చూసింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉంది బహుశా నిద్రపోతున్నదేమో! ఆమె ఆలోచనలు తిరిగి తన మీదకే మొగ్గాయి.

    యీనాడు  తండ్రి స్థితి  చూసేసరికి  ఆమె హృదయం  కలచి వేసింది. సరిగ్గా ఎట్లా ఉన్నదంటే.... అనుకోకూడదు  గాని ఇంకా రోజులు ....

    ఒళ్ళు జలదరించింది  ఛీ! ఏమిటి పాడు ఆలోచన? మనుషులు ఎంత వికారంగా ఆలోచిస్తారో  ఆమెకీ క్షణంలో  తెలిసివచ్చింది. ఒక్కొక్క మనిషీ, వివిధ దపల్లో  గురిఅయ్యే  ఆలోచనలను, ఆ ఒడిదుడుకుల  ప్రవాహినీ ఏ మహానుభావుడైనా  విశదీకరించగలిగితే  మనిషికీ, మనిషికీ  గల అవినాభావ సంబంధాలు నశించి, మానవ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.

    ఎంతటి గంభీర సన్నివేశంలోనూ  వింత వింత ఆలోచనలు వస్తూ వుంటాయి ఒక్కోసారి  భారతికి. "ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా  ఉండే భార్యాభర్తలు కూడా  ఒకరిని గురించి ఒకరు  అనేక సందర్భాలలో వికారంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట" అనుకుంది  విస్మయంగా.

    మళ్ళీ ఆలోచనలు  తండ్రివైపు మళ్ళాయి. అంతటి అమృత హృదయుణ్ణి, ప్రేమైకమూర్తినీ, నిర్మల చరిత్రుణ్ణి ఇంకొకర్ని చూడలేదు. ఈ సమయంలో  యీ సంబంధాన్ని తాను త్రుణీకరిస్తే  ఆయన మనసు ఎంత గాయపడుతుందో. అది ఎంతటి  ఉపద్రవానికి దారితీస్తుందో  ఆమె ఊహించగలదు. ఆయన మనస్సు  కష్టపడటానికి  వీలులేదు. ఆయనకోసం  ఎంత త్యాగమైనా  చేయగలగాలి.

    భారతి కనులలో నీళ్ళు నిండాయి. "జరగనియ్యి. అలాగే  జరగనియ్యి!" ఆమె చివరకు మనసు దృఢపరుచుకుంది. 'ఈ పెళ్ళి నాకు సమ్మతమేనని  ఉదయమే  నాన్నకి చెప్పివేస్తాను.'

    "ఎవరూ అతను? సారథా  అతని  పేరు! అతని రూపం నాకు గుర్తుంది. మరిచిపోలేదు. బావుంటాడులే. కాదనటంలా  ఒకవేళ  నా స్వార్ధానికే  యీ పెళ్ళి ఒప్పుకుంటున్నానా?"

    "ఛీ  ఛీ  ఏం కాదు. ఏమీ కానే కాదు."

    ఆలోచనలతో అపసీ సొలసి  ఏ అర్దరాత్రికో  భారతి కన్నుమూసింది. రాధమ్మ ఆ రాత్రంతా జాగారం చేసిందన్న  సంగతి ఆమెకు తెలియదు.
   

                                 *    *    *


    మరునాటి ఉదయం ఎనిమిదింటికల్లా  మల్లికా స్నానం  ముగించుకుని, ముస్తాబు చేసుకుని  గౌరీపతిగారి ఇంటికి వచ్చింది. రాధమ్మ లోపల వంటపనిలో  నిమగ్నురాలయి  వుంది. భారతి వాకిటి గదిలో నేలమీద పిచ్చిగీతలు గీస్తూంది. ఇంకా స్నానం  అదీ ఏమీ చేసినట్లు లేదు. బద్ధకంగా, మత్తు ఇంకా విడనట్లున్న ఆమె ముఖంమీద ముంగురులు చెదురుగా పడుతున్నాయి. అలికిడి విని తల ఎత్తి  ముఖంమీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ "రా మల్లికా! అందుకనేనా యీవేళ  ఎండ కాసింది! ఎన్నడూ లేనిది ఇలా ప్రొద్దుటే  చూడముచ్చటగా  తయారై వచ్చా వేమిటి చెప్మా!" అన్నది.

    మల్లిక ఆమె ప్రక్కకు వచ్చి  చతికిలబడుతూ "అదేం కాదు నువ్వీరోజు  ఇంత బద్ధకంగా వుండటం వల్లనే యీ రోజింత  ఎండకాసింది" అంది.

    "ఆహా! అలాగటా?"

    "అవునుగాని  పెళ్ళి కూతురా  ఏమిటీ పగటివేషమీ వేళ?"

    "ఉంది విశేషం. నేను నిజంగానే  పెళ్ళికూతురిని కాబోతున్నాను."

    "అయిందీ? అంగీకరించావూ? నిన్నటి బడాయిలన్నీ  ఏమయినాయి పిల్లా!" అంటూ ఆమె జడ పుచ్చుకుని లాగింది మల్లిక.

    "బడాయిలన్నీ  గాలిలో  కలిసి పోయినాయి మల్లికా!" అంతలోనే భారతి ముఖం గంభీరంగా మారిపోయింది. శూన్యంలో గంయాన్నేదో  వెదుక్కుంటున్నట్లు  రెపరెపలాడినాయి  కన్నులు.

    "ఎందుకు పెళ్ళి వద్దన్నానో. ఈ పదిరోజులనుండీ  మనస్సులో దేన్నుంచుకుని  కుమిలిపోతున్నానో  చెబుతా నుండు. ముందు బయట తలుపులు  మూసిరా."

    ఆమె మాటల్లోని  ఆవేశం  మల్లిక  అర్ధం చేసుకోలేక  "ఏమిటే, భారతీ యిది! క్షణంలో వివిధ రూపాలు దాలుస్తూంటావు" అంది.

    "చెప్పిన పని చెయ్యి  ముందు మిగతాది తరువాత"

    మల్లిక లేచివెళ్ళి వీథి తలుపులు  గడియవేసి వచ్చి మళ్ళీ క్రింద కూర్చుని "ఊఁ, చెప్పు త్వరగా" అంది ఓపిక పట్టలేనట్టు.

    "చెరువు దగ్గరకు నేను రానన్నానని  కారణం  అడిగావు కదూ?"

    మల్లిక అవునన్నట్లు  తలవూపింది.

    "బిందెను నిన్నే ముంచమంటే  నివ్వెరపోయావు కదూ?"

    "పోయిన మాట నిజమే."

    "పెళ్ళి చేసుకోనని గట్టిగా అంటే బడాయి లనుకున్నావు."

    "అనుకోనేమిటి?"

    "ఇప్పుడు  చూడయితే" అంటూ  భారతి జాకెట్ వీపుమీద నుంచి భుజం క్రిందికి వచ్చేవరకూ పైకిలాగి, వీపు ఆమెకు కనిపించేటట్లుగా ప్రక్కకి తిరిగింది.

    "చందనపు బొమ్మలాంటి  నీ వంటిమీద వికారమైన  ఈ మచ్చ ఏమిటే?" ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేస్తూ  అంది మల్లిక.
    "ఇంక చూడు!" భారతి  భుజం ప్రక్కనుంచి  జాకెట్టు  తొలగించింది.

    "ఇవన్నీ ఏమిటి? ఎందుకీ మచ్చలు?" మల్లికకు హఠాత్తుగా భయం వేసినట్లయి కంఠం వణికింది.

    "అవును, మచ్చలు."

    భారతి విచిత్రంగా  నవ్విందనుకుంది మల్లిక. కాని ఆమె నవ్వలేదు. పెదవులు వింత కదలిక కదిలినాయి. "అది తెలుసుకుందామనే  విజయవాడ  వెళ్ళి చూపించుకొచ్చా, 'లెవ్రసీ!' అన్నాడు డాక్టరు. అంటే అర్ధమయింది కదూ. కు....ష్టు...." 

    "భారతీ" అని గట్టిగా  కేకవేసి  రెండు చేతుల్తోనూ చెవులు మూసుకుంది మల్లిక. త్రుటిలో ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.

    భారతి స్నేహితురాలివంక చూడలేదు.నిశ్చలమైన కంఠంతో చెప్పుకుపోతూంది. "అవును అదే నాకు. అదే నాకు మల్లికా! పుట్టి బుద్దెరిగాక ఎవరికీ నేను అన్యాయం చెయ్యలేదు ఎవర్నీ చూసి అసహ్యించుకోలేదు. రోగగ్రస్తులను  చూస్తే జాలిపడేదాన్ని. అలాంటిది నామీద విధి పగబట్టింది. ఈ రోగంతో  తగుదునమ్మా  అని నలుగురిలోకి ఏ ముఖం పెట్టుకురాను! అందుకే ఇంట్లో దాక్కోవటం మొదలుపెట్టాను. అదీ సాగలేదు. అంతటితో ఆగక విధి మరో పరీక్షకు కూడా నిలబెట్టింది. ఎంతో  ఆలోచించి యీ నిర్ణయానికి  వచ్చాను మల్లిలా! ఈ పెళ్ళికి  అంగీకరించాను. 
  
    చెప్పటం  పూర్తిచేసి  అయిదు నిమిషాలసేపు  శూన్యంలోకి  చూస్తూ వుండిపోయింది. తరువాత యీ లోకంలోకి  వచ్చిపడి, తల ప్రక్కకి త్రిప్పి  చూసేసరికి  మల్లిక లేదు. తలుపులు తెరిచి వున్నాయి.

    "భయపడ్డావా మల్లికా! భరించలేకపోయావా? పిచ్చిపిల్లా!" ఆమె పెదవులపై నిర్వికారమైన చిరునవ్వు అంకురించింది.

    భారతీ! మల్లికా  చిన్నప్పటినుంచీ  ఒకరిని విడిచి ఒకరు విడువకుండా  జంటగా పెరిగిన ప్రాణస్నేహితులు. ఆ పల్లెటూరుకు  వారి కలయిక, వారు చిలిపిగా తిరగడం, వారి ఉనికి  ఒక వింత శోభనూ, వాతావరణాన్ని  కలిగిస్తూ వుండేవి ఇద్దరిదీ  ఇంచుమించు  ఒక ఈడే. థర్డు ఫారం  వరకూ  అక్కడి స్కూల్లోనే  చదువుకుని, తరువాత బయట ఊళ్ళకి వెళ్ళి చదువుకొనటానికి  పరిస్థితులు అనుకూలించక, చందరాలలోనే కలిసికట్టుగా  ప్రైవేటుగా  చదివి మెట్రిక్ పాసయ్యారు. తండ్రి ఆరోగ్య  పరిస్థితి బాగులేనందువల్లా, ఆర్ధిక పరిస్థితి అనుకూలించనందు వల్లా తరవాత  భారతి చదువుకు ఉద్వాసన చెప్పింది. మల్లిక చదువు కొనసాగించమని  ఆమెను ఎంతో బలవంతపెట్టింది గాని ప్రయోజనం లేకపోయింది. ఇక విధిలేక, ఆమెను విడవలేక విడిచివెళ్ళి మల్లిక గుంటూరు ఉమెన్స్ కాలేజీలో  చేరింది. డిసెంబరు సెలవులకు పదిహేను రోజుల క్రిందటే ఈ ఊరు వచ్చి వాళ్ళ  అమ్మగారికి ఒంట్లో నలతగా  వున్న కారణంగా  సెలవు గడువును కాస్త పొడిగించి అక్కడే రోజులు గడుపుతూంది.

 Previous Page Next Page