Previous Page Next Page 
భారతి పేజి 4

    "నాన్నా!" అంది భారతి  ఆయన గుండె  కంటుకుపోయి. "అలా అనకండి, నాన్నా! నేను వినలేను" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.

    "వినక తప్పదమ్మా, యీ వేదనంతా  నువ్వీ  రోజు  భరించాలి. నీ అయిష్టానికి  కారణం నాకు తెలుసు. ఆ డాక్టరు చెప్పింది నిన్ను నమిలేస్తోంది, యీ సంబంధానికి  అంగీకరిస్తే  వాళ్ళని వంచించినట్లు అవుతుందని నీ భావన ఇది వంచించటం  కాదమ్మా కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం  చేసుకుని, జీవితాన్ని  సరిదిద్దుకోవటం! నిన్ను చేసుకున్న  వ్యక్తి  అదృష్టహీనుడెలా  అవుతాడమ్మా, నీ ఉన్నత స్వభావం, వ్యక్తిత్వాల వల్ల  పునీతుడై ప్రకాశిస్తాడుగాని" అని గౌరీపతిగారు ఆమెను సముదాయించటానికి  ప్రయత్నించాడు.

    భారతికి తళుక్కుమని  ఏదో ఆలోచన  తోచి, తండ్రిని  వదిలి ఇవతలకు  జరిగి  పిన్ని వంక సాభిప్రాయంగా  చూసింది ఆంతర్యంలోని  బాధతో, ఆలోచనలతో  కొద్దిగా  బరువెక్కి వున్నాయి ఆమె కనులు.

    "పిన్నిని  చూశావా, నాన్నా? ఆమె బ్రతుకలా  ఎందుకు బండలయింది?"

    తూణీరంలా  వచ్చిన యీ  ప్రశ్నకు  గౌరీపతిగారు  అప్రతిభుడై పోయాడు. నోట మాట వెలువడక కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు.

    "పిన్నికి రూపంలో  ఏ ఆక్షేపణా లేదు. ఆమె ముఖంలో వెలిగే కళ ఏ కొద్దిమంది అదృష్టవంతులకో  వుంటుంది. కాని ఆమె మూగదన్న  సత్యాన్ని  దాచిపెట్టి, బలవంతంగా  పెళ్ళిచేశారు. పర్యవసానంగా పసుపుబట్టలు  ఆరనైనా ఆరకుండా  పుట్టింటికి  తిరిగి వచ్చింది. జీవితంలో  మళ్ళీ ఆమె భర్త కన్నెత్తి ఆమెవంక చూడలేదు. పిన్ని బ్రతుకట్లా  తెల్లవారి పోవటానికి  కారణమేమిటి?"
 
    ప్రసంగం తనవైపు  మళ్ళేసరికి రాధమ్మ  నిరుత్తరురాలై వెనక్కి  జరిగి, గోడ కానుకుని  నిలబడిపోయింది.

    గౌరీపతిగారు  అనుకోకుండా  తగిలిన దెబ్బలో నుండి  నెమ్మదిగా కోలుకున్నాడు. "ఆమె అత్తింటివాళ్ళు  కసాయివాళ్ళు. ఏ మాత్రం హృదయమున్నా  అంత నిర్దాక్షిణ్యంగా  ప్రవర్తించి ఉండేవారు కాదు" అన్నాడు నెపాన్ని  అవతలి వాళ్ళమీదకు నెట్టివేస్తూ.

    "కాని వాళ్ళ కసాయితనం  బయటపడటానికి  అవకాశమిచ్చింది పిన్నమ్మ తాలూకూ పెద్దలేగా. ఆ విషయం ఒప్పుకోవేం, నాన్నా?"

    "పరిస్థితుల ప్రాబల్యం  తల్లీ, అది. ఎంతో  సహృదయంతో ఆలోచిస్తేనేగాని  అర్ధం చేసుకోలేవు."

    "అర్ధం చేసుకుని ప్రయోజనమేమిటి, నాన్నా? ఆమె జేవితాన్ని ఉద్దరించటానికి పెద్దలు, కంకణం కట్టుకుని  విధి  నిర్వహణ పూర్తి చేశారు. ఏది ఏమయితేనేం? పిన్ని  ఈ తతంగంలో  ఓ సమిధగా  ఆహుతయింది."

    ఆమె ఆవేశం చూసి  గౌరీపతిగారికి  విస్మయం  కలిగింది. "అందరి విధివ్రాతా  ఒకటిగా  వుంటుందా, తల్లీ నీ జీవితం  శుభ్రప్రద మౌతుందని  నా మనస్సు నొక్కి  చెబుతోంది" అన్నాడు చిన్నగా వినిపించీ వినిపించనట్టు.

    "ఒక కుష్ఠు రోగి  జీవితం  శుభప్రదమై భాసిస్తుందని  ఎలా భావించావు, నాన్నా?"
  
    ఈ మాటలు  విని గౌరీపతిగారు  నిలువెల్లా  కంపించిపోయాడు. "భారతీ! అలా మాట్లాడకు. ఆ మాట నీ నోటి వంట  రానివ్వకు. నేను భరించలేను" అని అరిచాడు  ఆర్తిగా.

    "కొన్ని  సత్యాలు  అరుచిగా  ఉన్నా  భరించాలని  నువ్వేగా చెప్పావు, నాన్నా?"

    "చెప్పాను, ఇది నేను భరించలేని  సత్యం. ఊహించలేని సత్యం. అసలు సత్యం కానేకాదు. నువ్వు....నువ్వు....నీకా ఆ మాయదారి రోగం? అది నీకూ నీ భవిష్యత్తుకూ  మధ్య మహారణ్యాలు సృష్టించిందా? నీలోని  ఈ సంక్షోభం  చూడటానికేనా  ఇన్నాళ్లూ నిన్ను అల్లారుముద్దుగా  పెంచుకున్నాను?" చూస్తూ చూస్తూండగానే ఆయన కళ్ళు  ఎర్రబడిపోయి, చెమ్మగిల్లాయి  కూడా. గాద్గద్యంలో  నిండి గొంతు తడబడుతూంది. గుండె  బలహీనంగా  మారి, వడివడిగా  కొట్టుకుంటూంది.

    తడిసి, విప్పారిన కళ్ళతో  తండ్రి  దీన వదనం  కేసి విస్మయంగా  చూస్తున్నది భారతి.

    ఉన్నట్లుండి  ఆయన చెయ్యి ఛాతీ ఎడమ భాగంమీద  వేసి నొక్కుకున్నాడు. ముఖంలో వర్ణించనలవిగాని  బాధ గోచరించింది. భారతి గతుక్కుమని  ఒక అడుగు ముందుకు వేసింది. గోడ కానుకుని నిలబడ్డ రాధమ్మ భయం భయంగా చూసింది.

    "ఏమిటి, నాన్నా? గుండెల్లో నొప్పి వచ్చిందా?" తడారిపోతూన్న గొంతుతో అడిగింది భారతి.

    గౌరీపతిగారు  ముఖం రక్తఅంతా  అక్కడి నుండి  దిగజారిపోయినట్లు  తెల్లగా  పాలిపోయింది. శరీరమంతా చెమటలు క్రమ్మివేశాయి. చూపుల్లో  కాంతి నశించినట్లయింది. జవాబివ్వకుండా  విశ్వప్రయత్నం మీద గోడివారనున్న  నవ్వారు మంచం దగ్గరకు  నడుస్తూండగా, భారతి చప్పున పరుగెత్తి మంచం వాల్చి, తండ్రి భుజం  ఆసరాగా పట్టుకుంది. రాధమ్మ కంగారుగా లోపలి నుండి  దిండు పట్టుకువచ్చి  వేసింది. గౌరీపతిగారు  తన శుష్కశరీరాన్ని కూతురి సాయంతో  మంచంమీద వాల్చి, నీరసంగా కళ్ళు మూసుకున్నాడు.

    "ఎలా ఉంది, నాన్నా? వెళ్ళి ఆచార్లుగారిని  తీసుకు రమ్మంటావా?" అనడిగింది  భారతి ఆత్రంగా  ముందుకు వంగి.

    ఆయన కళ్ళు మూసుకునే మెల్లిగా  చేయెత్తి  అక్కర్లేదన్నట్లు  సంజ్ఞ చేశాడు.

    ఆ స్థితిలో  ఆయన్ని  చూడగానే ఆమెకు హృదయమంతా  ద్రవీ భూతమైపోయి, కళ్ళల్లో నీళ్ళు నిండుకొచ్చాయి  తను కూడా  తండ్రి పక్కనే కూర్చుని ఛాతీమీద చెయ్యిపెట్టి రాస్తూ  ఆయన ముఖంలోకి  జాలిగా  చూస్తూంది. రాధమ్మ కిటికీలో  వున్న  విసనకర్ర  అందుకుని గౌరీపతికి  విసురుతూంది. 

    చాలాసేపటిదాకా  ఆయన కళ్ళు మూసుకుని  అలానే  పడుకుని ఉన్నాడు. ఈలోగా  భారతి ఒకసారి లేచివెళ్ళి  గోడనున్న  దీపం పెద్దది చేసి వచ్చింది.

    మౌనంగా, మూగగా ,వ్యధగా కొన్ని క్షణాలు గడిచాక గౌరీపతిగారు నెమ్మదిగా కళ్ళు విప్పి, నీళ్ళు కారుతూన్న కళ్ళతో  ఎదురుగా కనబడిన కూతురివంక చూస్తూ, "ఇప్పుడు కాస్త బాగానే ఉందమ్మా" అన్నాడు.

    భారతి ముఖం  ప్రక్కకి  తిప్పుకొని  కళ్ళు  తుడుచుకుంటూంది  పైట  చెంగుతో.

    "ఏడుస్తున్నా! పిచ్చితల్లీ!" అంటూ రెండు చేతులూ  ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని అక్కున చేర్చుకుని, "నిన్ను  నువ్వు కించపరుచుకుని ఇహ ముందెప్పుడూ  మాట్లాడకు, భారతీ! అలాంటి మాటలు చావుకు నన్ను సమీపంగా  ఈడ్చుకుపోతాయి" అన్నాడు భారంగా.

    భారతి కష్టంమీద దుఃఖాన్ని  దిగమింగుతూ. "అలాగే, నాన్నా" అంది ఎలాగో.

    ఒక నిమిషం మెదలకుండా  ఊరుకుని గౌరీపతిగారు, "నిన్ను ఈ ఏకాంతమయిన చెర నుండి, దురవస్థ నుండి తప్పించాలనే దూరమాలోచించి  ఈ సంబంధాని కంగీకరించాను, భారతీ! నీ క్కాబోయే భర్త సద్గుణ సంపన్నుడు. నీ భవిష్యత్తు భారాన్ని  అతడే  స్వీకరించి బాధ్యత వహించి నీ జీవితానికొక  చక్కని  రూపాన్ని తీర్చిదిద్దుతాడు, ఏరికోరి వచ్చిన గొప్పింటి సంబంధాన్ని  కాదనటం వివేకం కాదమ్మా" అని, ఓ క్షణమాగి. "తొందరలేదు. ఆలోచించుకుని  రేపు  ఉదయం చెప్పమ్మా" అన్నాడు.

    భారతి ఏమీ జవాబివ్వలేదు. ఆలోచిస్తూ మౌనంగా  ఊరుకుంది.

    ఆ రాత్రి  గౌరీపతిగారు రోజూ చేసే ఫలహారం కూడా చేయలేదు. ఒక గ్లాసుడు మజ్జిగ త్రాగి పడుకున్నాడు.
    వేసవి రోజులు అయితే పెరట్లో  మంచాలు వేసుకుని  అందరూ ఆరుబయటే  పడుకుంటారు. ఇప్పుడింకా  శీతాకాలం కావడంవల్ల  లోపల గదుల్లోనే  పడుకుంటున్నారు. గౌరీపతిగారు  ముందు హాల్లో పడుకుంటారు: భారతీ, రాధమ్మా  పక్కగదిలో పడుకుంటారు.

 Previous Page Next Page