గూడ్స్ ట్రయిన్ దగ్గరవుతున్నది.
చకచకా గట్టుదిగి నదిలోకి వచ్చింది సంజీవి.
ఆమెలో గుండె దడ ఎక్కువైంది.
అదురుతున్నగుండెను అదుపులో వుంచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ, నీళ్ళులేని, ఎండిపోయిన ఆ పెన్నానది ఇసుకలో కూర్చున్నదామె.
ఆ రైలు వంతెన కింద నుంచి....గూడ్స్ బోగీ బేస్ మెంట్ కింద అతను ఏం చేస్తున్నదీ బైనాక్యులర్స్ లో స్పష్టంగా కాకపోయినా, లీలా మాత్రంగా కనిపిస్తున్నదామెకు.
బ్రిడ్జిని సమీపించడంతో గూడ్స్ కొంచెం స్లో అయినా, ఆ వేగాన్ని అందుకోవాలన్నా, అంత వేగంలో దిగాలన్నా మానవమాత్రులకు సాధ్యం కాని పని!
పెన్నానది మీద రైలు వంతెనపైకి గూడ్స్ ట్రెయిన్ చేరేటప్పటికి....అతను ఐరన్ సేఫ్ బేస్ మెంట్ ను గుండ్రంగా కట్ చేశాడు.
అయితే, ఇదివరకటి పొరపాటు జరగకుండా, ముందు జాగ్రత్తగా బేస్ మెంట్ ను పూర్తిగా కట్ చేయకుండా రెండుచోట్ల చిన్నపాటి గ్యాప్ వుంచాడు. గూడ్సు వంతేనపైకి చేరాక గ్యాస్ కట్టర్ తో మిగిలిన భాగాన్ని కరిగించే ప్రయత్నం చేశాడు.
ఆటోమాటిక్ గా ఒక వైపు కట్ కాగానే పైనవున్న బరువుకు ఆ బేస్ మెంట్ ముక్క ఆటోమాటిక్ గా పక్కకు ఒరిగిపోయింది.
అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించకపోవడంవల్ల ఒక్కసారిగా లోపలవున్న వెండి నాణేలు అతని ఒడిలో గట్టిగా పడిపోయాయి.
ఆ బరువుకు బాలెన్స్ తప్పి అతని రెండు కాళ్ళూ బేస్ మెంట్ నుంచి జారిపోయాయి.
ఆ దృశ్యం చూసిన సంజీవి గుండెలయ తప్పింది. కెవ్వున కేక పెట్టింది.
భయంతో కళ్ళుమూసి తెరిచేటప్పటికే....బ్రేక్ రాడ్ ను రెండుకాళ్ళతోమెలికవేసి అత్యంత లాఘవంగా పక్కకు తిరిగాడతను.
అతని మీద పడిన నాణేలు కిందకు జారిపోయాయి....
ఆకాశం నుంచి నక్షత్రాలు క్రుమ్మరించినట్టు....ఐరన్ సేఫ్ నుంచి గలగలా శభ్దాలు చేసుకుంటూ.....పట్టాల మధ్యగా కింద వున్న పెన్నానది ఇసుకలో పడిపోసాగాయి వెండి నాణేలు.
ఆశ్చర్యంగా చూసి గుండెల మీద చేయి వేసుకుని తృప్తిగా వూపిరి పీల్చుకుంది సంజీవి.
అతను ఎయిర్ జాకెట్ లోనుంచి తొడుగులను తీసి చకచకా మాగ్నేట్స్ కు తొడిగాడు.
అప్పటి కింకా బ్రిడ్జిని దాటిపోలేదు ఆ గ్రూడ్స్ ట్రెయిన్.
మానవ నాగరికతకు కొత్తవూపిరి పోసిన విద్యుత్ పరిశోధకుల సంచలనాత్మకమైన ప్రయోగాల ఫలితమే సూపర్ కండక్టవిటీ!
కాల్షియం-బేరియం_, కాపర్ ఆక్సయిడ్ కానీ, లేదా ఇట్రియా_బేరియం_కాపర్ ఆక్సయిడ్ పదార్ధాన్ని కానీ మైనస్ నూట ఎనభై మూడు డిగ్రీల వద్ద ద్రవ నైట్రోజన్ ను వుపయోగించి చల్లబరిచినట్టయితె అది సూపర్ కండక్టర్ గా మారుతుంది. దాని ద్వారా విద్యుత్ సరఫరా ఏ విధమైన నష్టం లేకుండా చేసుకోవడమేకాక బలమైన అయస్కాంత క్షేత్రాలుగా కూడా చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ సూపర్ కండక్టర్లు అయస్కాంతాలను వికర్షిస్తాయి కూడా.
అందుకే వీటిమీద వుంచిన అయస్కాంతాలను గాలిలో తేలుతూ పైకి లేస్తాయి. ఈ విధానాన్ని 'లెవిబేషన్' అంటారు.
దీన్ని ఆధారం చేసుకొని చక్రాలులేని అయస్కాంతాలు గల రైళ్ళు నడుపవచ్చు. ఈ సూపర్ కండక్టర్లను వుపయోగించినట్లయితే నేలమీద ఆనకుండా ఆరంగుళాల ఎత్తులో పడిపోవడమనే ప్రశ్నే లేకుండా ప్రయాణం చేస్తాయి రైళ్ళు!
ఇలాంటి సూపర్ కండక్టవిటీ నిక్షిప్తమై వున్న పొరలను వుపయోగించడం వల్లనే అయస్కాంతశక్తి బయటకు రాలేకపోయి మామూలు ఇనుపముద్దల్లా వుండిపోవడానికి కారణం.
ఎంతో జాగ్రత్తగా శరీరాన్ని పైకి తెచ్చి హుక్ మీదకు చేరుకున్నాడతను.
గ్యాస్ కట్టర్ తో పాటు ఒంటిమీద వున్న అయస్కాంతాలను చక చకా తొలగించి ఎయిర్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
అతనూహించిన విధంగానే బ్రిడ్జి మధ్యకు రాగానే గూడ్స్ వేగం మందగించింది.
వెనుకా ముందూ ఆలోచించకుండా వెంటనే నీళ్ళులేని పెన్నానదిలోకి అతను దూకేశాడు.
రిజర్వ్ బ్యాంక్ కు చేరవలసిన కోటిరూపాయల వెండి నాణేలు....అంటే సుమారు పదహారువందల కిలోల వెండి. పెన్నానది ఇసుక దిబ్బలపై గుట్టలు గుట్టలుగా పడిపోయాయి.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఊపిరి బిగపట్టుకుని అతడు చేసిన సాహసాన్నంతా తిలకిస్తున్న సంజీవి శిలాప్రతిమే అయింది. తనకు ఎదురుగా వున్న అతనిని ఒక హీరోని చూసినట్టు గుడ్లప్పగించి చూస్తోంది!
అసలు ఆ ఘనకార్యం చేసింది ఇతనేనా అన్న సందేహమూ కలుగుతోంది.
ఆ అద్బుతావస్థ నుంచి వాస్తవంలోకి వచ్చిన సంజీవి పాదాలు మెల్లగా కదిలాయి.
"కంగ్రాచ్యులేషన్స్....అధికారి _ మైడియర్ స్వీట్ హార్ట్...!" అంటూనే పరుగున వెళ్ళి అతనిని కౌగిలించుకున్నంత పని చేసింది సంజీవి.
సీరియస్ గా చూశాడు అధికారి.
ముఖం చిట్లించుకుంది సంజీవి.
* * *