'లేవే లేచి పిల్లాడికి పాలుపట్టు' అంటూ, రత్న పిల్లవాడి తల్లిని లేపుతూండగా రైలు దిగిపోయాను.
కాఫీ తాగాక కాస్సేపు ఫ్లాట్ ఫారంమీద పచార్లుచేసి కదులుతూన్న రైలు ఎక్కాను. నా కంపార్టుమెంటులో రత్నగానీ, రగ్గుకప్పుకొని పడుకొని ఉన్న స్త్రీగానీ లేరు. వారి సీటులో పనివాడు మాత్రం ఆడుకొంటున్నాడు, పొత్తిలి గుడ్డలలో. కంగారుగా తలుపు దగ్గిరికి వెళ్ళి ఫ్లాట్ ఫారం మీద కలియజూచాను. వాళ్ళు ఎక్కడినుండో పరిగెత్తుకొని వచ్చి పెట్టెలోకి ఎక్కుతారన్ననా ఊహ అబద్దమయింది. బండి ఫ్లాట్ ఫారం దాటిపోయింది, విస్మయంతో తిరిగి బాబు ఉన్న చోటికి వచ్చాను. రత్న నా దగ్గిర తీసుకొన్న ఇంగ్లీషు మాగజైనుమీద ఏదో కాగితం పడి ఉంది. తీసి చదువుకొన్నాను. 'అతడి జననం తల్లి జీవితానికొక సమస్య. బాబును తీసుకువెళ్ళి మీకు తోచినవిధంగా చెయ్యండి-రత్న' అని వ్రాసిఉంది. కొన్ని క్షణాలవరకు బుర్ర పనిచెయ్యడం మానుకొంది. ఆ పిల్లవాణ్ణి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆడుకొని ఆడుకోని రాగాలాపన ఎత్తుకొన్నాడు వాడు. ఎత్తుకోవాలంటే మెడలు పడతాయన్న భయం. ఎంతో అవస్థపడి ఒళ్ళోకి తీసుకొని సముదాయించాను. ఏడుపు మాని నిద్ర పోయాడు. తిరిగి మేలుకొన్నది మొదలు ఒకటే ఏడుపు. సముదాయించలేక చచ్చాను. బలే చిరాకెత్తిపోయింది."
"ఇదేదో సినిమాలో సంఘటనలాగుందే!" ముక్కు మీద వేలు వేసుకుంది అనూరాధ.
"వాళ్ళు బాబును అలా ఎందుకు వదిలేశారంటావు?" సందేహం వెలిబుచ్చింది విరిబాల.
"అదేదో పెళ్ళి కాకముందే..." అనూరాధ తల్లి అందుకుంది.
పిల్లవాడి తల్లి విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు, అర్ధాలూ చెప్పుకొన్నారు.
మాధవరావు అడిగాడు: "మరి ఏం చెయ్యాలని పిల్లవాన్ని ఇంత దూరం తెచ్చావు?"
కళ్యాణ్ జవాబు చెప్పలేదు.
"తెచ్చావు, సరే, మనకి ఎక్కడ కుదురుతుంది, ఆ పిల్లవాణ్ణి సాకడం?"
"అయితే ఏం చెయ్యమంటావు, మామయ్యా?"
"పెద్ద సమస్యగా భావించి మాట్లాడుతున్నావేంరా? ఇలాంటివాళ్ళ అనాథ శరణాలయాలు కావలసినన్ని."
మామ మాటకు తీవ్రంగా అడ్డుపడ్డాడు కళ్యాణ్. "అహఁ. దానికోసం ఇంతదూరం తీసుకురావడం దేనికి? రైల్లోనే వదిలేసి వచ్చేవాడిని."
"అయితే?!" ఆశ్చర్యంగా చూశాడు అల్లుడికేసి.
"ఒకవిధంగా ఆ బాధ్యత నా కప్పగించబడినట్లే, నిర్లక్ష్యంచేసి పిల్లవాడిని ఏదో అనాథశరణాలయంపాలు చెయ్యలేను. ముందు రాధకు పిల్లలు పుడితే పెంచమా? ఈ పిల్లవాడు మాకు పుట్టిన బిడ్డ అనుకుంటాం."
"అలా జరగడానికి వీల్లేదు." ఖండితంగా చెప్పాడు మాధవరావు. "ఎక్కడి బిడ్డ? ఏం పెంపకం? ఎక్కడో రైల్లో దొరికిన పిల్లవాణ్ణి రాధ తన బిడ్డగా పెంచుతుందా? ఇదేం మాటయ్యా? నీ కడుపున పుట్టిన బిడ్డలతో సమానంగా ఆస్తి పంచి ఇస్తావా వీడికి? ఇదెక్కడి కథ? వాడి కులమేమిటి? చరిత్రేమిటి? ఎన్ని సమస్యలకు కారణమౌతాడు వాడు? పెంచుతానంటే సరిపోతుందా?"
గట్టిగా కేకలు పెడుతూన్న మాధవరావువంక భయసంభ్రమాలతో చూడసాగారు అంతా.
"నీ ప్రవర్తనపట్ల మాకు సందేహం లేదనుకో. కాని, అసలు నీ శీలాన్నే శంకించే పరిస్థితి ఇది. లోకులు కాకులు. తలా ఓ కూతా కూస్తారు. అడ్డేదెవరు? వాడిని సాకడం అవస్థ. అవస్థే కాదు అనుమానం కూడా. తెలివిగా వాణ్ణి ఎక్కడయినా వదిలేసి రా, రేపు ఉదయమే." ఆజ్ఞాపించి లేవబోయాడు.
కళ్యాణ్ చలించలేదు. "మన్నించు, మామయ్యా. ఎటువంటి కష్టం వచ్చినా పిల్లవాణ్ణి పెంచడమే నా నిర్ణయం. ఈ విషయంలో రాధకుకూడా ఇష్టమైనప్పుడు మీ కేమిటి అభ్యంతరం?"
కస్సుమన్నాడు మాధవరావు. "ఈ విషయంలో నీ కెంత తెలుసో, దానికీ అంతే తెలుసు, దీని మంచి చెడ్డలు నాకు తెలిసినట్లు మీకు తెలియవు. పెద్దవాణ్ణి. మంచిగా చెబుతున్నాను, కృష్ణా. చెప్పినట్లు చెయ్యి. బాగుపడతావు."
"ఈ విషయంలో స్వార్ధానికి చోటిస్తే దైవం నన్ను క్షమించడు, మామయ్యా."
"ఉహూఁ! పెద్ద మాటలే నేర్చావన్నమాట." మాధవరావు పెద్దరికం దెబ్బతిన్నది. "అయితే పిల్లవాన్నే పెంచుతావో, రాధనే అర్దాంగిని చేసుకుంటానో ఈ రాత్రే తేల్చు!" తిరుగులేని బాణం వదిలి విసురుగా వెళ్ళిపోయాడు.
శ్రోతలందరూ నిశ్చిష్టులయ్యారు.
"ఛీ, ఛీ! పాడు పిల్లాడు! ఎక్కడో నష్ట జాతకుడులా ఉన్నాడు. వస్తూ గోల తెచ్చిపెట్టాడే!" నిద్రాదేవి ఒడిలో లాలించబడుతూన్న పసివాడికేసి చీత్కరంగా చూశారు, కొన్ని క్షణాలక్రితం మురిపంగా చూచినవారే. వీళ్ళ మాటలకేమో అన్నట్లు ఉలిక్కిపడి ఏడుపు ప్రారంభించాడు పిల్లవాడు. ఎవరూ ఎత్తుకోలేదు.
కళ్యాణ్ వెళ్ళి మంచంమీద కూర్చొని జోకొట్ట సాగాడు "ఏడవకు, ఏడవకు! బబ్బో, బబ్బో నాన్నా" అంటూ.
పిల్లలందరూ వేళాకోళం మొదలుపెట్టారు.
"బావ కన్నాడు రా!" చప్పట్లు రిచాడు ఒకడు.
"బావా, పురుడు ఎప్పుడు?" పగలబడి నవ్వాడు మరొకడు.
"తేలిగ్గానే కన్నావా?"
"ప్చ్! నొప్పులే పడలేదు."
"వెధవల్లారా! వెళ్ళండి, బయటికి, వేళాకోళానికి సమయ సందర్భాలు తెలియవు." విరిబాల తల్లి కసరడంతో తోక ముడిచారు, పిల్లలు.
"ఎందుకొచ్చిన తంటా ఇది, కృష్ణా?" ప్రేమ పూర్వకమైన అనునయంతో అన్నది విరిబాల తల్లి.
"మీ మామయ్య సంగతి తెలియండి కాదు నీకు. ఆయన దగ్గిర మాట ఒకటేకాని రెండు లేవు. పిల్లవాణ్ణి ఎక్కడయినా వదిలేసి రా."
నవ్వుతూనే తన దృఢ నిశ్చయాన్ని తెలిపాడు కళ్యాణ్. "అటువంటి వ్యక్తి చేతికింద, ఆయన ప్రేమాదరణలలో ఇంతవాన్నిగా పెరిగాను. కొంతైనా ఆయన పోలికలు రాకుండా పోతాయా, అత్తా?"
"బావా!" విహ్వల కంఠంతో అరిచింది విరిబాల.
"నీ కిష్టమైతే నాతో వచ్చేసెయ్యి. కాని నా నిశ్చయంలో మార్పు రావడానికి వీల్లేదు, రాధా." స్థిర గాంభీర్యంతో పలికాడు.
"ఇన్నాళ్ళ మన స్నేహానుబంధము, ప్రేమాభిమానాలు బూటకాలా, బావా? ఒక పిల్లవాడికోసం అవన్నీ క్షణికము లయ్యాయా?" సజలనేత్రియై గద్గదస్వరంతో ప్రశ్నించింది.
"వ్యక్తిభావంతో స్వార్ధానికి లోబడక మనిషిగా ఆలోచించి చూడు, ఈ పిల్లవాడి పరిస్థితి. ఆలంబనం అత్యవసరమైన చిరులత వీడు. ప్రేమోన్మత్తతతో ఇతన్ని అనాథున్ని చెయ్య ప్రయత్నించకు. ఇతడికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు తీర్చిదిద్దగల ఉదారు లెవరైనా ఉంటే చెప్పు, ఇతన్ని నేనుపరిత్యజిస్తాను." వదలని గాంభీర్యంతో అన్నాడు. "కానీ, ఇతన్ని ఆదరించ పూనుకొన్నంతలో మన ప్రేమ నిలవ తక్కువచేసి నువ్వు బాధపడి, నన్నూ బాధపెట్టకు."
"ఇంత తేలిగ్గా నన్ను నువ్వు వదులుకొన్నా నేను నిన్ను వదిలి ఉండలేను, బావా..."
"రాధా!" విరిబాల మాట పూర్తికాకముందే పిడుగు పాటులా వినవచ్చింది మాధవరావు కంఠం. మరుక్షణమే గదిలోకి వచ్చాడు ఆయన. "స్వతంత్రించి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. నీ సంరక్షకున్ని, తండ్రిని; నీ సుఖ క్షేమాలకై పాకులాడేవాణ్ణి; నీకు మూడు ముళ్ళ బంధం పడేవరకు నువ్వు నా అజ్ఞావర్తినివిగా మెలగడం నీ కర్తవ్యంగా, ధర్మంగా ఎంచుకో. సుఖపడతావు. ప్రేమతో కళ్ళు కప్పుకుపోయి సంచరిస్తే తరవాత దుఃఖపడితీరతావు!"
పిల్లవాణ్ణి తీసుకుని ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు కళ్యాణ్.
అదే ముహూర్తానికి విరిబాల వివాహం జరిగిపోయింది ఉదయభానుతో.
* * *
అనుమానంగా ప్రశ్నించింది రూప: "డాక్టరుగారు ఆమెను చూడలేదా?"
"ఎవరిని?"
"అదేదె, బాబు తల్లిని."
"చూడనట్లే."
ఎందుకో ఒక్క నిట్టూర్పు విడిచింది రూప. గోకుల్ ను గుండెలకు గట్టిగా అదుముకొని స్తబ్దంగా కూర్చుంది చాలాసేపటివరకూ.
"గోకుల్! గోకుల్!" పిలుస్తూ గదిలోకి వచ్చాడు కల్యాణచక్రవర్తి.
రూప ఒళ్ళోనుండి ఒక్క దూకుదూకాడు గోకుల్. ప్రేమ ఆనందం వ్యక్తపరిచే ఏవో అస్పష్టమైన ధ్వనులు చేస్తూ చేతులు చాచాడు.