Previous Page Next Page 
ఎండమావులు పేజి 4


    "ఆత్మబంధువులనూ, కన్న తల్లిదండ్రులనూ వదిలి ఈ పాపాత్మురాలి వంచన చేరారు. సుఖలాలసత్వ మనేది కొనుక్కుంటేనూ, తాత్కాలిక ఉద్రేకాలనల్లా వచ్చేది కాదు. భగవంతుడు మనకు ప్రసాదించిన ఆత్మను మలినపర్చకుండా ఉంటే అతకన్నా కావలసిన సుఖ లాలసత్వ మెక్కడుంది?" అనుకుంది స్వాతి.
    కృష్ణమూర్తికి బాగా నిద్ర పట్టింది. ముఖం మీద చెయ్యివేసి చూసింది. జ్వరం పేలిపోతున్నది. మందుసీసా కోసం అలమార తలుపు తెరిచి చూసింది. కళ్ళు చెమ్మగిలినయి. ఉదయం స్కూలుకు వెళ్ళేముందు తను తెచ్చి యిచ్చిన మందు ఆ సీసాలో అట్లాగే ఉంది. మందు ఎందుకు తాగలేదు. మూడు డోసులూ అట్లాగే ఉందే. తనమీద కోపమా! మందుమీద ఇష్టత లేకనా! రోగి తనంతట తానుగా మందు ఔన్సు గ్లాసులో పోసుకు తాగుతాడా! ఈ మందు ఇట్లా ఉంటానికి తనే కారణం. సాయంత్రం స్కూలు నుంచి వచ్చి వంట చేసుకుని మళ్ళీ ట్యూషన్లకు వెళ్ళే లోపల తను మందు ఎందుకు పోసివ్వలేదు? తానుగా ఇచ్చిన మందు ఆయన ఎప్పుడూ తాగ ననలేదే! "ఈ తప్పు నాదే, నాదే, తప్పంతా నాదే" అనుకుంటూ బావురుమని ఏడువసాగింది స్వాతి.
    ఆ పరిస్థితుల్లో అంతకన్న నిష్కృతి ఏమిటో తోచలేదు స్వాతికి.
    వ్యధిత హృదయాలు తేలిక పడాలంటే కన్నీరే శరణ్యము. మానసిక భావ దర్పణమే కన్నీరు. స్వాతి హృదయనికి శాంతి నిచ్చేది కన్నీరే.

                                    4

    సుభద్రమ్మగారు పోయి పదిహేను రోజు లయింది. కర్మకాండలన్నీ యధావిధిగా చేశాడు మురహరి. తల్లి ఇంత త్వరగా తమను విడిచి వెళ్ళుతుందనుకోలేదు. పన్నెండో రోజున పెద్ద లంతా సానుభూతి వాక్యాలు చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం నాన్న పోయినప్పుడూ పెద్ద లంతా సానుభూతి వాక్యాలు చెప్పారు. ఆనాడు వారు చెప్పింది "అమ్మను జాగ్రత్తగా చూచుకోమనీ, ఆమెకు ఏ లోటూ రాకుండా కనిపెట్టి ఉండమనీ, త్వరలోనే ఒక యింటివాడయితే కొడుకూ కోడల్ని చూసుకుంటూ ఆమె భర్త పోయిన దుఃఖాన్ని క్రమేపీ మర్చిపోగలడనీ శ్రద్దగా చదువు కుని ఉద్యోగం చేసుకుంటూ పేరు ప్రతిష్టలు తెచ్చుకోమనీ" ఇత్యాది అనునయ వాక్యాలు చెప్పి వెళ్లారు. ఆ పెద్దలు చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ జరగలేదు. ఒక్క అమ్మని మాత్రం సరిగ్గా చూసుకుంటున్నాడు. అదయినా తను చేస్తుందేమీ లేదు. కారణం ఆవిడ అన్నగారైన తాసీల్దారుగా రింట్లోనే ఉంటున్నది. తన మటుకు తను శ్రద్దగానే చదువుకుంటున్నాడు.
    ఈ రెండేళ్ళు గడిచాక, తండ్రి పోయిన దుఃఖం కాలానుగతంగా సమసిపోయాక, మళ్ళా నా జీవితమూ అయిపోయిం దన్నట్లుగా అమ్మ పోయింది. ఈసారి పెద్దలంతా ఏమని చెపుతారు. ఏమని చెప్పగలరు? తను ఎవర్నింక జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు అప్పచెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని లేరు. ఏకాకి. చదువుకుని పెళ్ళి చేసుకోమనటం మినహా ఈ పెద్దలంతా తనకు చెప్పవలసిందేమీ లేదు. చెప్పవలసిందంతా తన మేనమామకే చెప్పారు. వారు చెప్పినది ఒకటే. జ్యోతిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని.
    ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాడు. మురహరి తల్లి పోయిన పదిహేనో రోజు. అప్పటికిగాని తనను గురించి తను ఆలోచించుకోటానికి తీరిక చిక్కలేదు.
    "శలవు ఎన్ని రోజులు పెట్టావోయ్ మురహరీ" అన్న మేనమామ కేశవరావు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు మురహరి.
    "ఎల్లుండి కాలేజీకి వెళ్ళాలి. రేపు బయల్దేరుతాను మావయ్యా" అన్నాడు.
    "దాని రాజోలు అది వెళ్ళబుచ్చుకుని పోయింది. అది అంతవరకూ అదృష్టవంతురాలే. బ్రతికుండగా దాని ఒక్క కోరికా తీర్చలేకపోయాను". కళ్ళొత్తుకుని ఈజీ చైర్లో కూర్చున్నాడు కేశవరావు.
    ఏమిటది? అన్నట్టుగా మేనమామవైపు చూశాడు. మురహరి.
    "జ్యోతికి పెళ్ళి విషయమేనోయ్. ఆ మూడుముళ్ళూ చూసే యోగ్యత లేదు దానికి లేకపోయింది." అన్నాడు మురహరివైపు చూస్తూ.
    తండ్రి ఆశయాలకూ, భావాలకూ అమ్మ అడ్డుగోడ అని జ్యోతికి తెల్సినా, బావ ఆంతర్యమేమిటో అర్ధంకాని జ్యోతికి తండ్రి మాటలు కాస్త గుండె నిబ్బరాన్ని కలుగజేశాయి.
    ముందు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న మేనమామ మేనళ్ళుళ్ళ మాటలు నాలుగు లంకణాలు పడి లేచిన జ్యోతి నీరసాన్ని అవతలకు నెట్టినయ్యి.
    మాటలు బాగా వినిపిస్తున్నా బావను చూడాలనే కోరిక మనస్సులో కలక చెయ్యగా మెల్లిగా లేచి వస్తున్న జ్యోతి తూలి గుమ్మంమీద పడ్డది. దెబ్బ ఎక్కువగా తగలకపోయినా తండ్రి, బావ తన పరిస్థితి గమనించి ఏమనుకున్నారో అనే అభిమానంతో జ్యోతి కృంగిపోయింది.
    "అదేమిటి తల్లీ. ఏం కావాలి. నన్నడిగితే నే తెచ్చివ్వనూ. వంట్లో ఓపిక లేనిదానివి కాస్త విశ్రాంతి తీసుకోమ్మా" అన్న తండ్రి అనునయ వాక్యాలు.
    "ఎందుగ్గాను జ్యోతి యిక్కడికి రాబోయింది" అని మనస్సులో అనుకున్న మురహరి ఆలోచన, తీక్షణమైన చూపులూ జ్యోతిని యింకాస్త క్రుంగ దీసినయ్యి.
    మెల్లిగా లేచి జ్యోతి తన యధాస్థానానికి వెళ్ళింది.
    అంతలోనే టెలిఫోన్ మోగింది. కేశవరావుని ఆర్. డి. ఓ గారు రమ్మన్నారు.
    "రేపుగా నువ్వు వెళ్ళేది. రాత్రికి మాట్లాడుకుందాం" అని కేశవరావు వెళ్ళిపోయాడు.
    మేనమామ వెళ్ళంగానే మురహరి మెదడుకి మేత కలిగింది. జ్యోతి అతని మనోభావాల్లో మసగ మసగగా అవతరించింది. జ్యోతి ఎందుకని గుమ్మం మీద పడ్డది. తమ మాటలు చాటుగా విందామనే ఉద్దేశ్యంతో తలుపు చాటున చేరబోయి కాలుజారి పడ్డదా! తామిద్దరూ తనని గురించి ఏం మాట్లాడుకున్నారని అంత తాపత్రయం. మేనమామ, కూతురు అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తి. అత్తయ్య నిజంగా తాసీల్దారు చెయ్యవలసిన వ్యక్తే. ఆవిడకు బిడ్డల మన స్తత్వాలమీద ఏమాత్రం నమ్మకంలేదు. తన మనస్తత్వం మీద మాత్రమే ఆమెకు నమ్మకం. తమది తాసీల్దార్ల వంశం. కారణం ఆమె తండ్రి కూడా తాసీల్దారు చేసి రిటయిరయ్యారు. తన తమ్ముడు డిప్యూటీ తాసీల్దారు చేస్తున్నాడు. తన అల్లుడు కూడా తాసీల్దారు చేసే తీరైన వాడుగా ఉండాలిగా మరి. అదే ఆమె కోరిక. అసలీ గవర్నమెంటు పద్ధతి ప్రమోషన్సూ ఆవిడకు నచ్చవు. ఒక్కో సందర్భంలో సబ్ కలెక్టర్లు కుర్రవాళ్ళొస్తారు. ఆ మాటంటే వాళ్ళూ ఐ.ఏ. ఎస్ ఆఫీసర్లంటారు. డైరెక్ట్ రిక్రూట్ మెంటు అంటారు. ఎటొచ్చీ తాసీల్దార్లతోనే పేచీ వచ్చింది. ఆ గ్రేడుకు వచ్చే సరికి ప్రతి వాళ్ళకీ నలభై ఏళ్ళు దాటుతూనే ఉన్నయ్యి. అరా డజనుకు పైగా పిల్లలు. అలాంటప్పుడు అల్లుడు తాసీల్దారే కావాలంటే ఎట్లా కుదుర్తుంది. తాసీల్దారు చేస్తూ నలభైఏళ్ళు పైబడ్డవాళ్ళు పెళ్ళికాకుండా ఎందు కుంటారు. పోనీ ఐ. ఏ. ఎస్ సబ్ కలెక్టర్లయితే, వాళ్ళు నచ్చరు. అసలే సబ్ కలెక్టరు, అందులో అల్లుడు. ఇంక గొంతుకు ఉరి. తాసీల్దారయితేనే బావుంటుంది, తన తండ్రి తాసీల్దారు, తన భర్త తాసీల్దారు, తన తమ్ముడు డిప్యూటీ తాసీల్దారు. అల్లుడు కూడా ఆ కోవలోని వాడే, ఆ గ్రేడులోని వాడే అయుంటే ఎంత చక్కగా ఉంటుంది. ఎంత ఆలోచించినా ఆవిడకి సమాధానం దొరక్క తాసీల్దారై ఉండి, పిల్లలులేని వాడైతే రెండో పెళ్ళయినా ఫరవాలే దంది. ఈ అభిప్రాయాన్ని ఆవిడ సుభద్రమ్మగారు పోయిన ఎనిమిదోనాడు భర్తకు చెప్పింది. చెప్పుతుండగా జ్యోతి విన్నది. ఆ రాత్రే జ్యోతికి జ్వరం, పిచ్చిమాటలు. జ్యోతి చెల్లెళ్ళకూ, తమ్ముడికీ ప్రైవేటు చెప్పే స్వాతితో తన మనస్సు వెళ్ళబోసుకోవటం. రాత్రి పది దాటాక అప్పటికి తన గోడునంతా వెళ్ళబుచ్చుకుని ఆమెను ఇంటికి పంపటం.
    ఇవ్వేమీ మురహరికి తెలీకపోయినా జ్యోతి మాత్రం తనయందు యిష్టంగా ఉన్నట్లుగా గ్రహించాడు మురహరి.
    జ్యోతి ఎప్పుడూ చూసే జ్యోతే. తనెరగని జ్యోతి కాదు. తనతో మాట్లాడని జ్యోతి కాదు. తన తత్వం తెలీని జ్యోతి కాదు, కాని, రెండు మూడేళ్ళలో పెద్దదయింది. ఒంపు సొంపుల గీతలు వన్నె తెచ్చినయ్యి. వన్నె తెచ్చిన గీతలు కన్నె మనసును తన మీదకు మళ్ళించినయ్యి. కన్నె మనస్సు కనబడని మనస్సు. వికసించిన మనస్సు విరితాపులు వెదజల్లే మనస్సు. హోయలు వొలక బోసే మనస్సు. జ్యోతి అంతలోనే తను ఆశించి నంతగా ఆ కోవలోనికి వచ్చిందా? తనమీద వలపును వొలకబోసి, తన గుండెను కుదించి తన మనస్సులో నింపుకుందా? ఆ కలబోతను తల్లి వడపోస్తుందిగా? అప్పుడు?    
    పిల్లలంతా బళ్లోకి వెళ్ళారు. అత్తయ్య ఏం చేస్తున్నదో. జ్యోతి గదిలో ఉన్నది. కలికి తురాయిలా వెలుగు జిలుగులతో ఉన్నది జ్యోతి. కన్నె మనస్సు కనిపెట్టాలి.
    "జ్యోతీ" వినబడీ వినబడకుండా మెల్లిగా పిల్చాడు. గాజులు ఘల్లుమన్నయ్యి. ముత్యాల వంటి పలువరస తెల్లగా కనబడగా "ఏం బావా" జ్యోతి సమాధానం. గది గుమ్మం దాటి ఇవతలకు వచ్చింది జ్యోతి. నాలుగు రోజుల జ్వరానికే వాడి పోయిన తీగెలా అయినా ప్రేమరంజితమైన వదనంలో చిరునవ్వు చిందులాడింది.
    ఎందుకు పిలిచినట్లు? నేనేం మాట్లాడాలి? ఏం తోచలేదు మురహరికి.
    "ఇందాక పడిపోయావు. దెబ్బతగిలిందా"
    ఏం పరామర్శ, ఇందుకా పిల్చింది. అనుకుంది జ్యోతి. ఎన్నడో అన్న అత్తయ్య మాటలు జ్యోతికి గుర్తొచ్చినయ్యి.
    ఆ రోజున మురహరి వద్దనుంచీ ఉత్తర మొచ్చింది. నాన్న క్యాంపు వెళ్ళారు. అమ్మ నిద్ర పోతున్నది. ఉత్తరాన్ని తనకిచ్చి చదవ మన్నది సుభద్రమత్తయ్య. తను ఉత్తరం చదివింది. "ఓస్ అంత ఉత్తరంలోనూ నీ మాటే రాయలేదేమే జ్యోతీ" అన్నది అత్తయ్య. "ఏమో నీ కొడుకు మనస్సు నీకు తెలియలి" అని తన సమాధానం. అలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పించు కుని సంతోష పడ్డ అత్తయ్య కొడుకు మురహరి బావ ఇతడేనా? ఆ తల్లి పలుకుల్లోని ప్రేమ గాని, ఆర్ద్రత గని, ఆప్యాయతగాని, ఆకాంక్ష గాని ఆ తల్లికి కొడుకయినా ఈ బావ మాటల్లో లేవు. ఈ బావ హృదయమూ, అత్తయ్య హృదయమూ కలిసి అత్తయ్యే ఎత్తుకు పోయిందా తన కొడుకు హృదయం తనకు తెలీదూ!
    "మాట్లాడవేం జ్యోతీ, పరీక్షలు ఎప్పుడు. బాగా చదువుతున్నావా" అన్నాడు మురహరి.
    సమాధానం ఇవ్వవలసిన ప్రశ్నలు వేసినందువల్ల సమాధానం చెప్పింది.
    "అత్తయ్య పోయిందని విచార పడకు బావా"
    ఛ. తన పరామర్శ మాత్రం ఏం బావుంది? ఆ మాతృ శోకమే ఈ బావ హృదయంలో చేరి బావ మనస్సు అత్తయ్య మనస్సులా తనవైపుకు తిరుగుతుందేమోనని ఆశ.
    మురహరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్యి.
    "ఏం లేదు జ్యోతీ ఊరికినే పిల్చాను"
    కుప్పన కూలిపోయినట్టయి, ఖిన్నురాలై వెళ్ళింది జ్యోతి.
    ఆ మర్నాడే మురహరి విశాఖపట్నం వెళ్ళి పోయాడు. అతని మనస్సులో జయలక్ష్మి పుత్తడి బొమ్మలా మెరుస్తూ మెదిలింది.

                                  5

    "అమ్మాయ్ శ్రీలక్ష్మీ రేపు పోలిని స్వర్గానికి పంపేరోజు. పెంద్రాడే లేవాలి. ఇవ్వాళకు చాలు గాని ఇంక పడుకోతల్లీ" అన్నది ప్రభావతమ్మ ఏదో నవల చదువుకుంటున్న శ్రీలక్ష్మిని. తల్లి ఆ మాటనంగానే శ్రీలక్ష్మి నవల మూసేసింది.
    "అరటి దొన్నెల్లో ఆవు నేతితో తడిసిన వత్తులు వేసే ఉంచానమ్మా, బట్టలు కూడా చేతి బుట్టలో పెట్టాను. నాల్గు గంటలకల్లా వెళదామమ్మా" అన్నది శ్రీలక్ష్మి, తల్లి సరేనన్నది. అంతలోనే గౌతమి వచ్చిందా గదిలోకి జానకిరాం నారద భక్తి సూత్రాలు అనే గ్రంథం చదువుకుంటున్నాడు.
    "రా వదినా ఇంకా అన్నయ్య నిద్ర పోలేదా" అన్నది శ్రీలక్ష్మి.
    "లేదమ్మా, సరేగాని తెల్లవారు జామున స్నానానికి నేనూ వస్తాను. ఈ జీవితానికి అంతకన్న చేయ తగిన పని మాత్రం ఏమున్నది. నాకేం నాకేం పిల్లా పీచూ లేదుకదా. గొడ్రాలిని. నా జీవితం ఇట్లు వెళ్ళిపోవాల్సిందే" అన్నది గౌతమి.
    "అదేమిటి వదినా ఆ మాటలు ఎవరన్నారు. ఈ ఇంట్లో అంతా పాపకర్ములమే. నిన్ను అనవలసిన అవుసరం ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితాలు ఏ తీరుగా వెళ్ళిపోతయ్యో ఎవరికి తెల్సు" అన్నది శ్రీలక్ష్మి.
    "ఒకళ్ళు అన్నారని నేనటం లేదమ్మా. నా కర్మను నేనే నిందించుకుంటున్నాను. జీవితంలో ఆశించినదీ, ఆశించనిదీ కూడా కొందరి వ్యక్తుల విషయంలో జరుగుతుంది. నాబోటి దానికి నెత్తిన గొడుగు ఉండి కూడా అవస్థలు పడాల్సొస్తుంది." అన్నది గౌతమి.

 Previous Page Next Page