పది నిమిషాల తర్వాత వచ్చింది గీత. ఆమె ఇప్పుడు ఫ్రెష్ గా తెల్ల మల్లెపూవు లా ఉంది. ఆమెతో పాటు మిడ్డీ వేసుకున్న మరో యువతి.
"మా సిస్టర్ విమల. మా కొలీగ్ చలపతి" అంటూ ఇద్దరినీ పరిచయం చేసిందామె.
"హయ్.." అంది విమల.
చలపతి కేమనాలో తెలీలేదు. నమస్తే అన్నాడు బిడియంగా.
"ఇద్దరూ మాట్లాడుతూ వుండండీ! టీ తెస్తాను" అంది గీత లోపలికి వెళుతూ.
విమల వచ్చి అతనికెదురుగా కూర్చుంది.
"కహత క్ పడే అప్?" అడిగింది విమల చిరునవ్వుతో.
చలపతికి కంగారు పట్టుకుంది. తనకి హిందీ అంతగా రాదు. ఏదో బుక్ నాల్దేజ్ వుందంతే.
"ఆయామ్ నాట్ ప్రోఫిషిమెంట్ ఇన్ హిందీ......." అన్నాడు సిగ్గుపడుతూ.
"ఓ! కానీ హిందీ కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది కదా?"
"ఉంది! అయినా నాలుగు ముక్కలు బై హార్ట్ చేసి పరీక్ష రాసేయడమే ..." నవ్వుతూ అన్నాడు చలపతి.
ఆమె కూడా నవ్వింది.
"మీరేం చదువుకున్నారు?" అడిగాడతను.
"బి. కామ్ పైనల్."
"తరువాతేం చేస్తారు?"
"ఇంక తరువాతేం లేదు. ఉద్యోగం వెతకటమే."
* * *
"అప్పుడేనా?"
"లేకపోతేనూ అక్క నెత్తి మీద ఇంకెంత కాలం కూర్చొను?" నవ్వుతూ అందామె. గీత టీ తీసుకొచ్చింది.
"మీరు గేమ్స్ ఏమైనా ఆడతారా?" అడిగింది విమల.
"ఊహు ! లేదు......" మళ్ళీ బిడియంగా అన్నాడతను.
"మా విమల క్రికెట్ ఆడుతుంది! వాళ్ళ కాలేజీ టీం కి కెప్టెన్." అంది గీత.
"కిక్రేట్ నేనసలు లైక్ చెయ్యను" అన్నాడు చలపతి.
విమల ఆశ్చర్యపోయింది "ఎందుకని?"
"చాలా డల్ గా ఉంటుంది గేమ్. అదీ గాక అయిదు రోజుల పాటు ఆడటం సమ్ హౌ అది ఆటలాగా నా కనిపించదు. ఏదో పనిష్మెంట్ లాగుంటుంది."
"పెక్యులియర్ వ్యూ " అంది విమల నవ్వుతూ.
"ఆఫ్ కోర్స్."
"మనం వెళదామా?" అంది గీత టీ తాగాక.
"పదండి!"
ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
"ఒకే సి యూ ఎగైన్" అంది విమల గడప దగ్గర ఆగిపోయి . వాళ్ళింటికి దగ్గరలోనే ఉందా పోర్షన్.
గీత తనను బయట నిలబెట్టి లోపలకు వెళ్ళింది స్మితా అని పిలుస్తూ , కొద్ది నిముషాల తర్వాత మరో పొట్టి యువతితో తిరిగి వచ్చింది.
"యూ ఆర్ లక్కీ - ఇల్లు ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదట" అందామె.
చలపతి గుండెలు కుదుటపడినాయ్.
ఆ యువతి పక్కన వాటా కున్న తాళం తెరచి లోపలికి నడిచింది.
"రండి" అంది గీత చలపతితో.
ఇద్దరూ లోపలకు నడిచారు. ఒకే ఒక పెద్ద గది. దాని నానుకుని చిన్న వంటిల్లు . బయట వేపు బాత్ రూమ్స్ వున్నాయ్. అది తనకు సరిగ్గా సరిపోతుందనిపించింది చలపతికి.
"ఎలా వుంది?" అడిగింది గీత.
"బాగానే ఉంది. మరి అద్దె....."
"రెండొందలు. కరెంట్" అందా యువతి.
చలపతి నీరసపడిపోయాడు. నూట యాభయి వరకూ ఫర్వాలేదనుకున్నాడతను. కానీ ఇప్పుడు రెండొందలంటే తన జీవితంలో మూడో వంతు అన్నమాట! అయినా గానీ తప్పేట్టు లేదు. ఇంత చక్కని ఇల్లు అసలు దొరుకుతుందో లేదో......
నర్సరాజు కూడా అన్నాడు మధ్యాహ్నం " హద్రారాబాద్ లో ఎవరూ ఇంటి అద్దె ఎంత అని అడగరు. ఇల్లు ఖాళీగా ఉందని తెలిస్తే చాలు. ముందు వెళ్ళి ఇంట్లో దిగిపోతారు. అంత డిమాండ్ ఇళ్ళకు."
అంచేత ముందు ఈ ఇంట్లో దిగిపోవటమే ఉత్తమం.
"సరే...." అన్నాడతను నీరసంగా.
"అయితే అడ్వాన్స్ ఇచ్చెయ్యండి" అంది గీత.
చలపతి రెండు వందలు తీసి ఆ యువతికే ఇవ్వబోయాడు.
"నాక్కాదు మా డాడీ కివ్వండి" అందామె.
అందరూ కలిసి మళ్ళీ వాళ్ళింటి కెళ్ళారు. ముసలాయన బయటికొచ్చాడు.
"ఇంట్లో స్నేహితులు, పార్టీలూ ఏమి వుండకూడదు. చుట్టూ అన్నీ ఫామిలీస్ - మంచి గుండాలి." అన్నాడతను.
"ఓ! మీరే చూస్తారు కదా" అన్నాడు చలపతి.
"గీత మాకు బాగా తెలిసిన వాళ్ళమ్మాయి. అందుకని ఇస్తున్నాను. లేపోతే బాచులర్స్ కి ఇవ్వనసలు"
"థాంక్యూ -మీకెలాంటి సమస్యా వుండదు" అన్నాడు చలపతి.
అతను డబ్బు తీసుకున్నాడు.
'అయితే ఇంట్లో ఎప్పుడు జాయినవుతావ్?"
"రేపు సాయంత్రం అఫీసయ్యాక సామాను తెచ్చేసుకుంటాను."
"సరే! అప్పటికి క్లీన్ చేయించి ఉంచుతానులే"
గీతతో పాటు అక్కడి నుంచి వచ్చేశాడతాను. ఆమె వాళ్ళింటి దగ్గర ఆగిపోయింది.
"థంక్యూ గీత గారు! నన్నో ఇంటివాడిని చేశారు" అన్నాడు చలపతి నవ్వుతూ.
గీత నవ్వింది.
"నో మెన్షన్"
చలపతి అక్కడి నుంచి బస్ స్టాఫ్ కి నడిచి బస్ కోసం నిలబడ్డాడు. తానిప్పుడు నర్సరాజు యింటికెళ్ళలి. ఆ రాత్రి భోజనానికి రమ్మని పిలిచాడు నర్సరాజు. అతనిచ్చిన గుర్తులు, అడ్రసు వెతుక్కుంటూ ఇల్లు చేరుకునేసరికి రాత్రి ఎనిమిదయి పోయింది.