Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 4

    ఆ తరువాత శనివారం అతడు రాలేదు, ఆమెకేదో వెలితిగా మనసుకి చికాకు కలిగింది. తనకు తెలియకుండా తాను అతని రాక కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అర్ధమయింది. 'ఛీ! పాపిష్టిదానా! నీకు లేదు' అని తనను తను గట్టిగా తిట్టుకుంది.    
    అయినా కళ్ళు గుమ్మంవేపు పరుగులు తీస్తూనే ఉన్నాయి. నర్సుతో మాట్లాడుతున్న చెవులు మరెవరి మాటలనో ప్రతీక్షిస్తున్నాయి. ఆ తరువాతి వారం అతడు వచ్చాడు. ఆమె మనసు గంతులు వేసింది. ఈసారి అతనికి గెడ్డం పెరిగింది. ఆమె బట్టలు తీస్తూ, "ఏదైనా మొక్కు కున్నారా?" అంది నవ్వుతూ.    
    అతడు కూడా నవ్వుతూ, "మొక్కు కాదు, బ్లేడులు కొనటానికి డబ్బులు లేవు" అన్నాడు. ఆమె నిర్ఘాంతపోయింది. కొంతసేపు మాట్లాడలేక పోయింది.    
    "బ్లేడు కొనడానికే డబ్బులేకపోతే ఇంత ఖరీదయిన చీర ఎలా కొంటున్నారు?"    
    అతడు కొద్దిగా తటపటాయించి "ఈ షాప్ కి రాకుండా ఉండవలసింది అన్నాడు. ఆమె అనుమానమే నిజమైంది. ఆమెకు ఆనందం కంటే దుఃఖం కలిగింది, తలవంచి లో స్వరంతో "ఈసారిమీకు నచ్చే చీరలు లేవు వెళ్ళండి" అంది అతడు ఏదో అనబోయాడు. ఆమె లో స్వరంతోనే "వెళ్ళండి రాత్రి తొమ్మిది గంటలకి ఈ షాప్ దగ్గరున్న బస్ స్టాప్ లో నిలబడతాను నేను వచ్చి మాట్లాడతాను." అంది ఆజ్ఞాపిస్తున్నట్లు, అతడు వెళ్ళిపోయాడు. ఎనిమిదయ్యాక షాప్ క్లోజ్ చేసి, అన్నీ ఎక్కడివక్కడ సర్ది, సేల్స్ గరల్ గా షాప్ వాళ్ళిచ్చిన చీర ప్రైవేటు రూంలో మార్చుకొని తన చీర కట్టుకొని మిగిలిన వర్కర్స్ తో బయటకొచ్చింది. అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె బస్ స్టాప్ కి వచ్చింది. అతడు వెయిట్ చేస్తున్నాడు.    
    "ఇంకా నాకోసం ఉన్నారా?"    
    "ఈ రోజు మీరు ఉండమన్నారనే కాదు__రోజూ ఈ బస్ స్టాప్ లో వెళ్ళే మీరు వెళ్ళేవరకూ నిలబడి ఉంటున్నాను. ఒక్కనాడూ మీరు నన్నుచూసే వారు కాదు. అందుకే మళ్ళీ షాప్ కే వచ్చేవాడిని."    
    ఆమెకు అర్ధమయింది. ఆలోచనలో పడింది. ఒక నిర్ణయానికి వచ్చింది.    
    "మీరు మా ఇంటికి వస్తారా?"    
    అతని ముఖం వికసించింది.    
    "అంతకంటే అదృష్టమా? నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడాలనే అనుకుంటున్నాను."    
    ఆమె మనసులో ఏదో చేదుగా కదిలింది. కళ్ళలో మబ్బులు కమ్మాయి.    
    "మీ పేరు?" అడిగాడు అతడు.    
    "విమల!"    
    "చక్కని పేరు! మీకు తగినట్లుగా ఉంది."    
    ఆమె అదొకమాదిరిగా నవ్వింది బస్ వచ్చింది. ఇద్దరూ ఎక్కారు, దిగాల్సిన స్థానంలో దిగాక అతడు, "ఆటో మాట్లాడనా?" అన్నాడు. ఆమె నవ్వి, "వద్దు ఆ డబ్బుతో మీ గెడ్డం చేసుకోండి ముందు. మా ఇంటికి నడిచిపోవచ్చు" అంది.    
    ఇద్దరూ నడిచి విమల ఇల్లు చేరుకున్నారు. రెండు గదుల చిన్న వాటా అది. ముందు గదిలో తల్లి కూచుని అతి శ్రద్దగా చీరలపైన ఎంబ్రాయిడరీ చేస్తోంది. అతడిని చూసి లేచి నిలబడింది.    
    "అమ్మా ఈయన నాకు మా షాపులో పరిచయ మయ్యారు. పేరు....."    
    "శ్రీధర్ శర్మ" అతడు అందించాడు.    
    "కూచో నాయనా!" అంది తల్లి కుర్చీ చూపి.    
    "మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు. మా అమ్మ కష్టపడి నన్ను పెంచింది. ఇప్పటికీ నేను ఎంత వద్దన్నా కష్టపడుతూనే ఉంటుంది. చూడండి - చీరలకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసి షాపుల కిస్తుంది."    
    "చాలా మంచిది. అందరూ అలా కష్టపడి పనిచెయ్యాలి-మన మధ్య తరగతి కుటుంబాల్లో."    
    విమల గొంతు విని ఆ గదిలోనే మంచంలో పడుకున్న మూడేళ్ళ పాపలేచి, "అమ్మా!" అంటూ ఆమెను కౌగలించుకుంది. విమల ఆప్యాయంగా పాపను ఎత్తుకుని, "నా కూతురు శకుంతల!" అని పరిచయం చేసింది.    
    శ్రీధర్ శర్మ ముఖం పాలిపోయింది. దెబ్బతిన్న స్వరంతో,    
    "నన్ను క్షమించండి. మీకు పెళ్ళి కాలేదనుకొన్నాను" అన్నాడు.    
    "మీ ఊహ కరెక్టే! పెళ్ళి కాలేదు."    
    శర్మ తెల్లబోయి చూశాడు.    
    "ఇప్పుడు చెప్పండి - నా పేరు నాకు తగినదేనా?" జాలిగా నవ్వుతూ అడిగింది, శర్మ మాట్లాడకుండా లేచిపోయాడు. తల్లి కుట్టుపని చేతిలోకి తీసుకుంది.
    
                                                           4
    
    రాత్రి తొమ్మిదిగంటల సమయం బస్ స్టాప్ లో నిలబడి పరిసరాలు ఒక్కసారి కలయజూసింది విమల, ఇది ఆమెకు కొత్తగా అయిన అలవాటు! ఇదివరలో చుట్టు ప్రక్కల ఎవరున్నా కూడా గమనించకుండా, బస్ స్టాప్ దగ్గరికి రాగానే చుట్టు పరీక్షగా చూస్తోంది. ఏదో వెలితితోనే బస్ ఎక్కుతోంది.    
    తల్లికూడా విమలలో ఈ నిరుత్సాహాన్ని గమనించింది. సాధారణంగా ఎక్కువ మాట్లాడని ఆమె, "అనవసరంగా మనసు పాడుచేసుకోకు. పసిపిల్ల విషయం చూసుకో!" అంది హెచ్చరింపుగా.    
    ఆ మాటలతో ఏదోపెద్ద అపరాధం చేస్తూ దొరికిపోయినట్లు సిగ్గుపడిపోయింది విమల. అయినా తల్లి మాట్లాడుతోంటే, సమాధానం చెప్పకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోవటం, ఒకదాని కొకటి మాట్లాడటం, అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తనలో తను నవ్వుకోవటం అంతలో శోకమూర్తిలా మారిపోవటం - ఇలాంటి లక్షణాలతో తల్లికి దొరికిపోతూనే ఉంది.    
    తల్లి అనసూయ కూతుర్ని జాలిగాచూసి, అంతలో గుండెకలుక్కుమనటంతో గుండెరాసుకుంది. తనకేం రోగమో అనసూయకు తెలీదు. బీదరికమే అన్ని రోగాలకు మూలం. సరిఅయిన పోషణ, కావలసినంత విశ్రాంతీ లేకపోతే ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఇప్పుడామెకు యాభై దాటాయి. తన శరీరంలో అస్వస్థత సాధారణంగా ఆమె కూతురికి కూడా చెప్పదు. అంతగా ఓపికలేకపోతే నిద్రపోతున్నట్లు పడుకుంటుంది. అంతే!

 Previous Page Next Page