"లీవ్ మి.... వదులు" అతడి పట్టు సడలించాలని విఫలప్రయత్నం చేస్తుందామె.
"కృషి" అగ్నిరేఖల్లా కనిపిస్తున్న ఎర్రజీరలు అతడి కళ్ళల్లో "నన్ను చాలా తక్కువగా అంచనా వేసావ్"
ఇన్నాళ్ళూ కాపాడుకున్న యవ్వన పొంకానికి చరమాంకంలా అతడి చేతులు ఎక్కడో స్పృశిస్తున్నాయి.
"బా....స్ట....ర్డ్..." విరుగుతున్న వంతెనలా ఆమె మాటలు తడబడుతున్నాయి. "ఐ విల్ కిల్యూ."
నవ్వుతున్నాడు తోడేలులా.
పాయలుగా చీలుతున్న ఓ కన్య దుఃఖోద్విగ్నతని సేడిస్టిక్ గా ఆనందిస్తున్నట్టు ఆమె శరీరంపై నైటీని చింపేసాడు అప్పటికే.
ఆమె గావు కేక ఆ భవంతి ప్రతిధ్వనించేదే...
కాని పెదవులతో ఆమె నోరు నొక్కేసాడు.
శిక్షగా మారుతున్న అక్షరాల అంతః స్వరాలహరులు....పగులుతున్న శతసహస్ర ప్రాకారాల సరిహద్దులు...అతడి చేతి వేళ్ళు ఉద్వేగంగా దేహంపై నర్తిస్తుంటే...
అప్పుడు చూసుకుంది.
తను పూర్తిగా నగ్నంగా మారింది.
కాదు అతడు మార్చేశాడు.
మండుతున్న గోళంలా ముందు నిలబడ్డ అతడి చూపుల్ని తాళలేనట్టు గభాలున పక్కకి జరిగి బెడ్ పై వున్న బ్లాంకట్ ని అందుకోబోయింది. అడ్డం పడ్డాడు.
పోరాటంలో గెలవటానికి ఆమె వజ్రాయుధం కాదు. వజ్రం సంకల్పం కలదైనా ఓ బలవంతుడి బహు పంజరాన్న నలిగిపోతున్న యువతి.
అంతే...
బాత్ రూం లోకి పరుగెత్తింది.
గడియ పెట్టేదే కాని ఆమె చేతికన్నా ముందే అతడే కదిలి బాత్ రూంలోకి దూసుకొచ్చాడు.
కృషి కంపించిపోతూంది "అవుట్"
ఆమె కేక బయటి ఉరుముల చప్పుడులో సమాధైంది.
"గెట్ లాస్ట్" అశ్రుసిక్త నయనాలతో అరుస్తూ మరోదారి లేనట్టు చేతులు జోడించింది. వెనువెంటనే తన స్థితి గుర్తొచ్చినట్టు చేతులతో శరీరాన్ని కప్పుకుంది. "ప్లీజ్"
భావుకుడిలా చూసాడు "రిలాక్స్ బేబీ..."
ఖజురహో శిల్పంలా ఓమూల గోడకి అతుక్కుపోయిన కృషిని చూస్తూ అన్నాడు "ఎస్ మోసం చేయడం నా హాబీ అలా బ్రతకడం నాకు ఆనందకరమైన విషయం అది తెలీని నువ్వు నన్ను పోలీసులకి అప్పచెప్పావ్ దారుణమైన హింసకి గురిచేసావ్. అవును బేబీ పోలీసులు నన్ను చాలా టార్చర్ చేశారు. నిన్ను అంతకన్నా టార్చర్ చేయాలనీ ఈ అర్దరాత్రి వేళ ఇలా వచ్చాను."
"ఇప్పుడేం చేద్దామని"
"నిన్ను రేప్..." క్షణం ఆగాడు. "చేయను. అది నా కేరక్టర్ కే విరుద్దం. కాబట్టి నిన్ను ఓ రెండు నిముషాలపాటు ఏకాగ్రతగా చూడాలనుకుంటున్నాను."
మొగ్గలా ముడుచుకుపోతూ అంది "ఎందుకు"
"నీ నగ్నదేహాన్ని చూసిన తొలిమగాడిగా నీకు కలకాలం గుర్తుండిపోవాలనుంది."
ఆ స్థితిలో సైతం ఆమె ఆశ్చర్యపడకుండా వుండలేకపోయింది. "దాని వలన నీకు కలిగేదేమిటి"
"సింపుల్" నవ్వాడు మృదువుగా "అందమైన నీ శరీరాన్ని రేపటి నుంచి నువ్వు చూసుకునేటప్పుడు గాని లేదు రేపు నిన్ను కట్టుకున్నవాడు నిన్నూ నీ అందాన్ని బెడ్ రూంలో అభినందించేటప్పుడు గాని ముందు నేను గుర్తుకొస్తాను. ఆ శిక్ష చాలు నీకు..."
ఇలాంటి శిక్ష కూడా ఒకటుంటుందని ఇప్పుడే తెలుసుకున్న కృషి అవాక్కయిచూస్తుండగానే వచ్చిన పనైనట్టు వెళ్ళిపోతున్నాడు.
వచ్చిన కిటికీలో నుంచి దర్జాగా రాజమార్గంలోనే.
ఇక నిభాయించుకోలేకపోయింది కృషి.
ఇంతసేపు అదిమి పెట్టుకున్న ఆ అవమానభారానికి గండిపడింది. వున్నట్టుండి గావుకేకలు పెట్టింది. "కేచ్ హిమ్ పట్టుకోండి"
ఒక్కసారి కాదు మూడుసార్లు...
"ఏమైందమ్మా" ఎవరో పలకరిస్తున్నారు.
పట్టుకోమంటుంటే ఏమైందీ అని ఆరా తీస్తున్నారేం.
"అతడ్ని ఆపండి"
"ఎవరతను"
అప్పుడు కళ్ళు తెరచింది కృషి.
అంతే కాదు.
సమీపంలో నిలబడివున్న నౌకర్లని చూస్తూ ఉలికిపాటుగా లేచింది.
బయట వర్షం లేదు. కిటికీ పగల్లేదు.....అంతా ప్రశాంతంగా వుంది.
"పీడకలా అమ్మాయిగారూ" వృద్ద నౌకరు శరభయ్య అడుగుతున్నాడు వినయంగా.
బ్లేంకెట్ కిందనుంచే శరీరం తడిమి చూసుకుంది. 'తను నగ్నంగా లేదు అంటే ఇంతసేపూ తనుపడిన సంఘర్షణ కలలోనే'
అప్పటికే తెల్లవారిన సూచనగా బయట చెట్లపైనుంచి పక్షుల కలకలం వినిపిస్తోంది.
టీపాయ్ పై వున్న నీళ్ళను అందుకుని గడగడా తాగేసింది.
"ఏదో కల మీరు వెళ్ళండి"
"అంత ఘోరమైన కలా తల్లీ మరేం లేదు. చాలా గట్టిగా కేకలు పెట్టావమ్మా" శరభయ్య మరింత వినయాన్ని ప్రదర్శించాడు.
"మీరు వెళ్ళండి"
"మరేం లేదమ్మా తెల్లవారుజమున వచ్చే కలలు నిజమవుతాయంటారు అంచేత అదేదో చెబితే"
ఆ స్టేట్ మెంట్ తో మరింత ఆవేశపడిన కృషి "వెళ్ళమని చెబుతుంటే మీక్కాదు" అంది ఉక్రోషంగా.
వెళ్ళిపోయారు.
ఇప్పుడామెకి గుర్తుకొస్తున్నది కలగాదు. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయన్న శరభయ్య స్టేట్ మెంట్.
జుగుప్సగా వుంది.
సహజంగా ధైర్యవంతురాలయిన తనకిలాంటి కల వచ్చిందేం?
థూర్జటి గురించి భయపడుతోందా?
అమెరికాలాంటి దేశంలో ఉంటూ ఆత్మస్థయిర్యంతో చాలా సమస్యల్ని ఎదుర్కోగలిగిన తను ఇలా పిరికిదానిలా ఆలోచించడమేమిటి?
టు హెల్ వితిట్...
మరో అరగంటలో తయారయిన కృషి బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యాక మళ్ళీ నవల అందుకోబోతుంటే ఫోన్ రింగయ్యింది.
"ఎస్"
"కృషి" ఉపాధ్యాయ కంఠం వినిపించింది "నేను"
కృషి మొహంలోని రంగులు మారిపోయాయి. "చెప్పండి గ్రాండ్ పా"
"సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. బహుశా రావటానికి మరో రెండు మూడు రోజులు పట్టచ్చు"
తనకు అవసరం లేనివి వినాలని ఉత్సాహపడని విషయం చెబుతున్నాడు. అక్కడితో ఆ చర్చ ఆగినా బాగుండేది.
"స్టేట్స్ కి వెళ్లిపోయావనుకున్నాను"
అది చెక్ చేయడానికే తాతయ్య ఫోన్ చేసాడని తెలీడంతో మనస్సు చివుక్కుమంది.
"వెళ్ళమని నేను అనటం లేదు కృషీ. మనిషి తను కోరినట్టు జీవించేదే నిజమైన జీవితం అని నమ్మేవాడిగా నీ నిర్ణయాన్ని అభినందిస్తానని చెబుతున్నాను."
నాలా యాంత్రికంగా సాగుతున్న చర్చ అది.
"థేంక్స్ గ్రాండ్ పా-" ముక్తసరిగా అంది "మీ ఆరోగ్యం జాగ్రత్త"
"ఆరోగ్యం గురించే ఆలోచిస్తే స్వయం కృషితో సాధించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోలేను."
"సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం నేర్చుకోవాలి"
"నా స్థానంలో వున్నవాళ్ళకి తప్ప నేను అర్ధం కాను కృషీ" జవాబు నాశించనట్టుగా ఫోన్ క్రెడిల్ చేశాడు.
ఏదో కసి, ఉక్రోషం-
నవలని పక్కన పడేసిన కృషి ఉద్వేగంగా పైకిలేచింది.
ఓ మేజర్ సర్జరీ కూడా మార్చలేకపోయింది తాతయ్యని. ఇలా కొనసాగితే తాతయ్య ఏమవుతాడు.
అది గ్రాండ్ పా ఏటిట్యుడ్ మూలంగా రగిలిన క్రోధమో లేక విశ్రాంతిని మరిచి ఇంకా ఎప్పటిలాగే బ్రతకటాన్ని ఇష్టపడే ఉపాధ్యాయపై కోపమో వెంటనే హోండ కారులో బయలుదేరింది యూనివర్శిటీ లైబ్రరీకి.
బాల్యం నుంచి ఒంటరిగా బ్రతకడమే అలవాటైన కృషికి ఇష్టమైన విషయం పుస్తకాలు సంగీతం ఇవి రెండే.
* * * *
ఉదయం
తొమ్మిదిన్నర కావస్తోంది.
భాగ్యనగరం రోడ్లు రద్దీగా వున్నాయి.
ఆకాశంలో ఎండ క్రమంగా తీవ్రమవుతోంది.
కారులో స్టీరియో ఆన్ చేసింది కృషి. మడోన్నా 'లైక్ ప్రేయర్' మనస్సు కేదోలాంటి ఆహ్లాదాన్ని అందిస్తోంది.
అయోధ్య హోటల్ దాటి లక్డీకాపూల్ చేరుకుంటూ అలవోకగా ఫుట్ పాత్ వేపు చూసిన కృషి అదిరిపడింది.
నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నాడు థూర్జటి.
నిన్న సాయంకాలం పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడే బయటకెలా వచ్చాడు.
పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయేదే కాని ఉన్నట్టుండి నిన్న రాత్రి కలతో పాటు ట్రాఫిక్ ఐ లాండ్ దగ్గర రెడ్ లైట్ వెలగడంతో కారాపింది.
సరిగ్గా ఇదే అవకాశం కోసం చూస్తున్నాడేమో థూర్జటి గభాలున ఫ్రంట్ డోర్ తెరిచి ఆమె పక్కసీటులో కూర్చున్నాడు.
అనుకోని సంఘటనకి తడబడుతూ "మిస్టర్ థూర్జటీ" అంది కృషి సీరియస్ గా.
అతడిలో తొట్రుపాటు లేదు. యథాలాపంగా అన్నాడు. "గ్రీన్ లైట్ పడింది ట్రాఫిక్ జామ్ చేయక కారు ముందుకు పోనివ్వండి"
"అసలు నువ్వు" కారుని పోనిచ్చిన కృషి ఆవేశంగా అడిగింది "కారెందుకు ఎక్కావ్" అతడు జవాబు చెప్పలేదు. అసలా ప్రశ్నే వినబడనట్టు బయటికి చూస్తున్నాడు. అతడి నిర్లక్ష్యానికి మండిపడుతూ రవీంద్ర భారతి దాటుతుండగా అంది "ప్లీజ్ గెటవుట్" అనడమే కాదు రేడియో స్టేషన్ ముందు ఆపేసింది కూడా.
"వెరీ బేడ్" చిరుకోపంగా అన్నాడు.
"ఏమిటి"
"సరిగ్గా ఆకాశవాణి ముందు మీరు కారాపడం"
"ఆపితే ఏమవుతుంది"
"ఈ విషయం ఆలిండియా రేడియో గమనిస్తుంది. ఆనక మధ్యాహ్నం న్యూస్ లో మన విషయం ప్రసారం చేస్తుంది. అది సింగపూర్ లో వున్న మీ గ్రాండ్ పాకి తెలిసి..."
అప్రతిభురాలైంది. అంటే తన గురించి చాలా వివరాలు సేకరించాడు.
"మిస్టర్ థూర్జటీ" వ్యంగ్యంగా అంది "నా గురించి నీకెలా తెలుసూ అని నేను ఆశ్చర్యపోవడం లేదు. అది నీ ఐక్యూకి ఓ పెద్ద గుర్తుగా నేను భావించడమూ లేదు. కాని ఇంత తెలుసుకున్న నువ్వు నా స్థాయి మనిషితో ఇలా ప్లే చేయడం మంచిది కాదని నీ శ్రేయస్సు కోరి సలహా ఇస్తున్నాను"
"ఆ విషయం నిన్న సాయంకాలమే నాకు అర్ధమైంది."
"పాపం" సర్కాస్టిక్ గా అంది కృషి. "రాత్రంతా పోలీసులు చాలా హింసించి వుంటారు.'
"కలగన్నారా..."
ఆ క్షణంలో థూర్జటి 'కల'నే పదాన్ని వాడటం కాకతాళీయమే అయినా నిన్నరాత్రి కల గుర్తుకు రాగానే నుదుట చెమట పట్టేసింది.
"నిన్న మీరు నన్ను పోలీసులకి పట్టించగానే బాగా తోమి తాటవలిచేసి వుంటారని మీరు అనుకుని వుంటారు. కాని మీ నుంచి నేను సంపాదించైనా అయిదువేలలో ఓ వెయ్యి వాళ్ళ మొహాన కొట్టి బయటకొచ్చేసాను. ఏమిటి అలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు."
"నమ్మలేక పోతున్నాను."
"ఏమిటి" నిశ్చలంగా అన్నాడు "నాలాంటి అందమైన ఓ యువకుడు ఇలా టోపీవేసే కార్యక్రమంలో నిమగ్నం కావటాన్ని లేక పోలీసులు డబ్బు తీసుకుని నన్ను విడిచిపెట్టడాన్నా"
నిశ్చేష్టితగా చూస్తుంది కృషి.
"ఇక్కడ మోసం చేయడం మనుషుల హాబీ. అవకాశవాదంతో పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవటం వ్యక్తుల నైజం. ఈ దేశంలో సక్సెస్ అన్న పదానికి అర్ధం బ్రతకగలగడం. ఎలాగైనా ఫర్వాలేదు ఉదాహరణకి మిమ్మల్ని పబ్లిక్ గా మరోలా అనుకోకండి మిమ్మల్ని దోచుకోగలను. అంటే మీ ఒంటిమీద వున్న నగా నట్రాలాంటిదే సుమండీ. అందులో కొంత పోలీసుల చేతిలో వుంచి నన్ను నేను రక్షించుకోగలను....మీ పరిభాషలో ఈ వ్యవస్థ అంతగా తగలబడి పోయింది."
"షేమ్..."
"మిమ్మల్ని దోచుకోవడమా."
"కాదు. బ్రతకటానికి మరోదారి లేనట్టు నీలాంటి వాళ్ళు ఇలా దోపిడీలు చేస్తూ అదే జీవనోపాధిగా మార్చుకోవడం ఆనక దోచుకున్నది పంపిణీ చేసి నిన్ను నువ్వు రక్షించుకొంటూ ఈ వ్యవస్థే ఇలా తగలబడిపోయిందని వాపోవడమూనూ"