Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 4

 

    "ఏమిటి మన దగ్గర స్పెషాలిటీ? మనమేం పైనుంచి దిగోచ్చామా?"
    "రాకపోయినా వచ్చినంత ఇదన్నమాటండి! ఈ సర్దార్ పటేల్ రోడ్ మొత్తం మీద ఏ ఇంట్లో నయినా చూడండి! ఎవరోంట్లోనూ వంటమనిషి లేడు. కానీ ఈ సిక్టీ నైన్ సర్దార్ పటేల్ రోడ్ లో వంటమనిషి వున్నాడు."
    "నటరాజ్" సీరియస్ గా పిలిచిందామే.
    "ఏంటమ్మా?"
    "ఏం జరిగిందో నిజం చెప్పు?"
    నటరాజ్ కలవరపాటుతో రామచంద్రమూర్తి వైపు చూశాడు.
    రామచంద్రమూర్తి ఏదో సైగ చేయబోయాడు గానీ సీత అతని వేపు చూసేసరికి 'ఇహిహి' అంటూ చిరునవ్వు నవ్వేశాడు.
    "చెప్పక తప్పదంటారా?" అడిగాడు నటరాజ్.
    "నిజం చెప్పకపోతే ఉద్యోగం ఊడిపోతుంది! గుర్తుంచుకుని మరీ చెప్పు."
    "ఉద్యోగం గురించి నేనెప్పుడూ భయపడనమ్మా! తుమ్ముతే ఊడిపోయే ముక్కుని ఎంతకాలం పట్టుక్కుర్చుంటాం? అయిన గానీ నిజం చెప్పేస్తాను! ఆ దుకాణం వాడు అచ్చం అమ్రేష్ పూరి లాగా మాట్లాడాడమ్మా! ఇంకా అప్పు పెట్టను పొమ్మన్నాడు."
    సీత మొహం అవమానంతో మరింత ఎర్రబడిపోయింది. ఒక్కసారిగా అలాంటి మాట వినేసరికి షాక్ తగిలినట్లయ్యింది. ఇలాంటి అవమానం తమ పాతికేళ్ళ వైవాహిక జీవితంలో ఎప్పుడూ ఎదురవలేదు. ఆ ప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఆ పరిస్థితిని తట్టుకోడానికి రామచంద్రమూర్తి వేపు చూసింది.
    రామచంరమూర్తి మనసు విలవిల లాడింది. సీతను అలాంటి పరిస్థితిలో చూడకుండా వుండటానికే యింతకాలం ప్రయత్నిస్తూ వచ్చాడు.
    "రహమాన్ మనకి మంచి ఫ్రెండ్ కదా! సరదా కలా అనుంటాడు! నేను కనుక్కుంటాగా" చిరునవ్వు తెచ్చుకుని వుత్సాహంగా అన్నాడు.
    సీతకు అర్ధమైంది అతను తన దగ్గర నిజం దాస్తున్నాడని ఎందుకలా దాయటం! భార్యంటే అర్ధమిదేనా?
    "వద్దండీ! ఇంక వాడిదగ్గర చేయి దాచకండి!
ఏనాడూ లేనలవాట్లు యిప్పుడు చేసుకోవద్దు మనం!" బాధగా అందామె.
    రామచంద్రమూర్తికి ఆమె మాటలు ఊరట కలిగించినాయి.
    ఇదుగో - ఇందుకే! ఈ విషయంలోనే తను సీతను అమితంగా గౌరవించేది. సర్విస్ అంతా తను నిజాయితీని నమ్ముకుని చాలీ చాలని జీతంతో ఎన్ని అవస్థలు పడినా ఆమె పెదవి విప్పి ప్రశ్నించలేదు. ఆ అవస్థలు యింకెంతకాలం అని అడగలేదు. తను నమ్ముకున్న మార్గాన్ని మధ్యలో వదిలేయకుండా వుండటానికి ఆమె అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.
    ముఖ్యంగా తమ ఏకైక సంతానం సరితకి అన్యాయం  జరిగినప్పుడు--
    ఆ సమయంలో డబ్బు కోసం , వైద్య సదుపాయం విషయంలో రికమెండేషన్ల కోసం, తను గీసుకున్న గిరి దాటాల్సి వచ్చిన సమయంలో కూడా ఆమె ఆత్మస్థయిర్యాన్ని వదులుకోలేదు. తనను ధైర్యం కోల్పోనీలేదు. సరిత గుర్తుకొచ్చేసరికి రామచంద్రమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.
    "ఏమైపోతుంది దేశం? ఈ గుండా గవర్నమెంట్ ఇంకెంత కాలం ప్రజలనిలా పీడించుకు తింటుంది? తనలాంటి మధ్యతరగతి వాళ్ళ ఆక్రందనలు అరణ్యరోధనలేనా?
    "సరే! వెళ్ళనులే!" చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడతను.
    ఆమె కళ్ళల్లో మెరుపు, అనందం.
    అదే తన వైవాహిక జీవితానికి టానిక్!
    ఆఫీస్ చేరుకున్నాడతను.
    బయట కూర్చున్న ఫ్యూన్ తనని చూసి మొహం తిప్పుకున్నాడు. వాడికి తన మీద కోపం! కోపం కూడా కాదు! పగ! తను సూపరింటెండెంటుగా ఆ సీట్లో వున్నన్ని రోజులూ వాడి పై సంపాదన పడిపోయింది.
    వాడికే కాదు - మరో నలుగురు గుమాస్తాలకూ, ఓ అఫీసరుకీ - ఇంకో మేనేజర్ కీ అందరికీ తనను చూస్తే చాలు - ద్వేషం ప్రజ్వరిల్లేదు. చాలాసార్లు తనతో పాలయిట్ గా చెప్పడానికి ప్రయత్నించాడు ఆఫీసర్.
    "నీకెంత మంది పిల్లలు రామచంద్రమూర్తి?"
    "ఒక్కటే అమ్మాయండీ!"
    "ఏం చదువుతోంది?"
    "ఇంటర్ ఫస్టియర్"
    "అయితే త్వరలోనే చాలా ఖర్చు వుంటుందన్న మాట నీకు."
    "కొంత ఉంటుంది సార్"
    "కొంతేమిటి? మంచి సంబంధం చూసి చేయాలి కదా! నీకొచ్చే జీతముతో వాళ్ళ పెళ్లెం చేస్తావ్? ఎంతో కొంత వెనకేసుకోవాలంటే నువ్వీ సీట్లో వుండగానే చేయాలి. తర్వాత నీవల్ల కాదు."
    "అయాం సారీ సర్! నాకీ వెనకేసుకోవడాలు నచ్చవ్. నేనెప్పుడూ ఒకలాగానే వుంటాను. మంచి సీట్లో వున్నా , చెడ్డ సీట్లో వున్నా నాకేం తేడా కనిపించదు. నా ఉద్యోగం నేను సిన్సియర్ గా చేసుకోవటమే నాకిష్టం!" అయన మోహంలో విస్మయం , చిరాకు.
    "ఆఫ్ కోర్స్! నీ పాయింట్ నీదనుకో! ఎనీవే - నీ తోటివాళ్ళ కైనా యిబ్బంది కలుగకుండా చూసుకుంటే మంచిది."
    "నావల్ల ఎవరికీ ఇబ్బంది కాలుగకూడదనేదే నా కోరిక సార్!"
    "అల్ రైట్! యూ కెన్ గో!"

 Previous Page Next Page