Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 4


    
    స్కూల్ నుంచిగానీ, కాలేజీనుంచిగానీ ఇంటికి ఆలస్యంగా వస్తే 'ఏమిటంత ఆలస్యమయింది?' అనడిగితే 'ఏం? నీకు చెప్పాలా?' అన్నట్లు విసుగ్గా చూసే వాళ్ళు. "ఆలస్యమయింది" అనే వాళ్ళంతే. సంజాయిషీ చెప్పటానికి నామోషీ పడేవాళ్ళో అనవసరమనుకునే వాళ్ళో అంతకన్నా ఒక్క ముక్క చెప్పేవాళ్ళు కాదు.
    
    ఎక్కడికన్నా బయటకు పోతూంటే "ఎక్కడికి?" అనడిగితే "ఇక్కడికే" అనేవాళ్ళు 'ఫలానా చోటుకి' అనే జవాబు వాళ్ళ నోట్లోంచి వచ్చేది కాదు.
    
    "ఎప్పుడొస్తావు మళ్ళీ?"
    
    "వస్తాను!" అంతే జవాబు.
    
    చూస్తూ చూస్తుండగానే ఎలా చేయి దాటిపోయారో తలుచుకుంటూంటే తనకాశ్చర్యంగా ఉంటుంది.
    
    మరో అరగంట గడిచింది. ఈ టెన్షన్ తో కూడిన ఒంటరితనం భరించటం దుస్సహంగా ఉంది.
    
    మరో అరగంట గడిచింది. ఈ టెన్షన్ తో కూడిన ఒంటరితనం భరించటం దుస్సహంగా ఉంది.
    
    టెలిఫోన్ మోగింది.
    
    లేచి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. అవతల నుంచి రాజాచంద్ర మాట్లాడుతున్నాడు.
    
    "సారీ విశారదా ఇంకో అరగంట టైం పడుతుంది రావడానికి."
    
    "ఫరవాలేదులెండి."
    
    "కోపం లేదుగా?"
    
    "మిమ్మల్ని బంగారు పంజరంలో బంధించి ఊపిరి సలపకుండా చెయ్యటం నా అభిమతం కాదండీ. ఫ్రీగా ఉండండి ఫరవాలేదు."
    
    "నన్ను బంధించి ఉంచే అధికారం నీకుంది."
    
    "అధికారం మృదువుగా ఉండాలి కాని కటువుగా ఉండకూడదండీ."
    
    "థ్యాంక్స్ పిల్లలింటికి వచ్చారా?"
    
    "ఇంకా రాలేదు."
    
    "రాలేదా?" అన్నాడతను ఆందోళనగా.
    
    "వస్తారులెండి. ఎక్కడో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండిపోయి ఉంటారు" అంది అతనికి ధైర్యం చెబుతూన్నట్లుగా.
    
    "ఎక్కడ ఉన్నారో..."
    
    "అబ్బ వస్తారులెండి అనవసరంగా మూడ్ పాడుచేసుకోకండి."
    
    "ఉంటాను విశారదా" అతని గొంతులో అశాంతి వినిపించింది. ఫోన్ పెట్టేశాడు.
    
    దూరంగా స్కూటర్ శబ్దం వినిపించింది. ఆశగా చూస్తోంది. అంతకు ముందు స్కూటర్లు అటుమీదుగా వెళ్ళాయి. ఒక్కటీ ఇంటి ముందాగలేదు. స్కూటర్ కనుచూపుమేరకు వచ్చింది. మెల్లగా దగ్గరకు వచ్చింది. ఇంటి ముందాగింది.
    
    కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. కర్టెన్ లాగేసి బయటికి చూస్తూ నిలబడింది. చీకటిని చీల్చటానికి ప్రయత్నిస్తూ స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి.
    
    స్కూటర్ ఎవరో యువకుడు నడుపుతున్నాడు. వెనక వినూత్న కూర్చుని ఉంది. ఆమె చెయ్యి అతని నడుంచుట్టూ చుట్టుకుని ఉంది.
    
    వినూత్న స్కూటరు దిగింది.
    
    "థాంక్స్, వస్తాను" అంటోంది.
    
    అతనేదో అన్నాడు. విశారదకు వినబడలేదు. స్కూటరు స్టార్టయి కొంచెం కదిలింది.
    
    "బై."
    
    స్కూటర్ ముందుకు దూకి వెళ్ళిపోయింది.
    
    వినూత్న లోపలికొచ్చింది.
    
    "అరె! నువ్వింకా పడుకోలేదా మమ్మీ" అంది హాల్లో ఉన్న తల్లిని చూసి.
    
    "లేదు నీకోసమే ఎదురుచూస్తున్నాను."
    
    "నీకంతా కంగారు మమ్మీ ఎందుకు వెయిట్ చెయ్యటం?"
    
    "ఎందుకా?" అని విశారదకు ఏమేమో చెప్పాలనిపించింది. కాని ఆమె సాధారణంగా సహనం కోల్పోదు జవాబు చెప్పకుండా ఊరుకుంది.
    
    "గుడ్ నైట్ మమ్మీ" అని వినూత్న లోపలికి వెళ్ళిపోతుంది.
    
    "రా! భోజనం చేద్దువుగాని."
    
    "మంజీరా వాళ్ళింట్లో మీల్స్ చేసేశాను మమ్మీ" అని వినూత్న లోపలికి వెళ్ళిపోయింది.
    
    పది నిమిషాలు గడిచాయి. విశారద కదలకుండా అలాగే నిలబడిఉంది. వినూత్న డ్రెస్ మార్చుకుని లోపల నుంచి వచ్చింది. ఇందాక చుడీదార్ పైజమా వేసుకుని ఉంది. ఇప్పుడు మేక్సీ వేసుకుని, జుట్టు లూజ్ గా వదిలేసి చాలా ఫ్రెష్ గా ఉంది.
    
    "మమ్మీ! ఇంకా పడుకోకూడదూ?"
    
    విశారద ఏమీ మాట్లాడలేదు.
    
    "డాడీ, అన్నయ్యా వాళ్ళు ఇంకా రాలేదనా? వస్తారులే మమ్మీ నువ్వనవసరంగా వర్రీ అవకు."
    
    "నాకు నిద్ర రాదులే వినూ నువ్వెళ్ళిపడుకో."
    
    "నువ్వింకా అన్నం కూడా తినలేదు కదూ."
    
    విశారద మౌనంగా ఊరుకుంది.
    
    "నీకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ మమ్మీ" అంటూ వినూత్న లోపలికెళ్ళిపోయింది.
    
    ఓ పావుగంట తర్వాత బయట కారాగిన చప్పుడయింది. రాజాచంద్ర లోపలకు వచ్చాడు.
    
                                         * * *
    
    రాత్రి ఒంటిగంట దాటింది. రాజాచంద్ర, విశారద ఇద్దరూ పక్కమీద పడుకుని ఉన్నారు కాని నిద్రపోవటంలేదు.
    
    "విశారదా" అన్నాడు.
    
    "ఊఁ"
    
    "ఇటు తిరుగు."

 Previous Page Next Page