అటువంటి మాటలు పడటం రాధకు చేతకాదు, వెంటనే అందుకుని "ఏమంత కానిపని చేశాను? ఎందుకలా విరుచుకు పడతావు" అంది సూటిగా.
ముసలామె ఇంకా రెచ్చిపోతూ "మాటకుమాట సమాధానం చెప్పటం మాత్రం చాతవునే గడుగ్గాయిదానా, నువ్వెలా బాగుపడతావో నే చూస్తాగా అంది.
"నా బాగోగుల విషయం నీకెందుకులే తల్లీ, అవసరమైన వాళ్ళు పట్టించు కొంటారు."
ముసలామె నోరు నొక్కుకుని, విడ్డూరంగా "ఏమిటి? నేను పరాయిదాన్నయి పోయానా?" అంది.
రాధ యీసారి కోపంగా "ఎందుకలా ప్రతిదానికీ పెదర్ధం తీస్తావూ? అసలు నిన్నెవరు జోక్యం కలుగజేసుకొమన్నారు?" అని మాటకు మాట అంటించింది.
ఆవిడ మరీ కోపంగా "అదుపాజ్ఞలో పెట్టేవాళ్ళు లేకపోతే వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఇంతకీ అజలూ, పజలూ, తల్లి కనుక్కోవద్డా?" అనేసింది విసురుగా.
తన తల్లిని ఇంతమాట అనేసరికి రాధకు కోపం వచ్చి "ఎవరి సంతానాన్ని వాళ్ళు అదుపాజ్ఞలో పెట్టుకోవటంఅంత సులభమైన విషయం కాదు నాయనమ్మా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే తెలుస్తుంది" అంది ముందూ వెనకా ఆలోచించకుండా
దీనికి ముసలావిడ ఏమని సమాధానం చెప్పేదోగాని, ఇంతలోనే శారదాంబ అందుకుని "నోర్ముయ్!" అని అరిచింది అంతులేని కోపంతో.
అప్రయత్నంగా రాధ నోరు మూత పడింది. చూస్తూ వుండగానే ఆమె నేత్రాలు అశ్రుపూరితాలవగా తల వంచుకుంది. ముసలామె కసితీరినట్లుగా మిగిలిన నాలుగయిదు పళ్ళు పటపట లాడించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచాక "పిచ్చితల్లీ అంటూ శారదాంబ కూతుర్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది.
4
ఉదయం పదయింది. ఆకాశమంతా మేఘావృతమై ముసురుగా వుంది. మద్రాసులో ఒక వీధిలో ఒక పెద్ద డాబా ముందు బయటమెట్లమీద నిల్చుని ప్రకాశరావు "ఈ పూట కాలేజీకి యెలా వెళ్ళటమా?" అని ఆలోచించసాగాడు.
వారం రోజుల్నుంచి అతనికి మరీ ఇబ్బందిగా వుంది. చేతిలో చిల్లికానీ ఆడటంలేదు. షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చుకునేందుకు వీలు లేదు. వేసుకున్న బట్టలు మాసిపోయి తనకే అసహ్యాన్ని కలగజేస్తున్నాయి. అతని మనస్సు యిప్పుడు అన్ని విషయాలమీద లగ్నమైంది. ఉంటూన్న గదికి రెండు నెలల అద్దే బకాయిపడ్డాడు. బజార్లో అక్కడక్కడ చేసిన అప్పులలాంటివె అయిదారు వున్నాయి. వీటన్నిటిని ఎలా తీర్చగలుగుతాడో తనకే అర్థం కావటం లేదు. ఇవాళ భోజనం కూడా చేయలేదు. మిగతా విషయాలు ఎలా వున్నా తనకి భోజనం చేయకుండా వుండటం అలవాటులేదు. చిన్నప్పటినుంచి మూడుపూట్లా తినటం తల్లి తనకు అలవాటు చేసింది. అది యిప్పుడు పట్నంలో రెండుసార్లుగా మార్చుకునేసరికి నానా యాతన పడ్డాడు. ఇవాళ ఒంటిగంట అయేసరికి కళ్ళు తిరిగే పరిస్థితి రావచ్చు. ఎంతో చిన్న సమస్యలే అతనికి బహ్ర్మండమైన సమస్యల్లా కనిపించసాగాయి.
లోపలకు వొంగి అక్కడ హాల్లో గోడనవున్న గడియారం వంక చూశాడు. ఇంచుమించు టైము అయిపోయింది. కాలేజీ ఈ ప్రదేశానికి ఆరుమైళ్ళ దూరంలో వుంది. ఈ స్థితిలో నడిచి వెళ్ళడమూ అసంభవమే.
డబ్బు పంపమని ఇంటికి రాసి ఐదురోజులయింది. వాళ్ళకు పంపటం కష్టమని తెలిసే విధిలేక రాశాడు. ఎలా పంపుతారు? ఎలా వస్తుంది? ఇవన్నీ కలలో జరిగే సంగతుల్లా గోచరించాయి అతనికి. అక్కడ నిలబడి ఏమి చేయటానికీ తోచక మళ్ళీ లోపలకు వెళ్ళి గది తలుపులు తీసి కుర్చీలో కూర్చున్నాడు. తెల్లగా వున్న గోడవైపు ఏదో వెనుకనుంచి మెల్లగా వినవచ్చింది.
ఉలిక్కిపడి తలత్రిప్పి చూసి "రండి" అన్నాడు. ఆమె కోసం కుర్చీలోంచి లేవాబోతుంటే చిరునవ్వుతో "ఫర్వాలేదు---ఇది చాలు నాకు" అని క్రింద ధూళి దుమ్ములో పరిచివున్న చాపమీద కూర్చుంది.
"మీరు నాకు చాలా కష్టం కలిగిస్తున్నారు."
"ఏం?" అని క్రింద కూర్చున్న శకుంతల నవ్వుతూ అడిగింది.
"ఈ యింటి యజమానులు మీరు. నేను ఏదో చదువుకునే బీదవాణ్ణి. మీరు నాకన్నా క్రింద..."
"ఇహ ఆపండి" అని ఆమె పకపక నవ్వసాగింది.
"ఈ గొప్ప, బీదా తారతమ్యాలు లేకుండా మీరు మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు" అంది నవ్వును ఆపుకుంటూ.
ఆమెకు అంతగా పకపకమని యెందుకు నవ్వు వచ్చిందో ప్రకాశానికి అర్థం కాలేదు. మనస్సులోనిదే బయటకు అన్నాడు.
"మీరు ఎందుకు నవ్వుతారో అర్థం కావడంలేదు".
ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా వచ్చింది--- "నే నెందుకు నవ్వుతానో నాకే అర్థంగాదు."
ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విని దాని గురించి ఆలోచిస్తూండగా "మీరింతకీ అసలు విషయం చెప్పనేలేదు. తమరు యెందుకని ఎగగొట్టారు?" అని శకుంతల ప్రశ్నించింది.
"ఒంట్లో బాగుండలేదు."
"మీరీ పూట హొటలుక్కూడా పోయినట్లు లేదు."
"ఆకలిగా లేదు?"
కొంటెగా నవ్వుతున్న ఆమె వంక చూస్తూ ప్రకాశరావు బదులు చెప్పటానికి ఇష్టపడకపోయినా, తన ఓటమిని అంగీకరించలేక "ఆకలికి బదులు నా మనసునిండా యింకొకటి ఆక్రమించింది" అన్నాడు.
"మనసు నిండానా? కడుపు నిండానా?" అని శకుంతల విరగబడి నవ్వింది.
ఈసారి ప్రకాశరావు ఒప్పుకుంటూ "మీరు ఎప్పుడూ యిటువంటి ప్రశ్నలే వేస్తుంటారాయె. ఎలా సమాధానం చెప్పటం?" అన్నాడు.
ఎక్కువతక్కువలకు మాధ్యమంగా పరిచయం వున్న యిద్దరు స్త్రీ పురుషులు ఇటువంటి సమయాల్లో మాట్లాడుకోవలసి వస్తే మాటలు దొరకటం చాలా కష్టం. అందులో అక్కడ వున్నది ప్రకాశరావులాంటి యువకులే అయితే మరీ కష్టం.
కొంచెంసేపు గడిచాక శకుంతల "సరే మీరు భోజనం చేయలేదు. ఫలహారం అయినా చేయకూడదా!" అంది.
"నాకేమీ వద్దు" అన్నాడు ప్రకాశరావు బాధగా.
"కాదు, మీకు కావాలి" అంది శకుంతల మొండిగా.
తన రహస్యం బయట పడిపోతుందేమోనని విచారంగా, ఆతృతగా ఆమె వైపు చూశాడు అతను.
"మీరు ఎంత వద్దన్నా, నీరసంగా వున్నారనీ మీ ముఖమే చెబుతోంది. పళ్ళు తీసుకోవచ్చు, తెస్తానుండండి" అంటూ ఆమె లేచి గుమ్మం దాటి వెళ్ళబోయింది.
"వద్దు శకుంతల? హీనంగా అన్నాడతను. ఆ సంభ్ధనా, ఆ మాటల్లో ధ్వనించిన అదో రకం భావనా విని ఎక్కడ నిల్చుందో అక్కడే నిశ్చేష్టురాలై వుండిపోయింది.
ప్రకాశం వెంటనే తన తప్పును తెలుసుకొని, మితిలేని ఖేదంతో "నేను పట్టి దౌర్భాగ్యుణ్ణి, నా మీద ఆదరం చూపించే వాళ్ళతో గూడా ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలీదు" అన్నాడు గాద్గదికంగా.
శకుంతల ఇంకా తెల్లబోయి అలాగే చేస్తూ నిలబడింది.
"మీ కోపం ఇంకా పోలేదా?" ప్రకాశం ఆమెను సమీపిస్తూ జాలిగా అడిగాడు.
శకుంతల జవాబు చెప్పలేదు. ఒక నిమిషం అతనివంక భావశూన్యంగా చూసి, గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.
ప్రకాశరావు మ్లాన వదనంతో కుర్చీలో కూలబడి ఆలోచించసాగాడు. శకుంతల ప్రవర్తనలోని అర్థమేమిటి? తనతో మాట్లాడటానికి కూడా ఆమె యిష్టపడలేదా? ఒక్క మాటతో ఆమె సున్నిత హృదయానికి గాయం కలుగజేశాడని అతనికి తన ప్రయోజకత్వం మీద తనకే ఏవగింపు కలిగింది. తనకు ఏమీ చేతకాదు. ఎవరితో యెలా మాట్లాడాలో తెలీదు. ప్రపంచంలో ఎటువంటి పరభవాలైతే ఎదుర్కోగూడదని ప్రజలు అనుకుంటూ వుంటారో అవి తనకే ఎదురౌతుంటాయి.
ఈ ఒక్క మాటవల్లనే శకుంతల ఆగ్రహించుకుందన్న విషయం కూడా అతనికి వెంటనే నమ్మశక్యం గాలేదు. అంతకంటే చురకపెట్టే ప్రభావం గల భావం తన మాటల్లో వుండి వుండాలని అతను అనుకున్నాడు.
ఒకవైపు ఆకలిబాధ, మరోవైపు ఆలోచన్ల బాధ. ఈ రెండూ కలిసి అతన్ని కృంగదీస్తుంటే శిలా విగ్రహంలాగా అలా యెంతసేపో అతను కూర్చున్నాడు.
బయటనుంచి పోస్టుమేన్ కేకేసేవరకూ అతను అలానే వున్నాడు. తరువాత లేచి పోస్టుమేన్ అందించిన ఒక కవరు తీసుకొని లోపలికి వచ్చాడు.
ఉత్తరమంతా చదివాక అతని మనస్సు మరింత చిరాకుగా అయిపోయింది. ఇహ అలా కూర్చుని వుండటం కూడా అసంభవం కాగా అమాంతంగా పోయి విసురుగా చాపమీదపడి కళ్ళు మూసుకున్నాడు. అతని వళ్ళంతా ఏవో తేళ్ళూ, జెరుల్రూ పాకినట్లయింది. హృదయాంతరాళం నుంచి ఏవో బాధలు ఉబుసుకుని వస్తున్నట్లుగా అనుభూతి పొందాడు.
ఎంతో ప్రయత్నంమీద చాలాసేపటికి మగత నిద్రలో పడిపోయాడు.
మళ్ళీ అతనికి మెలకువ వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. తెలివితెచ్చుకుని, చుట్టూరా చూసి తన చేష్టలకి తనే సిగ్గుపడ్డాడు. పగటిపూట నిద్రపోయే అలవాటు చిన్నతనంనుంచీ తనకు లేదు. అటువంటిది ఇవాళ గాఢంగానో, మగతగానో ఏదో ఒకటి యింతసేపూ ఎలా నిద్రపోయానా అని అతనికి ఆశ్చర్యంగా వుంది. చాలాసేపు నిద్రపోవటంవల్ల ముఖం కొంచెం ఉబ్బరించి, కళ్ళు వాచి బాధపెడుతున్నా మనసు చాలా ప్రశాంతంగా వుంది. ఇప్పుడు ఇందాక బాధించిన ఆకలి బాధకూడా లేదు. ఏమిటో తేలికగా వున్నట్లుంది. ఇప్పుడు చేయవలసినదేమిటన్నది అతనికి ముందుగా తోచిన ప్రశ్న. ఏమీ చేయకుండా వూరికినే కూర్చుంటే లాభం లేదు. ఇప్పుడాకలి కాకపోయినా తిరిగి వేళ అయేసరికి మళ్ళీ బాధించవచ్చు. ఇంకా అయిదారు రోజులదాకా తనకు వచ్చే ఆస్కారం లేదు. ఇన్ని రోజులూ ఎలా కాలేజీకి పోయేటట్లు. ఎలా గడిపేటట్లు?
అతనికి అన్నగారు వ్రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య ఇలా యెందుకు చెప్పాడు? ఇటువంటి పనులు చేయటానికి తను సమ్మతించలేనని అతనికి తెలియని విషయమా?
లేచాడు. తన అభిమానం యెంత ఎదురు తిరుగుతున్నా అన్నయ్య చెప్పినట్లు చేయాలి. లేకపోతే పర్యవసానం అనుభవించేది తనే. అద్దంలో ముఖం చూసుకున్నాడు. ఉదయంనుంచీ తిండీ తిప్పలూ లేకపోవటంవల్లా, బాగా నిద్రపోవటంవల్లా, చాలా కొత్తగా, అసహ్యంగా కనిపించింది. తువ్వాలు తీసుకుని చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చి అటూ ఇటూ చూసి మెల్లగా లోపలికి పంపుదగ్గరికి వెళ్ళాడు. శకుంతల కనిపిస్తుందేమోనని అతనికి భయంగా వుంది. ఆ మాటకొస్తే ఆమె కనిపించక పోవటంకూడా అతని పూర్తీ వాంఛితం కాదు. కనిపిస్తే ముందుగా హావభావ ప్రదర్శన యెట్లా చేయాలో, ఏం మాట్లాడా లో తెలీదు.
అక్కడ సబ్బుకూడా లేదు. ఆదరా బాదరా నీళ్ళతో కడిగేసుకుని యివతలకు వచ్చి పడ్డాడు. తలుపులు ఎలాగో తాళం వేసి వీధిలోకి వచ్చాడు.
అదృష్టవశాత్తు అతనికి శకుంతల గురించి తలపొయసాగాడు. తను అసలు ఈ యింట్లోకి ఎలా వచ్చాడు? ఇంత పెద్ద పట్నంలో గది దొరక్క బాధపడుతున్న రోజుల్లో యి ఇంట్లో ఎలా దొరికింది? అంటే విచిత్రంగానే జరిగింది. "రూమ్----టులెట్?" బోర్డు చూసి తను లోపలికి పోయేసరికి అక్కడ పేరెరుగాని శకుంతల యేదో పుస్తకం చదువుకుంటూ కనిపించింది. నోరారా అడిగాడు తన ముఖంలో పెదాల కదలికలో ఆమెకు ఏం కనిపించి జాలి కలిగిందో, తండ్రితో మాట్లాడి తనకు వెంటనే గది లభించేటట్లు చేసింది. ఆనాటి శకుంతలకూ మధ్య తనకేం భేదం గోచరించలేదు. కాని తమ యిద్దరిమధ్యా వున్న సంబంధ బంధవ్యాలలో చాలా మార్పు వచ్చింది. తనతో ఆమె ఎప్పుడు అయినా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడటం అంటేనే తనకి భయం. అయినా మాట్లాడతాడు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది? తన కులంకాని ఆ స్త్రీతో మాట్లాడటానికి తను ఎప్పుడూ జంకుతూనే వున్నాడు. కాని పరిస్థితులు అలా వచ్చి, తను వాళ్ళ యింట్లో వుండడం సంభవించి, ఆమె చనువుగా మెలాగే స్వభావంగలది అయినప్పుడు తను ఏమి చేయగలుగుతాడు?