సారధికి ఒక క్షణం ఏమీ అర్ధం కాలేదు. మెదడు స్తంభించినట్లయింది. ఆ మరుసటిరోజు ప్రధానమంత్రి ఆంధ్రరాష్ట్రానికి వస్తున్నారని తెలుసు. రేపే రాష్ట్రంలో ఆరో రేడియో స్టేషన్ ప్రారంభోత్సవం.
....సారధికి ఏం చెయ్యాలో తోచలేదు. హత్యాప్రయత్నం విఫలమయినట్టా? అదే కాని పక్షంలో ప్రసారమవుతున్న ప్రోగ్రాము లన్నింటినీ ఆపుచేసి, విషాదభరిత మ్యూజిక్ ప్రారంభించాలి. దానికి ముందు, అసలు వార్తని ధృవపరచుకోవాలి. ఒకసారి రేడియోలో వార్త ప్రసారమయితే కొన్ని కోట్లమంది దానికి "రియాక్ట్" అవుతారు. వెనక్కి తీసుకోలేం. రాష్ట్రంలో జీవితం స్థంభించిపోతుంది. టెలిఫోన్ కాల్స్ ప్రారంభమౌతాయి.
ఎంక్వయిరీలు.... ప్రశ్నలు....
అసలు ప్రధానమంత్రి ప్రోగ్రాంలో ఏదైనా మార్పు వచ్చిందా? వస్తే తనకు తెలియకుండా ఎలా వుంటుంది?
అతడు చేతిలోని టెలెక్స్ వైపు చూసేడు. అప్రయత్నంగా దృష్టి దాని తారీఖుమీద పడింది. ఉలిక్కిపడ్డాడు.
ఇరవై మూడు.
అంటే రేపు.
రేపటి వార్త యీ రోజు టెలెక్స్ లో.... అనుమానంతో అతడు మరింత పరిశీలనగా చూశాడు. అప్పుడు కనబడింది పెన్సిల్ తో వ్రాసింది, చిన్న చిన్న అక్షరాలు. ".... రేపు చదువవలసిన వార్త...." అని.
తనని ఎవరో ఫూల్ ని చెయ్యటానికి ప్రయత్నించారన్న విషయం అప్పుడు అర్ధమయింది సారధికి.
ఆల్ ఇండియా రేడియో స్టేషన్ మీద ప్రాక్టికల్ జోకులు వేసేవాళ్ళు చాలామంది.
తనలో తనే నవ్వుకుంటూ, కాగితం నలిపి చెత్తబుట్టలో పడేశాడు సారధి. అదంత నవ్వుకొనే విషయం కాదని మరుసటి రోజు తెలిసింది.
* * *
డిసెంబర్ ఇరవైమూడు.
ప్రొద్దున్న ఆరున్నర.
"పట్టు పరిశ్రమకి చెంగల్పట్టు ప్రసిద్ధి, అత్తరుకి కోయంబత్తూరు" రాధ చదువుతూంది.
"తల తుడుచుకోవే జలుబు చేస్తుంది" అంటూ బామ్మ పెరట్లోకి వచ్చింది.
"ఈసారన్నా ఉద్యోగం రాకపోతే మన జలుబు వదిలిపోతుంది. అన్నట్టు బామ్మా - ఈ రోజు అమావాస్య కదూ" అంది రాధ తులసికోట ప్రక్కనే చదువుతూన్న పుస్తకం పెడ్తూ.
"ఈ వయసులో ఈ నమ్మకాలేమిటే నీకు" అంది బామ్మ.
"సెంటిమెంటుని ప్రశ్నించకు బామ్మోయ్! ఎవరి సెంటిమెంటు వాళ్ళకి" నవ్వేసి మళ్ళీ పుస్తకం తీసుకుంది చేతిలోకి.
రెండు గంటలపాటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి చదువులో మునిగిపోయింది రాధ. ప్రపంచ యుద్ధాలు, మహాపురుషుల జననాలు, అబ్రివేషన్లు వగైరా వగైరా.
ఎనిమిదిన్నర అవుతూండగా ఆమె పుస్తకం మూసి "నాయనమ్మా నేను వెళుతున్నాను పదింటికి ఇంటర్వ్యూ" అని అరిచింది.
రేడియో స్టేషన్ ఊరికి అటు చివర. ఎంత తొందరగా బస్ దొరికినా గంట పడుతుంది.
నాయనమ్మ రాధతో పాటు బయటకొచ్చింది.
రాధ మెట్లు దిగబోతూ ఎవరో తుమ్మిన ధ్వని విని, అరుగుమీద కూలబడింది.
బామ్మ నవ్వింది. "ఆ ప్రశ్నలడిగే గదిలోకి నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే అలాగే తిరిగి వచ్చేస్తావా ఏమిటే?"
"బామ్మా ఒక విషయం చెప్పనా?"
"ఏమిటే?"
"నేను నీ కాలంలోనూ నువ్వు నా కాలంలోనూ పుట్టవలసిన వాళ్ళం బామ్మా!"
"సర్లే, వెళ్ళు - వెళ్ళు-"
రాధ నసుగుతూ "శకునం" అంది.
అయిదు నిమిషాల తర్వాత ఎదురుగా వస్తున్న నీళ్ళకావిడి చూసి, "వెళ్ళొస్తాను బామ్మా!" అంది రాధ మెట్లు దిగుతూ.
రాధ నడుముమీద పొడవాటి జడ అటూ ఇటూ గెంతుతూంది. ఎందుకో బామ్మ కళ్ళు తడి అయ్యేయి. 'రత్నంలాంటి పిల్ల, ఈ డబ్బు అనే సమస్య లేకపోతే ఎలా వెలిగిపోయేది! ఆడుతూ పాడుతూ-'
"బామ్మా! నువ్వు వినటం లేదు."
"ఏమిటమ్మా"
"నేను వెళుతున్నాను. వెళుతున్నప్పుడు ఏం అనాలని చెప్పాను?"
బామ్మ తడబడింది. "బె...బె...."
"బెస్ట్ ఆఫ్ లక్."
"ఆఁఅదే. నాకు నోరు తిరగదు కానీ నన్ను చంపకు."
రాధ నవ్వి పది అడుగులు వేసి, వెనుదిరిగి చెయ్యి వూపి, మళ్ళీ నడక సాగించింది.
రోడ్ మీద ఫర్లాంగు నడిస్తే గానీ బస్ స్టాప్ రాదు. ఉదయపు సూర్యుడు డిసెంబర్ చలిని ఇంకా పూర్తిగా పారద్రోలలేదు. అందులోనూ చెరువు మీదనుంచి వచ్చే గాలి!
రాధ చెరువు వైపు చూసింది.
ఆమెకు క్రితం రోజు సంఘటనలోని పొట్టివాడు చెరువు పక్కనుంచి వస్తూ కనిపించాడు. చిరిగిన కోటూ, మాసిన పాంటూ, నెత్తిన బుట్టలు....
"నమస్కారం తాతగారూ!" అంది నవ్వి.
"ఎవరూ-" అని బుట్టల అవతల్నించి తల బైటకి పెట్టి "నువ్వా రాధమ్మ తల్లీ - ఇంటర్వ్యూకా" అని అడిగాడు.
రాధ తలూపింది. "మీ రెక్కడికి?"
"చిన్న పనిమీద వెళ్తున్నానులే అమ్మా."
రాధకో చిలిపి అనుమానం వచ్చింది. "అ ఆ ఇ ఈ సంఘం ప్రెసిడెంటుగారూ! మీది యావద్భారతదేశం అంతా ప్రతినిధులున్న పెద్ద సంఘం కదా- మరి ఎప్పుడూ ఈ ఊరి చివరే తిరుగుతున్నారేం-" అని అడుగుదామనుకుంది. కానీ, బాధపడ్తాడని ఊరుకుంది.
"ఏమిటవి?" బుట్టల వంక చూస్తూ అడిగింది.
"ఒక బుట్టలో బంతిపూలు.... ఇంకో బుట్టలో చామంతులు" అని అతడు సాగిపోయేడు - 'ఎందుకు' అని ఆమె అడిగే లోపులో.
మరో అయిదు నిమిషాలలో ఆమె బస్ స్టాప్ చేరుకుంది. తొమ్మిది కావస్తూంది. శీతాకాలమైనా ఆ రోజు బాగా ఎండగా వుంది. దూరంగా ఎక్కడా బస్ వచ్చే జాడ కనబడటంలేదు. ఆమె నుదుటిమీద చిరుచెమట పట్టింది.
మరో అయిదు నిమిషాలు గడిచినయ్. అంతలో దూరంగా ఏదో వాహనం వస్తున్న చప్పుడు వినిపించి, ఆశగా అటువైపు చూసింది.
ఓ పూల షర్టబ్బాయి-
స్కూటర్ మీద రివ్వున వచ్చి ఆగి, "లిఫ్ట్ కావాలా మేడమ్!" అని అడిగాడు.
రాధ అతడివైపు ఓ క్షణం సూటిగా చూసింది.
ఏమిటి వీళ్ళు- ఈ మొగవాళ్ళు- ఎంతమంది ఈ రోడ్డున వెళ్లటంలేదు? ఎవర్నీ అడక్కుండా నన్నే అడగటం ఎందుకు? ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు....
"ఇప్పట్లో బస్ రాదు మేడమ్! స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తూంటే కాదనకండి-"
"స్నేహం.... ఈ పదం ఎంత తేలికైపోయింది. కేవలం స్కూటర్ వెనుక లిఫ్ట్ ఇచ్చినందువల్ల స్నేహం. స్కూటర్ మీద వెళ్తుండగా పేరు అడగటం- పరిచయం.... స్నేహం ఆ పరిచయంతో హఠాత్తుగా ప్రేమగా మారిపోతుంది కాబోలు. పైకి యెంత అమాయకంగా వున్నాడో ఆ అబ్బాయి. అయినా ఎంత ధైర్యం. వళ్ళు మండిపోతూంది.
"ఏమిటాలోచిస్తున్నారు? నేను జంటిల్మన్ నండి-"
నవ్వొస్తూంది. జెంటిల్మన్ నని చెప్పుకొనే జెంటిల్మన్.
"ఏమిటి నాయనా... ఒంటరి ఆడపిల్లని ఏడిపిస్తున్నావ్" అన్న కంఠం పక్కనుంచి వినబడటంతో తల తిప్పి చూసింది.
టి.యస్. వృద్ధుడు.
ఆమె నవ్వి 'ఇప్పుడు చెప్పు' అన్నట్టుగా అబ్బాయి కేసి చూసింది. అతను తొణకలేదు.
"అబ్బే - మాకు తెలిసిన వాళ్ళమ్మాయండీ. ఆలస్యమయిపోతూందని ఒకవైపు, స్కూటరెక్కితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని ఒకవైపూ- ఎటూ నిర్ణయించుకోలేక పోతూంది. అంతే కాదూ సుమిత్రా-"
'మైగాడ్' అనుకుంది రాధ. అతను ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన వాడిలా వున్నాడు. ఆమె ఏదో అనబోయేంతలో టి.యస్. కల్పించుకొని "అమ్మాయికి మన సాంప్రదాయాల మీద యింకా నమ్మకం వున్నట్టుంది నాయనా!" అన్నాడు.
"అంతేనంటారా- అంతేలెండి-" స్కూటర్ స్టార్టుచేసి, రాధ వైపో చూపు పారేసి, ముందుకు సాగాడు.
"థాంక్స్ తాతగారూ!" అంది.
"దానికేముందమ్మా-"
స్కూటర్ మెయిన్ రోడ్ మీద దూరంగా అదృశ్యమయింది.
"బంతిపూల బుట్టలు ఏం చేసేరు?" అడిగింది.
"చిన్న పని చేసొచ్చేనులే తల్లీ" అన్నాడు వృద్ధుడు. "....ఇంకా కొన్ని మిగుల్తే అదుగో ఆ పూలషర్టుకుర్రాడి స్కూటర్ పెట్రోలు టాంకులో పోసేను."
రాధకి మొదట ఒక క్షణం అర్ధంకాలేదు. అర్ధం కాగానే విస్మయంతో - "ఏమిటీ" అంది.
"ఎంత సేపమ్మా? పాపం కుర్రవాడు నీతో మాట్లాడుతూ ప్రపంచాన్నే మరిచిపోయాడాయె. చకచకా కదిలే చేతివేళ్ళకి.... టాంకు మూతవిప్పటం- పూల రేకుల్ని చిదిమి వేయటం యెంతలో పని? అయితే రాధమ్మా, ఈ ఎండలో ఆ కుర్రవాడు... పాపం స్కూటర్ ఎందుకు ఆగిపోయిందో తెలియక...." ఆపైన అతడి మాటల్ని నవ్వు కమ్మేసింది.