ప్రభావతి నవ్వి అడిగింది "మీరు పేపరు చదివి ఎన్నాళ్ళయింది?" తనకు జరుగుతున్న అన్యాయాన్ని - పెద్దదిగానీ చిన్నదిగానీ ఒకవేళ అన్యాయమే అయితే అది ఇతరులు గుర్తించటం అతనికి ఇష్టంవుండదు.
జవాబుగా బలవంతాన నవ్వి ఊరుకున్నాడు.
"మీకు ఎప్పటినుంచి ఐడియా ఇస్తున్నాను మరో డెయిలీ తెప్పించుకోమని? వాళ్ళు ఎక్స్ ప్రెస్ తెప్పించుకుంటే మీరు హిందూ తెప్పించుకోండి."
అతను జవాబు చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
అతను 'ఊఁ' అని ఆమెవంక చూసి 'ఏమీలేదు' అన్నాడు.
"ఏమీ లేకుండా ఎలావుంటుంది? ప్రొద్దున్నే దేన్నిగురించి ఆలోచిస్తున్నారు?....చెప్పండి?"
"నిజంగా ఏమీలేదు."
"సరేలెండి. మీరు నాకు ఒకనాడు నిజం చెప్పారుగనకనా?" అని ప్రభావతి విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
తానసలు దేన్నిగురించి ఆలోచిస్తున్నాడు? ఏదో పరాకుగా వున్నాడంతే. ఒకవేళ అస్పష్టంగా ఏదయినా ఆలోచన వున్నా, దానికి స్వరూపం లేదే! అది ఫలానా అని ఎలా విడమరిచి చెప్పడం?
అతనికి 'ఛీ!' అనిపించింది.
ఇల్లెంత శుభ్రంగా వుంచుదామని చూస్తున్నా ఈ ఈగలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో అర్ధంకాదు.
ఈగలనూ, దోమలనూ, మురికినీ లెక్కచెయ్యకుండా నిర్లక్ష్యంగా బ్రతికేవాదు ఎంత అదృష్టవంతుడో అనిపించింది.
కాఫీ త్రాగటం పూర్తయింది. ప్రతిరోజూ జరిగేదే అయినా కాఫీత్రాగటం, మంచి ఆకలితో భోజనం చెయ్యటం, కంటినిండా నిద్రపోవటం - ఇవన్నీ చాలా ఆనందకరమైన ఘట్టాలు. వీటికేమాత్రం అంతరాయం కలిగినా ఆ అసంతృప్తి మనసుని సరిపెట్టుకోనివ్వదు.
తండ్రి ఫలహారం పూర్తిచేసి డ్రెస్ చేసుకుంటున్నాడు. డ్రైవరు అంతకు ముందే తాళాలు తీసుకువెళ్ళాడు గావును, షెడ్ లోంచి కారు బయటకు తీసుకువచ్చి ఇంటిముందరగా రోడ్డుమీద పెట్టి పాలిష్ క్లాత్ తో తుడుస్తున్నాడు. దారిన పోయేవాళ్ళు, వాళ్ళ అలవాటు ప్రకారం కారుప్రక్కన నడుస్తున్నప్పుడు దాన్నితాకి, చేత్తో రాస్తూ వుంటే మధ్యమధ్య వాళ్ళను అదలిస్తున్నాడు.
మూడోవాడు సుధాకర్ నిద్రలేచి టూత్ బ్రష్షూ, పేస్టూ తీసుకుని పెరట్లో వున్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు.
హరి తొమ్మిది దాటితేగానీ ఇల్లుదాటి బయటకు కదలడు తాపీగా గడ్డం చేసుకుంటూ గదిలో కూర్చున్నాడు.
కుమార్ తనుకూడా స్నానాదికాలు పూర్తి చేసుకుందామని నెమ్మదిగా లేచి లోపలకు వెడుతున్నాడు. హాల్లో అప్పటికే ప్యాంటు వేసుకుని బనియన్ తో వున్న తండ్రి ఎదురయ్యాడు.
తండ్రంటే కుమార్ కు భయం, భక్తి, గౌరవం అన్నీ వున్నాయి అతను తండ్రికోసం చాలా చేశాడు. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. అసలు కుమార్ కే సరిగ్గా తెలియదు. కొడుకుకోసం తండ్రి చేసింది రివాజయినా, అది ధర్మమయినా నలుగురూ గొప్పగా చెప్పుకుంటారు. తండ్రికోసం కొడుకు చేసింది రివాజు కాకపోయినా, ధర్మాన్ని మించింధయినా ఘనంగా చెప్పుకోరు సరికదా సామాన్యమైనదిగా, తేలిగ్గా కొట్టిపారేస్తారు. చెయ్యనిదాన్ని గురించి మాత్రం చెప్పుకుంటారు. ఆ మాటకొస్తే ఈ దేశంలో కొడుకులవల్ల తండ్రులు పడే ఇడుమూలకంటే తండ్రులవల్ల కొడుకులు నలగతం చాలా ఎక్కువ.
రంగారావుగారు కొడుకు ఎదురుగా కనిపిస్తే ఏదో పలకరిస్తాడు లేకపోతే ప్రశ్నవేస్తాడు. ఈ రెండూ కుమార్ కు ఇష్టంలేవు. అతను వాంఛిస్తున్న పద్దతిలో తండ్రీకొడుకు లేవిధంగా వుండాలో తనూ తన తండ్రీ అట్లా లేరు అతని దృష్టిలో తండ్రీ కొడుకూ ఎక్కువగా ఎదురుపడకూడదు. పదేపదే ఒకరిముందు ఒకరు బయటపడిపోకూడదు. ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అవసరమైనంతవరకే మాట్లాడుకుని, ఒకరినుంచి ఒకరు దూరంగా తప్పుకు తిరుగుతుండాలి. ఒకరిపట్ల ఒకరు గంభీరంగా ప్రవర్తిస్తూ వుండాలి. ఒకరికి ఒకరు గంభీరంగా కనిపిస్తుండాలి. అతనికి అట్లాంటి తండ్రీకొడుకుల బాంధవ్యం రమ్యంగా, అందంగా కనబడుతుంది.
"ఏరా, ఇంకా ఆలస్యముందా?" అనడిగారు రంగారావుగారు చేతికున్న రిస్టువాచీ చూసుకుంటూ.
కుమార్ తల ఊపి ఇబ్బందిలో పడినట్లుగా ముఖంపెట్టి "పోనీ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను" అన్నాడు.
"ఇప్పుడు ఏడున్నర దాటింది. ఓ అరగంటలో నేను ఇద్దరు ముగ్గుర్ని కలుసుకుని, పని పూర్తి చేసుకుని వస్తాను. ఈ లోపల స్నానం అధీ పూర్తిచేసి రెడీగా వుండు" అని సమాధానంకోసం ఎదురుచూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
"మీరు ముందు వెళ్ళిపొండి, నేను తెమిలాక రిక్షాలో వస్తాను" అని చెబుదామనుకుని చెప్పలేకపోయాడు కుమార్.
తనలో తాను తిట్టుకుంటూ లోపలకు వెళ్ళి మెట్లెక్కి పైకివెళ్ళాడు.
అతని బాత్ రూమ్ వగైరాలన్నీ పైవేపున్నాయి. అసలు కాఫీకికూడా క్రిందికి దిగి రావాల్సిన పనిలేదు. పైకే తెప్పించుకుని త్రాగవచ్చు. ప్రభావతి కూడా పైకి తెచ్చి ఇమ్మంటే కాదనదు. కనీ తను గదిలోంచి కాలు బయటకు పెట్టకుండా అన్నీ గదిలోకి తెప్పించుకుంటే ఎవరేమనుకుంటారోనన్న భయంతో కొందరు జీవితాన్ని బంధిఖానా చేసుకుంటారు. ఎవరేమనుకుంటే మనకేమన్న నిర్భయంతో కొందరు జీవితాన్ని సర్కస్ చేసుకుంటారు.
పైకివచ్చి ఆదరాబాదరాగా గడ్డం చేసుకునే సామాన్లన్నీ ఎదురుగా పేర్చుకుని బ్లేడుకోసం చూసేసరికి, అది కనబడలేదు. ఏదో ఒక వస్తువు రోజూ కనబడకపోవటం అతని దినచర్యలో ఒకటి అతనికి జ్ఞాపకమున్నంత వరకూ కొత్తబ్లేడ్ ఒకటి షేవింగ్ పెట్టెలో వుండాలి. మెట్లదగ్గరకొచ్చి నిలబడి "మల్లిబాబూ! మల్లిబాబూ!" అని పిలిచాడు.
రెండుమూడు సార్లు పిలువగా క్రిందినుంచి ప్రభావతి పలికింది. "ఏమిటీ? ఇంతలో ఏం కొంప మునిగిపోయిందని అట్లా అరుస్తున్నారు?"
ఆమె అలా అనడం తన తల్లి, మరదలూ వింటున్నారని అతనికి తెలుసు. వాళ్ళు వింటూవుండగా తనతో ఆమె అలా మాట్లాడటం అతనికిష్టంలేదు. అయినా అతని యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చాలా విషయాలు జరుగుతూ వుంటాయి.
"నా బ్లేడు కనబడటంలేదు ప్రభా! క్రొత్తవి వుండాలి" అన్నాడు కొంచెం బెదురుతూనే.
చాలామంది ఎదుటివాళ్ళని చూసి బెదిరేది వాళ్ళను చూసి భయపడి కాదు. తమకు ఇష్టంలేని సంఘటనలు జరుగుతున్నాయన్న భయంవల్ల.
"పిల్లలేమయినా తీశారేమో ఉండండి అడుగుతాను" అని క్రిందినుంచి ప్రభావతి పిల్లల్ని కేకేయటం, వాళ్ళు ఒక్కొక్కరూ రావటం, ఆమె వాళ్ళను గుచ్చి గుచ్చి అడగటం, చివరకి రెండోవాడు తన పెన్సిల్ చెక్కుకోవడానికి నాన్నగారి షేవింగ్ పెట్లోంచి బ్లేడ్ తీశానని, చెక్కుకున్నాక ఎక్కడో పోయిందని చెప్పడం, 'వెధవా! నీకు రోజుకొక మర కొనిపెడుతూ వుంటే నాన్నగారి బ్లేడు తీస్తావా? వుండు, నీపని చెబుతాను' అంటూ ఆమె వాడిని పట్టుకుని దబదబమని బాదటం పైకి సగంసగంగా వినిపిస్తూ కనిపిస్తూ వున్నాయి.
చివరకు ప్రభావతి తన తండ్రిదో, తమ్ముడిదో బ్లేడు పట్టుకుని పైకివచ్చింది.
"ఇదిగో గబగబ కానివ్వండి. మీ నాన్నగారు మీకు అరగంట టైమిచ్చారు. అప్పుడే పావుగంట గడిచిపోయింది. ఇహ ఆయనవస్తే మీ ఇద్దరి కాళ్ళక్రింద చీమలు కుట్టినట్లే అవుతుంది. ఊ ఊ, కానివ్వండి" అని ఎదురుగా కూర్చుంది.
తను నేలమీద కూర్చుని, చిన్న స్టూల్ మీద అద్దం పెట్టుకుని షేవ్ చేసుకుంటాడతను. తను షేవ్ చేసుకున్నప్పుడు భార్య అయినా సరే ఎదురుగా, అతిదగ్గర్లో ముఖంలోకి పరిశీలిస్తూ కూర్చోవటం అతనికిష్టం వుండదు. కానీ అవతలికి వెళ్ళమని చెప్పటం కుదరదు.
ఏదయినా రాస్తుంటే అవతలివాళ్ళు పట్టిపట్టి చూస్తుంటే క్రాంప్స్ వచ్చినట్లుగా అయి పెన్ను పట్టుకున్న చెయ్యి ఎలా కదలటానికి జంకుతుందో షేవ్ చేసే చెయ్యికూడా ఎవరయినా పట్టిపట్టి చూస్తుంటే అలానే జంకుతుంది.