"ఈ ప్రక్క బాగా తెగలేదండీ, ఇక్కడ గడ్డంక్రింద బాగా వుండిపోయింది. అటుప్రక్క.....అయ్యో తెగిందండీ!"
బాగా లోతుగానే తెగింది. రక్తం బడబడమని కారసాగింది.
అతనికి నీరసం క్రమ్మినట్లయింది. టవల్ ని తెగినచోట గట్టిగా అదుముతూ కూర్చుండిపోయాడు.
"అయ్యో రామా! అదేం చేసుకోవటమండీ! మీ నాన్నగార్నిచూడండి, ఎప్పుడయినా తెగుతుందేమో? ఏదీ చూడనివ్వండి నెత్తురు కట్టిందేమో."
"అబ్బబ్బబ్బ! నువ్వవతలకు వెళ్ళు పిల్లా!" అనాలనుకున్నాడు. ఊరికినే అనుకున్నాడంతే.
ఇంతలో క్రిందినుంచి ప్రభావతి అత్తగారు కేకేసింది. 'వస్తున్నాను అత్తయ్య గారూ!' అని ఆమె గబగబ క్రిందకు వెళ్ళిపోయింది.
షేవ్ చేసుకోవటం ముగించి కుమార్ స్నానానికి క్రిందికి వచ్చాడు. పైన బాత్ రూమ్ లో చేయొచ్చుగానీ పైకి వేన్నీళ్ళు తెమ్మనడం, పనిమనిషి తీసుకురావటం ఇదంతా కాలయాపన, యాతనకూడా అందుకని కుమార్ క్రిందనే చేసేస్తూ వుంటాడు.
బాత్ రూమ్ తలుపు వేసుకుని వేన్నీల్ల మిషన్ పంపు తిప్పాడు. ముందు గోరువెచ్చగా మాత్రమే వచ్చి తర్వాత చన్నీళ్ళే పడసాగాయి.
అతనికేడుపు వచ్చినట్లయింది. ఎంత వేసవిలో అయినా వేన్నీళ్ళు పోసుకోవటం అతనికి అలవాటు. అలాంటిది ఇప్పుడు కొద్దిగా చలిరోజులు కూడాను.
బయటినుంచి ప్రభావతి 'ఏమండీ! నీళ్ళు వేడిగా వున్నాయా?' అనడిగింది.
"ఆఁ నీ నెత్తిలా వున్నాయి" అని అందామానుకుని 'ఇది వేన్నీళ్ళ మిషన్ లా లేదు, ఐస్ వాటర్ మిషన్ లా వుంది' అన్నాడు.
పంపులోంచి నీళ్ళు పడుతూ చప్పుడు చేస్తున్నాయేమో, ఆ మాటలామెకు సరిగా వినబడలేదు. 'ఏమిటంటున్నారూ?' అంది బిగ్గరగా.
అవేమాటలు మరింత గట్టిగా చెప్పటానికి మొదలుపెట్టి "ఇదే...." అనబోతుంటే చెవులు గింగురుమనేటట్లు దగ్గర్లోంచి రైలుకూత వినిపించింది. అతని నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోయాయి.
కూత ఆగిపోయాక 'ఇప్పుడు చెప్పండి ఏమిటంటున్నారూ?' అంది ప్రభావతి.
అతనికిక చెప్పాలన్న యిచ్చ నశించింది.
"ఏమీలేదు" అన్నాడు.
"నాకు తెలుసండీ! నీళ్ళు చల్లగా వున్నాయని కదూ మీ బాధ? ఆలస్యంగా చేస్తే అంతే శాస్తి అవుతుంది. మీరు పైనుంచి షేవ్ చేసుకుని వచ్చేలోపల మీ మరదలు తన పిల్లలకు నీళ్ళు పోసేసింది. మీ బావగారింకా చేయలేదమ్మా అన్నాను. మా పిల్లలకు బడి టైమయిపోయింది అని వేన్నీళ్ళన్నీ వాడేసింది. అనుభవించండి" అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
చేసేదిలేక మొక్కుబడి తీర్చుకున్నట్లుగా ఆ చన్నీళ్ళనే గబగబ పోసుకోసాగాడు.
మోటారు పెట్టించి, ఇల్లంతా ఎక్కడపడితే అక్కడ పంపులూ, వాష్ బేసిన్లూ, బాత్ రూమ్ లో హాట్ వాటర్ మిషనూ ఇవన్నీ కుమార్ అయిదారు నెలలక్రితం పెట్టించాడు. అంతకుముందు తూముదగ్గర కూర్చుని ముఖం కడుక్కోవటం, రాక్షసి బొగ్గు బాయిలర్ లో వేసి మండించటం అమలులో వుండేది కుమార్ కి షవర్ వగైరాలతో ఈ సౌకర్యాలన్నీ చేసుకోవాలని ఎప్పట్నుంచో మనసు ఉవ్విళ్ళూరుతూ వుండేది. కానీ డబ్బు దాచుకోవటం ఎప్పటికప్పుడు ఆ డబ్బు దేనికో ఖర్చు అయిపోతూవుండేది. ఈసారికూడా తండ్రితో తానీవిధంగా చేయబోతున్నానని వెల్లడించినప్పుడు, ఓ నిముషం గంభీరంగా ఆలోచించి "ఇంతకన్నా ఉపయోగకరమైన దానికి ఈ డబ్బు సద్వినియోగం చేయవచ్చు నేమో చూడు" అన్నాడు. ఆయనలో ప్రతిదానికీ అడ్డుపుల్లలు వేసే స్వభావం వున్నదని తెలుసుకాబట్టి తను ప్రశ్నార్ధకంగా చూసినట్లు చూసి ఊరుకున్నాడు. "మేడమీద పిట్టగోడ అందవికారంగా కనబడుతోంది. అది పడగొట్టి పెరటిలో వాల్ అందంగా వుండేటట్టు కడితే బాగుంటుందని నా ఉద్దేశం" అన్నాడు. తండ్రికి ఇసుక, సిమెంటుకు డబ్బు ఖర్చుపెట్టడంలో నిషా వున్నట్లు కనిపించింది. ఇంట్లో ఎప్పుడూ ఏదో తాపీపనులు జరుగుతూనే వుంటాయి. వంటింట్లో వున్న అరుగుని తీయించి మరో అరుగు కట్టించటమో, గచ్చు నేలని తీయించి మళ్ళీ ఏదో చేయించటమో, ఏ గోడో పగలకొట్టించి దాన్ని మరో విధంగా మారుస్తుండటమో ఇలా ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే వుంటుంది. అభివృద్ధి మాత్రం అట్టే కనబడదు. ఇంటిముందు ఎప్పుడూ ఏ ఇసుకరాసో, ఇటుకుల కుప్పో వుంటుంది. అసలు తన ఇంట్లో ఏ మరమ్మత్తు జరుగుతున్నదో కుమార్ కి చాలా సందర్భాలలో అర్ధంకాదు. ఆయన ముందు మాత్రం పిట్టగోడను పగలకొట్టించి, మళ్ళీ కట్టించడం గురించి ఏమీ తర్కించ కుండా ఓరోజు వున్నట్లుండి శానిటరీ స్టోర్సునుంచి పైపుట్యూబులూ, వాష్ బేసిన్లూ వగైరాలు ఇంటికి చేర్పించాడు ఈ తతంగమంతా చూసి "వీళ్ళు పెద్దవాళ్ళయిపోయారే! మన సలహా వినటంగానీ ముందువెనుకలు ఆలోచించటం గానీ లేదు. వాళ్ళూ సంపాదనాపరులయ్యారు. వాళ్ళనేమనటానికి వీల్లేదు" అని తల్లిదగ్గర ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కానీ తర్వాత ఇల్లంతా పంపులతో నిండిపోయి ఎక్కడపడితే అక్కడ నీళ్ళు దివిజ గంగాభవానిలా అవతరిస్తున్నప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషం ఆయన ముఖంలోనే కనిపించింది.
ప్రభావతి కంఠం బయటినుంచి వినిపించింది. "మీ నాన్నగారు అప్పుడే వచ్చేశారండోయ్! అబ్బాయి తెమిలాడా లేదా అని అడిగారు. రండి త్వరగా!"
అతనికి ప్రభావతిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఒక్కొక్కసారి అత్తగారన్నా, మామగారన్నా ఎంతో ఆదరాభిమానాలున్నట్లూ, ఎంతో భయభక్తులున్నట్లూ మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి పూచికపుల్ల క్రింద తీసేసి మాట్లాడుతుంది.
"వచ్చేశారా? బాబ్బాబూ! నీకు పుణ్యముంటుంది కానీ వెళ్ళి ఆయనకింకా ఆలస్యముందిగానీ తర్వాత రిక్షాలో వస్తారు ముందు మీరెళ్ళిపొండని చెప్పకూడదూ?'
"ఆయన నామాట వినరు బాబూ, అయినా వుండండి, ట్రైచేసి వస్తాను. మీ ఇద్దర్నీ చూస్తుంటే మధ్య నాకు ముళ్ళమీద వున్నట్లుగా వుంది" అని ప్రభావతి అక్కడ్నుంచి లోపలికి వెళ్ళింది.
ఆమె తిరిగివచ్చేసరికి అతను స్నానంముగించి నడుంవరకు తువ్వాలు చుట్టుకుని బాత్ రూమ్ తలుపు తెరుచుకుని బయటకు వస్తున్నాడు.
"ఏమన్నారు?" అని అడిగాడు ఎంతో ఆతృతగా, పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నవాడిలా.
ప్రభావతి ఏదో చెప్పబోతుండగా రంగారావుగారే బాత్ రూమ్ దగ్గరకు వచ్చేశారు.
"నీకు మళ్ళీ రిక్షాడబ్బులు దండుగ ఎందుకురా? అయిన ఆలస్యం ఎలాగూ అయిందిగానీ గబగబ డ్రెస్ చేసుకుని టిఫిన్ తీసేసుకో ఈ వయస్సులో కూడా నేను చకచక పనులన్నీ పూర్తిచేసుకుని ఏడుగంటలకల్లా తెములుతున్నాను. నీకు ఎనిమిదిన్నర దాటినా చేతగాకుండా వుంది. కానియ్యి కానియ్యి, త్వరగా "అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.
ప్రభావతి పెదవివిరిచి "అన్ని కబుర్లు చెప్పారుగానీ తను ముందుగా ఆఫీసుకు వెళ్ళిపోయి కారు పంపిస్తానని అనకూడదూ? అమ్మో! కారుకీ ఆయనకూ లంకె" అంది విసురుగా.
తన అక్కసు ఇతరుల నాలికమీదినుంచి వ్యక్తమయితే తనికిష్టం వుండదు. మౌనంగా లోపలకు నడిచాడు.
క్రింది గదుల్లోనే వంటింటికి ప్రక్కగా వున్న ఓ గదిలో అందరిబట్టలూ పెట్టుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకూ ఉద్దేశించబడి వుంది. అందులో రెండు బీరువాలూ, నాలుగయిదు ట్రంకుపెట్టెలూ, ఒక అల్మైరా వున్నాయి. అది డ్రెస్సింగ్ రూమ్ అనే ఉద్దేశించబడి వున్నా, అరబస్తాడు బియ్యం పట్టే బియ్యండబ్బా, కొంత పాత ఇనుపసామానూ, అటకమీద తద్దినాలప్పుడో, శుభ కార్యాలప్పుడో బయటకు తీసే గుండిగలూ మొదలైన పాత్రసామానూ వున్నాయి. తనకోసం మేడమీద గదులున్నా దిగటం ఇబ్బందిగా వుంటుందని తన బట్టలూ అవీ ఈ గదిలోనే వుంచే ఏర్పాటు చేసుకున్నాడు కుమార్.
ఉండటానికి ప్రతివారికీ విడివిడిగా బీరువాలనీ, పెట్టెలనీ కేటాయించబడి వున్నా, అక్కడ అందరి బట్టలూ కలగాపులగంగా, అసహ్యంగా పడివున్నాయి. ఆడవాళ్ళు కట్టుకుని విడిచిన చీరెలు, తడి తువ్వాలులు నేలమీద చీదరగా పడి వున్నాయి. కుమార్ బీరువాతెరచి తన డ్రాయరు బనియనూ కనిపిస్తాయే మోనని ఆత్రంగా వెతికాడు. ఒకటి రెండు బయటకు తీసి చూశాడుకూడా. కానీ అవి తన తమ్ముళ్ళవని అనుమానంవచ్చి మళ్ళీ లోపల పెట్టేశాడు.