కుమార్ క్రిందికిదిగి ఇంట్లోకి వచ్చేసరికి ఆ ఇంట్లో పరిస్థితి ఇలావుంది....
ఆజానుబాహుడైన అతని తండ్రి అప్పుడే స్నానాదికాలు ముగించి పూజకోసం తను కేటాయించుకున్న గదిలో పూజలో నిమగ్నమై వున్నాడు. కుమార్, పిల్లలూ, అతని తమ్ముడు హరిపిల్లలూ అంతాకలిసి ఇల్లంతా నానా భీభత్సం చేసేస్తున్నారు. పెళ్ళికాని అతని చెల్లెలు సుజాత అప్పుడే ఎవరిమీదనో అలిగినట్లు మూతి ముడుచుకుని కూర్చుంది. హాలులో ఎవరూ వినకపోయినా రేడియో అనవసరంగా వార్తలు వల్లిస్తోంది. వంటింట్లో అప్పుడే కొంపంతా మునిగిపోయినట్లు అతని తల్లీ, ఆమె ఇద్దరుకోడళ్ళూ ఏదో పెళ్ళికో, అంతకన్నా పెద్ద శుభకార్యానికో సిద్దపడిపోతున్నట్లు నానా హడావుడీ చేస్తున్నారు. ఆ ఇంట్లో అందరికంటే పెద్దదైన అతని అమ్మమ్మ అయినదానికీ కానిదానికీ కల్పించుకోవటం అప్పుడే మొదలుపెట్టింది. అతని తమ్ముడు హరి క్రిందవున్న తన గదిలోకూర్చుని గబగబ పేపరు చదివేస్తున్నాడు. మూడోవాదు సుధాకర్ ఇంకా నిద్రలేచినట్లు లేదు. పెరట్లో పిల్లల రాక్షసగోల మరీ ఎక్కువయింది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, త్రోసుకుంటున్నారు. పంపులదగ్గర చేరి నీళ్ళు పారబోస్తున్నారు. అటూఇటూ పరిగెత్తి అన్నీ ముట్టుకుంటున్నారు.
పెద్దకోడలు ప్రభావతి వంటింట్లో చేస్తున్న పని ఆపి ఆపుకోలేని కోపంతో పెరట్లోకి వెళ్ళి పిల్లల్ని పట్టుకుని దబదబ నాలుగు బాదింది. ఆవిడ బాదాక తను బాదకపోతే బ్యాలెన్సు వుండదని చిన్నకోడలు విమలకూడా దూకుడుగా వెళ్ళి తన ఇద్దరి పిల్లలవీపుల్నీ చితక్కొట్టేసింది. పిల్లలు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో భయంలేదు, మొండితనం తప్ప పూజ చేసుకుంటున్న రంగారావుగారు తన ఏకాగ్రతకు భంగంకాగా గట్టిగా అరుద్డామని రెండుమూడుసార్లు తొందరపడబోయి తను పూజ చేసుకుంటున్నానని గుర్తుతెచ్చుకుని మళ్ళీ తమాయించుకుని ఊరుకున్నాడు. కోడళ్ళిద్దరూ పిల్లల్ని తన్నటం పూర్తిచేసి వంటింట్లోకి వచ్చి మళ్ళీ పనిలోపడి ఇల్లంతా వినిపించేటట్లు పిల్లల్ని ఉద్దేశించి ఇంకా గట్టిగా తిడుతూనే వున్నారు. "ఊరుకోండర్రా, ప్రొద్దున్నే గొడవేమిటి?" అని అత్తగారు వారించబోతున్నా వాళ్ళ వాక్ప్రవాహానికి అంతు ఉండటంలేదు. రంగారావుగారు పూజ ముగించుకువచ్చి ఓ క్షణం అక్కడ నిలబడి మొదట్నుంచీ డిసిప్లిన్ గా పెంచటం చాతగాక, ఇప్పుడు బాదుకుని ఏం లాభం?" అని ఓ వాగ్బాణం విసిరి బట్టలు మార్చుకునేందుకు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.
ప్రభావతి గయ్యిమని లేచింది. "ఛీఛీ! వెధవకొంప. నా పిల్లల్ని నేను కొట్టుకునేందుకు కూడా ప్రాప్తంలేదు. అందరూ సాధించేవాళ్ళే" అంటూ గబగబా ఇవతలికి వచ్చి మెట్లెక్కబోతోంటే కుమార్ ఎదురుగా వచ్చాడు. "ఇదిగో నేనీ కొంపలో కాపురం చేయలేనండీ, ఈ పిల్లల్ని మీరు ఎట్లా పెంచుకుంటారో ఏమో మీ ఇష్టం" అంది గట్టిగా, నిద్రలేచాక భార్య తనతో మాట్లాడిన మొదటి సంభాషణ విని అతను మెదలకుండా మిగతామెట్లు దిగిపోయి లోపలకు నడిచాడు. "మాట్లాడరేం? ఛీఛీఛీ! ఏం మనిషి? అయినా మీకు చెప్పి ప్రయోజనమేముంది లెండి? వట్టి గోడ" అంటూ తనకు కలిగిన కష్టానికి ఏకాంతంలో ప్రశాంతత పొందటానికి ఆమె మేడమీదకు వెళ్ళిపోయింది.
2
ఇల్లంతా తెల్లవారుతూనే ఓ ఇబ్బందికరమైన, కొంతమంది చూడటానికి ఇష్టంలేని మబ్బు వాతావరణంలో మునిగిపోయింది.
పిల్లలు రెండు నిముషాలు నిశ్శబ్ధంగా ఊరుకున్నట్లు ఊరుకుని పెరట్లో అల్లరిచేస్తే పైన గదిలోవున్న తల్లికి వినిపిస్తుందని కాబోలు గదుల్లోకి వచ్చి అల్లరి మొదలుపెట్టారు.
కుమార్ ముందుగదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతని ఇద్దరు మగపిల్లలూ ముందుగదిలోకి వచ్చి ఏదో అర్జంటుపని ఉన్నట్లు బీరువాక్రింద చేతులు దూర్చి సవరించటం ప్రారంభించారు.
అంతక్రితం ఏమీ జరగనట్లు జరిగేది తను అప్పుడే గమనిస్తున్నట్లు "అల్లరి చేయకండిరా!" అని గద్దించాడు.
అది ఆ రోజు అతని నోట్లోంచి వచ్చిన మొదటిమాట, ప్రతిరోజూ ఏదో మంచిమాటతో సంభాషణ మొదలుపెట్టాలనుకుంటాడు. కానీ ఎప్పుడూ ఎవర్నో గద్దించటంతోనో విసుక్కోవటంతోనో మొదలవుతుంది.
అతని పిల్లలకు తండ్రంటే భయంలేదు. అసలు వాళ్ళకేమీ వినబడనట్లే వాళ్ళ ధోరణిలో మునిగివున్నారు.
అంతకంటే గట్టిగా అరవటం అతనికిష్టంలేదు. అది తండ్రి చెవులకు వినబడిందా వెనుకనుంచి ఆయన అందుకుంటారు. అంతకుముందు జరిగింది మరిచిపోయి 'ఏమిటేమిటి?' అంటూ.
అది కుమార్ కు ఇష్టంవుండదు. తన కోపంగానీ, తనలాలనగానీ పదిమంది ముందూ బహిరంగపరచటం అతనికి చిన్నతనంగా వుంటుంది.
కానీ అప్పటికే తండ్రి వినేశాడు. 'ఏమిటి? అల్లరి చేస్తున్నారా?' అన్నాడు ముందుగదిలోకి వచ్చి ఆయనింకా పట్టుబట్టలతోనే వున్నారు.
"ఏమీ లేదులెండి. ఆదుకుంటున్నారు" అని బయటకు అని 'కొంచెం మితిమీరి' అని మనసులో అనుకున్నాడు.
ప్రభావతి తిరిగి పైకివెళ్ళింది కద, తనకు కాఫీ ప్రయత్నమేమయినా వుందో లేదో చూద్దామని లేచి లోపలి వెళ్ళాడు.
వంటిల్లంతా భీభత్సంగా వుంది. ఎక్కడికో వలస వెళ్ళేవారు, వాళ్ళ ఏర్పాటు మీదవున్నట్లుంది. ప్రభావతి మేడమేదినుంచి ఎప్పుడు దిగివచ్చిందో గానీ గ్యాస్ స్టౌమీద పాలు పెట్టి భర్తకు కాఫీ ప్రయత్నం చేస్తోంది. తోడికోడలు విమల కత్తిపీత ముందేసుకుని కూరలు తరుగుతోంది. తన తల్లి శారదమ్మ బొగ్గుల కుంపటిమీద పిల్లలకని కాబోలు అన్నం ఉడకేస్తున్నది.
ప్రొద్దున్నే వంటావార్పుకని ఇంత హడావుడి ఎందుకో అర్ధంకాదు కుమార్ కి.
ఎవరో వెంటబడి తరుముతునట్లు రైలువేళ తప్పిపోతుందన్న భయంతో ప్రయాణీకులు హంగామా చేసినట్లు, వంటిల్లు నిరంతరం రణగొణధ్వనితోనే నిండిపోయి వుంటుంది.
కొంతమంది ఆడవాళ్ళు చడీచప్పుడు చేయకుండా, ఆర్భాటాలు లేకుండా పిల్లల్ని ముచ్చటగా ముస్తాబుచేసి స్కూళ్ళకి ఎలా పంపించగలుగుతారో, ఇంట్లోని పనంతా చకచక చేసేస్తూనే ఇళ్ళు నిశ్శబ్దంగా, నిర్మలంగా వుండేటట్లు ఎలా చేయగలుగుతారో అర్ధంకాహ్డు కుమార్ కి.
మళ్ళీ ముందుగదిలోకి వచ్చి కూర్చుని పేపరెక్కడుందోనని అటూఇటూ చూశాడు. అతనికి కాఫీ త్రాగుతూ పేపర్ చూడటమంటే సరదా. కానీ ఆ కోరిక ఒక్కోసారి నెలల తరబడి నెరవేరకుండానే వుంటుంది. అతను చూద్దామనుకున్న వేళకు ఆ పేపరు తమ్ముడు హరి చేతిలోనో, లేకపోతే తండ్రి చేతిలోనో వుంటుంది. వరుస కుదరక, అతను రోజులతరబడి పేపరు చూడకుండా మానేసిన సందర్భాలనేకం వున్నాయి. ఉదయంవేళ హరి పేపరు పట్టుకుని కూర్చుంటే, మధ్యాహ్నం నిద్రలేచాక తండ్రి పట్టుకుని కూర్చుంటాడు. కుమార్ కి మళ్ళీ పేపర్ చూడాల్సిన టైము అదే. తండ్రి పేపర్ వదిలిపెట్టేసరికి అతను క్లినిక్ కు వెళ్ళాల్సిన టైము అయిపోతుంది.
ప్రభావతి కాఫీ తీసుకువచ్చింది.
ఆమె ముఖంలో రుసరుస ఒక పిసరు తగ్గినట్లుగా వుంది.
అతనికి కాఫీ కప్పు, సాసరులో త్రాగాలని వుంటుంది. అలా త్రాగితే దానికేదో రుచి వచ్చినట్లనిపిస్తుంది. ఈ విషయం ఎన్నిసార్లు గుర్తుచేసినా ప్రభావతి స్టెయిన్ లెస్ స్టీలుగ్లాసులోనే తీసుకువస్తుంది. నోరు తెరచి అడిగితే 'మరిచిపోయాను ఇవాల్టికి సరిపెట్టుకోండి' అంటుంది నవ్వేసి. అలా తీరకుండా వేధిస్తున్న చిన చిన్న కోరికలు అతని జీవితంలో చాలా వున్నాయి.
అలవాటు ప్రకారం ఆమె ఇచ్చిన గ్లాసు అందుకుని 'పేపరొచ్చిందా ప్రభా?' అని అడిగాడు.
"ఉండండి, చూసివస్తాను" అని ప్రభావతి లోపలకు వెళ్ళి మళ్ళీ ఇంతలోనే తిరిగివచ్చి "మీ తమ్ముడు చదువుకుంటున్నాడు" అంది.
అతను మౌనంగా కాఫీగ్లాసు నోటిదగ్గర పెట్టుకున్నాడు.