Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 4

   

    ఆ కార్యక్రమం చూడాలని ప్రదీప్ కు ఉత్సాహంగా లేకపోయినా ఇంట్లో బిందు ఎలానూ లేదు కాబట్టి, ఆ ఒంటరితనం భరించలేడు. అందుకని ప్రోగ్రాం చివరిదాకా కూర్చుని, తర్వాత బయటకు వచ్చాడు.
   
    పార్కింగ్ ప్లేస్ నుంచి కారు బయటకుతీసి ఆ జనసమూహంనుండి బయట పడి నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. కొంతదూరం వచ్చాక ఓ ప్రక్కన డాక్టరు మాలతి నడుస్తున్నట్లు కనబడింది. ఆపి పరిశీలనగా చూశాడు. అవునామే.
   
    "మాలతీ!" అని పిలిచాడు.
   
    ఆమె ఆగి అతనివైపు చూసి పలకరింపుగా నవ్వింది.
   
    "నడిచి వెడుతున్నావేం? కారేదీ?"
   
    "రిపేరుకు వెళ్ళింది. టాక్సీలో వచ్చాను."
   
    "రా.... డ్రాప్ చేస్తాను."
   
    ట్రాఫిక్ కు అంతరాయంగా కారు నిలపటంవల్ల వెనుకనుంచి అదేపనిగా హారన్లు మోగుతున్నాయి.
   
    మాలతి వచ్చి ఫ్రంట్ డోర్ తెరిచి అతనిప్రక్కన కూర్చుంది. కారు కదిలింది.
   
    "ఎలా వుంది మీటింగ్?" అనడిగాడు ప్రదీప్.
   
    "బాగానే వుంది కాని...." అని ఆమె ఏదో అనబోయి సంశయిస్తూ ఆగిపోయింది.
   
    "ఏం ఆగిపోయావేం?"
   
    "ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్, సూపర్ స్పెషలైజేషన్స్ డబ్బు విరివిగా ఖర్చుపెట్టగల స్థోమత వున్నవాళ్ళకే ఉపయోగపడుతున్నాయిగాని, మధ్యతరగతి వారికి, పేదవారికి ఏమీ ఉపయోగపడటంలేదు. ఒక సబ్జక్ట్ లో సూపర్ స్పెషలైజ్ చేసిన డాక్టర్ సేవలు యీ వర్గంవారికి అందటంలేదు. కరొనరీ బైపాస్ ఆపరేషన్ విషయమే తీసుకుందాం. పాతిక ముఫ్ఫయివేలు ఖర్చుపెట్టగలిగిన వాళ్ళు యీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో లక్షా రెండు లక్షలూ ఖర్చు పెట్టగలిగినవాళ్ళు ఏ అమెరికాకో వెళ్ళి చేసుకోగలుగుతున్నారు. ఈ వనరులు లేనివాళ్ళు నిస్సహాయంగా వుండిపోతున్నారు."
   
    "వాళ్ళకు మామూలు హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ వున్నాయి కదా!"
   
    "మామూలు హాస్పిటల్స్ లో కరొనరీ బైపాస్ సర్జరీ చేసే సదుపాయాలుండవు. గవర్నమెంటు హాస్పిటల్స్ లో నిర్వహణ లోపంవల్ల సకాలంలో చెయ్యలేకపోవటం, నెలలతరబడి నిరీక్షించటం అనివార్యమవుతాయి."
   
    ప్రదీప్ ఏమీ జవాబివ్వలేదు. ఆమెమాటలోని నిజానిజాల గురించి ఆలోచిస్తున్నాడు.
   
    "నా మనసును వేధించే కొన్ని సమస్యలున్నాయి."
   
    "ఏమిటి?"
   
    "వైద్యవిధానం ప్రముఖ వాణిజ్యంగా మారటం ఎంతవరకూ సబబా అని జీవించటంకోసం, సౌకర్యవంతమైన జీవితంకోసం ఏ వృత్తి చేసేవారయినా సంపాదించుకోవాలి. తమ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకోసమైనా సంపాదించుకోవాలి. ఒప్పుకుంటాను. కాని అది పారిశ్రామికరంగంగా మారటంలో ఔచిత్యమున్నదా?"
   
    "అలా మారటం - కనీసం సమాజంలో కొన్ని వర్గాలవారికైనా మేలు చేయగలిగినప్పుడు అందులో తప్పేమిటి?"
   
    "అలా చెయ్యటం ఓ జీవితలక్ష్యంగా ఆ వైద్యవృత్తికి సంబందించిన వాళ్ళు చేస్తే సమంజసమేనని సరిపెట్టుకోవచ్చు గాని, కేవలం ఓ పారిశ్రామికవేత్త వాణిజ్య పద్దతుల్లో యిది నిర్వహించటంవల్ల నా మనస్సుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను."
   
    "ఒక పని మంచి అయినప్పుడు తన కార్యకలాపాలు కేవలం నిర్వహణ వరకే లిమిట్ చేసుకుని ఆయా శాఖలలోని వున్నతశ్రేణి నిపుణులచేత వృత్తిధర్మం నిర్వహించబడుతూన్నప్పుడు తప్పేమీ కాదని నా ఉద్దేశ్యం."
   
    మాలతి జవాబివ్వకుండా వూరుకుంది. ఆ విషయంలో యింకా తర్కించడం ఆమెకిష్టంలేకపోయింది.
   
                                   * * *
   
    ఆ రాత్రి ప్రదీప్ కు ఎంతకూ నిద్రపట్టలేదు. బరువుగా వున్న కడుపుతో కదల్లేక కదల్లేక కదలాడే శ్వేతబిందు రూపమే అతని కళ్ళముందు కన్పించసాగింది. అక్కడ.... ఎక్కువ వైద్యసదుపాయాల్లేని ఆ ఊళ్ళో ఎక్కువరోజులు వుంచటం అతనికిష్టం లేకపోయింది. త్వరగా వెళ్ళి అక్కడ్నుంచి తీసుకొచ్చేయాలి అని నిర్ణయించుకున్నాడు.
   
    అతని మనసులో యింకో ఆలోచనకూడా కలిగింది. డాక్టర్ మాలతి అంటే అతనికి ఎంతో గౌరవమే! ఆమె సమర్ధతపట్ల అతనికి పూర్తి విశ్వాస ముంది. కాని ఆమెది కొన్ని లిమిటేషన్స్ వున్న నర్సింగ్ హోం. ఒకవేళ పరిస్థితి సీరియస్ అయితే, మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ చెలరేగితే ఎదుర్కోవటానికి ఆమె హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు. బిందు ఆరోగ్యంగురించి తాను ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదు. మాలతి బాధపడకుండా చెప్పి బిందు డెలివరీ శ్రీలక్ష్మి హాస్పిటల్ లో జరిగేటట్లు చూడాలి.
   
                              * * *

   
    రెండురోజులతర్వాత డాక్టరు మాలతి తన కన్సల్టేషన్ రూంలో ఓ పేషెంటుతో మాట్లాడుతుండగా శ్రీలక్ష్మి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది.
   
    "హలో! డాక్టర్ మాలతిగారున్నారా?"
   
    "నేనే మాట్లాడుతున్నాను."
   
    "శ్రీలక్ష్మి హాస్పిటల్ నుంచిమాట్లాడుతున్నాను. నేను ఉపేంద్రను."
   
    మాలతి క్షణంపాటు ఆశ్చర్యపడింది. ఉపేంద్ర! ఆయన్తో తనకెలాంటి పరిచయం లేదు.
   
    "నమస్కారమండీ!"
   
    "నమస్కారం! మీతో ఒక విషయం మాట్లాడాలి."
   
    "చెప్పండి."
   
    "మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా సమర్ధులైన గైనకాలజిస్టు అని తెలిసింది. మీలాంటి ప్రతిభావంతులు మా హాస్పిటల్ కు కావాలి."
   
    "నా గురించి మీకున్న సదభిప్రాయానికి కృతజ్ఞురాల్ని కాని నాకు సొంత నర్సింగ్ హోం వుంది."
   
    "మీకు వసతి, కారు అన్ని సౌకర్యాలూ కలుగచేస్తాను. జీతం మీరు కోరినంత ఇస్తాను. ఇక్కడవున్న ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ మీ నర్సింగ్ హోంలో వుండవు."
   
    "కావచ్చు సామాన్య ప్రజానీకానికి భారీ ఎత్తు హాస్పిటల్స్ అందుబాటులో వుండవు. పేదప్రజలకూ, మధ్యతరగతివారికి కూడా అందుబాటులో వుండటమే నా జీవితలక్ష్యం."
   
    "అటువంటివారికి గవర్నమెంట్ హాస్పిటల్సూ వున్నాయి."
   
    "కేవలం గవర్నమెంటు హాస్పిటల్సే కాకుండా కనీసం కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అయినా సామాన్యులకు వుండాలని నా అభిమతం. అయినా జనరల్ హాస్పిటల్ లో పనిచేసే ప్రొఫెసర్లు, సివిల్ సర్జన్లూ చాలామంది మీ హాస్పిటల్లో కన్సల్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు కదా ఇంకా నాలాంటి వారి అవసరమేమిటి?"
   
    ఉపేంద్ర నవ్వాడు. "టాలెంట్ ఎక్కడ వున్నా నాకు కావాలి."
   
    "సారీ! నాకు వీలుపడదు."
   
    "మీ దయ, వుంటాను. మీరు పనిచేసినా చెయ్యకపోయినా మీ సర్వీస్ కోసమై మా హాస్పిటల్ గేటు ఎప్పుడూ తెరిచే వుంటుంది."
   
    "థాంక్స్" అంది మాలతికూడా చాలా సభ్యతగా.
   
    ఉపేంద్ర ఫోన్ పెట్టేశాడు.

 Previous Page Next Page