Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 4

  

     రావు ఆమె ఒడిలో అటూ ఇటూ కదుల్తున్నాడు.
   
    ధరణి అప్పుడు గమనించింది. అతని హార్ట్ బీట్ మామూలుగానే ఉంది. ఒంటికి ఏమాత్రం చెమట పట్టలేదు. మొహంలో బాధ కృతకంగా వుంది. అతని ముఖం మాత్రం ఆమె ఒడిలో ... అతి సెన్సిటివ్ పార్ట్స్ ని తాకుతోంది!
   
    ధరణికి నిజం తెలియగానే అతన్ని ఒక్కతోపు తోసి పారెయ్యాలనిపించింది. "రావుగారూ...." అని తీవ్రంగా పిలిచింది.
   
    మగతలో వునట్లుగా రావు మాట్లాడలేదు. ఆమె స్పర్శా సుఖాన్ని అనుభవిస్తున్నట్లుగా సన్నగా మూల్గాడు.
   
    తనకీ నీలూకీ ప్రొద్దుట బస్ స్టాప్ లో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఆమెకి. తన ఇష్టం లేకుండా తన శరీరాంగాలని తాకడానికి వీడికి హక్కెవరిచ్చారూ?
   
    "డ్రైవర్..... ఆ ఎలక్ట్రిక్ షాప్ దగ్గర ఆపు!" అంది.
   
    "ఎందుకమ్మా.... అక్కడేం ఆస్పత్రి లేదుగా" అనుమానంగా అడిగాడు డ్రైవర్.
   
    "హార్ట్ ఎటాక్ గురించి నీకు తెలీదు కాబోలు! చిన్నపాటి కరెంట్ షాక్ ఇస్తే మళ్ళీ వెంటనే బీట్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే అన్యాయంగా చచ్చిపోతాడు పాపం! నేను చెప్పినట్లుగా చెయ్యి" అంది.
   
    "అలాగే అమ్మా" అన్నాడు డ్రైవర్ కారు ఆపుతూ.
   
    వింటున్న రావుకి భయంవేసింది. కొద్దిగా కదిలాడు. ధరణి అతన్ని లాగే నొక్కిపెట్టి.
   
    "డ్రైవర్! ఈయన్ని సాయం పట్టి షాప్ లోకి తీసుకెళ్దాం పద" అంది.
   
    రావు సన్నగా మూల్గుతూ లేవడానికి ట్రై చేశాడు.
   
    "అయ్యగారు కదుల్తున్నారమ్మా" అన్నాడు డ్రైవర్.
   
    "అలాగే ఉంటుంది కానీ పద..... టైం మించిపోతే ప్రాణానికి ప్రమాదం" డోర్ తెరుచుకొని దిగుతూ అంది. ఇద్దరూ రావ్ ని లోపలి తీసుకెళ్ళారు.
   
    ధరణి షాప్ లోని ఎలక్ట్రిషియన్ కుర్రాడికి వందరూపాయల నోటు చూపిస్తూ "ఈయనకి పాపం హార్ట్ ఎటాక్ వచ్చినట్లుంది. రెండు షాకులియ్యి మామూలు మనిషౌతాడు. ఊ ....క్విక్!" అంది.
   
    రావు ఈ లోపల కదుల్తూ "మంచినీళ్ళు" అన్నాడు.
   
    "ముందు నీ పని కానియ్యి. ఇంకొ వంద రూపాయలు ఇస్తాను" ధరణి ఆ కుర్రవాడితో గుసగుసగా చెప్పింది.
   
    ఆ చిన్నకుర్రాడు రెట్టించిన ఉత్సాహంతో ఆపకుండా నాలుగు షాకులిచ్చాడు. రావు లబలబ లాడ్తున్నా ఆపలేదు!
   
    "వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్?" రావు కోపంగా అరుస్తూ లేచి నిలబడ్డాడు.
   
    ధరణి అతని కళ్ళల్లోకి చూస్తూ సన్నగా నవ్వి "షాక్ ట్రీట్ మెంట్ సార్!" అంది.
   
    రావుకి ఇంకొ మాట మాట్లాడ్డానికి భయం వేసింది. శరీరంలో ప్రవహించిన కరెంట్ దెబ్బకి అతనికి ఒళ్ళంతా జిలజిలమన్న పోటుతో మొద్దుబారి, లేచి నిలబడడానికి కూడా కష్టంగా అనిపించింది.
   
    "హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి గానీ, ఇలా కరెంట్ షాకు లిప్పిస్తారా?" నాలిక మెలికబడ్తుండగా కోపంగా అడిగాడు.
   
    "ఆ ట్రీట్ మెంట్ పని చెయ్యడం వల్లనే కదా మీరు మళ్ళీ మనిషయ్యారు?" అంది ధరణి.
   
    "ఈ అమ్మగారు లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోయేదండి" డ్రైవర్ తన సంతాపాన్ని ఆయన ముందు బాగా ప్రకటించాలని ఆరాటపడ్డాడు.
   
    "చాల్లే అఘోరించావు ....పద!" రావు కోపంగా అరిచాడు.
   
    ధరణి మనసులోనే నవ్వుకుంటూ కారువైపు నడిచింది.

    రావు మళ్ళీ మాట్లాడలేదు. కానీ ఈ సంఘటన వల్ల అతనిలో పట్టుదల మాత్రం బాగా పెరిగిపోయింది.
   
    ధరణి 'వియ్ ద లివింగ్'! చదవడంలో మునిగిపోయింది.
   
                                        2
   
    యోగి వయసుకి చిన్నకుర్రాడే కానీ జ్ఞానం, పరిణితీ అతిగా పెరిగిపోవడం వల్లనేమో చాలా పెద్దమనిషి తరహాగా హుందాగా ఉంటాడు. లాల్చీ, పైజామా కానీ; లాల్చీ, పంచె కానీ ధరించి భుజం మీద ఉత్తరీయం విధిగా వేసుకుంటాడు. ముఖాన కుంకుమ బొట్టు సదా వుంటుంది. నిదానంగా మాట్లాడుతూ, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాడు.
   
    'పిల్లల్ని నేను ప్రేమించను..... ఆరాధిస్తాను! ఎందుకంటే వాళ్ళు భగవత్ స్వరూపాలు కాబట్టి!' అంటూంటాడు.
   
    అతను 'శుభోదయా రెసిడెన్షియల్ స్కూల్'ను కేవలం మధ్యతరగతి ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకోసమే పెట్టాడు. సోమవారం నుండి శనివారం దాకా పిల్లలు ఓ భద్రమైన చోట వుంటే, తల్లిదండ్రులు నిశ్చింతగా తమ ఉద్యోగవిధులు నిర్వహించగలరన్న ఐడియా అతడికి రాగానే అన్ని ఆఫీసుల్లోనూ పాంప్లెట్స్ పంచి ఎడ్వర్టయిజ్ చేశాడు. అతను ఆశించిన దానికన్నా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
   
    జనం రిజిస్ట్రేషన్ కోసం క్యూలు కట్టారు. విరగబడి అప్లికేషన్ ఫారాలు కొన్నారు! ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి సరైన దిక్కులేక అవస్థలు పడ్తున్న తల్లిదంద్రుల్నే సెలెక్ట్ చేసి, వారి పిల్లలకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్లో తమ పిల్లల్ని చేర్చుకోవడం తమ అదృష్టంగా తల్లిదండ్రులు భావిస్తుంటారు.

    ఇంటర్వెల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ గలగల నవ్వుతూ, అరుస్తూ బైట వున్న ప్లే గ్రౌండ్ లోకి పరుగెత్తారు. అందరూ చాలా ఆరోగ్యంగా, అందంగా ఉన్నారు.
   
    బెదురుచూపులు, చూస్తూ స్వీటీ టాయ్ లెట్స్ దగ్గరికి వచ్చి నిలబడింది.
   
    "ఏయ్..... హుష్.... ఇట్రా...." రాజేష్ సైగ చేస్తూ వెనక్కి రమ్మని పిలిచాడు.
   
    స్వీటీ అతని వెనకాలే నడిచింది. అక్కడంతా తుప్పలున్నాయి. ఓ పొదలాంటి దాని పక్కన కూర్చున్నాడు రాజేష్.
   
    "పురుగులుంటాయేమో?" స్వీటీ భయపడింది.
   
    "ఉంటేనేం. నేనున్నానుగా!" హీరోలా ధీమాగా అన్నాడు రాజేష్.
   
    స్వీటీ భయంగానే కూర్చుంది.
   
    "ఇదిగో నీ కోసం తెచ్చాను" అంకుల్ చిప్స్  ప్యాకెట్ ఇచ్చాడు.
   
    "నా కోసం ఎంత కష్టపడి తెచ్చావు రాజూ!" స్వీటీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
   
    "నీ కోసం ఏమైనా చెయ్యగలను!" చెప్పాడు రాజేష్.
   
    "ప్రేమించుకుందాం అన్నావుగా!" చిప్స్ తింటూ అడిగింది స్వీటీ.
   
    "ఔను!" రాజేష్ హఠాత్తుగా ఆమెని పట్టుకుని మెడమీదా బుగ్గలమీదా ముద్దులు పెట్టాడు.
   
    "ఉహు! అలాకాదు" అంది స్వీటీ.
   
    "ఎలా?"
   
    "స్టార్ మూవీస్ చూడవా?" విసుగ్గా అడిగింది.
   
    రాజేష్ సిగ్గుపడ్డాడు.
   
    స్వీటీ ముందుకు వంగి అతని పెదవుల్ని అందుకుంది.
   
    శుభోదయా స్కూలు ఆవరణలో జరిగే ప్రతి విషయమూ యోగికి తెలుస్తుందని ఆ పిల్లలకి తెలీదు.
   
                                          3
   
    ఆఫీసులు మూసే వేళల్లో బస్సులు గర్భిణీలవుతాయి.

    కాస్త ఖాళీ బస్ వస్తే ఎక్కుదాం అని అప్పటికే రెండు బస్సులు వదలి పెట్టేసిన ధరణి, ఇక లాభంలేదని మూడవసారి వచ్చిన బస్ రష్ గా వున్నా ఎక్కేసింది. భుజానికి బ్యాగ్ వేలాడుతోంది. ఇంకొ చేతిలో కూరలసంచీ బరువుగా వుంది.
   
    "ఫీఛే జావ్.. పీఛే...." ఎక్కిన ఆడవాళ్ళందరితోనూ చెప్తున్నాడు డ్రైవరు.
   
    మగవాళ్ళు చాలా ముందువరకూ వున్నారు. వెనక ఖాళీగానే ఉంది! ధరణి అతికష్టంమీద లోపలి నడిచింది. బస్ నిండా జనం ఉండటం మూలన డ్రైవర్ ఎన్ని సడెన్ బ్రేకులు వేసినా ఎవరూ కిందపడటంలేదు. ఒకళ్ళమీద ఒకళ్ళు పడుతున్నారు.
   
    ధరణి ముందు ఓ కాలేజీ అమ్మాయి నాజూగ్గా, లేతగా, అందంగా వుంది. కానీ ఎందుకో చాలా ఇబ్బంది పడుతునట్లుగా ఉన్నాయి ఆ చూపులు.
   
    "టికెట్ .... టికెట్...." కండక్టర్ వచ్చి ధరణిని ఆనుకుని నిలబడ్తూ అడిగాడు.
   
    "ఇస్తాను... కొంచెం జరిగి నిలబడండి" అంది ధరణి.
   
    దాంతో కండక్టర్ కోపంగా "అంత ముట్టుకోవడం ఇష్టం లేనిదానివి ఆటోలో పోకపోయావా?" అని అరిచాడు.
   
    ధరణి ఆశ్చర్యంగా "ఇప్పుడు నేను కాని మాట ఏవన్నాననీ? కాస్త జరిగి నిలబడవచ్చు కదా అన్నాను" అంది.
   
    "పో... పో... వమ్మా ఇష్టమైతే బస్ లో ఉండు లేకుంటే దిగిపో.... నాకే తరీకాలు చెప్తున్నావా?" అరిచాడు కండక్టర్. అంతలో బస్ ఆగిపోయింది. కంప్లీట్ ఇష్యూయింగ్ పాయింట్ కావడం వలన బస్ ఆపేసి టికెట్స్ ఇస్తున్నాడు.
   
    వెనకాల నుండి మగవాళ్ళు అసహనంగా ఆపకుండా బెల్ కొడ్తున్నారు.
   
    "ఏందమ్మా గొడవా? అసలే లేట్ అయిపోయిందంటేనూ" అని ధరణినే తప్పు పట్టిందొకావిడ.
   
    ధరణి మాట్లాడకుండా చిల్లర తీసిచ్చింది. గుంపులో ఉన్నప్పుడు మెజారిటీ గొంతే బలమైనది.

 Previous Page Next Page