Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 4

  

     ఆమె ప్రతీ క్షణాన్నీ ఆనందిస్తోంది. అది కేవలం థ్రిల్లేకాదు. తెలియనితనాన్ని నెమ్మది నెమ్మదిగా, క్రమక్రమంగా తెలుసుకుంటూ వుండటంవల్ల వచ్చిన ఆనందం!
   
    అంత అపురూపమైన మొదటి అనుభవాన్ని అంతకుముందు కేవలం ఊహల్లో కూడా ఆలోచించకపోవటంవల్ల అయోమయంతో, దాన్ని ఎంతో మామూలుగా గడిపేసి- భావిజీవితంలో దాన్ని ఒక మంచి జ్ఞాపకంగా కూడా మిగుల్చుకోలేని దురదృష్టవంతులు కోకొల్లలని తెలుసుకొని ఆమె అనుభూతుల్ని నిక్షిప్తం చేసుకుంటూంది.
   
    కాలీజీలో మొట్టమొదటిరోజు ముకుంద్ మహర్షి వ్రాసిన "భారతదేశంలో స్త్రీలు" అన్న పుస్తకం మీద సైకాలజీ ప్రొఫెసర్ ఇచ్చిన లెక్చర్ ప్రతీవాక్యమూ ఆమెకు గుర్తుంది. "-సైన్స్, ఆర్ట్సు, కామర్స్ - ఇలా విడగొట్టి, విద్యార్దులని ఏదో ఒకటి ఎన్నుకోమనటమే మనం చేసే మొదటితప్పు, సైన్సు చదివిన విద్యార్ధికి పెడల్స్ సెపల్స్- ఆక్సిజనూ, ఆర్కిమెడీసూ తప్ప మరొకటి రాదు. కామర్స్వాడికి డబుల్ ఎంట్రీ తప్ప మరొకటి తెలీదు. బి.ఏ. ప్యాసయిన చాలామందికి 'కంపెనీ'కి 'ఫర్మ్' కి తేడా తెలీదు. అందరికీ కావల్సిన విషయాలని చిన్నచిన్న సబ్జెక్టులుగా విడగొట్టి ఎందుకు బోధించాలో అర్ధంకాదు. ఒక పోలీసు ఇన్ స్పెక్టర్ మనల్ని అరెస్టు చేయటానికి వచ్చినప్పుడు మనకున్న హక్కులేమిటో ఎవరూ మనకి క్లాసురూమ్ లో చెప్పడు. ప్రథమ చికిత్స, చిన్నపిల్లల్ని పెంచే జాగ్రత్తలు, శరీరాన్ని నిర్దుష్టాకారంలో వుంచుకునే ప్రయత్నాలు, నలుగురిలో జంకులేకుండా మాట్లాడగలిగే పద్దతులు, అన్నిటికన్నా ముఖ్యంగా 'బిహేవియర్ సైన్స్'-ఇవేమీ నేర్పరు. ఒక సగటు విద్యార్ధి చదివే చదువు అతడి భవిష్యత్ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యార్ధులకు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు వంట ఎలా వండుకోవాలో ప్రాక్టికల్స్ గా నేర్పితే మరింత ఉపయోగకరం కదా! (క్లాసులో నవ్వులు) మైక్రోస్కోప్ లో పువ్వుల్నీ, కాండాల్నీ పరీక్షించేకన్నా విద్యార్దినులకు దానిబదులు ఎఫిటైట్ గురించి నేర్పితే మంచిదికాదా? (క్లాసులో చప్పట్లు - విజిల్స్.)
   
    "మీరెందుకు హుషారుగా చప్పట్లు కొడుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. నేను మాట్లాడుతున్నది సెక్సువల్ ఎఫిటైట్ గురించి కాదు. జీవితంపట్ల మనిషికి వుండవలసిన ఎఫిటైట్ గురించి మేము మీకు బోధిస్తూన్న మానసిక శాస్త్రం పాతిక సంవత్సరాలు పాతది అయినా సరే మీరు అదృష్టవంతులు కనీసం ఆ సైకాలజీ అన్నా చదువుతున్నారు. కానీ దీన్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా, మీ నిజజీవితానికి అన్వయించుకోండి! నిజమైన సైకాలజీ స్టూడెంట్స్ కి ఎప్పుడూ కోపంరాదు. ఎవరిమీదా చిరాకు కలుగదు. తన జీవితంపట్ల అతడికి ఎంతో ఇష్టం వుంటుంది. అతడితోపాటు ఎక్కువ సమయం గడపటానికి స్నేహితులు ఇష్టపడతారు. ఇదంతా ఎందువల్ల? కోపం వచ్చే పరిస్థితుల్లో తననితాను ఎనలైజ్ చేసుకోవటంవల్ల! ఎవరితోనైనా శతృత్వం ఏర్పడే సమయాల్లో వారి తరపునుంచి సమస్యని విశ్లేషించే గుణం అలవడటంవల్ల! జీవితాన్ని ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకోగల సామర్ధ్యం ఏర్పడటం వల్ల! అలాగే అతను తన చుట్టూ వుండేవాళ్ళని ఎప్పుడూ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ తో చూస్తూ వుండటంవల్ల అతడి మొహంమీద ఏ పరిస్థితిలోనూ చిరునవ్వు చెరగదు- ఇదంతా కేవలం సైకాలజీ చదవటంవల్ల రాదు. ఇప్పటికీ మీరు దాన్ని మూడు సంవత్సరాల్నుంచి చదువుతున్నారు. ఇంకోరెండు సంవత్సరాలు చదవబోతున్నారు. కానీ మీలో ఎంతమంది దాన్ని మీ జీవితాలకి అన్వయించుకున్నారు?-" ఆయన ఆగాడు.
   
    "ఎంతో దూరం వెళ్ళనవసరంలేదు. మీ ఇంట్లో సభ్యుల్ని, కొత్తగా వచ్చిన వదినల్ని, ఎదిగే చెల్లెళ్ళనీ గమనించండి, అందమైన ఊహల్లోంచి యదార్దానికి వంతెన కనబడుతుంది. జఢత్వానికి అది మొదటిమెట్టు ఏదో గానుగెద్దులాగా బ్రతికేయటం అనేది అక్కన్నుంచే ప్రారంభం అవుతుంది. అనుక్షణం కష్టపడటానికి కావల్సిన శక్తిని అనుక్షణం ఆనందించటం ద్వారా పొందండి."
   
    చాలా చిన్న సంఘటనలు, చిన్న చిన్న వ్యాసాలు, చిన్న ఉపన్యాసాలు మనిషిమీద ఒకోసారి చాలా ప్రభావం చూపిస్తాయి. కిరణ్మయి విషయంలో అదే జరిగింది. ముందే ఒకచోట చెప్పినట్లు ఆమె ఇల్లే ఒక ప్రపంచం! మనుష్యులందరూ ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్టు బ్రతికేవారు. అంత చిన్న ఇంట్లోనే గ్రూపులు పెద్దకోడలు, మూడోకోడలు ఒక గ్రూపు. రెండోకోడలు ఒక గ్రూపు. మళ్ళీ నలుగురూ కలిస్తే నవ్వుతూనే మాట్లాడుకుంటారు. అత్తగారి అభిమానం సంపాదించటానికి నలుగురూ విడివిడిగానూ, గ్రూపులు గ్రూపులుగానూ ప్రయత్నం చేస్తూ వుంటారు. చాలాకాలం వరకూ నాలుగో అన్నయ్యకి ఉద్యోగం లేదు. అప్పటి వరకూ ఆ కోడలు 'ముదనష్టపుది'. షెడ్యూల్ కాస్టు రిజర్వేషన్ లో అన్నయ్యకి పెద్ద ఉద్యోగం రాగానే రాత్రికి రాత్రి ఆ కోడలు మా ఇంటి మాలక్ష్మీ అయిపోయింది.
   
    ఈ వైబ్రేషన్స్ లో వ్యత్యాసం పెద్దల్లోనే కాకుండా ఎదుగుతున్న చిన్నపిల్లల్లో కూడా కనపడటం ఆమెకి ఆశ్చర్యంగా తోచింది. పెద్దన్నయ్య పిల్లలకీ, చిన్నన్నయ్య పిల్లలకీ ఒక్కక్షణం పడదు. పెద్దన్నయ్య పదమూడేళ్ళ పెద్దకూతురు అప్పుడే తలమునకలయ్యే ప్రేమలో వుందని ఆమె నోట్ పుస్తకాల అట్టలవెనుక ఉత్తరాలు బయటపడ్డరోజు తెలిసింది. ఆ పిల్ల ప్రాణాలు తీసెయ్యటానికి ఇంట్లోవారంతా ఒక సైన్యంలా సమాయత్తం అవటం ఒక సైకాలజీ విద్యార్ధినిగా కిరణ్మయికి ఏనాటికీ అర్ధం కాని విషయం. ఎదుగుతున్న పిల్లలకి కావలసిన ప్రేమా ఆప్యాయతా ఆ ఇంట్లో ఏ రోజైనా లభించాయా? అసలు ఆ ఇంట్లో ఓ నలుగురు సరదాగా కూర్చుని ఒక సమస్యగానీ, భవిష్యత్తుగానీ ఏనాడైనా చర్చించారా? చర్చిస్తారా కానీ అది ఏ మాత్రం లాభకరమైన విషయం, రెండో కూతురి మొగుడు తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నరోజు, మాట్లాడుకోవటానికి అదో పెద్ద టాపిక్ అవుతుంది.....అంతే.
   
    ప్రతివాళ్ళు మరొకరి దగ్గర తన మంచితనం ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం మూడోవ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు తప్పితే తన వ్యక్తిత్వం పెంపొందించుకొనే ఒక్క మాట- కనీసం ఒక్కటంటే ఒక్కమాట మాట్లాడదు.
   
    కిరణ్మయి బి.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనరోజు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురుతప్ప ఎవరూ సంతోషించినట్టు కనపడలేదు- ఆమెకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆమె దగ్గిర సంతోషం ప్రకటించిన ఆ ఇద్దరు ముగ్గురే- తరువాత తమ భార్యలదగ్గర (లేక భర్తల దగ్గిర) లేక అత్తగారి సానుభూతి పొందటానికి- "ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు చదవటం" అని అనటం ఆమె స్వయంగా విన్నది.
   
    మనుష్యులు నూటికి నూరుపాళ్ళు నిజాయితీగా వుండాలనీ, వుంటారనీ ఆమె ఎన్నడూ అనుకోలేదు. అది అసాధ్యం కూడా రెస్ట్రిజిన్ తన "The Chancy World" లో వ్రాసిన మాదిరిగా, తనకి లాభం లభించే సందర్భాల్లో, అవతలి వ్యక్తికి వ్యాపార సంబంధమైన కష్టం కలిగించినా-అంతవరకూ మనిషి స్వార్ధంతో ప్రవర్తించవచ్చు. కానీ మానసికంగా సంబంధిత విషయాల్లో కూడా- అందులో తనకేమీ లాభంలేదని తెలిసికూడా ఈ మనుష్యులు తన ఎదుట తనని పొగిడి, తన పరోక్షంలో నొసలు ఎందుకు విరుస్తారో ఆమెకి అర్ధంకాలేదు.
   
    తను ఎమ్మే చదవటం ఇంట్లో ఎవరికైనా ఇష్టంలేకపోతే వారు తన ఎదురుగా ఆ విషయాన్ని చెప్పి డానికి కారణాలు వివరిస్తే అది ఉత్తమమైన పద్దతి. తమ అభిప్రాయాల్ని వెల్లడిచేయకుండా మౌనంగా వుండటం మధ్యమం. కానీ తన ముందు- "మిగతా అందరూ ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం చదువుఆపొద్దు" అని తన దగ్గిర అని, మళ్ళీ తన తల్లి దగ్గర, ఆమె తన చదువుని వ్యతిరేకిస్తుందని తెలియగానే "నేనూ అలాగే అనుకుంటున్నా" నని అనటం హీనం కన్నా అధమం. ఇంట్లో అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇంట్లోనేకాదు. ఈ ప్రపంచంలో చాలామంది.
   
    "నువ్వెప్పుడూ ఆలోచిస్తూనే వుంటావా?"
   
    ఆమె తెప్పరిల్లి నవ్వి "లేదే" అంది.
   
    "కాదు. నువ్వు ఆలోచిస్తున్నావు."
   
    ఆమె నవ్వుతూనే, "ఆ మాటకొస్తే ప్రతీవాళ్ళూ ఎప్పుడూ ఆలోచిస్తూనే వుంటారు" అంది.
   
    అతడామె చీర కుచ్చిళ్లమీద చెయ్యివేస్తూ-
   
    "కానీ ఆలోచిస్తూ తను ప్రపంచంలోనే వుండిపోరు" అన్నాడు.
   
    "సరే, మీరు మాట్లాడండి. నేను వింటాను."
   
    "నువ్వు నాకో ప్రామిస్ చెయ్యాలి.'
   
    "ఏమిటి?" అతడి చెయ్యి తొలగిస్తూ అంది.
   
    "ఎప్పుడైనా నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు నేను చటుక్కున "ఏమిటిప్పుడు ఆలోచిస్తున్నది" అని అడుగుతూ వుంటాను. నువ్వు దాన్ని చెప్పాలి."
   
    "సరే!"
   
    "సరే- అని అంత సులభంగా అనకు. అది ఎంత సిగ్గేసేదైనా, ఎంత మొహమాట పెట్టేదైనా, చివరకు నాకు ఇబ్బంది కలిగించేదైనా సరే నిజమే చెప్పాలి."
   
    "మరి నేనడిగినప్పుడూ మీరూ అలాగే చెప్పాలి."
   
    "ఓ.కే."
   
    "ఎంత సిల్లీదైనా" నవ్వుతూ అంది.
   
    "నాకు సిల్లీ అంటూ ఏమీలేదు. నేను చెపుతూ వుండగా నువ్వే చెవులు మూసుకుని 'హరిహరీ! ఇక వద్దులెండి' అంటావ్."
   
    "అంటే? నేను అడిగాను కదా అని అప్పటికప్పుడు కల్పించి ఏదో చెప్పి మళ్ళీ నేను అడక్కుండా చేస్తారా?" కోపం నటిస్తూ అంది.

 Previous Page Next Page