.....కిటికీ వూచల్ని పట్టుకొని బయటికి చూస్తున్న చంద్ర ఉలిక్కిపడ్డాడు. చూస్తున్నది నిజమో, కలో అర్ధంకాలేదు. గొంతులోంచి రాబోయిన కేకని బలవంతంమీద ఆపుకొన్నాడు. అలాగే నిశ్చేష్టుడయి, అచేతనంగా వుండిపోయాడు.
క్రేన్ తోగాని, పదిమంది మనుషులు ఎత్తితేగానీ లేవని పెద్ద బండరాయి, గాలిలో నాలుగైదు అడుగులు పైకి లేచి, రెండు క్షణాలు శూన్యంలో ఊగిసలాడి, ఎవరో వదిలేసినట్లు దభేలున పడిపోయింది.
చుట్టూ గాఢమైన నిశ్శబ్దం.
ప్రారంభం :
జూన్ ఇరవై తొమ్మిది.
రాత్రి కురిసిన వర్షం ప్రభావంవల్ల చల్లటిగాలి దక్షిణం నుంచి వీస్తూ వుంది.
తొమ్మిదిన్నరయింది.
రమణ బట్టలేసుకున్నాడు. ఉన్నవి రెండు జతలు. అందులో ఒకటి ఇంటర్వ్యూలకోసం, మాలతిని కలుసుకోవటం కోసం అట్టే పెట్టింది. అది వేసుకున్నాడు. జేబులో అర్ధరూపాయి వుంది. అన్నయ్యని అడగటానికి మనసొప్పలేదు. అడిగినా వుండదు. అడక్కపోతే అడిగి లేదనిపించుకొన్న అసంతృప్తి వుండదు.
ఫైల్లో సర్టిఫికెట్లు వున్నయ్యో లేదో చూసుకొన్నాడు.
బి.ఏ. ఎకనామిక్స్ యూనివర్సిటీ ఫస్టు సి.సి. బాడ్మింటన్, మంచి కుర్రవాడు.
ఫైలు మూసి, "వదినా వెళుతున్నాను" అని అరిచేడు. జానకి లోపల్నుంచే "మంచిది బాబూ" అంది.
"తడుముకోకుండా చెప్పరా" అన్నాడు దగ్గుతూ ముసలాయన. రమణకి నవ్వొచ్చింది. ఇది పదహారో ఇంటర్వ్యూ.
తలూపి బయటకొచ్చాడు.
పత్రిక ఆఫీసు కొచ్చేసరికి పావుతక్కువ పది. తనలాటి మరో ఇరవయి మంది భారతీయులు.
అతడి వంతు వచ్చేసరికి పన్నెండయింది. నెమ్మదిగా గదిలోకి ప్రవేసించాడు.
ఆ గదిలో వున్న రోజ్ వుడ్ టేబుల్ ఖరీదుతో ఒక సగటు మనిషి రెండు నెలలు, అక్కడున్నవాళ్ళ ఒక్కొక్కరి కోటు కుట్టటానికయిన ఖర్చుతో ఒక నెలా, ఆ గది కేసిన పెయింటింగు ఖరీదుతో మూడు నెలలూ భోజనం చెయ్యొచ్చు.
ఆ గదిలో గాలి కూడా నమ్రతగా వీస్తోంది.
పేపర్ వెయిట్ కూడా హుందాగా వుంది.
"బీ సీటెడ్ మిస్టర్ రమణా!"
"థాంక్యూ సర్!"
"మీ క్వాలిఫికేషను?"
"బి.ఏ."
"క్లాసు?"
"ఫస్టు క్లాసు. యూనివర్సిటీ ఫస్ట్."
"సబ్జెక్టు!"
"ఎకనమిక్స్."
క్షణం నిశ్శబ్దం.
"....భూమికి, సూర్యుడికి మధ్య సగటు దూరం యెంత?"
"తొమ్మిదికోట్ల ముప్పైనాలుగు లక్షల మైళ్ళు."
"మిస్టర్ రమణా! ఆకాశంలో నక్షత్రాలెన్ని?"
'లాభంలేదు. ఈ ఉద్యోగం తనకి రాదు. ఆర్ధిక శాస్త్రంలో పట్టభద్రుడైన తనని ఆస్ట్రానమీలో ప్రశ్నలడుగుతున్నారంటే- ఈ ఉద్యోగం యింతకు ముందే యెవరికో అంకితం అయిపోయిందన్నమాట!'
అయినా చెప్పటం మొదలు పెట్టేడు.
"మన కంటికి కనబడేవి దాదాపు ఆరువేల నక్షత్రాలు. కానీ లక్ష మిలియన్ల నక్షత్రాలు మన మిల్కీవే లో వున్నాయని అంచనా. అలాంటి మిల్కీవే గలాక్సీలు విశ్వంలో పదికోట్లు. అంటే మొత్తం విశ్వంలో పదికోట్ల నక్షత్రాలున్నాయన్న మాట. పది తర్వాత ఇరవయినాలుగు సున్నాలు."
అవతలివాళ్ళ తల దిమ్మెక్కినట్లయింది. కొంచెం సేపెవరూ మాట్లాడలేదు. తరువాత ఒకాయన అడిగేడు.
"లావా అంటే ఏమిటి?"
"భూమి అంతర్భాగాన మహోజ్వలమైన వేడికి కరిగిన ఘనపదార్ధం. సప్తలోహాల మిశ్రమం."
"మీరు తెలుగు బాగా అధ్యయనం చేసినట్టున్నారే" నవ్వులు రమణ మొహం ఎర్రగా మారింది.
"లావా మరి భూమిపైకి ఎందుకు రాదు?"
"కవచంలాగా పై పొర కప్పుకుంది కాబట్టి"
"లావాలో ఇనుము వుంటుంది కదా?"
"ఉంటుంది."
"మీ తమ్ముడు ఓ బావిలోకి అయస్కాంతం పట్టుకెళ్ళాడనుకోండి. మరి లావా బయటికొచ్చెయ్యాలి కదా.....ఐమీన్ భూమిని చీల్చుకుని"
రమణ తలెత్తి చూసేడు. అందరి మొహాల్లోనూ ముసిముసిగా నవ్వులు.
"భూమి పొర చాలా మందం. అలా రాదు"
"భూమిపై డెన్సిటీ ఎంత?"
"క్యూబిక్ సెంటీ మీతరుకి అయిదూపాయింట్ అయిదు గ్రాములు"
"భూమి లోపల డెన్సిటీ ఎంత?"
"దాదాపు దానికి రెండు రెట్లు."
"అంత డెన్సిటీ వున్న లావాని ఈ పొర ఆపగలదా?" అడిగేడొకాయన. "పకోడీలు దట్టంగా కూరి కాగితంలో కడ్తే- లోపలి డెన్సిటీ ఎక్కువైతే ఏమవుతుంది?"
ఇంకొ కమిటీ మెంబరు తనే సమాధానం చెప్పాడు. "కాగితం పగిలి మనకందరికీ పకోడీలు దొరుకుతాయి."
గొల్లున నవ్వులు.
"మిస్టర్ రమణా! భూమి మాస్ ఎంత?"
"అయిదూ పాయింట్ తొంభై ఏడు ఇంటూ పదివందల ఇరవై ఏడు గ్రాములు."
"ఇంత పదార్ధాన్ని పై పొర ఆపలేకపోతే ఏమవుతుంది?"
రమణ లేచాడు. సర్టిఫికెట్లు సర్దుకున్నాడు. "ఇలాంటి ఇంటర్వ్యూలుండవు. మనిషి తిండికోసం ఏడవటం వుండదు. చదువుకున్న చదువుకి యింత చిన్న ఉద్యోగం కూడా దొరకలేదే అన్న బాధ వుండదు. ఎయిర్ కండిషన్డ్ రూమ్ లుండవు. ప్రశ్నలుండవు. సమాధానాలుండవు. అసలేమీ వుండదు."
* * *
"ఏమైంది ఇంటర్వ్యూ?" అడిగింది మాలతి.
"ఏమవుతుంది?"
"అంటే?"
అతన్ని అనునయంగా చూస్తూ, "పోన్లే-అదృష్టం బావుంటే ఇంకోసారి వస్తుంది" అన్నది.
"రాదు ఇంకోసారి కూడా రాదు" అన్నాడు అతను అడ్డంగా తలవూపుతూ "ఆ దేవుడికి కూడా తెలుసు మనం తనకేమీ లంచం యివ్వలేమని."
"నేన్నీకొకటి చెప్పనా?"
అతడు ఏమిటన్నట్టు చూసేడు.
"తిట్టగూడదు సుమా!"
"ఏమిటి?"
"నీకీసారి ఉద్యోగం వస్తే మనిద్దరం తిరుపతి వస్తామని మొక్కుకున్నాను అందామె.
"నేనూ మొక్కుకున్నాను."
"ఏమని?" అందామె ఆశ్చర్యంగా. ఆమెకి అతడు 'మొక్కుకున్నా' డంటే ఆశ్చర్యంగా వుంది. "ఏమనీ?" అని రెట్టించింది. అతడు మౌనంగా వుండటం చూసి.
"ఈసారి ఉద్యోగం రాకపోతే తిరుపతి వచ్చి, విగ్రహాన్ని బాంబుల్లో బ్రద్దలు కొట్టేస్తానని".
ఆమె సన్నగా వణికి, చప్పున అతడి చెయ్యి పట్టుకొని "అలా అనకు, ప్లీజ్! నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది" అంది. అతడు పేలవంగా నవ్వి "రాదు" అన్నాడు. "వచ్చినా ఆ ఉద్యోగపు జీతం, మీ నాన్నగారు నీకు ప్రతినెలా ఇచ్చే పాకెట్ మనీ అంతకూడా వుండదు."