Previous Page Next Page 
సుహాసిని పేజి 4


    వెంకట్రత్నం జీవితాన్ని కాచి వడబోసిన వాడిలా కనబడతాడు. ఆయన అందరి సమస్యల గురించీ అడిగి తెలుసుకుని అడక్కపోయినా సలహాలిస్తూంటాడు. కొందరాయన్ను మెచ్చుకుంటారు. కొందరు నిరసిస్తారు. ఎందరో వేళాకోళం చేస్తారు. కానీ అంతా కూడా ముఖం మీద ఆయన్ను గౌరవిస్తూనే ఉంటారు.

    గౌతమ్ ఆయనతో "కారణం నాకూ తెలియదు. తెలుసుకోవడం కోసమయినా మీతో మాట్లాడాలి" అన్నాడు.

    "అయితే ముందీ కాగితం మీద సంతకం పెట్టు. విశేషాలు లంచ్ అవర్ లో మాట్లాడుకుందాం" అన్నాడు వెంకటరత్నం.

    గౌతమ్ ఓసారి ఆ కాగితం చదివాడు. అతడి బుర్రకేమీ ఎక్కలేదు. వెంకట్రత్నం తెచ్చిన కాగితం కదా అని సందేహించకుండా సంతకం పెట్టేశాడు.


                        *    *    *    *


    "నేనదోలా ఉంటున్నానని మీరెలా కనిపెట్టారు?" లంచ్ అవర్ లో గౌతమ్ అడిగిన మొదటి ప్రశ్న.

    "మన మేనేజర్ దగ్గరకు వెడితే ఆయన మర్యాదగా కూర్చోండి అన్నాడనుకో. అంటే ఆయనకు నాతో ఏదో అవసరముందన్న మాట. నీ దగ్గరకు కాగితం తీసుకొస్తే నువ్వు నన్ను కూర్చోమని అనలేదనుకో-అంటే నీ మనసు బాగోలేదని అర్ధం."

    గౌతమ్ వెంకట్రత్నం వంక ఆరాధనా పూర్వకంగా చూసి, "జీవితాన్ని చవిచూశారు మీరు. కంపెనీలో కూడా మా అందరికంటే పై హోదాలో వుండాల్సిన వారు మీరు" అన్నాడు.

    "జీవితాన్ని చదివి పైకి రావాలనుకునేవాడు తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఒకరి కింద పనిచేసేవాడు తన అర్హత రుజువు చేసే కాగితాలు బడిలో చదివి సంపాదించాలి...." అన్నాడు వెంకట్రత్నం.

    "కానీ మీ సలహాలు కంపెనీకి లక్షల లాభాలార్జిస్తుంటాయి."

    "సలహా విత్తనం లాంటిది. ఒక రూపాయి విత్తనం వేలకొద్దీ లాభాలార్జించగల తోటను తయారు చేయగలదు. నేను విత్తనాలమ్మగలను. తోటను పెంచలేను." అని నవ్వి, "విత్తనాలమ్మడం సుఖం అదే తోటను పెంచాలంటే ఎన్ని బాధలు? క్రిమికీటకాల నుంచి ప్రకృతి భీభత్సాల వరకూ అన్నీ శతృవులే! అన్నింటినీ తట్టుకోగల సమర్ధులకే ఆ ఫలితం అనుభవించే అర్హత కూడా ఉంటుంది."

    గౌతమ్ ఇంకా ఏదో అనబోతుండగా, "మనం మాట్లాడకోవాలనుకున్నది ఇది కాదు. నీ గురించి చెప్పు" అన్నాడు వెంకట్రత్నం.

    "చెప్పడానికేం లేదు! పదిమందికీ సాయపడ్డానికి నా జీవితాన్నంకితము చేయాలనుకుంటున్నాను. కానీ నేనెవరికీ సాయపడేందుకు అర్హుడ్ని కాను. ఉదాహరణకు మా వీధినే తీసుకోండి__" అంటూ క్లుప్తంగా తన అనుభవం చెప్పాడు గౌతమ్.

    వెంకట్రత్నం నవ్వి, "మీ వీధిలో ఉన్నవాళ్ళ సమస్యలు వాళ్ళు సృష్టించుకున్నవి. ఉన్నంతలో తృప్తిపడక లేనిదానికై అర్రులు చాచడం వల్ల చాలా మధ్య తరగతి కుటుంబాల్లో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆశయసాధనానికి అదృష్టం మీద కాక స్వయంకృషిపై ఆధారపడాలనుకున్ననాడు ఆశయాలకు ఆశలు పునాదులు కాలేవు. అప్పుడు మధ్య తరగతి అంటూ వుండదు. ఉన్నవాళ్ళకు సమస్యలుండవు."

    "అయితే నేనేం చేయాలంటారు?"

    "జీవితంలో సమస్యలు సృష్టించుకొని కొందరు బ్రతుకుతుంటే జీవితమే సమస్య అయిన వాళ్ళెందరో ఉంటున్నారు.... నువ్వు వాళ్ళకు సాయపడు. ఎంత సాయపడ్డా నీది ఉడతా భక్తి మాత్రమే అవుతుంది. అయినా నిరుత్సాహ పడకూడదు నువ్వు."

    గౌతమ్ బుద్ధిగా తలూపాడు.

    "తలూపినంత సులభం కాదు. ప్రతి మనిషీ తను చేసినదానికి ఫలితం ఆశిస్తాడు.... మన సమాజంలో అట్టడుగు వారికోసం ఎందరో మహాత్ములు, అవతార పురుషులు తమ జీవితాలను త్యాగం చేశారు. ప్రజారాజ్యాన్ని సృష్టించారు. కానీ జరిగిందేమిటి? అట్టడుగు ప్రజలకోసం ప్రజారాజ్యం వస్తే, ఆ ప్రజారాజ్యం కొనసాగడానికి అట్టడుగు ప్రజలూ కొనసాగుతున్నారు. మనది కర్మభూమి....ఇది చిత్రమైన దేశం. ఎక్కడెక్కడి విజయవంతమయిన ప్రయోగాలూ ఇక్కడ ఊహించని రూపం ధరిస్తాయి."

    "అయితే నేనేం చేయాలి?"

    "నీకు చేతనైంది నువ్వు చేయి. ఫలితం గురించి పట్టించుకోకు. అనుకున్నట్లు జరక్కపోతే నిరుత్సాహపడకు. ఎప్పుడూ ఉత్సాహంగా, నవ్వుతూ ఉండు. జీవితంలో బరువైన సమస్య అంటూ ఏదీ వుండదు. మనం తేలికగా తీసుకోగలిగితే! ప్రతిదీ తేలికగా తీసుకోగలిగిననాడు నీ ముఖాన చిరునవ్వు చెరగదు గుర్తుంచుకో!" అన్నాడు వెంకట్రత్నం.

    "ఎప్పుడూ నవ్వుతూ ఉండడం ఎవరికయినా సాధ్యమా?" అన్నాడు గౌతమ్.

    "ప్రయత్నించి చూడు. అది బహుశా నీకే సాధ్యపడవచ్చు...." అన్నాడు వెంకట్రత్నం.

    అప్పుడాయన ముఖం గంభీరంగా ఉంది.


                                4


    బాత్రూంలో నాలుగు కాళ్ళ చిన్న బల్లమీద అప్సరసలా కూర్చుందామె. విరబోసుకున్న ఆమె జుత్తు షాంపూ అడ్వర్టయిజ్ మెంట్లోలా ఎగురుతోంది. పసుపు రాసుకున్న ఆమె ముఖం బంగారంలా మెరుస్తోంది.

    ఆమె ఎటు చూస్తోందో మనసటు చూట్టం లేదు. అందువల్ల బాత్ రూంలో ఎవరో ప్రవేశించడం తలుపులు మూయడం గమనించలేదామె-   

    "ఇంకా బట్టలు విప్పుకోలేదా?" అన్న మందలింపు స్వరానికామె ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కానీ వెంటనే బదులివ్వలేదు.

    "ఊఁ....ఇంకా బట్టలు విప్పుకోలేదా?" ఆ స్వరం గద్దించింది.

    "విప్పుకోను" అందామె నెమ్మదిగా.

    "ఏం? తలంటుకోవా?"

    "అంటుకుంటాను. కానీ బట్టలు విప్పుకోను...."

    "ఎందుకని?"

    "ఎందుకేమిటి? నేనిప్పుడు చిన్నపిల్లను కాను...."

    "ఈ మాట నాతో పదేళ్ళుగా చెబుతున్నావు. నేను విన్నానా?"

    "ఏమో....ఈవేళ నాకెందుకో సిగ్గేస్తోంది...."

    "అమ్మ దగ్గర సిగ్గన్నావు కదా అని నేనొచ్చాను...."

    "అమ్మకంటే నీ దగ్గరే నాకు సిగ్గెక్కువ...."

    "అయితే నేనే విప్పుతాను...."

    "అసలు తలంటుకుంటే బట్టలెందుకు విప్పాలి?"

    "ఆడపిల్ల సొగసులు బట్టలు లేనప్పుడే తెలుస్తాయి. ఆ సొగసు చూసే అదృష్టం అస్తమానూ నాకెలాగూలేదు. కనీసం ఈ వంకనైనా...."

    "ఛీ.... ఏమిటిది బావా?" అందామె అర్ధాంగీకారంగా నవ్వుతూ.

    "నేను విప్పనా, నువ్వు విప్పుకుంటావా?"

    "నేనే విప్పుకుంటాలే........." అంటూ ఆమె వంటి మీద బట్టలనొక్కొక్కటిగా దిగ విడిచింది.

    "ఎంత బాగున్నావే, గదిలో దీపం వెలిగినట్లయింది."

    "బాగానే మెచ్చుకున్నావు కానీ నీ విగ్రహమే నాకు నచ్చలేదు. దగ్గరగా రా బావా!"

    "వస్తాను.... నీ వంటికి నలుగు పెట్టి ముత్యంలా మెరిసేలా చేస్తాను...."

    "అబ్బ__నాకు సిగ్గు...." అంటూ ముడుచుకుపోయిందామె.

    "నాయనమ్మ మొగుడిలాంటిది. నా దగ్గర సిగ్గేమిటి?" అంటూ వంటికి నలుగు పెట్టసాగిందావిడ.

    "బామ్మా. నువ్వు బావలేని లోటు బాగా తీరుస్తున్నావు. కానీ అప్పుడే నాయనమ్మనని చెప్పేసుకుని సస్పెన్సు పోగొట్టేశావు. తలుపు బయటనుంచుని చెవులు పెట్టి వినే వాళ్ళకింక ఉత్సాహమేముంటుంది?" అందామె.

    "నేను బాత్రూంలో వుండగా తలుపు దగ్గర చెవులు పెట్టి వినే సాహసం ఈ యింట్లో ఎవరు చేయగలరు?" అందావిడ.

    "నా తాత....అంటే నీ మొగుడు...."

    ఆవిడ వెంటనే ముడుచుకుపోయి "ఏమిటీ, ఆయనక్కడ నుంచుని మాటలు వింటున్నారా? తెలియక ఏం మాట్లాడేశానో ఏమిటో" అంటూ సిగ్గుపడింది.

    "ఆడపిల్ల మొగుడి దగ్గర సిగ్గుపడకూడదన్నావ్. మొగుడు తలుపవతల ఉన్నాడనగానే నీకింత సిగ్గేమిటి బామ్మా!" అందామె.

    సమాధానంగా తలుపు బయట నుంచి హహ్హహ్హ అంటూ నవ్వు వినిపించింది. అది ఆమె తాత నవ్వేనని ఆమెతోపాటు ఆవిడ కూడా గుర్తుపట్టింది.

    ఆ తర్వాత ఒక్క డైలాగు కూడా లేకుండా ఆమె తలంటైపోయింది.

    ఆమె బాత్రూంలోనే బట్టలు మార్చుకుని బయటకు వచ్చింది. నాయనమ్మ ఆమెననుసరించి రాబోతూంటే గుమ్మం దగ్గరే తాత ఆమెనాపి.... "మొగుడి దగ్గర సిగ్గు లేదుగా, నేను నీకు తలంటేదా?" అన్నాడు.

    "చాల్లెండి, చిన్న పిల్లతో మీరూ సమానంగా" అంటూ ఆవిడ ఆయన్ను విడిపించుకుంది.

    ఆమె వెనక్కు తిరిగి పకపకా నవ్వసాగింది.

    తాత ఆమె వంక అబ్బురంగా చూసి, "నువ్వు నా మనుమరాలివి కాదే, దేవకన్యవు....ఎంత బాగున్నావో! రోజూ ఇలా తలంటి పోసుకుని నాక్కనిపించవే" అన్నాడు.

    "రోజూ సంగతలాగుంచండి. ఇక మీదట నేను దీనికి ఒక్కసారి కూడా తలంటిపోయను" అంది నాయనమ్మ రుసరుసలాడుతూ.

 Previous Page Next Page