Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 4

    భార్య మాటలు విని రాజారావు- "వీలుంటే ఈ పర్యాయం వసుకు చీర కొనాలి-" అనుకున్నాడు. అయితే అతని నిర్ణయంలో బలంలేదనడానికి చిహ్నంగా మనసులో కూడా "వీలుంటే" అని మాత్రమే అనుకున్నాడు.   
    బయల్దేరేముందు రాజారావు ఓసారి అన్నీ చూసుకుని బ్యాగుకు జిప్ వేయబోతుండగా వసుంధర ఓ మాసపత్రిక తీసుకొచ్చి- "మరిచేపోయాను. మీరింకా ఇది చూడనేలేదు. కొత్తగా ప్రారంభించిన మాసపత్రిక ఇది. మనకు ప్రారంభసంచిక పంపారు. అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది..." అని అదికూడా బ్యాగులోకి తోసేసి జిప్ వేసేసింది.   
    రాజారావూ, వసుంధరా ఇద్దరూ కథలు రాస్తారు. అయితే ఒకరు లేకుండా ఒకరు వ్రాయలేరు. ఇద్దరూ కలసి వున్నప్పుడే వాళ్ళు రచనలు చేస్తారు. ఆ విధంగా కూడా ఈ ప్రయాణం రాజారావుకు నష్టదాయకం. ఈపది రోజులలోనూ అతనికి కనీసం కొన్ని వందల రూపాయల నష్టం జరిగిందనుకోవచ్చు.   
    ఇంట్లో పిల్లలున్నారు. ఈశ్వర్రావున్నాడు. రాజారావు పొరపాటునకూడా వసుంధరతో ఏకాంతానికి వెళ్ళకుండా చాలా సింపుల్ గా వీడ్కోలు పుచ్చుకున్నాడు. అతను, ఈశ్వర్రావు కలిసి ఆఫీసు కారు ఎక్కారు...   
                                          2   
    ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఒక్క నిముషం కూడా లేటుకాలేదు. రాజారావు, ఈశ్వరరావు- హడావుడిగా వాల్తేరు కంపార్ట్ మెంటులో ఎక్కారు. అందులో వాళ్ళకు ఎక్కడా కండక్టర్ కనబడలేదు. కంపార్ట్ మెంటుమీద త్రీటయిరు రిజర్వ్ డ్ అని వ్రాసి వున్నప్పటికీ- తమ తమ బెర్తు నంబర్లు తెలుసుకోవడం కోసం ఇద్దరూ తహ తహలాడుతున్నారు.   
    "కంగారేముందండీ- పెట్టి కాళీగానే వుందికదా- ఓ చోట కూర్చోండి- అన్నాడో పెద్దమనిషి హిందీలో ఆయన సలహాకు వెంటనే ఆచరణలో పెట్టి ఇద్దరూ ఆయన పక్కనే కూలబడ్డారు. ఈలోగా అవతలకిటికీ పక్కగా వున్నా బెర్తు మీద ఘర్షణ ప్రారంభమయింది. ఒక ముసలాయన పక్కపరుచుకుని విశాలంగా కూర్చుని వున్నాడు. తన పక్కగా కూర్చోబోతున్న ఇంకో ప్రయాణికుడితో నాయన దెబ్బలాడుతున్నాడు.   
    "ముసలాడిని కోరి కింద బర్తు తీసుకున్నాను. కూర్చునేందుకింకో చోటుచూస్కోలేవా?" అన్నాడాయన ఇంగ్లీషులో కండక్టరు వచ్చేదాకా అందాకా అక్కడ కూర్చుంటానని ఆ ప్రయాణికుడు బ్రతిమాలుకుంటున్నాడు.   
    "అందాకా కూర్చునేదానికాయన్ను బ్రతిమాలడమెందుకూ? ఇలావచ్చి కూర్చోండి-" అన్నాడు రాజారావుకు సలహా ఇచ్చిన పెద్దమనిషి. ఆ ప్రయాణికుడు వెంటనే వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు.   
    ట్రయిన్ వెంటనే కదిలింది కానీ ఎక్కడా కండక్టర్ జాడలేదు. "కనీసం కదిలేబండిలోనయినా ఎక్కన్నించో వచ్చి ఎక్కుతాడనుకున్నాను-" అన్నాడు ఈశ్వర్రావు. ఇంతలో ఎవరో - ఆమూల బెరుతుమీద నల్లకోటాయన నిద్రపోతున్నాడన్నారు. ఈశ్వర్రావు తను చొరవగా వెళ్ళి ఆ నల్లకోటాయన్ను లేపాడు. ఆయన విసుక్కుంటూ కళ్ళు నులుముకుంటూ లేచి ఒరియాలో ఈశ్వర్రావునుకసిరాడు. ఈశ్వర్రావు ఇటీవలే భువనేస్వర్ లో వుద్యోగంలో చేరిన కారణంగా అతనికి ఒరియా రాదు- "బెర్తు నంబర్-" అన్నాడతను.   
    నల్లకోటు తన పక్కన ఓసారి చూసి- "కొడీ-" అన్నాడు. అతను అన్న పద్దతీ, చూసిన చూపూ బాగోలేక పోవడంతో అతను వెంటనే రాజారావు దగ్గరకు వచ్చి- "కోడీ అంటే ఏమిటండీ-" అన్నాడు.   
    "ఇరవై-" అన్నాడు రాజారావు.   
    "నేను బెర్తు నంబరు అడిగితే టికెటైనా చూడకుండా చెప్పేశాడు కండక్టరు..." అన్నాడు రాజారావు వెనకనే వచ్చిన ఈశ్వర్రావు. రాజారావు నల్లకోటును నిద్రలేపాడు. విసుక్కుంటూ నిద్రలేచి- "కోరాహల్లా?" అనడిగాడు. ప్రపంచంలోని చిరాకంతా అతని మాటలలో కాపురం చేస్తున్నట్లుంది.   
    "బెర్తు నంబర్" అన్నాడు రాజారావు.  
    నల్లకోటుకు చాలా కోపం వచ్చినట్లుంది. ట్రయిన్లో ఇంతమంది ప్రయాణికులుంటే ఈ ప్రశ్న వేయడానికి నీ కింకెవరూ దొరకలేదా అనడిగాడు.   
    ఈ ప్రశ్నకురాజారావు తికమకపడి- "నువ్వు కండక్టరు కాదా?" అని అడుగుదామనుకున్నాడు. అయితే చాలా సంవత్సరాలుగా భువనేశ్వర్లో వుంటున్నా అతనికి వచ్చిన ఒరియా అంతంతమాత్రం తికమకలో వున్నప్పుడతనికి మాటలు దొరకవు. అందుకని అతనలా అప్రతిభుడయి వుండిపోయాడు.   
    "బెర్తునంబరు అడిగి నా నిద్రపాడు చేయడానికివచ్చిన మాటలు ఇప్పుడు రావడంలేదా నాయనా!" అన్నాడా నల్ల కోటు వెటకారంగా రాజారావు మళ్ళీ ప్రయత్నించిమాటలు రాక వెనక్కుమళ్ళాడు.

 Previous Page Next Page