Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 4

    రాయుడు ఓ కుర్చీలో కూర్చుని - "మీకూ సుహాసినికీ పెళ్ళి అని విన్నాను. నిజమేనా?" అన్నాడు.  
    "సుహాసిని మీకెలా తెలుసు?" ప్రభాకరం ఆశ్చర్యంగా అడిగాడు.   
    "సుహాసిని ఈ ఊళ్ళో చాలామందికి తెలుసు" అన్నాడు రాయడు.   
    ప్రభాకరం కోపంగా ఆయన వంక చూసి, "మీరు చెప్పదలచుకున్న దేమిటో సూటిగా చెప్పండి!" అన్నాడు.   
    "మీరలా కోపంగా నావంక చూడకండి. నేను మీ స్నేహం కోరి వచ్చాను. నా స్నేహితుడొకడు తను తీయబోయే కొత్త చిత్రంలో ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నాడు. అతనికి సుహాసిని నచ్చింది. ఆమెకు వివాహం నిశ్చయమైందని ఎవరో చెప్పడంవల్ల - కొంత వాకబుచేసి మీ దగ్గరకు వచ్చాను. కాబోయే భర్తగా ఇందుకు మీ అనుమతి తీసుకోవడం ధర్మంకదా, ఏమంటారు" అన్నాడు రాయుడు.   
    ప్రభాకరం చిరాగ్గా - "నా భార్యను నేను సినిమాలలో నటించనివ్వను" అన్నాడు.   
    "ఆమాత్రం నేనూ అర్ధం చేసుకోగలను. అందుకే ఆమె సినిమాలో నటించాకనే ఆమెను మీరు వివాహం చేసుకుని, తర్వాత మరి నటించవద్దని చెప్పండి!" అన్నాడు రాయుడు.
     "సినిమాల్లో నటించాక దాన్ని నేను పెళ్ళిచేసుకోను" అన్నాడు ప్రభాకరం.
    "అయితే ఆమె సినిమాల్లో నటిస్తే మీ యిద్దరి వివాహమూ జరగదన్నమాట!" అన్నాడు రాయుడు.
    "నేను పెళ్ళి చేసుకోనని బెదిరిస్తే అదెట్లాగూ సినిమాల్లో నటించదు" అన్నాడు ప్రభాకరం అతడీ మాటలు ఎంతో నమ్మకంగా అన్నాడు.
    రాయుడు అక్కణ్ణించి బైటకు వచ్చాడు. ఆయన సాయంత్రం దాకా ఆగి, పార్కుకి వెళ్ళి అక్కడ సుహాసినిని కలుసుకున్నాడు. సుహాసినికి పార్కులోకి వెళ్ళి ఓ గంటసేపు గడపడం దైనందిన కార్యక్రమం.
    "నీపేరే కదమ్మా సుహాసిని!" అన్నాడు రాయుడు.
    "అవునండి....మీరు....అని" ఆగిపోయింది సుహాసిని.
    "నా పేరు రాయుడు మీ బావ ప్రభాకరంగారు పంపాగా వచ్చాను" అన్నాడు రాయుడు ఆమెను పరీక్షగా చూస్తూ.
    "బావ పంపారా? ఎందుకు?" అందామె ఆశ్చర్యంగా.
    "ఓ ప్రొడ్యూసర్ నిన్ను సినిమాల్లో బుక్ చేస్తానంటున్నాట్ట. ఇందులో నీ అభిప్రాయమేమిటో తెలుసుకోమని నన్ను పంపాడు" అన్నాడు రాయుడు.
    "నన్ను సినిమాల్లో బుక్ చేయడమా! ఎవరండీ ఆ వెర్రి ప్రొడ్యూసరు? అంతా బావ చేసే థమాశా౧ ఇంతకీ బావ ఏమంటాడు?" అంది సుహాసిని.
    "ఆయన నీ అభిప్రాయం తెలుసుకోమన్నాడు?"   
    "బావ అలాగెందుకంటాడు? నేను తను గీచిన గీటు దాటనని తనకు తెలియదా? నా నిర్ణయాలంటూ ఏమీలేవు నాకు. న అమనసంతా ఏనాడో తనకు అంకితం చేసేశాను" అంది సుహాసిని.
    "చూడమ్మా! సినిమాల్లో అవకాశం కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకున్నారు తపస్సు చేసినవారందరికీ దేవుడు ప్రత్యక్షం కాడు. నిన్ను అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు సినిమాల్లో చేరడం చాలా మంచిది. డబ్బుకు డబ్బు. పేరుకు పేరు!"
    "అని బావ చెప్పాడా?" అంది సుహాసిని.
    "కాదమ్మా! నేనే చెబుతున్నాను."
    "మరి బావ ఏమన్నాడో చెప్పండి!"
    "నువ్వు సినిమాల్లో చేరితే ఆయన నిన్ను పెళ్ళి చేసుకోట్ట!"  
    "అయ్య బాబోయ్! బావలేని జీవితాన్ని నేనూహించుకోగలనా?"
    రాయుడు ఆశ్చర్యంగా ఆమె వంక చూసి- "నువ్వు చక్కని చుక్కలాగున్నావు. ఆ కురూపి విగ్రహాన్ని నువ్వెలా ప్రేమించావమ్మా!" అన్నాడు.
    సుహాసిని రాయుడి వంక చురుగ్గా చూసి-"షటప్!" అంది.
    రాయుడు తెల్లబోయి, "నేనిప్పుడంత తప్పు మాట ఏమన్నాను? నీ బావ అందగాడని నేనన్నంత మాత్రాన ఆయన అందగాడైపోతాడా?" అన్నాడు.
    "క్షమించండి! నేను నోరు జారాను మా బావనెవరైనా ఏదైనా అంటే నేను సహించలేను నా కళ్ళకి బావ ఎంతో అందంగా కనబడతాడు" అంది సుహాసిని.
    'ప్రేమ గుడ్డిదంటారు. ఇదే కాబోలు' అనుకుంటూ రాయుడు అక్కణ్ణించి లేచాడు. లేచి వెళ్ళిపోతున్న అతడివంక సుహాసిని ఆశ్చర్యంగా చూసింది.
                                                    4
    రాయుడు సెక్రటరీకో ఫోన్ కొట్టాడు. అర్జంటుగా రచయితను పంపమని. మర్నాటికల్లా రచయిత రాయుడి చెల్లెలింటికి వచ్చాడు.
    "రాయుడుగారూ, నమస్కారమండీ! మీ గొప్పతనం మీరున్నప్పటి కంటే లేనప్పుడే ఇంకా ఎక్కువగా తెలుస్తోందండి. ఎవర్ని చూసినా మీ గురించి అడిగేవారే! మీ కొత్త చిత్రం గురించి ప్రశ్నించేవారే! ఈ వెధవ ప్రపంచం మహానుభావులందర్నీ ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువగా గుర్తిస్తుందండి!" అన్నాడు రచయిత.
    రాయుడు సరిగ్గా, "అబ్బబ్బ! నేనింకా బ్రతికేఉన్నాను కదయ్యా!" అన్నాడు. రచయిత మరింత వినయంగా - "ఆ మాట మీరనక్కర్లేదు. మీరు మీ చిత్రాల కారణంగా ఈ ప్రపంచంలో ఎప్పటికీ జీవించే ఉంటారు" అన్నాడు.
    "బాగుందయ్యా! అవన్నీ బ్రతికున్నవాళ్ళ మీద చెప్పాల్సిన డైలాగులు కాదు. ఈలోకం వదిలిపోయిన వాళ్ళ మీద చెప్పాలి. నువ్విలా కొంపలు ముంచుతావనే డైలాగులకు వేరే మనిషిని పెట్టుకున్నాను. ఇంతకీ నిన్నిప్పుడెందుకు పిలిపించానంటే, మన సినిమాకో కొత్త కథ దొరికింది. ఇదో తమాషా కథ కథ కూడా మనసి పూర్తిగా తెలియదు. అంతా చదరంగంలో ఆటలా నడుస్తుంది. నువ్వో పక్కన ఉండి ఎత్తులు వేయాలి. డానికి ప్రతిగా అవతలివాళ్ళేఎత్తు వేశారో చూడాలి. మళ్ళీ మనం ఎత్తువేయాలి. అర్ధమైందా?" అన్నాడు రాయుడు.
    అర్ధంకాలేదండి" అన్నాడు రచయిత.
    "అవున్లే! నీకు మొత్తం కథంతా తెలియదు గదా!" అన్నాడు. రాయుడు - "ఓ అమ్మాయుందయ్యా! కుందనపు బొమ్మలా ఉంటుంది. మన ఫీల్డులో హీరోయిన్లెవ్వరూ ఆమె కాలిగోటికి చాలరు అలాంటి పిల్లని మన సినిమాల్లో కమేడియన్లకంటే అగ్లీగా ఉండే కుర్రాడికిచ్చి పెళ్ళి చేయబోతున్నారు ఆ పిల్ల తల్లిదండ్రులు."
    "పాపం! ఆపిల్ల నెలాగైనా రక్షించాలి" అన్నాడు రచయిత అప్రయత్నంగా - "ఇందుకు రెండు ఉపాయాలున్నాయి. ఆ పిల్ల తల్లిదండ్రులు పాపం అప్పుల్లో ఉండి, ఆ కుర్రాడికి డబ్బు బకీ పడి ఉంటారు. బాకీ తీర్చలేక ఈ పెళ్ళికి ఒప్పుకుని ఉంటారు. ఆ తల్లిదండ్రులకు ఆర్ధికసాయం చేయాలి లేదా-ఆ పిల్ల కెక్కడైనా ఉద్యోగం ఇప్పించి, ఆ కుర్రాడికి దూరంగా తీసుకుపోవాలి!"
    "అదెట్లా కుదురుతుంది? ఆ పిల్ల ఆ కుర్రాన్ని ప్రేమిస్తోంది" అన్నాడు రాయుడు.

 Previous Page Next Page