Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 48

    సువర్చలని చూస్తూనే ప్రేమీ దుఃఖం కట్టలు త్రెంచుకొన్నట్టుగా అయింది. "ఆంటీ" అంటూ చప్పున సువర్చల గుండెల్లో చేరి పెద్దగా ఏడ్చేసింది.

    సువర్చలగొంతు దుఃఖంతో పూడుకుపోగా మాటపెగలలేదు. ఆపిల్ల వీపుమీద చేతులుంచి తన గుండెలకు మరింతగా అదుముకొంది.

    ఎక్కడి దక్కడ ముగిశాక బలవంతంగా ఆపిల్లను తనింటికి తీసికెళ్ళింది సువర్చల.

    నాలుగురోజులు గడిచాయి.

    "నీ భవిష్యత్తు గురించి ఏమాలోచించుకొన్నావు పాపా?" అని అడిగింది సువర్చల ఓరోజు.

    "ఈసారి ఎలాగైనా బి.ఎ. పూర్తి చేద్దామనుకొంటున్నాను."

    "ఆ సంగతి కాదు, నేను అడుగుతున్నది. ఒక్కదానివీ ఆ ఇంట్లో ఎలా ఉంటావూ అని."

    "నాకేం భయంలేదు, ఆంటీ. ఒక్కదాన్నే ఉండగలను."

    "ఊహించుకొన్నంత తేలికకాదు. ఒక్కదానివే ఉండడం. ప్రాక్టికల్ గా ఎన్నో సాధకబాధకాలు అనుభవించాల్సి వస్తుంది."

    "ఏం చెయ్యను మరి? నేను ఒక్కదాన్నీ అవుతానని తెలిసే నాన్న వెళ్ళిపోయాడు కదా?" రుద్దంగా అంది.

    సుందరయ్య వారం పదిరోజుల్లో పోతాడనగా ఇక్కడికి వచ్చాడు విశాల్ రావడం మొదలైన సంగతులనేకం చెప్పాడు.

    "మొదట నేనూ అభిమానపడ్డాను. ఆవిడ తన కూతురిగా పరిచయం చేయకుండా గాలికి తగిలిన మనిషిగా చెప్పుకొంటానంటే! ఇప్పుడాలోచిస్తూంటే ఆమె ప్రవర్తన ఎంతో సమంజస మనిపిస్తూంది. పెళ్ళిచేసుకొని గౌరవంగా కాపురం చేసుకొంటూంది. పెళ్ళికాకముందు పుట్టిన పిల్లని పరిచయం చేయడం ఆమెకి కాదు. పాపకికూడా గౌరవం కాదు. బాగా డబ్బు, బంధుబలగం ఉన్నావిడ. పాప పట్టుదలకి పోకుండా తల్లి దగ్గరికి వెడితే చక్కటి భవిష్యత్తు ఏర్పడుతుంది! పాప నన్నసలు మాట్లాడనివ్వదు ఈ విషయంలో. పాపకి మీరు నచ్చజెప్పండి, అమ్మగారూ." అన్నాడు.

    ఆ పిల్లకి తన మీద కావలసినంత గురీ, గౌరవం ఉన్నాయి. ఉన్నాయి కదాని ఆ పిల్ల వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోగలదా? కన్నతల్లి అంటే ఆపిల్ల మనసులో చెప్పలేనంత అసహ్యం, ద్వేషం నిండుకు పోయాయి. విధిలేని పరిస్థితిలో ఇంకెవరి అండనైనా కోరుకొంటుందేమో గాని ఆతల్లి అండమాత్రం ప్రాణం పోయినా ఆశించదు.

    పూర్తిగా అసంభవ మనిపించిన విషయంలో పాపకి ఏమని నచ్చజెప్పుతుంది? అందుకే ఆ విషయం పాప దగ్గర ప్రస్తావించలేదు.

    వంటరిదైన ఆపిల్ల ఎలా బ్రతుకుతుందన్న ఆలోచన సువర్చలని కలతపెడుతూంది. స్వార్జితమైన తన చిన్న ఇంటికీ, ఇంటిలోని వస్తువులకీ, బాంక్ లో దాచిన పదివేల రూపాయలకు ప్రేమీని వారసురాలిని చేసి పోయాడు సుందరయ్య. అవి ఆ పిల్ల వంటరితనాన్ని దూరం చేయలేవు కదా? ఆ పిల్ల పెళ్ళికి సుముఖంగా ఉంటే ఈ సమస్యే ఉండేదికాదు! భర్త, సంసారం, పిల్లలూ _ఆమెకో చిన్ని ప్రపంచం ఏర్పడేది. ఆమె హృదయ వీణను మీటే ప్రియుడొచ్చేవరకు పెళ్ళి ఆలోచనలె దగ్గరికి రానిచ్చేట్టు కనిపించడం లేదు.

    సుందరయ్యపోయిన పదవరోజు ఆ వీధిలోనే ఉన్న సత్రం వాళ్ళకి డబ్బిచ్చి బీదలకీ, బిచ్చగాళ్ళకీ అన్నదానం చేసింది ప్రేమీ. అంతే. వేరే కర్మకాండ ఏదీ నిర్వహించలేదు.

   
                                         18

    ఆ రోజు బి.ఎ. పరీక్షకు ఫీజుకట్టి వచ్చింది ప్రేమీ. అల్మారాలో దుమ్ము పట్టిన పుస్తకాలన్నీ దులిపి ఎప్పుడో తను తిరిగిన ప్రపంచంలోకి తొంగి చూస్తున్నట్టుగా ఒక్కో పుస్తకాన్ని పేజీలు త్రిప్పి చూడసాగింది. ఏమిటో, అంతా అయోమయంగా, క్రొత్తగా ఉంది. మళ్ళీ ఇప్పుడు చదవడమంటే విసుగ్గా ఉంది.

    పుస్తకాలు, నోట్సులు సర్దుతూంటే అడుగున ఆల్బమ్ కనిపించింది. చాలా రోజుల తరువాత ఆల్బమ్ తెరిచింది ప్రేమీ.

    మొదటి పేజీలో ఓకే ఒక ఫోటోవుంది. అది రాజ్యం సుందరయ్యల పెళ్ళినాటి ఫోటో. దృఢంగా, ఆరోగ్యంగా, గుబురు మీసాలతో గంభీరంగా పాతికేళ్ళున్న సుందరయ్య ప్రక్కన పదేళ్ళ వయసున్న రాజ్యం సన్నగా పిల్లలా వుంది. ఇద్దరి మెడలోనూ వాడిన పూలదండలూ, ముఖాన చెదిరినట్టుగావున్న పెళ్ళిబొట్లూ ఉన్నాయి.

    వాళ్ళ వయసులో ఎంత తేడా? వాళ్ళ సంసార జీవితంలో ఆ తేడా ఎక్కడా కనిపించేది కాదు. సంసారనావ పూర్తిగా రాజ్యం చేతిమీదే నడిచేది. సమర్ధుడైన నావికుడు నడిపే పడవలో ప్రయాణీకుడిలా సంతృప్తిగా, నిశ్చింతగా కాలం దొర్లించేవాడు సుందరయ్య.

    ఎంత ఆలోచించినా వాళ్ళిద్దరూ తగాదాపడిన సంఘటనలు గుర్తురాలేదు ప్రేమీకి. ఎంత అన్యోన్యమైన దాంపత్యం అమ్మా నాన్నది. ఎంతో ధీమాగా, దర్పంగా ఉండే నాన్న అమ్మ పోయాక ఎంత బేలగా అయిపోయాడు. ఆమె బెంగతోనే కృశించి కృశించి మరణాన్ని త్వర త్వరగా చేరుకొన్నాడు.

    పేజీ త్రిప్పుతూనే బోర్లాపడుకొని తలెత్తి బోసినోరు విప్పి పువ్వులా నవ్వుతూన్న పాప! మెడలో బంగారు గొలుసు, నడుముకి కట్ డ్రాయర్ తప్ప ఇంకేమీ లేవు. అది ప్రేమీ నెలల వయసులో తీసిన ఫోటో. మరో ఫోటోలో ప్రేమీని మధ్య కూర్చోబెట్టుకొని రాజ్యం దంపతులు దిగారు. మూడవ పేజీలో ఉన్న ఫోటో ప్రేమీ సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు నాటకంలో భరతుడి పాత్ర వేసినప్పటిది.

    "మా పాప నాటకంలో వేస్తూంది!" అంటూ, రాజ్యం ఆ వీధి వీధినంతా వెంటేసుకువచ్చి చూసింది నాటకాన్ని. ఇంటికి వచ్చాక మిరపకాయలతో, చందనంతో దిష్టి తీసింది. "అందరి కళ్ళు మన పాపమీదే ఉన్నాయి. అందరూ మన పాపనే మెచ్చుకొన్నారు!" అంటూ.
 

 Previous Page Next Page