మనసంతా వికలంగా వుంది. ధర్మారావు యింట్లో లేడు. ఆమె ఎప్పుడోగాని డ్రింక్ చెయ్యదు. వాడ్రోబ్ తెరిచి స్కాచ్ విస్కీ అందుకుని గ్లాసులో కొంత వరకూ నింపుకుని, ఫ్రిజ్ లోంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని వేసుకుంది. గబగబ రెండు పెగ్గుల వరకూ తాగింది. తల కొంచెం తిరిగినట్టయిందిగాని అనుకున్న అనుభూతి రాలేదు. ఆచార్య జగదీష్ యిచ్చిన పిల్ గుర్తొచ్చింది. గబగబ తాను రహస్యంగా దాచుకున్న అరలోంచి పిల్ తీసుకుని వేసుకుంది. అయిదు నిమిషాల తర్వాత పిల్ పనిచెయ్యడం ప్రారంభించింది. శరీరంలోని ప్రతి అణువూ ఎన్నో కోణాల నుంచి విచ్చుకున్నట్లయి, మనస్సులోకి ప్రాకి ఎక్కడెక్కడికో విహరిస్తోంది. పెదమలమీదకు వింత నవ్వొకటి ఆవహిస్తోంది.
ధర్మారావు లోపలకు వచ్చాడు. బిజినెస్ అతనికి మధ్య దెబ్బ మీద దెబ్బ తగుల్తోంది. ఎటువంటి కష్టంలోనైనా ఆత్మ స్థయిర్యం కోల్పోకుండా వుండగలిగినవాడు _ యిప్పుడు తట్టుకోలేకుండా వున్నాడు.
అతని మొహమంతా అలసిపోయిన చిహ్నంగా స్వేదబిందువులతో నిండివుంది.
అలికిడి విని విద్యుల్లతాదేవి అటుకేసి తిరిగింది. ఆమె కళ్ళు నిషా కిరణాల్ని వెదజల్లుతున్నాయి.
"నా డబ్బు మాట ఏం చేశావు?" అంది.
చాచి పెట్టి చెంప పగల కొడదామన్నంత కోపమొచ్చింది. కష్టం మీద తమాయించుకున్నాడు.
"లేదని చాలాసార్లు చెప్పాను."
"నేను తెచ్చిన ఆస్తితో నువ్వు ...మనిషివయ్యావు. బిజినెస్ మేగ్నేట్ గా సమాజంలో ఓ స్థానం సంపాదించావు. ఇప్పుడు నువ్వనుభవిస్తోన్న హోదా, అంతస్థూ నేను పెట్టిన భిక్ష. అటువంటి నా మీద తిరగబడాలని ప్రయత్నించకు ధర్మారావు."
"నువ్వు తెచ్చిన దానికన్నా యిప్పటికి ఎన్నో రెట్లు అనుభవించావు. నీ బాకీ ఎప్పుడో తీరిపోయింది. ఇప్పుడా డబ్బుమీద నీ కెలాంటి హక్కూ లేదు విద్యుల్లతాదేవీ !"
విద్యుల్లతాదేవి నవ్వింది. "ఒక్కసారి పెట్టుబడి నాదంటూ అయాక దాని మీద వచ్చే లాభమంతా నాదే అవుతుంది ధర్మారావు. నువ్వు నా మేనేజర్ క్రిందకే వస్తావు."
"అది నీ దృష్టిలో. నా దృక్పధం వేరే వుండవచ్చుగా?"
"నీ దృక్పథాలు నాకనవసరం. నాకిప్పుడు అర్జంటుగా డబ్బు కావాలి."
"లేదని వెయ్యిసార్లు చెప్పాను."
"లేదంటే వీల్లేదు. పుట్టించి తీరాలి. అయినా ఎందుకు లేదో చూస్తాను" అంటూ ఆమె గదిలో వున్న స్టీల్ బీరువా తెరిచి అందులో వున్న అరలన్నీ వెదుకుతూ, లోపల వస్తువులన్నీ క్రిందకు గిరాటెయ్య సాగింది.
ధర్మారావు కోపం ఆపుకోలేకపోయాడు. "లేదని చెబుతుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా?" అంటూ విసురుగా వెళ్ళి ఆమె రెక్కపట్టుకుని యివతలకు ;లాగటానికి ప్రయత్నించాడు.
"ఒదులు, నన్నొదులు. నా అవసరాలకు ఉపయోగపడని నువ్వసలు మనిషివేనా?" అంటూ ఆమె తన చేతుల్లోంచి విడిపించుకోవటానికి ప్రయత్నించింది.
"విద్యుల్లతాదేవీ, రాక్షసిగా ప్రవర్తించకు."
"నేను రాక్షసినయితే _ నువ్వు ... నువ్వు ఓ పశువులా ప్రవర్తిస్తున్నావు."
ఆమె కళ్ళలోంచి అగ్ని కణాలు రాలాయి. "ఆఫ్ ట్రాల్ నువ్వు నా సొమ్ముతో పైకి వచ్చిన వాడివి నన్ను కొడతావా?"
అతనిపై తిరిగి చెయ్యి చేసుకుందామన్నంత ఉద్రేకంతో ఆమె చెయ్యి గాల్లోకి లేచింది.
ఆమె ప్రవర్తన చూసి అతను ఆవేశం అణుచుకోలేకపోయాడు. గాల్లోకి లేచిన ఆమె చేతిని పట్టుకుని వెనక్కి ఓ తోపు తోశాడు.
ఆమె బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి తూలిపడింది. తల విసురుగా స్టీల్ బీరువాకు కొట్టుకుని, దభీమని శబ్దం చేసింది. లోపల నరాలన్నీ జివ్వుమని లాగాయి. రక్తనాళాలను చిట్లకొట్టి రక్తం బయటకు ప్రవహించినట్లయింది.
తలపైకెత్తగానే బీరువాలో ఒక ప్రక్కన సొరుగులో వున్న పిస్టల్ కళ్ళబడింది. ఉద్రేకంలో ఏం చేస్తున్నదో కూడా తెలీని స్థితిలో పిస్టల్ ని చేతిలోకి తీసుకుంది.
"దుర్మార్గుడా! నీ స్థితిని మరచి ప్రవర్తిస్తున్నందుకు తగినట్టుగా బుద్ధి చెబుతాను."
పిస్టల్ ను అతనికేసి గురిపెట్టింది.
ఒక్క క్షణం స్తబ్దుగా నిలబడిపోయి, తర్వాత తేరుకుని ధర్మారావు నిర్లక్ష్యంగా నవ్వాడు.
"విద్యుల్లతాదేవీ! యిన్నాళ్ళూ నాలోని మంచితనాన్నే చూశావు. ఇప్పుడు రెచ్చగొట్టబడిన పురుషత్వాన్ని చూస్తావు" వేగంగా కదిలి ముందుకు రాబోయాడు.
ఆమె చేతిలోని పిస్టల్ ధన్ మని పేలింది.
ఆ సమయానికి తేజ తన గదిలో మంచం మీద పడుకుని వుంది. నిద్రపోవటం లేదు. తల్లిదండ్రుల గదిలోంచి ఏదో రభస వినిపిస్తోంది గాని _ తీవ్రస్థాయిలో చర్చ ఏదయినా జరుగుతున్నదేమోననుకుంది. తర్వాత పిస్టల్ పేలిన శబ్దం వినిపించే సరికి ప్రక్క మీద నుంచి మెరుపులా లేచి అటుకేసి పరిగెత్తింది.