Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 48

   
    "వెళ్ళిరా! నీ జీవితం సుఖంగా గడవాలని ఆశీర్వదిస్తున్నాను."`    
`    ప్రసూన కోరుకుంటున్నది ఈ ఆశీర్వాదం కాదు.    
    "మీరు ఒప్పుకుంటే మరి కొన్ని రోజులు మీ దగ్గర ఉండాలని ఉంది."    
    లలిత తల అడ్డంగా ఊపింది.    
    "వద్దు! వెళ్ళిపో!"    
    ప్రసూన మనసు దెబ్బతింది. వెళ్ళబోయింది. లలిత హీనస్వరంతో "నీకు ఏదైనా అవసరముంటే అడగడానికి భయపడకు" అంది.    
    ప్రసూన లలితకు అభిముఖురాలైంది.    
    "భయపడను. ఒకరిముందు చెయ్యిజపడం మనను మనం చిన్న బుచ్చుకోవడం. మీ ముందు నను నేను చిన బుచ్చుకోను. మీ కూతుర్ని నిజంగా ప్రేమించే స్నేహితురాలిని నేను. ఈ విషయము మీరు నమ్మగలిగితే చాలు!"    
    ప్రసూన కళ్ళు చెమ్మగిల్లటం లలిత గమనించింది.    
    తరువాత త్వరలోనే లలిత మంచంమీద నుంచి లేవగలిగింది. కానీ ఈ లలితకూ వెనుకటి లలితకూ పోలిక లేదు. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.    
    ఆలోచించి ఆలోచించి లలిత ఒక నిర్ణయానికి వచ్చేసింది.    
    "నేను ఇంకా మీ దగ్గర ఉండలేను- వెళ్ళిపోతాను_"    
    అంది సాంబశివంతో ......    
    సాంబశివం ఆశ్చర్యపడలేదు____ఇలాంటిది ఎదుర్కోవలసి వస్తుందని అతను అనుకుంటూనే ఉన్నాడు.    
    ఏ విధంగానూ ఎవరికీ పోలని అపూర్వమైన స్త్రీ మూర్తి లలిత......ఇన్నాలలుగా ఆవిడను సాధించటానికి తనకున్న ఒకే ఒక ఆయుధం సుశీల.....సుశీల లేదు. లలిత తనను క్షమించదు__దయదలచదు___    
    "వెళ్ళు" అన్నాడు ప్రశాంతంగా......    
    క్రూర మృగంలా తన మీదకు కలియబడే సాంబశివం అంత శాంతంగా మాట్లాడటం లలితకు ఎలాగో అనిపించింది. అయినా ఇక అతనితో కలిసి తను ఉండలేదు.    
    "ఇన్నాళ్ళుగా మీ లాభాలలో సగం నా పేరుమీద ఉంచారు అది తీసుకోండి!"    
    "ఉండనియ్యి!"    
    "ఎందుకు? నేను డబ్బుకోసం మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నా నని అనుకుంటున్నారా?" "లేదులే! నన్నుచూసి మోహించి......." వెటకారంగా అన్నాడు.    
    "ఎంతమాత్రం కాదు. ఆ రోజుల్లో మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ నా పెళ్ళి ఒక సమస్య అన్నట్లు మాట్లాడేవారు. నా కుటుంబం కోసం పెళ్ళిచేసుకున్నాను. నేను ఎంత త్యాగం చేస్తున్నానో అర్ధం చేసుకోకుండా చేసుకున్నాను గనుక ఇన్నాళ్ళుగా కట్టుబడి ఉన్నాను___మీ డబ్బు మీరు తీసుకోండి!"    
    "ఆ డబ్బు నీ పేరు మీదనే ఉండనియ్యి లలితా. నాకేదైనా అవసరమయితే నువ్వు నన్ను తప్పకుండా ఆదుకుంటావనే నమ్మకం నాకుంది___ అందుకే నువ్వంటే నాకు గౌరవం___అ న్దుకే నువ్వంటే నాకు ఈర్ష్య...... నీ గొప్పతనాన్ని చూసి......"    
    నవ్వాడు సాంబశివం__    
    సాంబశివం ఇలా నిష్కపటంగా మాట్లాడినప్పుడు ఏమీ చెయ్యలేని ఆసక్తురాలయి పోతుంది లలిత__ ఈ విషయం సాంబశివం కూడా అర్ధంచేసుకున్నాడు.    
    కానీ లలిత అక్కడ కూర్చోలేక పోయింది__సాంబశివం చిట్టచివరి ఆశాకిరణం కూడా హరించిపోయింది.    
    సాంబశివం రెండు రోజులు వరుసగా హోటల్ కి రాలేదు. సాధారణంగా అలా జరగదు. కారణం ఏమిటో తెలుసుకోవడానికి హోటల్ సిబ్బంది ఎవ్వరికీ గుండె నిబ్బరం లేదు. రేఖ నవ్వుతూ "ప్రసూనా! సాంబశివంగారి దగ్గర ఏదైనా మాట్లాడగలిగే స్వాతంత్ర్యం నీకే ఉంది. నువ్వే కనుక్కోవా!" అంది.    
    రేఖ ఏ ఉద్దేశంతో అన్న ఆ మాటలు నిజమే అనిపించింది. ప్రసూనకు. పైగా తను దొంగ నోట్లకు సంబంధించిన వివరాలు కనుక్కోవాలి. అందుకైనా వెళ్ళాలి___    
    ప్రసూన వెళ్ళేసరికి సాంబశివం తప్ప తాగి ఉన్నాడు.    
    "ఎవరు" అన్నాడు ముద్ద ముద్దగా.........    
    "సార్!" అంది ప్రసూన భయంగా......    
    "నువ్వా! సుశీల వెళ్ళిపోయింది- లలిత వెళ్ళిపోయింది- అందరూ వెళ్ళిపోయారు-" అన్నాడు___    
    లలిత వెళ్ళిపోయిన సంగతి ప్రసూన వింది___ కానీ అందుకు సాంబశివం ఇంతగా క్రుంగిపోతాడనుకోలేదు___లలితను అంతగా ప్రేమిస్తున్నాడా?    
    "బాధ పడకండి సార్!"    
    "నాకు అన్నీ  ఉన్నాయి__డబ్బుంది, హోదా ఉంది-పలుకుబడి ఉంది- కానీ, నా కెవరున్నారు? ఎవ్వరూ లేరు......"    
    సింహంలాంటి సాంబశివం ఆడపిల్లకంటే అన్యాయంగా బేలగా అయిపోయాడు.    
    "అలా అనకండి సార్! మేమంతా లేమా?"    
    "అవును? అన్నట్లు నువ్వు వున్నావు కదూ! ఇవాళ నుంచి నా దగ్గరే ఉండిపోవాలి! చెప్పు. ఉంటావు కదూ! ఉంటావు కదూ!"

 Previous Page Next Page