"అవును పెద్దదానివైపోయావు" అంది అనూరాధ ఓ నిమిషం నిదానంగా చూశాక దుప్పటి మీదకు లాక్కుంటూ.
"ఫో. అదికాదే నేను....నేను..."
అనూరాధకు నిద్ర వస్తోంది. అందుకని బద్దకంగా "అవును నీ కీర్తి ప్రతిష్టలు చాలా యినుమడించాయి" అంది.
సుజాత విసుగ్గా "అబ్బా! నీకెప్పుడూ వాటిగొడవేనే. నాకింకేం అక్కర్లేదనుకున్నావా?" అంది.
ఈసారి అక్క బద్దకాన్ని ఒదుల్చుకుని, చెల్లెలి ముఖంలోకి తేరిపారచూసింది. అయినా ఏమీ గ్రహించలేక "ఓహో! నీ ప్రియుడిగురించా?" అంది పరిహాసంగా.
"ఊ" అని సుజాత సిగ్గుపడి "నేను ప్రేమించాను" అంది గర్వంగా.
అనూరాధ కంగారుపడింది. ఈ పిల్ల ఒట్టి అమాయకురాలని ఆమెకు తెలుసు. "ఏం పనిచేశావు చెల్లీ?" అంది.
"సుజాత ఉలికిపడి అంత కాని పనా?" అంది.
అనూరాధ మృదుస్వరంతో "అలా అనికాదు. ఈ వ్యవహారాల్లో నువ్వు దిగటం నాకు భయాన్ని కలిగిస్తుంది. ఈ జీవితంలోని ఎగుడుదిగుళ్ళు నీకు తెలీదు. అసలు మంచివాళ్ళు, మనని అర్ధం చేసుకునేవారెవరూ లేరు భూమ్మీద. అది గ్రహించక నరకమంటే అప్పుడు..."
అక్క యింత దారుణంగా మాట్లాడటం ఆమె యిదివరకెప్పుడూ ఆలకించలా. "అలా జరిగిపోయింది మరి" అంది కొంచెం కోపంగా.
అనూరాధ లేచికూర్చుని చెల్లెలి మంచంమీదకు వెళ్ళి ప్రేమగా చెక్కిలి నొక్కుతూ "ఎవరు నీ మనోనాధుడు?" అంది.
సుజాత ఆమె చేయి తన చల్లని చేత్తో గట్టిగా పట్టుకుని వణుకుతూన్న పెదాలతో "అతడే...చంద్రం."
"మరి ప్రభాకరం?" అని ప్రశ్నించింది అనూరాధ ఆశ్చర్యంగా.
సుజాత చకితురాలై "ఏం చెయ్యను? అడిగిన వాళ్ళందరికీ నా హృదయం కొంచెం కొంచెం పంచిపెట్టటానికి, నాలోనూ రక్తమాంసాలున్నాయిగా అక్కా" అంది.
"పాపం! అతను నీకోసం తపస్సు చేశాడు" అంది అనూరాధ జాలిగా.
సుజాత ఏమీ మాట్లాడలేదు. అక్కయ్య చెయ్యి అలానే నొక్కిపట్టుకుని నిట్టూరుస్తూ పడుకుంది. కొంతసేపటికి అనూరాధ సున్నితంగా విడిపించుకుని వెళ్ళి తన ప్రక్కమీద పడుకుంది. రోడ్డుమీద కారొకటి చప్పుడు చేస్తూ పోయింది. ఇద్దరూ మెదలకుండా కళ్ళు తెరచుకుని పడుకొని ఆలోచిస్తున్నారు.
"ఇదొక నూతన జంఝాటమా? నేను ప్రభాకరాన్ని అన్యాయం చేశానా?" అనుకుంది సుజాత.
"ఎవరీ చంద్రం? చెల్లెలి జీవితాన్ని యింత సులభంగా ఎలా ఆక్రమించగలిగాడు?" అనుకున్నది అనూరాధ.
"ఒకప్పుడు ప్రభాకరమంటే అదొకరకం ఆకర్షణ వుండేది! ఏమిటో అది. ఒకవేళ నేను చంచలురాల్నా ఏమిటి? అయితే అవనీ సుఖం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోతాను. ప్రభాకరమంటే నాకు ఏవగింపులేదు. చంద్రాన్ని చూడకుండా వుంటే ఏం జరిగేదో! చూసేశాను మరి. అతని ప్రభావంలో మునిగిపోయాను. పాపం ప్రభాకరం" అని జాలిపడింది సుజాత.
"నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమించలేకపోయాను. సుజాత ఆ సుడి గుండంలోకి పోతోంది. అదే మంచిదేమో" ఆమె హృదయవీణ మధురంగా మ్రోగింది.
20
దూరంగా రైలుకూత వినిపించింది. సరోజిని ఉలికిపది లేచికూర్చుంది. చుట్టూ చీకటి. అంతా నిద్రపోతున్నారు. పోయే పోయే రైలుచప్పుడు తన గుండెల్లో, యీ మంట అబ్బా! బావా! ఏం పనిచేశావు? ఎందుకంత కసి నీకు నేనంటే?
ఇంతలో ఆమె పదేళ్ళ చెల్లెలు మేలుకొని "అక్కా! ఎందుకే కూర్చున్నావ్?" అంది.
సరోజిని ఉలికిపడి "కూర్చున్నాను గదూ అవును. అవునే సీతా! రోజూ తెల్లవారుఝామున నాలుగింటికి రైలు కూతపెడుతుంటే, ఆ చప్పుడుకి మెలకువ వస్తుందే. ఇహ నిద్రపట్టదు మరి. పడుకో సీతా! అంది.
సీత కాసేపు అటూ యిటూ కదిలి "నాకు నిద్ర రావటల్లేదక్కయ్యా! నాకేమైనా కథ చెప్పు" అంది.
"ఇప్పుడు కథలేమిటే నీ మొహం. పడుకుని మంచి మంచి కలలుగనే సమయం."
సీత ఊరుకోలేదు. సరేగానీ అక్కయ్యా. "నీ కథల్లో రాజకుమారుడెప్పుడూ రాజకుమారిని మోసాలు చేస్తాడే?" అని ప్రశ్నించింది.
సరోజిని ముఖం నల్లబడింది. అక్కడ చీకటి లేకపోయినా యీ విషయ మా చిన్నపిల్లకు అర్ధంకాదు.
"ఎందుకంటే నేను చెప్పేవి నిజమైన కథలు. అబద్దాలయితేనే రాజ కుమారులు మంచివాళ్ళు."
"అసలు లోకంలో మంచివాళ్ళు ఉంటారక్కయ్యా?"
"చాలా కొద్దిమంది వుంటారు సీతా. కాని మంచివాళ్ళుకూడా చెడ్డపనులు చేస్తూవుంటారు. చెడ్డపనులు చెయ్యకుండా ఎవరూ వుండరు."
సీత కాస్త దీర్ఘంగా ఆలోచించింది. "నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటా వక్కయ్యా?" అనడిగింది హఠాత్తుగా.
"సరోజిని నిర్ఘాంతపోయి "యిప్పుడెందుకు ఆ ప్రసక్తి?"
"అమ్మావాళ్ళు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నారు."
`
"నేను పెళ్లి చేసుకోను" అంది కరాఖండిగా సరోజిని.
"చేసుకో అక్కయ్యా, బాగుంటుంది."
సరోజిని నవ్వాపుకుని "ఏమిటే బాగుండేది?" అంది.
"పెం....డ్లి"
"సరే చూద్దాంలే నిద్రపోతావా? కథ వింటావా?"
"కథే చెప్పు."
సరోజిని చెప్పసాగింది. సీత ఊ కొడుతుంది...ఆ చచ్చిపోయిన చేప నవ్వింది. చచ్చిపోయిన చేప ఎట్లా నవ్వుతుంది? రాజుగారు మంత్రిని పిలిచాడు. చేప ఎందుకు నవ్విందో ఆ వైనంకనుక్కోమన్నాడు. పదిహేను రోజులలోగా కనుక్కోలేకపోతే తల తీయిస్తానన్నాడు. పాపం మంత్రులకి ఎప్పుడూ ఇలాంటి కష్టాలే వస్తూవుంటాయి. విచారంగా కాళ్ళీడ్చుకుంటూ యింటికి వెళ్ళాడు. ఆ మంత్రి భార్య చక్కనిచుక్క, భలే తెలివిగలది. భర్త విచారం కనిపెట్టి "అదేమిటండీ?..అలా వున్నారు?" అనడిగింది.
ఇలా సాగిపోయింది కథ. పూర్తయ్యేసరికి అయిదయింది. తల్లీ, తండ్రీ లేచి కూర్చున్నారు. గ్రామంలో సందడి మొదలయింది. తల్లి పెరట్లోకిపోయి బావిదగ్గర ముఖం కడుక్కుని వచ్చి వంటింట్లో కుంపటి రాజేసింది. మేఘాలను చీల్చుకుని సూర్యరశ్మి క్రిందకు వచ్చి భూమిని తాకింది. సీత లేచి పెరట్లోకి పోబోతూంటే సరోజిని చెయ్యి పట్టుకుని ఆపి "సీతా! త్వరగా స్నానం చెయ్యి. ఈ పూట గుడికి పోదాం" అన్నది.
కాఫీ యిస్తూ తల్లి "అలా వున్నావేమే?" అనడిగింది కూతుర్ని.
"ఎలా వున్నానమ్మా?" అన్నది సరోజిని దిగులుగా నవ్వి.
తండ్రి కాఫీ త్రాగి, సాయంత్రంవరకూ రానని చెప్పి పనిమీద ప్రక్క ఊరికి పోయాడు. సరోజిని స్నానం చేయడానికి చీరె తీసుకునిపోతోంది. తల్లి రాధమ్మ కూతుర్ని వంటరిగా పట్టుకుని ఆపింది. "నాకో రహస్యం చెప్పు సరూ! నువ్వు ఎందుకు రోజురోజుకూ చిక్కిపోతున్నావ్?" అనడిగింది బాధగా.
సరోజిని తల వంచుకుని బొటనవ్రేలితో నేలను రాస్తూ నిల్చుంది. ఏమీ పలకలా.
"చెప్పు సరూ! నాముందు దాపరికం దేనికి?" అంది రాధమ్మగారు వ్యతీతమైన గొంతుకతో.
సరోజిని బలవంతాన నవ్వి "ఏమీలేదే అమ్మా, అంతా నీ పిచ్చిగాని..." అంటూ అక్కడ్నుంచి తప్పించుకోచూసింది.
కానీ రాధమ్మగారు కూతుర్ని చెయ్యిపట్టుకుని ఆపి "చెప్పవే సరూ! బావంటే అంత యిష్టమా నీకు?" అని అడిగేసింది చివరకు.
దీనికి ఏ కూతురు సరిగా సమాధానం చెబుతుంది? ఆ చూపులు రాధమ్మగారు అర్ధం చేసుకుంది. ప్ర్మగా కూతురి తలమీద చెయ్యివేసి నిమురుతూ "నువ్వదృష్టవంతురాలివి కాదమ్మా. ఆ ఆశ విడిచెయ్యి" అంది ఖేదంగా.
ఈ గొంతులో ఏదో విపరీతం ధ్వనించి - సరోజిని తల ఎత్తి "ఎందుచేతమ్మా అలాగ?" అనడిగింది ఉత్కంఠగా.
రాధమ్మగారు ఏదో చెబుదామని నోరు తెరచింది. ఎదురుగా తులసి చెట్టుమీదనుంచి ఒక ఆకురాలి క్రిందపడింది. గొంతులోని మాట గొంతులోనే ఉండిపోయింది. కొంచెంసేపున్నాక అతి ప్రయాసతో "అదంతేనమ్మా వాళ్ళు డబ్బున్నవాళ్ళు, మనం లేనివాళ్ళం వాళ్ళకూ మనకూ ఎట్లా పొత్తు కుదురుతుంది?" అంది జీరపోయిన కంఠంతో.