ప్రేమీ ఆయనచేత ఏవేవో టాబిలెట్స్ తినిపించింది. కాని, దగ్గు తగ్గలేదు. అతడి ఆయాసాన్ని చూడలేక పోతూంది. అతడిచొక్కా గుండీలుతీసి చాతీమీద అమృతాంజనంతో రాయసాగింది. మనిషి శరీరంమీద వ్రాస్తున్నట్టుగాకాక ఏదో అస్థిపంజరంమీద వ్రాస్తున్నట్టుగా ఉంది. కండ కరిగిపోయి, చర్మం ఎండుకుపోయి ఒక కంకాళంలా ఉన్నాడు.
"నువ్వు డాక్టరు చెప్పినప్పుడే హాస్పిటల్లో చేరి, మంచి ట్రీట్ మెంట్ తీసుకొని ఉంటే ఈరాత్రి ఇంత బాధపడేవాడివి కావేమో."
"ఇక డాక్టరు చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టే వింటాను." ఎదురు చెప్పి నిలిచేశక్తిలేనట్టుగా కళ్ళుమూసుకొన్నాడు సుందరయ్య. ఆయాసంతో ఆయన కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. అతడికి ప్రేమీ ఇంత దగ్గరగా మసలడం ఇష్టంలేదు. ఇంట్లో ఉంటే ఆమె మంచం వదలదు. హాస్పిటల్లో చేరడమే మంచిది అంత్యదశలో తనపిల్లలు తన దగ్గర మసలాలని కోరుకొంటాడు మనిషి. కాని, తనకున్న జబ్బు ఆ అదృష్టాన్నుంచి దూరంగా ఉంచేట్టుంది.
ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు హాస్పిటల్ కి వెడదామా అన్నట్టు నిమిషాలు లెక్కపెడుతూంది ప్రేమీ.
అతికష్టంగా మూడు అయింది.
"వేడివేడిగా టీ చేసిస్తావా, పాపా? వేడిపడితే కాస్త ఆయాసం తగ్గుతుందేమో." సుందరయ్యకు మాటదొర్లడమే కష్టంగా ఉంది.
ప్రేమీ టీ చేసి తెచ్చేసరికి సుందరయ్య ఊపిరందక గిలగిల్లాడుతున్నాడు. అతడి కళ్ళు గాజుగోళీల్లా ముందుకు పొడుచుకు వచ్చాయి. నరాలన్నీ ఉబ్బి ముఖం భయంకరంగా తయారైంది.
అతికష్టంగా శక్తి కూడదీసుకొన్నాడు సుందరయ్య. "మొన్న వచ్చిన అబ్బాయి మళ్ళీ వస్తాడు నీకోసం. దయచేసి అతడిని అవమానించకు. ఒంటరిగా నువ్విక్కడుండకు. మీ అమ్మదగ్గరికి వెళ్ళిపో." ఈ మాటలు చెప్పడానికే అతడు ప్రాణం నిలుపుకొన్నాడా అన్నట్టు, చెప్పడం అవుతూనే ప్రాణం వదిలేశాడు.
మరణ వేదననుండి విముక్తి పొందిన అతడి శరీరం ప్రేమీ చేతుల్లో అలాగే ఉంది.
కట్టెల్లా అతడి చేతులు భుజాలనుండి వ్రేలాడుతున్నాయి. ఈ శుష్కహస్తాలు ఒకనాడు ఒకతల్లి నిర్దయగా పారేసిన పసిగుడ్డును ఆర్దతతో ఎత్తుకొన్నాయి ఆ పసిగుడ్డును ఇరవయ్యేళ్ళు తనగుండెలలోని ప్రేమంతనీ రంగరించి పెంచాయి.
కట్టెల్లా వ్రేలాడుతున్న ఆ చేతుల్ని స్పృశిస్తూ వెక్కి వెక్కి ఏడవసాగింది ప్రేమీ.
మసక చీకట్లుండగానే సువర్చలకి సుందరయ్య మరణవార్త చేరింది. శవసంస్కారంకోసం ఎవరెవరికో ఫోన్ చేసి కారులో బయల్దేరింది. ఆమె రాజ్యం చనిపోయినప్పుడు వెళ్ళింది ఆ ఇంటికి. మళ్ళీ ఇప్పుడు వెడుతూంది. ఆరోజు సుందరయ్యను ఓదార్చడానికి వెడితే ఈరోజు ప్రేమీని అనునయించడానికి, ఈ దుఃఖసమయంలో ఆపిల్లకు అండగా ఉండడానికి వెడుతూంది.
అప్పటికే ఇరుగు పొరుగు ఇల్లు పట్టకుండా వచ్చారు. శవాన్ని గుమ్మానికి ఎదురుగా క్రింద చాపవేసి పడుకోబెట్టి తలవైపు దీపం వెలిగించి వాకిట్లో నెగడు రాజవేశారు.
"ఏడిస్తే మీ నాన్న వస్తాడా? ఏడవకు. తలనొప్పి వస్తుంది. కళ్ళు వాస్తాయ్. మనసు కుదుట పరుచుకో. ఏం చేస్తావ్? ఒక ఇంటిదానివి కాకముందే పెంచిన తల్లినీ, పెంచిన తండ్రినీ పోగొట్టుకొని ఏకాకి వయ్యవు." ఓదార్చినట్టే ఓదార్చి ఆపిల్ల దుఃఖానికి సమిదల్ని ఎగదోస్తూంది ఒకామె.
"ఇంట్లోంచి శవమైనా లేవకముందే మనసు ఎలా కుదుట పరుచుకొంటుంది? రోజువెనుక రోజు గడుస్తూంటే ఆ దుఃఖంమీద భగవంతుడు ఒక్కోరాయి పడేస్తాడు. ఆ దుఃఖం ఎవరూ చెప్పకుండానే మాయమైపోతుంది."
"ఏ రాక్షసో కనిపారేసిన పిల్లను తెచ్చి ఇంతదాన్ని చేశాడు. చస్తే ఏడవడాని కన్నట్టు ఈ బిడ్డను మిగుల్చుకొన్నాడు. ఎంత మంచిమనిషి? చైనా అపకారమైనా ఎవరికైనా చేసి ఎరుగునా?" చనిపోయిన వ్యక్తి మంచిచెడ్డలు బేరీజ్ వేస్తున్నారు.