"గొప్పదాన్ని చేసేద్దామని. ఒకవేళ నేను గొప్పవాడినవకుండా వుంటే ?"
"అంటే?"
కళ్ళలోకి చూసింది.
మనసు చిగురిస్తోంది. శరీరం మీద అలలు అలలుగా గిలిగింతలు.
"వివరంగా చెప్పాలంటే పెద్ద కావ్యమంత అవుతుంది. టూకీగా చెప్పాలంటే నువ్వు నాకు కావాలి" అని ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా _ "పద మీ పెద్దవాళ్ళతో మాట్లాడదాం" అంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని లోపలకు తీసుకెళ్ళాడు.
* * *
ఆ గదిలో తిరిగి మిత్రబృందమంతా సమావేశమయ్యారు.
గ్లాసులమీద గ్లాసులు ఖాళీ అవుతున్నాయి.
"మూడో రోజుకు దాన్ని నాదాన్ని చేసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆనాటికది మా అన్నయ్య పెళ్ళాం కాబోతోంది. నో! ఇది జరగటానికి వీల్లేదు" అంటూ చేతిలోని గ్లాసు నేలమీద విసిరికొట్టాడు యోగి. పగిలి ముక్కలై గదంతా చెల్లా చెదురుగా పడిపోయాయి.
ఈ పెళ్ళి కాకుండా నే చేస్తాను" అన్నాడు ప్రతాప్ గట్టిగా.
సభ్యులంతా ఆశ్చర్యంగా అతని వంక చూశారు.
"దాన్ని, ఆలం ...ను ముహూర్తానికి ముందే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అక్కడ పెళ్ళి జరగబోయే సమయానికి యిక్కడ ..." అంటూ అప్పటికి అయిదో పెగ్గు పూర్తిచేసిన ప్రతాప్ విరగబడి నవ్వాడు.
16
గేటు తీసుకుని లోపలకు వస్తోన్న ప్రజ్ఞను చూసి, "హాయ్" అంటూ సంతోషంతో లేచి నిలబడి ఎదురుగా వెళ్ళింది తేజ.
దగ్గరకు వచ్చాక ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుని నొక్కింది.
"అబ్బ ! ఎన్నాళ్ళకి ?"
"రాలేకపోయాను."
తేజ ఆమె వంక పరిశీలనగా చూసింది. ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
అప్రయత్నంగా అంది "ఏమిటి? పెళ్ళి కళతో వెలిగిపోతున్నావు?"
"పెళ్ళి చేసుకోబోతున్నాను కాబట్టి."
"కంగ్రాట్చ్యులేషన్స్ ! ఎప్పుడు ?"
"రేపే."
"అరె! అంత త్వరగా ఎందుకలా..."
"మరి ఏం చెయ్యను? పెళ్ళికొడుకు ఊ తొందరపడిపోతున్నాడు. వాళ్ళమ్మగారికి ...అంటే కాబోయే మా అత్తగారికి సీరియస్ గా వుందట. ఏ క్షణంలో ఎలా వుంటుందోనని ..."
"ఎవరా పెళ్ళికొడుకు ?
"మీకు తెలుసు."
"తెలుసా ? ఎవరు చెప్పు."
"డాక్టర్ దయాకర్."
"గుడ్! మంచి సంబంధం కొట్టేశావు" అంది తేజ అభినందనగా.
"అంతా అనుకోకుండా జరిగింది. ఆయన ... ఆయన ... నన్ను ..."
"ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాడు. అవునా ?"
ప్రజ్ఞ సిగ్గుపడుతూ నవ్వింది.
"ప్రజ్ఞా! ఈ క్షణంలో నాకెంతో సంతోషంగా వుంది. నా భావాలు, నా ఆలోచనలు, వివాహ వ్యవస్థమీద నా అభిప్రాయాలు ఎలాగైనా వుండనియ్యిగాక. నువ్వంటే నా కెంతో యిష్టం. నీ జీవితం సుఖ ప్రదంగా జరిగిపోవాలి."
"నా జీవితం సుఖవంతం చేసుకుని తీరతాను. ఆదర్శ దాంపత్య మంటే ఏమిటో యీ యాంత్రిక ప్రపంచానికి చూపిస్తాను" అంది ప్రజ్ఞ చాలా ధీమాగా.
"నేనూ అదే కోరుకుంటున్నాను."
"మీరు నా పెళ్ళికి వచ్చి తీరాలి."
"తప్పకుండా వస్తాను."
* * *
విద్యుల్లతాదేవి చాలా అస్థిమితంగా వుంది. సరిగ్గా ఆ రోజుకల్లా అయిదు లక్షల రూపాయిలూ తీసుకుని ఆశ్రమానికి రమ్మని ఆచార్య జగదీష్ ఆదేశమిచ్చారు. ఆ డబ్బు కోసం భర్తతో చాలా తగవు పెట్టుకుంది. ఎప్పుడూ ఎంతో తేలిగ్గా తీసుకుంటూ, ఆమె ఏం చేసినా వూరుకుంటూ వుండే భర్త యీసారి ఎదురు తిరిగాడు. చేతికి డబ్బు రానివ్వకుండా చూశాడు.
ఓ రకమైన నిస్సహాయ స్థితి ఆమెను ఆవరించసాగింది. ఆడటానికి వెళ్ళింది.
రమ్మీలో ఆమె చాలా ప్రవీణురాలు. ఎన్నోసార్లు లక్షలకు లక్షలు గెలుచుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈ రోజామెను దురదృష్టం వెన్నాడుతోంది. తీసుకెళ్ళిన యాభయివేలూ పోగా పైన యింకో పాతిక వేలు అప్పు పెట్టాల్సి వచ్చింది. తర్వాత అహం, అభిమానం అడ్డొచ్చి లేచి కాదు డ్రైవ్ చేసుకుంటూ యింటికొచ్చేసింది.