సుశీల మరణ వార్త విని ప్రసూన తల్లడిల్లి పోయింది. ఉన్నది ఉన్నట్లుగా లలిత దగ్గర కొచ్చేసింది. అప్పటికి లలిత స్పృహలో లేదు......తెలిసీ తెలియని కోమాలో ఏదేదో కలవరిస్తోంది!
"అమ్మా!" అంది ప్రసూన లలిత దగ్గరగా వచ్చి......
"సుశీ!" అంది ఒక్కసారి లలిత ఆత్రంగా.......
"వచ్చావా, సుశీ! రావేమో అనుకున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోయావనుకున్నాను. ఇంకా బ్రతకట మెందుకనుకున్నాను. వచ్చేసావు.....నాకు తెలుసు! నా సుశీల నన్ను వదలి ఉండలేదు."
ప్రసూన రెండు చేతులు ఆప్యాయంగా పట్టుకుంది. ఏంచెయ్యాలో, ఏం మాట్లాడాలో అర్ధంకాక అయోమయంగా ఉండిపోయింది ప్రసూన......
డాక్టరు ప్రసూనకు ప్రక్కకు పిలిచాడు.
"ఆవిడ ప్రస్తుతం ఏదీ అర్ధం చేసుకునే దశలో లేదు ...... నిన్ను సుశీల అనుకుంటోంది. ఆవిడ బ్రతకాలంటే నువ్వు సుశీలలాగే నటిస్తూ ఆవిడను వదలకుండా ఉండాలి ..... ..... మూడు నాలుగురోజులు కావచ్చు.... ..... వారం రోజులు కావచ్చు........"
"ప్రసూనా! ప్లీజ్!" కన్నీళ్ళతో అడిగాడు సాంబశివం......ప్రసూన వెంటనే ఒప్పుకుంది. తనవల్ల లలిత కోలుకుంటే అంతకంటే కావలసినదేముంది?
దగ్గర దగ్గర వారం రోజులవరకూ ప్రసూన లలిత మంచాన్ని వదలలేదు......లలిత "సుశీ!" అన్నప్పుడల్లా పలికేది.....వేళకు మందులిచ్చేది ...... ఏ రాత్రివేళ లలిత "అబ్బా!" అనుకున్నా గభాలున లేచి కూచుని "ఏం కావాలమ్మా!" అనేది.
లలిత పరిస్థితి కొంచెం మెరుగు పడసాగింది. ఆ రోజు ప్రసూనను తేరిపార చూసింది......
"నువ్వు ఇక్కడ ఎందుకున్నావ్?" అంది......
ప్రసూన మాట్లాడలేదు......
"ఆయన నిన్ను ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడా?" అంది మళ్ళీ......
గతుక్కుమంది ప్రసూన.... .....వెల వెల పోతూ చూసింది......
"చూడు! ఈ ఇల్లంతా నీ యిష్టం వచ్చినట్లు తిరుగు......నా గదిలోకి మాత్రం రాకు!"
పురుగును విదిలిస్తున్నట్లుగా అంది లలిత........
ప్రసూన తల వంచుకొని ఆ గదిలోంచి వెళ్ళిపోయింది......
సాంబశివం దగ్గరకొచ్చి "నేను వెళ్తున్నాను సార్!" అంది.
"అదేం? లలిత ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటోంది......మరికొన్ని రోజులు ఉండలేవూ?"
"లలితగారు కోలుకుంటున్నారు...... అందుకే నన్ను సహించలేకపోతున్నారు......" సాంబశివం ముఖం పాలిపోయింది.
"సరే! వెళ్ళు!"
ప్రసూనకు ఎలాగో అనిపించింది......తను చూపించిన ప్రేమకు ప్రతిఫలం ఇది! కనీసం ఒక థేంక్స్ అయినా లేకపోగా అవమానాలతో వెళ్ళవలసి వస్తోంది.
ప్రసూన వెళ్ళబోతుండగా పని మనిషి వచ్చి "అమ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు" అంది.....
ఒక్క క్షణం తటపటాయించి ప్రసూన లలిత గది లోకి వెళ్ళింది.....
లలిత చాలా నీరసంగా ఉంది కానీ ప్రమాద స్థితి దాటింది.
"అయామ్ సారీ! ఈ వారంరోజులూ నా దగ్గిరున్నది నువ్వే నట కదూ!"
లలిత తనను ఈ మాత్రం గుర్తించటం ప్రసూనకు చాలా సంతోషాన్ని కలిగించింది......చిరునవ్వుతో తన సంతృప్తిని సూచించింది.
"నీ సేవలో ఏదో ఆత్మీయత, అభిమానం ఫీలయ్యాను.....అందుకే సుశీల అని భ్రమపడగలిగాను ...... ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది....."
"ఆశ్చర్యమేముంది? నా మనసులో ఉన్నది నేను చూపించుకోగలిగే అవకాశం వచ్చింది......." "నీకు ఏదైనా బహుమానం ఇయ్యలనుకుంటున్నాను ...... ఏం కావాలో అడుగు....."
ఈ మాటలతో ప్రసూన ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది.
"నా సేవలో ఏదో ఆత్మీయత కనిపించిందని మీరే అన్నారు. దాని మూల్యమెంతో మీరే నిర్ణయించి ఇవ్వండి......"
లలిత కొన్ని క్షణాలు ప్రసూన ముఖం చూస్తూ ఉండిపోయింది.