Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 46

   

        ఇసుక రేణువులో సర్వ ప్రపంచాన్ని, అడవిలో స్వర్గాన్ని చూడగలగడంలోనే సార్ధకత వుందని అనుకుంటే ఈ సమస్యలు మనల్ని ఏ రకంగానూ బాధించవు. కష్టమైనా, సుఖమైనా సమానస్థాయిలో తీసుకోగలగాలి. అంత ఎత్తుకు ఎదగడం మనవల్ల కాదేమో. స్త్రీ తన కాళ్ళమీద తను నిలబడగలగాలి. ఆర్ధికంగానూ, భావాత్మకంగానూ తన ఆలోచనలను, ఆదర్శాలనూ ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆమెకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు. స్త్రీలు అర్ధరాత్రి వేళలో ధైర్యంగా వీధుల్లో తిరగ్గలిగిననాడే మనకు పూర్తి స్వాతంత్ర్యం అన్నాడు మహాత్ముడు. అర్దరాత్రి ఆడది బయటకు తిరగాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు నేటి స్వాతంత్ర్య భారత పౌరుడు. అంటే వీళ్ళ దృష్టిలో చీకటి పడితే బయటకు వెళ్ళాలనే కోరిక కలిగిన స్త్రీలో దురుద్దేశ్యం వుంటుందన్న మాట. అలాంటి సమాజంలో నీ భర్త ఉత్తముడు కాక తప్పదు. నీ ఉత్తరం చదివినంతసేపూ నా కనిపించింది మీ మధ్య 'కమ్యూనికేషన్ గ్యాప్' వుందని నీకు కావలసినదేమిటో అతడి ప్రవర్తన ఎందుకలా వుందో డైరెక్టుగా ఎప్పుడయినా నిలదీసి అడిగావా? ఒక్కసారి మీ విషయం మీరిద్దరూ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మంచిదని నాకనిపిస్తోంది. నా భర్తలా అతడు "నోర్ముయ్ నాకంతా తెలుసు. నువ్వేం చెప్పనక్కర్లేదు" అంటాడనుకోను. అతడితో నువ్వు నిజంగా సుఖపడలేవనీ, విడిగానే నీ అస్థిత్వాన్ని ఋజువు చేసుకోగలవని, ఈ (అ)సభ్య సమాజంలో వొంటరిగా నిలబడి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోగలననే ధైర్యం నీలో వుంటే, వెంటనే బయలుదేరిరా. నీకోదారి చూపించలేకపోను.
   
    పోతే, నీ భర్తలో నువ్వు మార్పు తేవడానికి ప్రయత్నించాలనీ, అదే నీ జీవితానికి ఆనందదాయకమనీ చెప్పను. నీ ఆత్మగౌరవం నాకు నచ్చింది. స్త్రీలలో ఇలాంటి మార్పు రావడం హర్షణీయమే. మగవాడి అహంభావ చితాన్ని అంటించడానికి నువ్వు ఓ సమిధనవుతానంటే వారించను. ఆ పునాదులమీదే ఆకాశాన్నంటే పర్వతాలను నిర్మించాలి. పైకి నిష్కల్మషంగా, చల్లగా కనిపించే మంచుపర్వతం కాస్త కరిగితే నిర్భేధ్యమయిన, దృఢంగా నిలబడ్డ శిఖరం కనిపిస్తుంది. కాస్త ప్రేమకీ, దుఃఖానికీ బాధకీ కరిగిపోవడం మన బలహీనత కాదు. అప్పుడే మన నిజస్వరూపాలు బయటపడేది. మరి ఆలోచిస్తావు కదూ.
                                                                                                                                                                            నీ అనూ".
   
    ఉత్తరం పూర్తిచేసి అచేతనంగా కూర్చుండిపోయింది భార్గవి. ఏవో ఆలోచనలు. స్కూటర్ ఇంటి ముందాగిన శభ్దానికి ఈ లోకంలోకి వచ్చింది. గడియారం నాలుగ్గంటలు చూపిస్తోంది. ఇంత త్వరగా శ్రీరామ్ ఇంటికి రావడం ఎప్పుడూ జరగలేదు. చేతిలో ఫైళ్ళు లేకుండా రావడం మరింత ఆశ్చర్యకరం. వస్తూనే బెడ్ రూమ్ లో మంచంమీద వాలిపోయాడు. భార్గవి ఆశ్చర్యంగా లేచి వెళ్ళి దగ్గరగా నిలబడింది. ఆమె ఆలోచన కనిపెట్టినట్లు "ఒంట్లో బాగోలేదు" అన్నాడతను. చూస్తే జ్వరంతో వళ్ళు కాలిపోతుంది. మరుక్షణంలో అల్మైరాలోంచి టాబ్లెట్లు తీసి, మంచినీళ్ళతో ఇచ్చింది భార్గవి. వేడి కాఫీ చేసిచ్చింది. కాసేపట్లో ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకున్నాడు శ్రీరామ్. భార్గవి భయపడింది. పక్క వాళ్ళబ్బాయిని బ్రతిమాలి డాక్టర్ ని పిలిపించింది. ఆ వచ్చిన జ్వరం వారం రోజులకి కాని తగ్గలేదు. టెంపరేచర్ కొద్దిగా తగ్గగానే ఆఫీసుకి బయల్దేరబోయాడు.
   
    "మీతో కొంచెం మాట్లాడాలి" సీరియస్ గా అంది. అతడు తలెత్తి ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు.
   
    "ఏం మాట్లాడాలి?"
   
    "మన గురించి, మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి".
   
    "దానికి మాట్లాడాల్సిందేముంది?"
   
    "చాలా వుంది. అసలు మాటలు లేకపోవడమే మన సంసారంలో వున్నా బలహీనత. మీకు జీవితంలో బ్యాంక్ చాలా ముఖ్యమయిందే, కాదనను కాని, భార్యగా నేనూ ముఖ్యమే".
   
    శ్రీరామ్ మాట్లాడలేదు. అతడి విషయం తెలుసు కాబట్టి భార్గవి ఊర్కోలేదు. "మన పెళ్ళయి పదేళ్ళవుతోంది. కాని, ఇలా మనం ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నాం. మీ మనసులో ఏమున్నదో నాతో చెప్పరు. నా మనసు విప్పి చెప్పనివ్వరు. అందుకే నేను విసిగిపోయాను. ఆ రోజు మీరు జ్వరంతో ఇంటికి వచ్చిన సమయానికి నేనసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయంలోనే వున్నాను".

    అతడు ఉలిక్కిపడి, "ఎందుకు, ఎక్కడికి?" అని గాభరాగా అడిగాడు.
   
    "ఈ ఇంటిలో నా అవసరం అంతగా లేదనిపించింది. ఉండి మీకిక్కడ భారం అయ్యేకంటే నా దారి నేను చూసుకుంటే మంచిదనుకున్నాను".
   
    "నీ అవసరం లేదని ఎందుకనుకున్నావు? నేను నీకేం తక్కువ చేస్తున్నాను?" అతడి కంఠం బలహీనంగా పలికింది.
   
    "ఆ మాటే అనవద్దంది. తక్కువ చెయ్యటం అంటే మీ ఉద్దేశ్యంలో నా తండ్రిలా కాకుండా కడుపునిండా తిండి పెట్టడం, చీరలు కొనివ్వడం అంతేగా! అవే అయితే నాకు కావలసింది నేను సంపాదించుకుంటాను".
   
    "నేనా ఉద్దేశ్యంతో అనలేదు. ఇల్లు వదిలి వెళ్ళాలనుకునేటంత దుర్మార్గంగా ప్రవర్తించానా నేను".
   
    "అది దుర్మార్గం అవదు. కేర్ లెస్ నెస్ నేను పెళ్ళి చేసుకున్నది మీరు నాకు తిండి పెడతారని కాదు. నాకో మనిషి తోడు కావాలని. మీకూ నా తోడు అవసరం అని చేసుకున్నాను. పెళ్ళికి ముందు మీరు వచ్చి నాతో అంతగా మాట్లాడితే స్త్రీల అభిప్రాయలను గౌరవించే మనిషని మురిసిపోయాను. మీ చెల్లెలి పెళ్ళికోసం మీరు పడ్డ తపన చూసి బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వ్యక్తి అని నా అదృష్టానికి పొంగిపోయాను. కాని, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఒకే ఇంటిలో వుంటున్నాం. మీరు డబ్బు సంపాదిస్తున్నారు. నేను ఇంటిపని చేస్తున్నాను. అంతకు మించిన బంధం మనలో పెరగటంలేదు. ఆఫీసులో నలుగురూ కూర్చుని పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకోరా? జోక్స్ వేసుకోరా? కాని ఇంటిలో ఎందుకలా వుంటారు?"
   
    "చిన్నప్పటినుంచీ నా అలవాటంతే భార్గవీ! ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేను. నా ధ్యేయమేమిటో, దాన్ని చేరుకోవాలనే ఆశ. అంతే అది నన్ను మరో సంగతి ఆలోచించనివ్వదు. అది నా బలహీనతే కావచ్చు. కానీ, చిన్నతనంనుంచీ వున్నదది".
   
    "పెళ్ళి చేసుకుని భార్యతో కాపురం చేయడం చిన్నతనంనుంచీ వచ్చిన అలవాటు కాదు ఏది ఏమైనా ఇక ఇక్కడ వుండడం నావల్ల కాదు. ఇన్నాళ్ళుగా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నానన్న తృప్తితో బ్రతికాను. ఇక ఆ అవసరం లేదు".
   
    "అంటే నాకు డైవర్సు ఇస్తావా?" ఆశ్చర్యంగా అడిగాడు.
   
    "అంత పెడ మాటలెందుకులెండి. నా దారి నేను చూసుకుంటానంతే".
   
    శ్రీరామ్ మాట్లాడలేదు. తనుకూడా ఇక చెప్పవలసిందేమీ లేనట్లు ఆమె అక్కడినుండి వెళ్ళిపోయింది.
   
                         *    *    *

   
    అదృష్టం బావుండి భార్గావికి మెలకువ వచ్చింది.
   
    అప్పటికే అతను నిద్రమాత్రలు మింగబోతున్నాడు. ఆమె అదాటున దగ్గరకెళ్ళి అతడి చేతిని బలంగా గుంజింది. ఇంత పరిణామాన్ని ఆమె ఊహించలేదు.
   
    ఆమెకు దుఃఖం కూడా రాలేదు.
   
    దిగ్భ్రమ, అంతే.
   
    శ్రీరామ్ ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.
   
    అతడామె ఒళ్ళో తల పెట్టుకుని చాలాసేపు ఏడ్చాడు. ఆమెకు అనూరాధ మాటలు గుర్తొచ్చాయి. మంచు కరిగితే కానీ పర్వత స్వరూపం తెలీదు. అతడి కాంప్లెక్సులు పోయి సేద తీరుతున్నాడు.
   
    ఆమె వారించలేదు. ఓదార్చలేదు.
   
    భూమాత సూర్యుడిని తూర్పునించి ఒడిలోకి తీసుకునేవరకూ అలాగే కూర్చుంది.
   
                             *    *    *
   

    భార్గవీ! గతాన్ని తలచుకుంటే నా ప్రవర్తన నాకే లజ్జాకరంగా అనిపిస్తోంది. ఆ రోజు జ్వరంతో నేను త్వరగా ఇంటికి వచ్చినరోజు గుర్తుందా? చాలా ఆశ్చర్యంగా చూశావు నావైపు. ఆఫీసులో అందరూ ఎప్పుడూ నన్ను ఎగతాళి చేస్తారు. "ఈయన త్వరగా ఇంటికి వెళితే గుర్తుపట్టరు" అని ఒకరు. "అసలింటిలోకి రానివ్వరు" అని మరొకరు.... నీ చూపులో అదే భావం కనిపించేది. నాన్నగారిని కూడా చాలా అశ్రద్ద చేశాను కదూ. నా ప్రవర్తనకు ఆయనెంత కుమిలిపోయారో చిన్నతనం నుంచీ ఆయన నా కోసం పడ్డ కష్టానికి, ఆయనకీ ఎలాంటి శ్రమ కలిగించకూడదనుకున్నాను తప్ప ఒక్క మంచి మాట ఆయనకు మరింత తృప్తి నిస్తుందన్న విషయాన్ని మర్చిపోయాను. అక్కకూ, చెల్లెలికీ అన్నీ సవ్యంగా చేసి పెడితే ఆయన తృప్తి పడతారనుకున్నాను. కాని మధ్యలో నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాననీ, నీ బాధ్యత కూడా నాదేనని పూర్తిగా మర్చిపోయాను. నువ్వు ఈ షాక్ ఇచ్చేవరకూ నేను నీ మీద ఎంత ఆధారపడి వున్నానో తెలియదు. నేను చాలా బలహీన మనస్కుడిని. ఈ ఆత్మహత్యా ప్రయత్నమే దానికి ఉదాహరణ. నువ్వన్నది నిజమే భార్గవీ. సద్విమర్స ప్రతి మనిషికీ చాలా అవసరం పడుకోబోయేముందు ఒక్కసారి ఆ రోజు గురించి ఆలోచిస్తే ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది. తప్పకుండా...."
   
    సూర్యుడు పూర్తిగా పైకి వచ్చాడు.
   
                                                  *    *    *

 Previous Page Next Page