నా భర్త ఓ బ్యాంక్ ఆఫీసర్. డబ్బు సంపాదించడం అతడి డ్యూటీ. నా పెళ్ళయిన అయిదేళ్ళూ కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలోనే మునిగిపోయింది. పక్షవాతంతో మంచానపడ్డ మామగారు మూడేళ్ళు అదే స్థితిలో వున్నారు. ఆడపడుచులిద్దరూ నెలకోసారైనా తండ్రిని చూడాలన్న నెపంతో వచ్చి వెళ్ళేవారు. అన్ని అవయవాలు సవ్యంగా వుండే పక్షవాతపు రోగుల్లా ప్రవర్తించేవారు. నా కష్టాన్ని అర్ధం చేసుకున్నది ఆ ఇంట్లో మంచానపడ్డ ఆ మామగారే. ఒకరిమీద ఆధారపడకుమా స్వయంకృషితో అరవయ్యేళ్ళు గడిపిన వ్యక్తి ఒక్కసారిగా పరాధీనుడైతే ఎలాంటి వ్యధ అనుభవిస్తాడో ఆయన్ని చూసి అర్ధం చేసుకోగలిగాను. వారున్న రెండేళ్ళలో నాతో మనసు విప్పి చెప్పుకునేవారు. ఆ తర్వాత కళ్ళతోటి తన బాధ వ్యక్తం చేసేవారు. ఆయనంత బాధపడుతూంటే నా భర్తకు దగ్గర కూర్చుని నాలుగు అనునయ వాక్యాలు చెప్పే టైం దొరికేది కాదు. తన ఉద్యోగం, తన బ్రాంచి-ఇవే ఆయన ధ్యేయాలు. కన్నతండ్రి బాధే అర్ధం చేసుకోలేని వ్యక్తి నన్నెలా అర్ధం చేసుకుంటాడో ఊహించుకో.
మామగారు పోయారు. ఖర్చు తగ్గింది.
మా యింట్లో కొత్త ఫర్నిచర్ వెలసింది. పదిమందిలో స్టేటస్ పెరిగింది. శ్రీరామ్ కి నాకూ మధ్య దూరం కూడా పెరిగింది. రావలసిన ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలియదు కాని శ్రీరామ్ కాంప్లెక్సు మరింత పెరిగింది. నాతో మాట్లాడటం పూర్తిగా తగ్గిపోయింది. తనను మంచి స్పిరిట్ లో పెట్టటానికి అంత క్రుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పటానికి ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది ఏదో భోజనం చేశాననిపించుకోవడం, నిద్రపోవడం.....పగలంతా ఇంట్లో ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక పిచ్చిదానిలా అటూఇటూ తిరగడం ఇదీ నా దినచర్య. జీతం వచ్చినరోజు ఇచ్చిన డబ్బుతో నెలంతా గడుస్తుంది. కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరమూ రాదు.
పుట్టింట్లో లేని ఆర్ధిక స్వాతంత్ర్యం చేతికి వచ్చింది. అంతకు మించిన మార్పు ఏదీ లేదీ జీవితంలో పెళ్ళయిన ఇన్నేళ్ళలో నన్ను సంతోషంగా బయటకు తీసుకెళ్ళిందీ లేదు. నవ్వుతూ ఓ గంట కబుర్లు చెప్పిందీ లేదు. ఇంటిలో ఓ పనిమనిషిలా ఎంతకాలం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? స్త్రీ జీవితం ఇంతే అయితే నాకీ జీవితం వద్దు. ఆత్మహత్య చేసుకుంటాను. లేదా మరెవరి ఇంటిలోనయినా చాకిరీ చేసుకుంటాను. ఎవరయినా ఇంత ముద్ద పడెయ్యకపోరు. అటు తల్లిదండ్రులకీ, ఇటు భర్తకీ నేనవసరంలేదు. చుట్టుప్రక్కల వాళ్ళంతా చూసే జాలి చూపులకి తట్టుకునే ధైర్యం నాకు లేదు.
బాగా అలసిపోయాను అనూ. ఈ రకమయిన జీవితం గడపడం నావల్ల కాదిక. నాలాంటి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చే సంస్థలు హైదరాబాద్ లో చాలా వుంటాయి. వాటి వివరాలు కనుక్కొని నాకు రాస్తే వచ్చేస్తాను. ఎక్కడున్నా ఇంతకంటే సంతోషంగా బ్రతకగలనని నమ్మకం నాకుంది. దయచేసి నా కోసం శ్రమ తీసుకొని ఈ సహాయం చేసిపెట్టు. నీ ఉత్తరం అందంగానే వచ్చేస్తాను.
నీ
భార్గవి".
పోస్టు డబ్బాలో వేసి వచ్చిందేకాని, భార్గవి మనసు మనసులోలేదు. 'నువ్వు కదలకుండా కూర్చుంటే నీకు కావలసిన పనంతా దానికదే జరిగిపోతూండటమే ఆటోమేషన్. అయితే... దానికి మరో పేరు స్త్రీ' అన్నాడో రచయిత. భర్త ఎలాంటి వాడయినా సమర్ధిస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ పడుండే శాల్తీయే భార్య అనుకుంటారు. ఈ మగాళ్ళకి తగిన బుద్ది చెప్పాలంటే ఎదురుతిరగడం ఒక్కటే మార్గం.
రాత్రి పొద్దుపోయాక శ్రీరామ్ స్కూటర్ చప్పుడు వినిపించినా భార్గవి కదల్లేదు. కొద్దిసేపటి తర్వాత వెదుక్కుంటూ వచ్చాడామెకోసం. "ఇక్కడ కూర్చున్నావా? ఆకలిగా వుంది భోజనం పెట్టు, పనిచేసుకోవాలి" అన్నాడు నీర్సంగా.
"నేనేం చేయలేను, చేసే ఓపికలేదు" అంది కూర్చున్న చోటినుంచే ఆశ్చర్యంగా ఆమెవైపు చూసి లోపలకు వెళ్ళిపోయాడు. కొంచెం సేపాగి, లోపలకు వెళ్ళి పడుకుంది.
ఉదయం లేచేసరికి శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
సరిగ్గా పదిరోజుల్లో వచ్చింది జవాబు. ఆత్రుతగా విప్పింది భార్గవి. చాలా పెద్ద ఉత్తరమే రాసింది అనూరాధ.
"భార్గవీ!
నేనేం వ్రాశానో చదవాలని చాలా ఆత్రుతగా వుందికదూ ఇంత పెద్ద ఉత్తరంలో ఏముందోనని తొందరపాటుతో గబగబా చదివెయ్యకు. మనసు ప్రశాంతంగా నిలుపుకుని నిదానంగా చదువు. అంతా చదివాక బాగా ఆలోచించు ఓ నిర్ణయాన్ని తీసుకో నీ నిర్ణయం ఎలాటిదైనా నేను సంతోషిస్తాను. కాని నా కోరిక ఒక్కటే. నీలో నా ఆలోచన అంతర్మధనం కావాలి. ఆ మధనంలోనే ఫలితం నిర్ణయింపబడాలి.
నువ్వన్నట్లు భావనా ప్రపంచంలో విహరిస్తూ ఎన్నెన్నో కలలు కన్నాము. మన జీవితం మన చేతిలోనే వుందనీ, దాన్నెలా మలచుకోవాలో ఆత్మవిశ్వాసం పైనే ఆధారపడి వుంటుందని మనందరం నమ్మాము. రెక్కలు టపటపలాడించుకుంటూ తన ఇష్టం వచ్చిన దిక్కులో ఎగురుతూ పోతుంది పక్షి. నీటిలో తిరిగే చేప ఆరులు మార్చుకుంటూ సరదాగా పయనిస్తుంది. హోమోసేపియస్ స్టేజినుంచి వేలతరాల ముందున్న ఈనాటి తరంలో స్త్రీలమైన మనం వేసే ప్రతి అడుగూ ఆలోచించి వేయాల్సిందే ఏ అడుగు మనల్ని ఏ రొంపిలోకి దింపుతుందో తెలియని హీనస్థితిలో వున్నాం.
నీకష్టం ఏమిటో విపులంగా వివరించావు. నీ పరిస్థితిని ఓ స్నేహితురాలిగానే కాకుండా ఓ స్త్రీగా కూడా పూర్తిగా అర్ధం చేసుకోగలిగాను. నీ భర్త ఎదుట కనిపిస్తే కాలరు పట్టుకుని, 'నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావసలు?' అని నిలదీయాలనిపిస్తుంది ఎవరికైనా. కాని, నీ ఉత్తరం నాలో అలాంటి ఆవేశాన్ని కలిగించలేదు. కారణం ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు నాకథవినాలి. నీ చుట్టూ వున్న ప్రపంచంలో వున్న అనేకమంది స్త్రీల చరిత్రలు వినాలి. మన స్నేహబృందం కలుసుకునే సమయానికి నేనీ లోకంలో వుంటానో వుండనో తెలియని పరిస్థితిలో వున్నాన్నేను.
కంగారుపడకు. పూర్తిగా చదువు. నేను ప్రేమించాను. ఆ ప్రేమించడం మామూలుగా కాదు. అతి గాఢంగా, తల్లిదండ్రులను ఎదిరించి అప్పటికప్పుడు ఇల్లు వదిలి వచ్చేంత తీవ్రమయింది నా ప్రేమ. శాస్త్రబద్దంగా వివాహం చేసుకున్నాం. నేను అతడి చదువూ, అందమూ, ఉద్యోగమూ చూడలేదు. నా మనసుకు నచ్చాడు. అతడితో సుఖపడగలననే నమ్మకంతో అంతవరకు వెళ్ళాను. కాని కొద్దిరోజుల్లోనే నాకో భరించలేని నిజం తెలిసింది. అతడికి నా చెల్లెలు తోటే సంబంధం వుందనీ, చాలా కాలంగా నడుస్తోందనీ!! నా ప్రేమ ఎంత గుడ్డిదయిందీ తెలిసి వచ్చింది. "ప్రేమ వివాహాలన్నీ అంతేననీ, తొందరపాటులో తీసుకునే నిర్ణయాలనీ" విమర్శకులనే మాట నిజమనిపించేలా చెయ్యకూడదనీ, తల్లిదండ్రుల దగ్గిర చులకన కాకూడదనీ మనసుని దిటవు పరచుకుని అతడితో కలిసి జీవంచడం నేర్చుకున్నాను! ఈ రోజు నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా భర్త ఇంటిలోంచి బయటకి వెళ్ళడు. ఉద్యోగం లేదు.. కాదు.. చెయ్యడు. అతడి తల్లి, తోబుట్టువుల బాధ్యత నాది! నాకూ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ బాధ్యతా నాదే. ఈ మూడుతరాల జనాన్ని పోషించడం కోసం నేను అహర్నిశలూ కష్టపడతాను. పైగా ఇంటికి వచ్చి మర్నాడు ఆఫీసుకు వెళ్ళేవరకూ చివాట్లు తింటాను. నా సంతానం మీద ఎవరికీ అభిమానం లేదు.
భార్గవీ, డబ్బు సంపాదిస్తాను. ఖర్చు పెట్టుకునే స్వేచ్చలేదు. పిల్లలను కన్నాను. వాళ్ళను యిష్టప్రకారం పెంచలేను. పేకాట ఆడి తూలుతూ వచ్చే భర్తనే వ్యక్తిని భరించక తప్పదు.ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బంధం చావకుండా బ్రతికిస్తోంది. అదీ నా జీవితం. ఒక్కసారి మన ఇద్దరి బతుకులనీ పోల్చిచూడు. నా పెద్ద గీత ముందు నీది చాలా చిన్న గీతై పోలేదూ? నీ భర్త వేళకు ఇంటికిరాడు. నిన్ను సినిమాలకూ, షికార్లకూ తీసుకెళ్ళడు. సరదా కబుర్లు చెప్పడు. ఇవన్నీ భరించలేని విషయాలే కాదనము. కాని అతడిలో ఎలాంటి దుర్గుణాలూ లేవు. ఓ సిగరెట్టయినా ముట్టుకోడు. మత్తు పదార్ధాల జోలికి పోడు. రేసుకోర్సు ఎక్కడుందో తెలియదు. పేకాట ఆడడమే రాదు. ఇవన్నీ అతడిలో 'ఎస్సెట్స్' అనుకోవచ్చు.
నీకంటే నేను ఎక్కువ ప్రపంచాన్ని చూశాను. మా ఆఫీసులో చాలామంది స్త్రీలున్నారు. నేనెవ్వరితోటి మాట్లాడను. కాని వాళ్ళమాటలు వద్దన్నా చెవుల్లో పడుతుంటాయి. "మా ఆయనేమిటో అయిదయేసరికి ఠంచనుగా ఇంటికి వచ్చేస్తారు. సేల్సుటాక్సు డిపార్టుమెంటుకదా కాస్త 'పైపని' చూసుకోకూడదా అంటే నచ్చదు. వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వెళితే టీవీలు, ఫ్రిజ్ లు, కొందరిళ్ళలో ఏ.సి.లు కూడా వుంటాయి. ఈయనేమో సాయంత్రం అయ్యేసరికి నేను ఎదురుగా వుండాలి" అని వాపోతుంది నా పక్క సీటమ్మాయి. ఓ రోజు ఒళ్ళు కాలిపోయే జ్వరంతో వచ్చిందో అమ్మాయి. ఎందుకొచ్చావంటే మా "ఆయనకు లీవు దొరకలేదు" అంది. అదేమిటంటే అంతేనట. ఆయన... పర్మిషన్ వుంటే తప్ప లీవు పెట్టకూడదు. ఆయనింట్లో వున్నప్పుడే ఆమె ఇంట్లో వుండాలి. ఇవన్నీ ఆఫీసులో పనిచేసుకునే స్త్రీల సమస్యలు అనకు. ఇళ్ళలో వుండే వాళ్ళ సమస్యలు మరో రకంగా వుంటాయి. కష్టపడి సంపాదించుకువస్తాను కాబట్టి తన భార్య తన బానిసలా బ్రతకాల్సిందే అంటాడు అటుపక్కాయన. "ఇవ్వాళ వంకాయకూర చెయ్యమంటే బీరకాయ చేశావని ఓ రోజు కొడితే, సాయంత్రం నేను వచ్చేవేళకు తయారయి కూర్చున్నావు. ఎవ్వరికోసం?" అని రెండోరోజు కొడతాడు ఇటు పక్కింటాయన. ఆమె దెబ్బలు తినని రోజుండదు. అతడికి అహాన్ని పోషించుకోవడం కోసం ఓ చిన్న కారణం చాలు. వీళ్ళందరితోనూ పోల్చి చూస్తే నీ భర్త చాలా ఉత్తముడు. అతడికి ఆఫీసు ఓ అబ్సెషన్ అంతే. అంతకుమించి అతడేం దుర్మార్గుడు
కాదు.