"మీరు పిలుస్తున్నారని చెబితే హడలిపోయింది. తన సంగతి మీ కెందుకు చెప్పానని, ఆవిడ నన్ను చీవాట్లు వేయడానికి కాకపోతే ఎందుకు పిలుస్తుందని ఏడ్చేసింది. ఇక్కడేమీ అవమానం జరగదని హామీ ఇచ్చి బలవంతంగా తీసుకువచ్చాను."
"ఎందుకు పిలిచానో చెప్పలేదా."
"ఉహుఁ. మీ నోటినుండి వింటేనే బాగుంటుందని. ఒక్కసారిగా సర్ప్రైజ్ చేయాలని."
"రా, మీనాక్షి. ఇలాకూర్చో. ఈ రోజే పాప నీ సంగతి చెప్పింది. నువ్వువేసిన తప్పటడుగు గురించి నేనేం సంజాయిషీ అడగను. వయసు పరవళ్ళకి చదువు, వివేకం నిలువవని నాకు తెలుసు. భాగస్వామిగా మా అజయ్ కూడా ఉన్నాడు. నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళక్కరలేదు. వీలైనంత త్వరలో అజయ్ తో నీ పెళ్ళి జరిపిస్తారు." నెమ్మదిగా చెప్పింది సువర్చల.
"ఆయన ఒప్పుకున్నారా?" ఎర్రబడిన కళ్ళెత్తి విస్మయంగా చూసింది మీనాక్షి.
"ఒప్పిస్తాను."
"ఒప్పుకొంటారో లేదో? నా సంగతి నలుగుట్లోపడి ఆయన ఒప్పుకోకపోతే?...మా వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళ గడపకూడా ఎక్కనివ్వరు." మళ్ళీ ఎర్రటి కళ్ళలో నీళ్ళు నిండుకు వచ్చాయి.
"ఇంత జరిగాక నువ్వు గుట్టుగా ఎలా ఉండగల ననుకొన్నావు?"
"గుట్టురట్టుకాకముందే నేను....నేను ఆత్మహత్య చేసుకోవాలను కొన్నాను."
"మరి పాపకి ఎలా తెలిసింది ఇది?" ఆశ్చర్యపోయింది సువర్చల.
"అజయ్, మీనాక్షి హోటల్ కి వెళ్ళడం, బస్ స్టాపుల్లో సైగలు చేసుకోవడం నేను రెండు మూడుసార్లు చూశాను, ఆంటీ నాకప్పుడే అజయ్ మీద అనుమానం వచ్చేసింది. మొన్న మా ఫ్రెండ్ మాట్లాడాలని పిలిస్తే హోటల్ కి వెళ్ళాను. అజయ్ తో బయటికి వచ్చింది మీనాక్షి. అజయ్ విసురుగా, కోపంగా టాక్సీపిలిచి ఎక్కి వెళ్ళిపోయాడు. మీనాక్షి రెండడుగులు వేసి పడిపోయింది. అక్కడున్న అందరం గుమిగూడాం. ఎవరో నీళ్ళు ముఖంమీద చల్లి సేదదీర్చారు. ఇంటివరకు దిగబెట్టివస్తానని ఆమెతో బయల్దేరాను. 'నీకు అజయ్ వాళ్ళు బాగా తెలుసుకదూ? మీ అజయ్ ఎంత అన్యాయం చేశాడో చూశావా?' అని, జరిగిందంతా చెప్పింది. 'మనసు పట్టలేక చెప్పాను. మొదటి శ్రోతవి నువ్వే. ఎవరితో చెప్పొద్దు. రేపు నేను చస్తే మీ అజయ్ చేసిన అన్యాయానికి నువ్వు సాక్షిగా ఉంటావు' అని వేడుకొంది"
"అజయ్ నిన్ను పెళ్ళిచేసుకోకపోయినా నీకీ ఇంట్లో కోడలి స్థానముంటుంది. నీకు రక్షణ కవచంలా నేనుంటాను. ఆలోచించుకో, ఇక్కడ ఉండిపోతావో, వెళ్ళిపోతావో?"
రాత్రి ఎనిమిదిగంటలయింది.
భోజనానికి క్రిందికివచ్చిన అజయ్ డైనింగ్ టేబిల్ దగ్గర ఉన్న మీనాక్షినిచూసి ఒకక్షణం కొయ్యబారినట్టుగా నిలబడిపోయాడు.'మమ్మీ అన్నంతపనీ చేసిందన్నమాట' అనుకొన్నాడు గాబరాగా. గిర్రున వెనుదిరిగి పైకి వెళ్ళిపోయాడు.
ప్రొద్దుటే బ్రీఫ్ కేస్ తో దిగాడు. "నేను హోటల్లో ఉండడానికి వెడుతున్నాను. ఆవిణ్ణి పంపించేశాక వస్తాను." అని చెప్పి వెళ్ళిపోయాడు.
కొడుకు కాళ్ళు చేతులు విరిచి ఇంట్లో కూర్చోబెడదామనిపించింది సువర్చలకి. ఇది తన మొదటి పరాజయమా అనుకొంది. 'అందరూ నవ్వేపని చేశానా? ఏంలేదు. ఆపదలోఉన్న అమ్మాయిని ఆదుకొన్నాను." అని తను చేసిన పనిని సమర్ధించుకొంది.
16
రఘురామయ్య వచ్చారు రెండురోజుల తరువాత.
కోడలి గృహప్రవేశం, కొడుకు గృహత్యాగం అన్నీ తెలిశాయి.
"నువ్వు మంచిపని చెయ్యలేదు, సువర్చలా." అన్నారు చిరాకుగా ముఖంపెట్టి.
"మంచిపనికాదా?" ఈ విషయంలో భర్త విరోధిస్తాడని ఎంతమాత్రం ఊహించని సువర్చల కొంచెం దెబ్బతిన్నట్టుగా అడిగింది.
"ఆడపిల్ల చెడిపోతే ఆ చెడిపోయిన వాడితోనే దాని జీవితం ముడి పెట్టినట్టుగా నువ్వు అజయ్ విషయంలో చేశావు. మగపిల్లాడుకదా? ఇలాంటి విషయాలలో హద్దుల్లో పెట్టాలనుకోవడమంత హాస్యాస్పదం మరొకటి ఉండదు."
"మగవాడు మగవాడిని సమర్ధించక ఏం చేస్తాడు అనుకోనా?" సువర్చల ఉక్రోషంగా అడిగింది.
"ఒక్కసారిగా మనకున్న సాంఘిక వ్యవస్థకు ఎదురు తిరిగి గెలవలేవు. ఆడపిల్ల తప్పుచేస్తే ఆ ఇంటి పరువు పోవడం ఎంత మామూలో మగపిల్లాడు తప్పుచేస్తే ఆ ఇంటి గౌరవం చెక్కుచెదరకుండా ఉండడం అంత మామూలు. ఈ సందర్భంగా మీనాక్షి తల్లిదండ్రులు తలదించుకోవాలిగాని మనం తలదించుకోనక్కరలేదు. కాని, నువ్వు చేసిన పనివల్ల ఆ పరిస్థితి వచ్చేట్టుంది. కొడుకు తప్పుచేశాడని అతడిని వ్యభిచారిగా ఈ సమాజం ముందు నిలబెట్టడం, అతడి దోషానికి శిక్ష విధించాలనుకోవడం హాస్యాస్పదకాక మరేమిటి? ఆ పిల్ల ఇంట్లో తిష్ఠవేసింది. వీడు ఇల్లోదలి పారిపోయాడు. చూడు చూడు ఎంతబాగుందో? ఎంత నవ్వులపాలు అవుతుందో మనకుటుంబం."
"ఆపిల్ల జీవితం గురించి మీరేమీ ఆలోచించడం లేదన్నమాట."
"ఈ సమాజంలో పరువుగా, మర్యాదగా బ్రతకాలంటే మనిషి పాటించాల్సిన కొన్ని నియమాలు, నిబంధనలూ ఉన్నాయి వాటిని అతిక్రమిస్తే, అతిక్రమించినవాళ్ళే అనుభవించాలి పరిణామాన్ని."
"మీ కొడుకూ, ఆ అమ్మాయీ చేసింది ఒకేతప్పు. శిక్షమాత్రం ఆ పిల్లకేనా?"
"మన సాంఘిక వ్యవస్థలో ఉన్న న్యాయం అదే చెబుతుందిగా?"
"ఈ వ్యవస్థ ఆడదాన్ని ఎంత అన్యాయం చేస్తుంది! ఆడదాన్ని ఎంత హీనపరుస్తూంది. దీన్ని నామరూపాల్లేకుండా చేసి క్రొత్తవ్యవస్థను రూపొందించకపోతే మేం సాధించిన ప్రగతికి అర్ధమేమైనా ఉంటుందా? స్త్రీ పురుషులకు సమాన న్యాయం పంచే క్రొత్త వ్యవస్థ కావాలి మాకు."