Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 46

   
        
    బొంబాయికి స్నేహితులతో ఎక్స్ కర్షన్ కానీ బయలుదేరింది సుశీల......అటునుంచి అటే శేఖర్ తో వెళ్ళిపోవాలని ప్లాన్.  
    బొంబాయి ప్రయాణానికి అన్నీ స్వయంగా సర్దుతోంది లలిత. తల్లిని చూడగానే సుశీలకు దుఃఖము ఆగలేదు___ డబ్బుకు ఆశపడాలేదు, కోరాలేదు. తనకోసము కేవలం తనకోసం మనసును చంపుకొని బ్రతుకుతుంది. తనకోసము కాకపోతే ఆవిడ మనసుకు ఇష్టము లేని పనిని చేయించడము ఎవరి వల్లా అయ్యేదికాదు. అలాంటి తల్లి తను దూరమయ్యాక ఎలా బ్రతుకుతుంది? లలితను కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సుశీల. "ఏమిటి సుశీ!? ఎక్కడకో శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్లు బాధపడుతున్నా వేమిటి? ఇదివరకు ఎన్ని సార్లు స్నేహితులతో వెళ్ళలేదు? రాలేదు?"    ఏం లేదమ్మా!" అంటూ కళ్ళు తుడుచుకుంది సుశీల___సుశీల ముఖము చూసిన లలితకు ఎలానో అనిపించింది. "పోనీ అంత బెంగగా ఉంటె వెళ్ళకు__" అంది.    
    కంగారుపడింది సుశీల__    
    "ఆహా! నేను వెళ్ళి తీరాలి!" అంది.    
    బొంబాయి వెళ్ళబోయే ముందు హోటల్ కి వెళ్ళి తండ్రిని కలుసుకుంది సుశీల.    
    "నాన్నా! నీకు ఏదైనా బహుమానము ఇస్తాను. నీకేది ఇష్టమో చెప్పు......"    
    "నీకంటే నాకు ఇష్టమైనదేముందీ?"    
    "అలాకాదు! చెప్పు?"    
    "ఆల్ రైట్! నీ ఫోటో ఉంటె ఇయ్యి....." నవ్వుతూ అన్నాడు సాంబశివం.    
    అమాయకంగా నవ్వుతున్న సాంబశివాన్ని చూస్తూ కన్నీళ్లు నిగ్రహించుకోవటం కష్టమైంది సుశీలకి.    
    తన పాస్ పోర్టు సైజు ఫోటో తీసి సంతకంచేసి తండ్రికి ఇచ్చింది. అది జాగ్రత్తగా తన డైరీలో దాచుకున్నాడు సాంబశివం.
    సుశీల బొంబాయి చేరుకున్న మరునాడే పోలీస్ డిపార్టుమెంట్ నుండి ట్రంక్ కాల్ వచ్చింది సాంబశివానికి.    
    "టాక్సీలో వెళుతున్న యువతీ యువకులిద్దరూ అతి దారుణంగా హత్యా చెయ్యబడ్డారు. యువతి మీ కుమార్తె అని ఆధారాలబట్టి అనుమానింపబడుతోంది. మీరు వెంటనే వచ్చి గుర్తించండి_"    
    పోలీస్ డిపార్టుమెంట్ నుండి ట్రంక్ కాల్ వచ్చింది సాంబశివానికి. అవతలివైపు కంఠం వింటూనే గడ్డ కట్టుకుపోయాడు సాంబశివం.....    
    "అయామ్ సారీ సాంబశివం. మన నీతికి స్వపరభేదం లేదు. ఒకసారి మన రాకెట్ లోకి వచ్చిన వ్యక్తి ప్రాణాలతో బయటబడటానికి వీల్లేదు-నువ్వు ముందుగానే జాగ్రత్త పడవలసింది......"    
    ఇంకా గుర్తించవలసిన అవసరమేమీ లేకుండానే ఆ వ్యక్తి సుశీల అని అర్ధమయిపోయింది. హంతకులను పోలీస్ డిపార్టు మెంట్ కనిపెట్టలేకపోవచ్చు......కానీ ఎవరో సాంబశివానికి రూఢిగా తెలుసు-కానీ.....కానీ....ఏమీ చెయ్యలేదు.    
    భరింపరాని శోకంతో తల్లడిల్లిపోతున్న లలితను తీసుకుని ఎలాగో బొంబాయి చేరుకున్నాడు సాంబశివం.    
    ఖండఖండాలుగా నరకబడివున్నారు, సుశీల, శేఖరం .... సుశీల వస్తువులన్నీ రక్త సిక్తాలయ్యాయి. వీటి మధ్య ఎర్రగా భయంకరంగా మెరుస్తోంది. తల్లిదండ్రుల మధ్య ఉన్న సుశీల ఫోటో.    
    ఆ దృశ్యం చూడలేక స్మృతి తప్పి పడిపోయింది లలిత. ఆ ఫోటో చేతిలోకి తీసుకుని పిచ్చి చూపులు చూశాడు సాంబశివం. ఆ దంపతులను ఎలాగో ఇంటికి చేర్చారు.    
    స్మృతి రాగానే లలిత మొట్టమొదట అడిగిన ప్రశ్న ...... "నిజం చెప్పు. సుశీల అ ఆమధ్య రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చేది. నీతో పార్టీలో ఉన్నానని అనేది. నువ్వూ 'అవును' అనేవాడివి......నిజమేనా?"    
    వల్లమాలిన కసితో రగులుకుపోతున్న లలితకు సాంబశివాన్ని మన్నించాలని కూడా అనిపించలేదు.    
    సాంబశివం తలవంచుకున్నాడు.    
    "దుర్మార్గుడా! నామీద కసి తీర్చుకోవాలని అనుకున్నవే కాని దానివల్ల కలిగే ఫలితాలను ఊహించలేక పోయావు..... నన్ను ఏడిపించి ఆనందించాలనుకున్నావు. ఆనందించు.....బాగా ఆనందించు. నీ ఆనందాన్ని చూసి నేనూ ఆనందిస్తాను......"    
    విరగబడి నవ్వింది లలిత......అలా నవ్వి నవ్వి మళ్ళీ స్మృతి తప్పి పడిపోయింది.

 Previous Page Next Page