కాళ్ళూ.... చేతులూ..... నడుం.....భుజాలు..... ముఖం..... పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది మోహిత. అర్థంకాక, చూస్తున్నాడు మైత్రేయ.
పది నిమిషాలు...... పదిహేను నిమిషాలు....
"మోహిత..... ఇంకా ఎంతసేపు....? ఒడ్డుకిరా....." అరిచాడు మైత్రేయ.
జవాబు లేదు.
"మోహితా!" గట్టిగా అరిచాడు.
జవాబు లేదు.
గబగబా ఆమె మునిగినచోటు దగ్గరకు పరుగెత్తాడు...... అక్కడ మోహిత లేదు.
"మోహితా..... మోహితా...... మోహితా....." నీళ్ళలో కలయ తిరుగుతున్నాడు పిచ్చివాడిలా అరుస్తూ.
ఎక్కడా మోహిత జాడలేదు.
చెరువు ఒడ్డు వెంబడి అరుచుకుంటూ పరుగెడుతున్నాడు. దూరంగా నీళ్ళల్లో తేలుతున్న వ్యక్తి......
పరుగు పరుగు వెళ్ళాడు. పెనుకెరటం ఉధృతికి నీళ్ళల్లో సుడులు తురుగుతున్న వ్యక్తి.....
మోహితా...... మోహితా.... బలంగా ఆ వ్యక్తిని పట్టుకుని గుండెలకి హత్తుకుని ఒడ్డుకి తీసుకొస్తున్నాడు.
అంతా చీకటి.... చీకటి....
ఇసుక దిబ్బలమీద ఆ వ్యక్తిని పడేసి "మోహితా!" అంటూ ఆమె ముఖంలోకి చూశాడు.
ఆ వ్యక్తి ఇందు.
సత్యమా....? స్వప్నమా? ఎక్కడో వుండే ఇందు, ఇక్కడ చెరువులో తేలడం ఏమిటి?
"ఇందూ.... ఇందూ.....?" ఆమె తలను ఒడిలో పెట్టుకుని పిలిచాడు మైత్రేయ.
ఆ పిలుపుకి ఆశ్చర్యపోతూ మెల్లగా కళ్ళు విప్పింది ఇందు.
ఆమెకంతా అయోమయంగా వుంది.
"బా.....వా...." పెల్లుబుకుతున్న దుఃఖంతో మైత్రేయను చుట్టేసింది ఇందు.
పది నిమిషాలు గడిచాయి.
నిశ్శబ్దంగా ఇసుక దిబ్బమీద కూర్చుని చెరువులోని అలవేపు చూస్తున్నాడు మైత్రేయ.
మోహిత మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. అతని కళ్ళవెంట కన్నీటి ప్రవాహం. అతని కన్నీళ్ళ వెనక బాధ ఏ మాత్రం అర్థంకాని ఇందు, అతని ముఖంలోకే చూస్తోంది.
కొన్ని సంఘటనలు విచిత్రంగా వుంటాయి. మరికొన్ని సంఘటనలు అనూహ్యంగా వుంటాయి. కొన్ని సంఘటనలు మానవాతీతంగా వుంటాయి. నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన మోహిత, ఏ దూరతీరాలకు వెళ్ళిపోయిందో తెలీదు....... దూరతీరాలకు వెళ్ళిపోవాలనుకున్న ఇందు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, అతని చేరడంకోసం నరకయాతనలు అనుభవించిన ఇందు..... మైత్రేయ చేతులకే చిక్కడం మానవాతీతమైన అద్భుతం కాదా?
ఆత్యహత్య చేసుకునేందుకు శ్రీ దత్త సచ్చిదానంద ఆశ్రమానికి దగ్గర్లో వున్న వాగులో దూకిన ఇందు వాగు ప్రవాహానికి కొట్టుకొచ్చి మైత్రేయ, మోహిత కూర్చున్న చెరువులో పడటం నిజంగానే అద్భుతం......
"ఇక్కడికెలా వచ్చావ్? ఎవరికోసం చూస్తున్నావ్?" మైత్రేయని చూడగానే దుఃఖమంతా మర్చిపోయిన ఇందు అడిగింది.
"నిన్ను చూడాలని చచ్చిపోయేముందు కలలు గన్న వ్యక్తి కోసం" అన్నాడతను.
ఆమెకేమీ అర్థంకాలేదు.
సరిగ్గా అదే సమయంలో-
మోహిత కూర్చున్న ఇసక దిబ్బమీద, హేండ్ బ్యాగ్, ఆ పక్కన మెరుస్తూ చిన్న టేప్ రికార్డర్ కనిపించింది. గబగబా దానిని అందుకుని, వణుకుతున్న వేళ్ళతో 'ఆన్' చేశాడు.
"డియర్ మైత్రేయ! మూడోసారి నీళ్ళల్లోకి నేను వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తానని ఎదురుచూస్తున్నావు కదూ...... అందుకే ముందుగా నీకు 'సారీ' చెప్పాను. నీకేమీ ఇవ్వలేకపోతున్నానని చెప్పాను. నాకిప్పుడెంతో హాయిగా వుంది.
నన్ను వెతికించే ప్రయత్నమ చెయ్యకు. నీళ్ళల్లో నీళ్ళల్లా నన్ను అయిపోనీ. నువ్వు చూపిన ప్రేమకు, నీకు ద్రోహం చేశానని అనుకోకు. నన్ను శపించకు. ఒకవేళ శపించాలనుకుంటే ఒక్కక్షణం ఆలోచించు.
నిన్ను నేను నిజంగా ప్రేమించాను మైత్రేయ.
నాకు పెళ్ళయ్యాక, నువ్వు కలిసినా, నా భర్తను వదిలేసి నీతో లేచి వచ్చేసెదానిని. కానీ నేను దుర్మార్గుల కామానికి దారుణంగా బలైపోయిన దానిని. స్వచ్ఛమయిన ఆత్మతో, మనసుతో నన్ను ప్రేమించిన నువ్వు, నాతో గడిపినప్పుడల్లా నీకా దృశ్యం జ్ఞాపకానికొచ్చి నువ్వు మథన పడకూడదు. మనమధ్య మానసికమైన దూరం పెరగకూడదు.
నన్ను, నీకు స్వచ్ఛంగా అర్పించుకోవాలి...... ఆ అర్పణలో నేను ఆధ్యాత్మికమయిన ఆనందాన్ని పొందగలగాలి. నీ మధురమయిన స్పర్శ అణువణువులో నిన్ను నేను దాచుకోవాలి....... పరవశించిపోవాలి...... ఆ ఆనందంలో నేను తడిసి ముగ్ధనైపోవాలి...... పువ్వునైపోవాలి.......
ఈ జన్మలో అది సాధ్యం కాదని నాకు తెలుసు. అందుకే నీ జ్ఞాపకాలలా పదిలంగా, పవిత్రంగా వుండాలని కోరుకుంటున్నాను.
నేను చట్టం దృష్టిలో నేరస్తురాలినైనా, భగవంతుని దృష్టిలో కాదన్నది నా నమ్మకం.
ఇంకో విషయం-
నీ పిలుపుకోసం, నీ ప్రేమకోసం, నీ స్పర్శకోసం జీవితాన్ని బాధలమయం చేసుకున్న అమాయకురాలు ఇందు. ఎక్కడున్నా ఇందు నీది.......
ఇందు నీకు దక్కుతుందనే నమ్మకం నాకుంది.
ఈ కొద్దిరోజులలో నీ సాన్నిధ్యంద్వారా నాకు అనంతమయిన మానసిక ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చినందుకు గుర్తుగా, నాకున్న ఆస్థిని నీ పేరుమీద ట్రాన్స్ ఫర్ చేశాను. అందుకు సంబంధించిన పేపర్స్ నా హేండ్ బ్యాగ్ లో వున్నాయి తీసుకో.....
ఉంటాను..... ఎప్పటికీ - నీ మోహిత."
మరోసారి, మరోసారి టేప్ రికార్డర్ లో 'ఆఫ్' చేసి ఇందువేపు చూశాడు.
ఇందు కళ్ళముందు ఎప్పుడూ చూడని మోహిత రూపం అది ప్రేమకు, అంతులేని మమకారానికి ఆకారంలా కన్పిస్తోంది.
నిర్లిప్తంగా చెరువువేపు చూశాడు మైత్రేయ.
ఇప్పుడు కెరటాలు చప్పుడు చెయ్యడం లేదు.
గాలి సవ్వడి చెయ్యడం లేదు.
ఇప్పుడక్కడ వెన్నెల లేదు.
"మోహితా....." ఉద్వేగంగా అరిచాడు. లేచి ముందుకు నడిచాడు. నిశ్శబ్దంగా కదులుతున్న అలల్లోకి నడుస్తున్నాడతను.
అతని కళ్ళంట కారుతున్న కన్నీళ్ళు.....
మోహిత మునిగినచోట ఆగి, దోసిళ్ళల్లోకి నీళ్ళు తీసుకుని కళ్ళకద్దుకున్నాడు మైత్రేయ.
పక్కనే వచ్చి నించున్న ఇందువేపు చూశాడు. ఇందు నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు.
నీళ్ళల్లోంచి బయటికొచ్చి, ఇసక దిబ్బమీద నుంచుని చెరువువేపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు.
"బావా....." నెమ్మదిగా పిలిచింది ఇందు.
మోహిత హేండ్ బ్యాగ్ ను తీసుకుని, అతని చేతిని పట్టుకుంది.
మసక చీకటిని మరికొన్ని గంటల్లో మెరుపుల వెలుగుగా మార్చడానికి ఆకాశం సిద్ధమవుతోంది.
ఇసుక దిబ్బలు దాటి రోడ్డుమీద కొచ్చారిద్దరూ, రోడ్డుమీదకొచ్చి మళ్ళీ వెనక్కి చూశాడు మైత్రేయ.
(శుభం)