Previous Page Next Page 
మోహిత పేజి 46


    "గ్రాండ్ సక్సెస్..... గ్రాండ్ సక్సెస్.... శత్రుసంహారం ముగిసింది.... మైత్రేయ..... ముగిసింది" మైత్రేయ చేతుల్ని ముద్దు పెట్టుకుంటూ బిగ్గరగా అంది మోహిత.

 


                                             *    *    *

 

    అర్చనా నర్సింగ్ హోమ్ అంతా అల్లకల్లోలంగా వుంది.

 

    స్పెషల్ రూమ్ లోకెళ్ళిన ఎ.సి.పి. రమేష్, నిశ్చేష్టుడైపోయి రాజేంద్రకుమార్ శవంవేపు చూస్తున్నాడు.

 

    తెగిపోయిన రక్తనాళాల్లోంచి స్రవిస్తున్న రక్తం.....    


    
    పులికోరలతో చెక్కేసినట్లుగా ఊడిపోయి, వేలాడుతున్న ముఖంమీద చర్మం.

 

    "హి ఈజ్ డెడ్!" డాక్టర్ ప్రకటించాడు.

 

    పావుగంట తర్వాత-

 

    మైసూరు నగరంలో అన్ని వీధుల్లోనూ పోలీసుల జీప్ లు రయ్, రయ్ మంటూ పరుగెడుతున్నాయి.

 

    ఎ జంక్షన్ లో చూసిన పోలీసులు..... పోలీసులు..... రైల్వేస్టేషన్ లో పోలీసులు...... బస్టాండుల్లో పోలీసులు..... ఆటో స్టాండ్స్ దగ్గిర పోలీసులు..... సిటీలోంచి ఒక్క చీమకూడా బయటకు వెళ్ళడానికి వీలులేకుండా పోలీసులు......

 

                                          *    *    *

 

    ఆ పోలీసుల హడావిడికి దూరంగా జయమార్తాండ గేటు ముందున్న రోడ్డుమీద, ఒక అమ్మాయి నడిచి వెళుతోంది.

 

    ఆమెకు జీవితమ్మీద మరో ఆశ లేదు. తన దుఃఖాన్ని పంచుకోడానికి మరో  వ్యక్తి లేడు....

 

    ఎవరి కోసం ఇన్నాళ్ళూ నిరీక్షించిందో, ఆ వ్యక్తి కనిపిస్తాడనే నమ్మకం ఆమెకు ఎప్పుడో పోయింది.

 

    అందుకే ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక, చావాలని నిర్ణయించుకుంది. మసక చీకట్లో చీకటి బొమ్మలా నడుస్తోందామె.

 

    ఆ వ్యక్తి ఇందు.....

 


                                            *    *    *

 

    దూరంగా ఎత్తయిన చాముండి బెట్టమీద దీపాలు వెన్నెలతో పోటీ పడుతున్నాయి. ఆ చాముండి బెట్ట అనుకుని వున్న లోయలో వున్న  చెరువు గట్టుమీద కూర్చుంది మోహిత. ఆమెకు ఎదురుగా మైత్రేయ.

 

    అక్కడ పట్టపగలే జనసంచారం వుండదు. ఈ సమయంలో ఎ ఒక్కరూ రావడానికి సాహసించరు, పోలీసుల్తో సహా.

 

    "థాంక్స్ మైత్రేయ! నా కర్తవ్యాన్ని సంపూర్ణంగా పూర్తిచేయడానికి సహకరించినందుకు నీకు నేనేమివ్వగలను?" ఆర్ద్రంగా  అందామె.

 

    "ఇప్పుడేం చేద్దాం...... పోలీసులు మనకోసం..... నగరం అంతటా వెతుకుతుంటారు."

 

    "పోలీసులకు లొంగిపోదామా?" నవ్వుతూ అందామె.

 

    "నీ ఇష్టం...... అన్నాడతను.

 

    "అందుకే నువ్వంటే నాకిష్టం మైత్రేయ...... మైత్రేయ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదూ. నన్ను నిజంగా కోరుకుంటున్నావు కదూ...... నిజం చెప్పు?"

 

    "అవును మోహితా! నీ స్వచ్ఛమయిన ఆత్మను, ఆ ఆత్మలో వున్న మనస్సును నేను కోరుకుంటున్నాను" ఆరాధనగా అన్నాడతను.

 

    "నా శరీరం నీకక్కర్లేదా?" అంటూ అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది.

 

    ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు మైత్రేయ.

 

    "మైత్రేయ..... నాకు సముద్రమన్నా, వెన్నెలన్నా, ఏకాంతమన్నా, నగ్నత్వమన్నా చాలా ఇష్టమని నీకు తెల్సు కదూ, ఆ లిస్టులో నువ్వూ చేరావు. నా ఆత్మలో ఆత్మగా మారిపోయావు. నాకోసం నువ్వెన్ని బాధలు పడ్డావు...... నువ్వెవరో, నేనెవర్నో.... ఏదో కాలాతీతమయిన, అనంతమైన బంధం మనల్ని కలిపింది" తాత్త్వికంగా అంది మోహిత.

 

    దూరంగా లలితకుమార్ ప్యాలెస్ మీదున్న లైట్ లోంచి వస్తున్నా కాంతి, ఆకాశానికి, నేలకి వేసిన వెలుగు వంతెనలా వుంది.

 

    మసక వెన్నెల్లో, మంచుదిబ్బల్లా మెరుస్తున్న ఇసుక దిబ్బలవేపు చూస్తోందామె.

 

    ఇద్దరిమధ్యా చల్లని గాలి.....

 

    ఒకదాని మీద ఒకటి ఒరిగిపోతున్న తెల్లటి మబ్బులు.

 

    "ఇంత అందమయిన ప్రకృతిని పట్టించుకోకుండా, మనిషి రకరకాలైన స్వార్థపు మాయలోపడి కొట్టుకోవడం అన్యాయం కదూ" పిడికిట్లోకి ఇసుకను తీసుకుని, దూరంగా విసురుతూ అందామె.

 

    "నీలాంటి ధైర్యవంతురాలిని నేనింతవరకూ చూడలేదు" అన్నాడతను.

 

    "ఏ విషయంలో?"

 

    "అటు న్యాయం, ఇటు చట్టం."

 

    "అంటే నన్ను పోలీసులకు లొంగిపొమ్మంటున్నావా?" నవ్వుతూ అంది మోహిత.

 

    "ఈ పోలీసులు నన్ను పట్టుకోలేరు. ఈ చట్టం నన్ను శిక్షించలేదు" మళ్ళీ అందామె.

 

    "ఎలా?"

 

    ఆ ప్రశ్నకు మోహిత జవాబు చెప్పలేదు. అతని కళ్ళల్లోకి చూస్తూ, వేళ్ళతో అతని నుదుటిమీద జుట్టు సవరిస్తూ.....

 

    "మొదట్లో నిన్ను అనుమానించాను మైత్రేయ. కేవలం సెక్స్ కోసమే నన్ను అభిమానిస్తున్నట్లు నటిస్తున్నావనుకున్నాను. అందుకే అప్పుడప్పుడు నా నగ్నత్వంతో నిన్ను టెస్ట్ చేశాను. నిన్ను  నేను ప్రేమించడానికి గల కారణం నీ నిగ్రహం, నీ వ్యక్తిత్వం. మొదట్లో నిన్ను ఈ నేరాల్లో ఇన్ వాల్వ్  చెయ్యాలనుకున్నాను. నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాక, నీ సహాయాన్ని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. నీ జోలికి పోలీసులు రారు. భయపడకు" లేచి నిలబడింది మోహిత.

 

    
                                          *    *    *

 


    శ్రీదత్త సచ్చిదానంద ఆశ్రమం దాటి, పక్కనే వున్న వాగు పక్కన కూర్చుంది ఇందు.

 

    ఆమెకు ఒక్కసారిగా నందిగామ పచ్చని పంట చేలగట్లమీద నవ్వుతూ, తుళ్ళుతూ పరిగెత్తిన బాల్యం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మానాన్న, మధ్యగదిలో బావ పెట్టుకుని తొలిముద్దు, తనను రక్షించడం కోసం ప్రాణాలు కోల్పోయిన శ్రీమహాలక్ష్మి అందరూ గుర్తుకొచ్చారు. ఆమె కళ్లవెంట నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

 

    పిడికిట్లోకి ఇసుకను తీసుకుని, అలల్లోకి విసురుతోంది.

 

    సుడులు తిరుగుతున్న అలల్లా, ఆమె మనస్సులో రకరకాలైన ఆలోచనలు.

 


                                          *    *    *

 

    చీర, జాకెట్ విప్పేసి బ్రా, లంగాతో కూర్చుంది మోహిత.

 

    ఆమెవేపే కన్నార్పకుండా చూస్తున్నాడు మైత్రేయ.

 

    "ఇప్పుడు నాకు బాగా తాగాలని వుంది మైత్రేయ. బాగా తాగి, నన్ను నేను మర్చిపోవాలనుంది. ఒక సిప్ తాగి, నదిలో ఒక మునక మునిగి వెనక్కొచ్చి, ఇసుకలో పడుకుని ఆకాశంవేపు చూస్తూ గడపడంలో ఎంత ఆనందం వుంటుందో నీకు తెలుసా? ఆ ఆనందం నాకిష్టం" లేచి ఎదురుగా వున్న చెరువులోకి దిగుతూ అంది మోహిత.

 

    పావుగంట గడిచింది.

 

    నీళ్ళల్లోంచి బయటికొచ్చి, ఇసుక దిబ్బమీద పడుకుని ఆకాశంవేపు చూస్తోందామె.

 

    "మైత్రేయ...... నా దగ్గరగా వచ్చి కూర్చో" అందామె. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడతను.

 

    అతని చేతుల్ని తన పెదవులకు ఆనించుకుని ముద్దుపెట్టుకుని.....

 

    "మైత్రేయ..... ఒక మనిషి, ఇంకో మనిషిని గుర్తుంచుకోడానికి ఏం చెయ్యాలి?" అని అడిగింది.

 

    "ప్రేమించాలి..... లేదా త్యాగం చెయ్యాలి......" నెమ్మదిగా చెప్పాడతను.

 

    "నన్ను నువ్వు గుర్తుంచుకుంటావా?" అని అడిగి, అతని బుగ్గను గిల్లింది.

 

    "అంటే....?" ప్రశ్నించాడతను.

 

    "ఆలోచించు.....!" అంటూ రెండోసారి నీళ్ళల్లోకి వెళ్లింది. చెరువు నీళ్ళల్లో జలకన్యలా ఈదుతోంది...... చిన్నపిల్లలా ఆడుతోంది. పెద్దపెట్టున నవ్వుతోంది.

 

    "మరీ లోతుకు వెళ్లొద్దు...."హెచ్చరించాడు మైత్రేయ.

 

    "నాకు ఈత వచ్చులే...." నీళ్ళలోంచి కేక వేసిందామె.

 

    అరగంట గడిచింది.

 

    మబ్బులు లేని నిర్మలమయిన ఆకాశంలో చంద్రుని నుంచి రాలిపడిన వెలుగు ముక్కల్లా వున్నాయి చుక్కలు. చుక్కలు చెక్కిన చక్కని శిల్పంల వున్నాడు చంద్రుడు.

 

    ఒడ్డుకేసి ఇసకమీద కూర్చుని బ్రా, లంగాలను తీసేసి పక్కన పడేసి, మైత్రేయవైపు చూసింది.

 

    ఇప్పుడు మోహిత వెన్నెల బొమ్మలా వుంది.

 

    "నేను చెప్పినట్టుగా చేస్తావు కదూ......?" అడిగిందామె.

 

    "చేస్తాను..... ఏం చెయ్యాలి....?"

 

    "కాసేపాగాక చెప్తానులే...." అంటూ ఇసకను తీసి వంటికి రాసుకుంటోందామె.

 

    "నువ్వు నాకు ఇందును చూపించావు కావు....."అందామె.

 

    ఇందు..... అవును ఇందు....

 

    ఇప్పుడెక్కడుందో? ఎలా వుందో?

 

    "చూపిస్తాను...... మోహితా..... ఇందును చూపిస్తాను...... ఇందు మనసు కూడా నీలాంటి సున్నితమయినదే."

 

    మోహిత నెమ్మదిగా లేచి, మైత్రేయ దగ్గరకు వచ్చి, అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.

 

    ఆ కౌగిలి చల్లగా వుంది. అతని పెదవులమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు స్వచ్ఛంగా వుంది.

 

    "మైత్రేయ..... థాంక్స్!" అతని రెండు చేతుల్నీ పట్టుకుని అంది.

 

    "ఎందుకు.....?" ఆశ్చర్యంగా అడిగాడతను.

 

    
                                        *    *    *

 

    తలతిప్పి నలువేపులా చూసింది ఇందు. ఎదురుగా ఉరకలెత్తుతున్న వాగు....

 

    భారంగా నిట్టూర్చి, మనసులోనే దేవుడికి నమస్కారం చేసి ముందుకు అడుగు వేసింది.

 

    తడి ఇసక మీద ఆమె  పాదాలు భారంగా పడుతున్నాయి.

 

    దూరంగా అంతెత్తున పొంగుతున్న అలలు..... ఒడ్డుకొస్తున్న నీళ్ళపాయలు...... ఆ నీళ్ళలో నుంచుంది ఇందు.


    
                                         *    *    *

 

    "నిన్ను మనసారా ముద్దు పెట్టుకునే అరుదైన అవకాశాన్ని నాకిచ్చి నందుకు...." అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అందామె.

 

    ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో చిన్న తడి, ఆ తడి కన్పించదు.

 

    "సారీ......!" అందామె మళ్ళీ.

 

    "ఎందు....కు?"

 

    "ఇంతకంటే..... నీకేమీ ఇవ్వలేకపోతున్నందుకు....." అతని చేతుల్నించి విడివడింది. నగ్నంగా, నీళ్ళల్లోకి దూకేసింది. మైత్రేయవేపు చూస్తూ లోనికెళుతోంది.

 

    నెమ్మదిగా..... నెమ్మదిగా..... నెమ్మదిగా.....

 Previous Page Next Page