ఉదయం లేచి"యివ్వాళ త్వరగా వెళ్ళాలి" అంటూ హడావిడిగా వెళుతున్న అతడిని చూస్తుంటే ఆమె వొళ్ళు మండిపోయింది.
"మీ బ్యాంక్ లో మీపైన మేనేజరున్నాడు. మరో యిద్దరు ఆఫీసర్లున్నారు. ఎవరికీ లేని రెస్పాన్సిబిలిటీ మీకు మాత్రమేనా ఇల్లంటూ ఒకటుందని కూడా గుర్తు చేయాలా?" అంటూ నిలదీసింది.
"నా ఆఫీసు విషయాల్లో నీ జోక్యంగానీ, సలహా గానీ నా కనవసరం లేదు. నా అలవాట్లు నావి. ఇప్పుడు నీ కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నీకు ఏం తక్కువ చేస్తున్నానని ఈ కోపం!"
"అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం? నాకు తిండి సరిగ్గా దొరకడంలేదని నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాననుకున్నారా? భార్యగా నాకు కావలసింది అది మాత్రమేనా?"
"నన్ను విసిగించకు భార్గవీ! కొత్త సంవత్సరం మొదటిరోజు చాలా పనుంటుంది. త్వరగా టిఫిన్ పెట్టు, వెళ్ళిపోతాను".
"కొత్త సంవత్సరం అంటే కొత్త అకౌంట్లు, కొత్త లెడ్జరు పుస్తకాలు అవి తప్ప మరోరకం సరదాలుంటాయని మాత్రం మీకు తెలియదా? మీతో సరదాగా కాస్త సమయం గడపాలని కోరుకోవడం తప్పా?"
"బ్యాంకులో నేనేదో జల్సా చేస్తున్నాననేది నీ అభిప్రాయం అయితే అది పొరపాటు అలా కష్టపడినందువల్లే ఈ రోజు ఈ స్థితికి వచ్చాను. ఇంకా పై పొజిషన్ లోకి వెళ్ళబోతున్నాను. అది నీకూ సంతోషదాయకం కావాలి. నేనేం పేకాడటం లేదు. రేసులకి వెళ్ళటం లేదు పని! పని చేస్తున్నాను. అయినా ఇప్పుడీ డిస్కషన్ దేనికి? త్వరగా టిఫిన్ పెట్టకపోతే అలాగే వెళ్ళిపోతాను".
తిరుగులేని బెదిరింపు అది. భార్గవి అతడికి అన్నీ అందించి వెళ్ళిపడుకుంది. కలలు కన్నంతసేపు పట్టలేదు. తను మరో పంజరంలో యిరుక్కుపోయినట్లు తెలుసుకోవడానికి..... రెక్కలు విరిచేసి విశాలమైన మైదానంలోకి వదలివేయబడ్డ స్వేచ్చ యిది! ఇదేనా తను కలలుకన్న స్వేచ్చ? స్త్రీకి జీవితంలో కావలసిందేమిటి? హోదాలో వున్న భర్తా, ఏ లోటూలేని బ్రతుకూ అయితే తనకు అవి రెండూ వున్నాయి. కాని రసహీనమైన జీవితం అయిపోయింది. శ్రీరామ్ గురించి నెగిటివ్ గా ఆలోచించాలంటే భయపడ్డదిన్నాళ్ళూ కాని యిప్పుడు ఆలోచనంతా అదే.
అతడు పెళ్ళి చేసుకున్నది కేవలం యాంత్రికత్వం కోసం......డబ్బు కోసం. ఆ డబ్బయినా తన స్వంత ఆనందం కోసం కాదు. చెల్లెలి పెళ్ళి అవసరం మీద. అంతకుమించి అతడికి పెళ్ళి గురించి, భార్య గురించి మరో భావం ఏమీ లేదు. అతడి మనసులో ఎప్పుడూ కదలాడేది ఒకే కోరిక. పెద్ద హోదా సంపాదించాలి. బహుశా అతడిలో ఆత్మన్యూనతాభావం చిన్నతనం నుంచే అంచెలంచెలుగా పెరిగిపోయి వుండాలి. తండ్రి ఓ నౌకరుగా పనిచేశాడు. ఆ లెవెల్ నుంచి తను పైపైకి ఎదిగిపోవాలి. ఈ కోరిక మనసులో పురుగులా తొలిచేస్తుంటే తనపై అధికారులందరి దగ్గరా అణిగి మణిగి వుండడం అలవాటయిపోయింది. స్టాపు అందరితో తనూ సమానంగా ఒక ఉద్యోగిని అన్న విషయం అతడి మనసే ఒప్పుకోలేకపోయింది. ప్రమోషన్ వచ్చి ఆఫీసరయినా అతడిలో ఈ కాంప్లెక్సు పోలేదు. తన కింద పనిచేసే వాళ్ళ ముందుకూడా తన అధికారం చూపించలేని అతడి బలహీనత అతడినో హాస్యాస్పదుడిగా మార్చివేసింది. అందరి దృష్టిలో గట్టిగా ఏమైనా అంటే ఈ ఫ్యూన్ కొడుక్కి ఎంత అహంకారం అనుకుంటారని భయం. పై అధికారుల పనులన్నీ అడక్కుండానే చేసిపెట్టి వాళ్ళ ప్రాపకాన్ని సంపాదించుకున్నాడు. ఆ అలవాటులోంచి యిప్పుడు బయటపడలేక అవస్థ పడుతున్నాడు. త్యాగం అతడి స్వార్ధం త్యాగంలోంచే ఆనందం పొందుతాడు. భార్య చీర చెల్లెలికి పెడతాడు. బావ మెప్పుకోసం శలవు పెడతాడు. మేనేజరు మెప్పుకోసం అహర్సిశలూ కష్టపడతాడు. భార్య తప్ప అందరి మెప్పూ కావాలి అతడికి.
ఆమెకప్పుడు తల్లి గుర్తొచ్చింది.
తల్లి దృష్టిలో తండ్రి దేముడు. అతడు చేసేదాంట్లో, చెప్పేదాంట్లో తప్పులెంచడం మహాపాపం. ఈ భావాలలో పుట్టి పెరిగిన ఆవిడ ఆయనలో మార్పు తేవడానికి ప్రయత్నించలేకపోయింది. కాని తను అలా కాకూడదు. మంచి మాటలతోనయినా, కాకపోతే అలిగి కోపం తెచ్చుకునయినా అతడిలో మార్పు తెప్పించాలి. అది తన బాధ్యత' అనుకుందామె.
లేచి మొహం కడుక్కుంది.
* * *
భర్తని సరయిన దారిలోకి తిప్పాలన్న ఆలోచన బాగానే వుందికాని అది ఎలా అన్నదే భార్గవికి తట్టలేదు. 'భర్తని లొంగదీసుకోవడం ఎలా' లాంటి పుస్తకాలు, 'భర్తను గుప్పెట్లో పెట్టుకునే మార్గాలు' లాంటి వ్యాసాలు ఆమె చదవలేదు. ట్రాక్షనల్ ఎనాలిసిస్ సైకాలజీ స్టడీ ఆమెకు తెలియవు. ఉన్నంతలో శ్రీరామ్ వ్యక్తిత్వాన్ని విశ్లేషించింది. అతడు చాలా బీదరికంలో పెరిగాడు. స్కూలు ఫీజులు సరైన సమయానికి కట్టలేక క్లాసులో అవమానింపబడటం, రకరకాల దుస్తులు వేసుకునే పిల్లలమధ్య రెండే రెండు జతలతో గడుపుతూ రావడం..... వీటితో వాళ్ళకన్నా తను చాలా అల్పున్ననే భావం అప్పటినుండే పెరుగుతూ వచ్చుండాలి. కాలక్రమేణా కుటుంబం బీదరికం నుంచి మధ్య తరగతిలోకి మారింది. ఒక ఆఫీసర్ గ అతనికి సమాజంలో గౌరవము వుంది. కాని, చిన్ననాటి ఇన్ ఫీరియారిటీ నుంచి అతడింకా పైకెదగలేకపోతున్నాడు. అక్కా.... చెల్లీ..... ఆఫీస్ కేవలం ఇలా ఇతరుల మెప్పు పొందటాన్ని మాత్రమే తన సెన్సాఫ్ అచీవ్ మెంట్ గా భావిస్తున్నాడు. అతడిని మార్చాలంటే అతడిలోని ఈ ఆత్మన్యూనతను పోగొట్టాలి. దానికోసం ఒక ప్రోగ్రాం వేసుకుంది ఆమె. ముందుగానే ఇంటి వాతావరణాన్ని మార్చాలి. ఇంటికీ, బ్యాంక్ కీ తేడా ఇంట్లో అడుగుపెడుతూనే గుర్తించగలగాలి.
ఆమె దగ్గరున్న డబ్బంతా తీసుకుని బజారుకు వెళ్ళింది. ఆ రోజే అనవసరమైన సామాగ్రి అటకమీద కెక్కించి-కర్టెన్లు, డోర్ మాట్సు, కుషన్ కవర్లు, ఫ్లవర్ వేజులాంటి చిన్న వస్తువులతో ఇంటి రూపు మార్చేసింది. సాయంత్రం వాకింగ్ కి వెళ్ళివచ్చిన మామగారు గుమ్మంలో అలాగే నిలబడిపోయారు.
"మనిల్లేనా యిది? చాలా బావుందమ్మా! మండుటెండలో దాహంతో అలమటిస్తూ తిరిగి వచ్చిన వాడికి చల్లటి నీడలో, చల్లటినీళ్ళు తాగినంత తృప్తిగా వుంది" అన్నాడు.
భార్గవి హృదయం సంతోషంతో గంతులు వేసింది. ఇక శ్రీరామ్ ఎలా ఫీలవుతాడో చూడాలన్న కోరికతో ఎదురుచూడటం మొదలుపెట్టింది. అలవాటు ప్రకారం ఎనిమిదింటికి వచ్చాడతను. రావడమే ఉసూరుమంటూ పడక్కుర్చీలో వాలిపోయాడు. భార్గవి మంచినీళ్ళు తీసుకెళ్ళి అందించింది. అలవాటు ప్రకారం త్రాగేసి కళ్ళుమూసుకునే చెయ్యిచాచి పక్క టేబుల్ మీదుంచాడు. అక్కడ వుండాల్సిన టేబుల్ ని మరో పక్కకి మార్చింది భార్గవి. గ్లాసు కిందపడ్డ శబ్దానికి కళ్ళు తెరిచాడు. ఆమె ఉత్కంఠగా చూస్తోంది.
"ఏమైందిక్కడ టేబుల్" అడిగాడు.
"నా చేతికందిస్తే తీసుకునేదాన్నిగా". గ్లాసు తీసి బట్టతో నీళ్ళన్నీ తుడిచింది. ఆమె వంటింట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి శ్రీరామ్ బూట్లువిప్పి కుర్చీ కిందకు తోసేశాడు. ఆమె పెట్టిన పూలతొట్టెను పక్కన నేలమీద పడేసి, స్టూలుమీద కాళ్ళు బారజాపుకున్నాడు. ఆమె మౌనంగా బూట్లు తీసి స్టాండులో వుంచి, హవాయి చెప్పుల్ని తెచ్చి దగ్గరగా వుంచింది. బాత్రూంలో ఆమె చేసిన మార్పుల్నిగాని, పడకటింట్లో అతడికి సౌకర్యం అమర్చిన టేబుల్, కుర్చీలుగాని అతడి దృష్టిలో పడలేదు.
"నా ఆఫీసు పని చేసుకోవడానికి కూడా ఇక్కడే కూర్చోవాలా?" అని మాత్రం అడిగాడు.
"ఏం అనుకూలంగా లేదా? టేబుల్ లైట్ పెట్టాగా? అక్కడయితే మామగారికి ఇబ్బందిగా వుంది".
"సరే సరే" ఫైల్స్ ముందేసుకున్నాడు.
"ఏమండీ, నేనేమైనా సహాయం చేయగలనేమో చెప్పండి. చేస్తాను" అడిగింది ప్రక్కనే స్టూలుమీద కూర్చుంటూ.
"నువ్వా, ఏం తెలుసు నీకు బ్యాంకింగ్ గురించి?" హాస్యంగా నవ్వాడు.
"నేనూ గ్రాడ్యుయేట్ ని, చెబితే తెలుసుకోగలను. పదోక్లాసు పాసయిన వాళ్ళుకూడా బ్యాంకుల్లో పనిచేస్తున్నారుగా ఆ మాత్రం చెయ్యలేనా?"
"అవును నేను పదోక్లాసు పాసయ్యే ఉద్యోగంలో చేరాను. ఆ తరువాత ఏదో భట్టీయం పట్టి పై డిగ్రీలు చదువుకున్నాను. ఆ విషయం నాకు గుర్తు చెయ్యనవసరం లేదు" విసురుగా అన్నాడు.
బలంగా చెంపదెబ్బ కొట్టినా భార్గవి అలా త్రుళ్ళిపడేదికాదు. అయినా తమాయించుకుని, "సారీ, నేనా ఉద్దేశ్యంతో అనలేదు" అని, ఇక అక్కడ వుండలేక వచ్చి పక్కమీద వాలిపోయింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. మొదలుపెట్టిన మొదటిరోజునే ఇలా జరుగుతుందనుకోలేదు. త్వరలోనే ఆమె కోలుకుంది. శ్రీరామ్ లో మార్పు వెంటనే రాదు. సహనంతో నిరీక్షించాల్సిందే. తన ప్రయత్నాలు కొనసాగించాల్సిందే.
రెండురోజుల తరువాత మామగారికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచాన పడటంతో, భార్గవి ప్రయత్నాలకి ఆనకట్ట పడింది.
"ప్రియమైన అనూ!
చాలాకాలం తర్వాత ఉత్తరం రాస్తున్నాను. నీ అడ్రసు కనుక్కోడానికి నెలరోజులు పట్టింది. ఎందుకూ అనుకుంటున్నావా? అవసరం. పదిహేనేళ్ళవరకూ మన విషయాలు ఒకరికొకరం తెలుసుకోకూడదనీ, నలుగురూ కలుసుకున్నపుడే మన జీవిత కథలు విప్పి చెప్పుకోవాలనీ తీసుకున్న నిర్ణయం, నేను మర్చిపోలేదు. కాని, ఆ మాటమీదే నిలబడాలంటే నా బాధ ఎవరితో చెప్పుకోనూ. "స్నేహం ఇవ్వని దేశంలో స్నేహితులు లేని ప్రతిమనిషీ ఓ ద్వీపం" అన్నాడో కవి. నేనూ ఓ ద్వీపాన్ని నాలుగువైపులా సముద్రపు హోరు నన్ను ముంచెత్తివేస్తూంటే నిస్తేజంగా నిలబడి నేను, నేను కాదనుకుంటూ జడత్వంలో మునిగిపోతున్న ఓ అసహాయురాలిని. 'ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటి' అంటున్నావా? చీపురుకట్ట తిరగేసి కొడితేనూ, కిర్సనాయిలుపోసి కాలుస్తేనూ మాత్రం 'కష్టం' అనుకోవాలంటే నా కొచ్చిన కష్టం ఏమీలేదు.