Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 45

    "విషయం నవ్వులాట క్రిందికి తేల్చివేయాలని చూడకు. నాకు తెలియని కథలజోలి నా కెందుకు? తెలిసిన కథగురించే నేనిప్పుడు ఆలోచిస్తాను ఆ కథ గురించే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను."

    "ఇన్నాళ్ళనుండి నేను వివాహం ఎందుకు వాయిదా వేస్తూ వచ్చానో నీకు తెలుసు. నాది పర్మినెంట్ జాబ్ కాదు. చేస్తున్నదీ ప్రయివేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా. నా కంటూ సంపాదన స్థిరంగాలేనిదే భార్య, సంసారం ఏర్పరుచుకోవడం మెడకో డోలు అన్న సామెతగా ఉండదా?"

    "నీ ప్రిన్సిపుల్స్ గౌరవించబట్టే పెళ్ళి విషయంలో నిన్నెప్పుడూ బలవంత పెట్టలేదు. ఆ విషయంలో నీకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాను. ఆ స్వేచ్చని నువ్వు దుర్వినియోగం చేసుకొన్నావని ఇప్పుడు తెలిసింది. ఇంకా నిన్నింత స్వేచ్ఛగా ఉండనిస్తానని అనుకోవద్దు. మీనాక్షితో నీ వివాహం జరిపించి నీ స్వేచ్ఛకు ఆనకట్ట వేస్తాను."

    "ప్రస్తుతం గండం గడిచిపోతే మీనాక్షికి కావలసినంత భవిష్యత్తు ఉంది. బలవంతంగా నా మెడలు వంచి పెళ్ళి చేస్తే ఏముంది? ఆమె భవిష్యత్తు అంధకారంలో సమాధి అయిపోయిందనుకో. సవ్యంగా కోటిరెట్లు హాయి కదూ? నువ్వు మీనాక్షికి న్యాయం చేస్తున్నానని అన్యాయం చేస్తున్నావన్న మాట. అందుకని, పిచ్చితల్లీ! వెర్రి ప్రయత్నాలు మానేసి గమ్మునఊరుకో."

    "పెళ్ళయితే ఆమెతో కాపురం చేయవా?" యుద్ధం చేస్తూ కట్టివిరిగిపోయిన వీరుడిలా నిస్సహాయంగా చూసింది సువర్చల.

    "మరీ ఇంత పంతాలకు వచ్చాక ఎవరికీ ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు."

    "మీనాక్షి ఏం తప్పు చేసిందని ఆమెమీద నీకు కక్ష?"

    "ఇప్పటివరకు నాకేం కక్షలేదు. ఆమె నా కాళ్ళకు చుట్టుకుపోతే మాత్రం నేను సహించను."

    ఆయుధం విరిగిపోయినా బాహుబలం గుర్తు తెచ్చుకొన్నట్టుగా మొండి ధైర్యంతో విజ్రుంభించింది సువర్చల. "ఇలా బెదిరించి మీనాక్షి పీడ వదిలించుకోవాలనుకొన్నావా? ఉహుఁ నీలాంటి పోకిరీ వెధవలకి బుద్ది చెప్పకపోతే నేను పాతికేళ్ళకు పైగా చేస్తున్న సాంఘిక సేవకు అర్ధమేమైనా ఉంటుందా? మీనాక్షి కి నీతో వివాహం జరిపిస్తాను. ఆమెతో నువ్వు కాపురం ఎలా చేయవో చూస్తాను. కన్న తల్లిగా నిన్ను ఏమైనా శాసించగల హక్కు నాకుంది కదూ?"

    "హక్కులు ఎదిగిన పిల్లలమీద ప్రయోగిస్తే ఫలితాలు చాలా వికటంగా ఉంటాయి"

    "నేను చేసేది చేస్తాను. దానికి నువ్వు ఏం ప్రతీకారం చేయగలవో చూస్తాను." విసవిసా క్రిందికిదిగి వచ్చింది సువర్చల.

    "పాపా. నువ్వొకపని చేయాలమ్మా!"

    "చెప్పండి, ఆంటీ."

    "నువ్వెళ్ళి మీనాక్షిని తీసుకురాగలవా ఇక్కడికి?"

    "అజయ్ ఏమన్నాడు, ఆంటీ?" ఆత్రుత పట్టలేనట్టుగా అడిగింది.

    "బలవంతంగా పెళ్ళిచేస్తే ఆమెతో కాపురం చేయడట. ఎలా కాపురం చేయడో, చేయక ఎక్కడికి పోతాడో చూస్తాను. వాడి బెదిరింపులు నేనేం లెక్క చేయను."

    "మీనాక్షిని పిలిపించి ఏం చేస్తారు మీరు?" ప్రేమీ అయోమయంగా అడిగింది.

    "మీనాక్షి వస్తే ఇక్కడే ఉంచుకొంటాను. వాళ్ళింటికి పంపించనిక. ఆ పిల్ల ఏ అఘాయిత్యం తలపెట్టక ముందే నువ్వెళ్ళి ఆమెను తీసుకు వచ్చెయ్యి." తొందర పెట్టింది సువర్చల.

    ప్రేమీ విస్ఫారిత నేత్రాలతో సువర్చల ముఖంలోకి చూసింది. "మీనాక్షి బాధ్యత పూర్తిగా మీరు
స్వీకరిస్తున్నారన్నమాట. కాని, ఒక్క మాట. అంకుల్ తో సంప్రదించకుండా ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం బాగుండదేమో."

    "మీనాక్షి బాధ్యత స్వీకరించడంకూడా నా సాంఘిక సేవలో ఒక భాగమే! ఇన్నాళ్ళు నా సాంఘిక సేవకి అడ్డురానట్టే దీనికీ ఆయన అడ్డురారనే నా నమ్మకం! అయినా ఒక మంచి పని చేస్తున్నానన్న విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసం నాకున్నప్పుడు నన్నెవరూ ఆపలేరు."

    "ముందుగా ఈ సంగతి అంకుల్ కి తెలిసి ఉండడం మంచిదేమో!"

    "ఆయనని సంప్రదించాలీ అంటే ఇప్పుడాయన ఊళ్ళో లేరుగా? రెండురోజులదాకా రారు. ఈ రెండురోజుల్లో ఎంత అనర్ధమైనా జరుగుతుంది. నువ్వెళ్ళి మీనాక్షిని తీసుకురా, పాపా! తండ్రీ కొడుకులతో పోరాడదానికి నేను సిద్దంగా ఉన్నాను" దృఢనిశ్చయంతో చెప్పింది.

   
                                  *    *    *

    గంటలో మీనాక్షిని వెంటబెట్టుకు వచ్చింది ప్రేమీ.

    సువర్చల ఆ పిల్లను పరిశీలనగా చూసింది ఒక్కక్షణం. కట్టుబొట్టు అంతా ముత్తయిదు పిల్లలాగే ఉంది. చేతులకు గాజులున్నాయి. నుదుటతిలకం బొట్టుఉంది. పొట్టి పొడవు, లావు సన్నం కాని ఒళ్ళు. చామనచాయకి ఒక ఛాయ ఎక్కువున్న ఒంటిరంగు. చూడగానే అందగత్తె అనిపించదుకాని ఏదో కళ ఉంది ఆ పిల్ల ముఖంలో. నిండుగా ఆరోగ్యంగాఉన్న బుగ్గలో, ఒత్తుగా దువ్వెనకు ఎదురు తిరిగేట్టున్న ఉంగరాల వెంట్రుకలోకాని ఆపిల్లను అంత తేలిగ్గా తీసివేయనీయవు. వయసు పాతిక్కి చేరువగా పరవళ్ళు త్రొక్కే నదిలా ఉంది.

    ఏడ్చినట్టుగా ఉన్నకళ్ళు బెదురు చూపులు చూస్తున్నాయి.

    "ఈమే అజయ్ తల్లి సువర్చలాదేవి." ప్రేమీ పరిచయం చేస్తూంటే ఆ పిల్లకళ్ళు ఒక్కసారి ఎత్తిచూసి తిరిగి క్రిందికి దించేసుకొంది. పెదవులు ఊరికినే అదురుతున్నాయి.
   

 Previous Page Next Page