అప్పటికే శేఖర్ తమ ప్రయాణానికి తేదీకూడా నిశ్చయించాడు. సరిగా ఆరోజుకి పదిహేను రోజులే ఉంది ప్రయాణం.
"నాన్నా! నా పెళ్ళి విషయంలో నీ అభిప్రాయమేమిటో చెప్పు. నీకేం కావాలి? నువ్వు సెలెక్ట్ చేసిన వ్యక్తినే నేను చేసుకోవటమా? లేకపోతే ఎవరిని చేసుకున్నా నేను సంతోషంగా ఉండటమా?"
"అదేం ప్రశ్నా? నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి! నువ్వు ఎవరిని చేసుకుంటానంటే వాళ్ళకే ఇచ్చి చేస్తాను. ఎలాంటి వాడైనా సరే! ఎక్కడున్నా సరే!"
తమ సంగతి ఏ పరిస్థితుల్లోనూ బయటికి రానీయకూడదని అది చాలా ప్రమాదమనీ శేఖర్ మరీ, మరీ నొక్కి చెప్పబట్టి సుశీల నిగ్రహించుకుంది కాని లేకపోతే శేఖర్ సంగతి తండ్రికి చెప్పేసి తండ్రి అంగీకారంతో, ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకోవాలని ఎంతగానో ఆరాటపడింది.
నవ్వుతూ "ఎక్కడున్నా సరేనా?" అని రెట్టించింది.
"ఆ! ఎక్కడున్నా సరే! చివరకు విదేశాలలో ఉన్నా సరే." గతుక్కుమంది సుశీల.
"కానీ, నేను నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వెక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాను......." పకపక నవ్వింది సుశీల.
లలిత సాంబశివం కంటే మరింత ఆదరంతో మాట్లాడింది.
"బాగా ఆలోచించుకో సుశీ! చదువుకున్నవాడని కానీ, ఉద్యోగస్థుడని కానీ నువ్వు భ్రమపడకు. నిజంగా నీ మనసుకు నచ్చితేనే చేసుకో!"
"నా మనసుకు నచ్చటమే నీకు ప్రధానమా అమ్మా! ఎవరిని చేసుకున్నా నీకు అభ్యంతరం ఉండదా?"
ఆశగా అడిగింది సుశీల.
"ఇంకా నెమ్మదిగా అడుగుతున్నావా? పశువు నుండి మనిషిని వేరు చేసేది ఏమిటి! మనసేగా! మనం మనుష్యుల మయినా అనుక్షణము మనసును చంపుకొని బ్రతుకుతున్నాం. మనసులేని దాంపత్య జీవితం కంటే నరకము మరొకటి ఉండదు. నువ్వు నాకు దూరమైనా భరించగలను. కాని మనసు లేని వాన్ని చేసుకుంటే మాత్రం భరించలేను."
తన మాటలకు తనే భయపడినట్లు గబుక్కున ఆగిపోయింది లలిత.
"అది సరే! ఈ మాటలన్నీ ఏమిటి? నీ మనసులో ఏమైనా ఉందా?"
అంది సుశీలను పరిశీలనగా చూస్తూ....సుశీల ఒక్క క్షణం తొట్రుపడి "ఏమీలేదు__"అనేసింది.
ఒక్కొక్కరోజు గడిచి శేఖర్ తో తను వెళ్ళిపోవలసిన రోజు దగ్గిర పడుతున్నకొద్దీ సుశీల మనసులో బరువు పేరుకోసాగింది.
"అమ్మా! నా పెళ్ళికి ఎలాంటి చీర కొనాలనుకుంటున్నావో, ఇప్పుడేకొను....." అంది సుశీల.
లలిత తెల్లబోయింది.
"అదేమిటీ? ఇంకా పెళ్ళీచూపులైనా కాలేదు. అప్పుడే పెళ్ళిచీరా?"
"పెళ్ళికి మరోచీర కొందువుగాని ఇప్పుడు సరిగ్గా నా పెళ్ళికి నువ్వెలాంటి చీర కొనాలనుకుంటున్నావో అది కొను నాకు ఇప్పుడే కట్టుకోవాలని ఉంది......"
సుశీలకు చీరలమీదా అలంకరణమీదా ఉన్నా వ్యామోహం లలితకు తెలుసు. అప్పుడప్పుడు అంత వ్యామోహము తగదనిపించినా మందలించలేక పోయేది. "పోనీ చిన్నపిల్ల!" అనుకునేది. కొనియ్యగలిగే తాహతున్న తండ్రి! కొత్తరకాలన్నీ కొనుక్కోవాలని కుతూహలపడే కూతురు! సుశీలకున్న చీరలకు లెక్కలేదు!
లలిత సుశీలను వెంటబెట్టుకుని బజారుకు వెళ్ళింది. సాధారణంగా 'అది నచ్చలేదు, ఇది నచ్చలేదు' అని వంకలు పెట్టే సుశీలా ఆ రోజు చీర ఎన్నిక పూర్తిగా లలిత ఇష్టానికే వదిలేసింది.
ఆ సాయంత్రమే లలిత కొన్న చీర కట్టుకుని పెళ్ళి కూతురులా తయారయి లలిత పాదాలకు నమస్కారం చేసింది సుశీల.....నివ్వెరపోయింది లలిత.
"ఏమిటే ఇది?"
సుశీల నవ్వుతూ "సరదాగా నమస్కారం చేశానమ్మా! ఆశీర్వదించరాదూ!" అంది.
సుశీల నువ్వుచూసి లలితకు ఏ అనుమానమూ రాలేదు పైగా ఇలాంటి ఆకతాయితనం సుశీలకు అలవాటే!
"నువ్వు మనసారా ప్రేమించే వ్యక్తిని పెళ్ళిచేసుకుని అతని హృదయపూర్వకమైన ప్రేమను పొంది కలకాలం ఆనందంగా బ్రతుకు."
కలకల నవ్వింది సుశీల.....ఆ నవ్వు విని మురిసిపోయింది లలిత.
తండ్రి రాగానే తండ్రికికూడా నమస్కారం చేసింది సుశీల.
పట్టుచీరతో అందంగా ఉన్న సుశీలను చూసి మురిసి పోయిన సాంబశివం 'నమస్కారం ఎందుకు?' అని కూడా అడుగలేదు.
"కలకాలం అష్టయిశ్వర్యాలతో సుఖంగా ఉండు__" అని ఆశీర్వదించాడు___లో లోపల చాలా బాధపడింది సుశీల.
ఇంటికి ఫోటోగ్రాఫర్ ను పిలిపించింది. తల్లినీ తండ్రినీ పక్కల పక్కల కూర్చోబెట్టి తను మధ్యన నించొని ఫోటో తీయించుకోవాలని పట్టుబట్టింది. ఇటీవల తమను దగ్గిర చేయాలని సుశీల చేస్తున్న ప్రయత్నాలు లలితకు, సాంబశివానికి ఆనందాన్నే కలిగిస్తున్నాయి. సాంబశివం గర్వంగా వచ్చి కూచున్నాడు__ఒక్క క్షణము తటపటాయించిన లలితను సుశీల "రా, అమ్మా!" అనగానే వచ్చి కూచుంది. యిద్దరి మధ్యా నించుని రెండు చేతులు ఇద్దరిమీద వేసింది సుశీల___ఫోటో చక్కగా వచ్చింది.....సాంబశివం గ్రాండ్ గా ఫ్రేము కట్టించి తన గదిలో గోడకు వేలాడదీసుకున్నాడు. లలిత స్టాండులో ఫిక్స్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంది. సుశీల దానిని అపురూపముగా తన సూట్ కేస్ లో సర్దుకుంది.....