Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 44

    "రెండు మూడుసార్లు హోటల్ కి రమ్మన్నాను. వచ్చింది. అంతే. అంతకు మించి పెద్ద సంబంధం లేదు. గంటలకొద్దీ కలసి షికార్లు కొట్టలేదు కలసి కబుర్లు చెప్పుకోలేదు." విసురుగా ముఖం త్రిప్పేసుకొన్నాడు.

    "కలసి గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటే రాదు కడుపు. షికార్లు కొట్టినా రాదు. హోటల్ గదిలో పడుకొంటే మాత్రం కడుపు తప్పకుండా వస్తుంది."

    "సిగ్గులేని ప్రసంగం చేయొద్దు." అజయ్ చెయ్యెత్తి ఒకడుగు ప్రేమీవైపు వేశాడు, ఉగ్రంగా!

    సువర్చల అతడి చేతిని విసురుగా క్రిందికి దించింది. తరువాత అజయ్ రెండు చెంపల్ని ఓపిక ఉన్నంతవరకు వాయించేసింది.

    "నువ్వు ఆడపిల్లలతో స్వేచ్ఛగా తిరుగుతావని తెలుసు. సోషల్ టైప్ అని సమాధాన పరుచుకొనేదాన్ని. ఈ సోషల్ టైప్ చాటున ఆడపిల్లల్ని అన్యాయం చేయగలవని ఊహించలేదు. ఆడపిల్లల్నే కాదు, మగపిల్లల్ని కూడా ఒక హద్దులో పెంచాలని ఇప్పుడు అర్ధమైంది. లేకపోతే మరో ఆడపిల్ల జీవితంలో గోతులు తీయగలరు మీ మగపిల్లలు. ఈ సత్యం ఇదివరకే గ్రహించి నీ కింత స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది." కటుస్వరంతో అంది సువర్చల.

    అజయ్ ఏం మాట్లాడలేదు. అవమానంతో బిగుసుకొన్నట్టుగా ఉన్నాడు. అక్కడున్న పేపర్లన్నీ గబగబా పాడ్ తో కట్టేసి, వాటిని తీసుకొని పైకి వెళ్ళబోతున్నాడు.

    సువర్చల అతడి దారి కడ్డంగా నిలబడింది.

    "మీనాక్షి అల్లరిపాలు కాకముందే ఆమెను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా."

    "జీవితంలో ఎదురయ్యే  ప్రతి ఆకర్షణా కాలికి బంధమైతే మనిషి బ్రతకలేడు, మమ్మీ." స్థిరంగా, గంభీరంగా ఉంది అజయ్ గొంతు. "నువ్వు ఒక్కసారిగా నన్ను సన్మార్గంలోకి మార్చలేవు. నువ్వు నన్ను సచ్చీలుడిగా, సన్మార్గ వర్తనుడిగా చూడాలని అనుకొంటే అందుకు నువ్వు నన్ను మొదటినుండీ ఆ శిక్షణలో ఉంచాల్సింది. మొక్కా, మాను ఉపమానం నీకు నేను చెప్పాలా?" నవ్వాడు వేదాంతిలా.

    అతడి నవ్వుతో ఖంగు తిన్నట్టుగా అయింది సువర్చల. ముఖం పాలిపోయింది "అయితే, నువ్వు  మానులా వంచలేనంత దుర్మార్గుడివై పోయావా? ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకు ఉన్నానా?"

    "బలహీనతే దుర్మార్గమనుకొంటే అలాగే అనుకోవాలి. ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ చాటుమాటు వ్యవహారాలెన్నో ఉంటాయి. వాటన్నిటికీ ఫ్రేమ్ కట్టి పటంలా గోడకు వ్రేలాడదీసి ప్రదర్శనకు పెట్టినట్టుగా చేస్తే ఈ మానవ సమాజం చాలా అసహ్యంగా, వికృతంగా కనిపిస్తుంది." తల్లిని తప్పుకొని పైకి వెళ్ళిపోయాడు అజయ్, మెరుపులా.

    శివం దిగిపోగా కుప్పకూలిపోయే మనిషిలా ఆవేశమంతా జారిపోగా క్రుంగిపోయినట్టుగా సోఫాలో కూలబడిపోయింది సువర్చల "మీనాక్షి సమస్యను ఎలా పరిష్కరించాలి, పాపా? అజయ్ తీసేసినంత తేలికాగా నేను తీసివేయలేకపోతున్నాను." అంది దిక్కుతోచనట్టుగా.

    "ఇంతగా మీరు విచలితులౌతారని అనుకోలేదు, ఆంటీ." ప్రేమీ గొంతులో పశ్చాత్తాపం ధ్వనించింది. "ఈ రోజు ఆంటీకి పరీక్ష అనుకొన్నాను. పాతిక సంవత్సరాలకు పైగా సంఘసేవలో, మహిళాభ్యుదయం కోసం జీవితం గడిపిన ఆంటీ హృదయ సంస్కారానికి ఈ రోజు పరీక్ష అనుకొన్నాను. పరీక్షలో మీరే గెలిచారు, ఆంటీ! మీలాంటి గొప్ప వ్యక్తి సాంగత్యం లభించడం నా అదృష్టంగా గర్వపడుతున్నాను." ప్రేమీ గొంతు ఆవేశంతో పూడుకుపోయింది.

    "గొప్ప వ్యక్తినా? అయితే నా కిప్పుడే పరిక్ష ప్రారంభమైందని అనుకోవాలి. మీనాక్షి సమస్యను నేను న్యాయంగా పరిష్కరించగలిగితే నిజంగా నేను గొప్ప వ్యక్తినే అవుతాను. తరతరాలుగా ఈ దేశంలో స్త్రీ అన్యాయ మౌతూనే ఉంది. ఇవాళ ఒక స్త్రీకి జరిగిన అన్యాయంలో భాగస్వామి నా కొడుకు. నా కడుపున పుట్టినవాడే అనుకొంటూంటే దుఃఖంతో నా గుండెలు మండిపోతున్నాయి." ఆక్రోశించ సాగింది సువర్చల.

    "అజయ్ ని ఒప్పించి మీనాక్షికి పెళ్ళి జరిపించడం కంటే మరో విధంగా మీనాక్షికి న్యాయం దొరకదుగా?"

    "అతడి ధోరణినిబట్టి అంత తేలిగ్గా పెళ్ళికి ఒప్పుకొంటాడని అని పించడంలేదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అదీ ఇప్పుడు మన ముందున్న సమస్య."

    "మీనాక్షితో వివాహం జరిపించి తీరుతానని అజయ్ తో అనండి, ఆంటీ. అతడినుండి ఏం జవాబు వస్తుందో చూద్దాం."

    "సరే. కథ నడిపించడంలో నేనేమీ ఆలస్యం చేయను." అంటూ కొడుకు దగ్గరికి బయల్దేరింది సువర్చల.

    అజయ్ డన్ లప్ పరుపు మధ్య వెల్లికిలా ఎదమీద చేతులు కట్టుకు పడుకొని పైన తిరుగుతున్న ఫాన్ వంక చూస్తున్నాడు. ఎంతగా సమస్యల్ని విదిలించుకొని సరదాగా తిరిగే మనిషి అయినా ప్రస్తుతం చుట్టేసిన ఈ సమస్యనుండి ఎలా బయట పడాలిరా అన్నట్టు కనుబొమలు దీర్ఘాలోచనతో ముడిపడ్డాయి.

    "అజయ్! నువ్వు తీసేసినంత తేలిగ్గా ఈ సమస్య నిన్ను వదలదు. ఆ అమ్మాయి ఈ రోజు కాకపోయినా రేపైనా నీ పేరు వీధిలోకి లాగుతుంది. లాగకపోతే నేను ఆ అమ్మాయి వెనకుండి లాగిస్తాను. మగవాడిని నాకేమిటి అని విర్రవీగకు. మగవాడివైనా తలవంచుకొనే పరిస్థితి తెస్తాను."

    "ఈ బెదిరింపుకు అర్ధం?" అజయ్ కనుబొమలు ఎత్తి అడిగాడు.

    "నువ్వు మీనాక్షిని వివాహం చేసుకొని ఇంటికి తీసుకురావాలి. లేకపోతే పర్యవసానం బాగుండదు."

    అజయ్ లేచి కూర్చున్నాడు. "మీనాక్షి కథ ఈ రోజు తెలిసింది నీకు. నీకు తెలియని కథలు ఇంకా ఉండవచ్చుగా? వాళ్ళందరికీ నువ్వు న్యాయం చేయగలవా? చేయాలని నీకంత ఉబలాటంగా ఉంటే కోడళ్ళతో నీ ఇల్లు నిండిపోతుంది. అప్పుడు అత్తగా నీ సుఖం, నీ దర్జా ఏమని చెప్పాగలం?" అజయ్ నవ్వసాగాడు.
   

 Previous Page Next Page