Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 44

   
    "తొందర పడకండి సార్! రెండు మూడు రోజుల్లోనే మిమ్మల్ని కలుస్తాను."    
    అంగీకార సూచకంగా తల ఊపాడు మోహన్...... సాంబశివం విశ్వాసం చూరగొన్నవాళ్ళు, తనకు సహకరించేవాళ్ళు ఎవరా అని అలోచించసాగాడు మోహన్. రేఖ గుర్తుకొచ్చింది. కానీ సాంబశివం రేఖను నమ్ముతాడా, ఆ మాట కొస్తే తను నమ్ముతాడా?    
    చూడాలి!    
    ఆరోజే చిరంజీవి! ప్రసూనను కలుసుకున్నాడు. ఏదో యథాలాపంగా చెప్పినట్లు జరిగిందంతా ప్రసూనకు చెప్పాడు.....    
    "ఎవరయినా సాంబశివం నమకం సంపాదించుకున్న వ్యక్తులు సహాయపడితే తప్ప లాభము లేదని బాధపడుతున్నారు మోహన్!" అన్నాడు.    
    "చిరంజీవీ! నువ్వు నాకొక సహాయం చేయగలవా" ఆలోచిస్తూ అంది ప్రసూన......   ప్రసూనలో ఇలాంటి రియాక్షన్ ఆశించే చిరంజీవి ప్రసూనకు సంగతులన్నీ చెప్పాడు___అయినా అమాయకముగా "ఏమిటి?" అన్నాడు.    
    "నువ్వు మోహన్ తో నా పేరు చెప్పకు. సాంబశివం ప్రేమించే వ్యక్తి నీకు తెలుసుననీ-ఆవిడద్వారా ప్రయత్నిస్తాననీ  చెప్పు___ఎలాంటి సహాయం కావాలో అడుగు."    
    "సాంబశివంగారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా?" పట్టరాని ఆశ్చర్యముతో అడిగేశాడు చిరంజీవి.....    
    ప్రసూన సిగ్గుపడింది....సంకోచపడింది. "ఏమో మరి! అలానే అనిపిస్తుంది. నాతో ఎప్పుడూ స్పష్టంగా ఏమీ అనలేదనుకో....."    
    "అయితే మీరు....."    
    "అవన్నీ నీకనవసరం! నా సహాయం కావాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి" మందలిస్తూ అంది.    
    చిరంజీవికి ప్రసూన సహాయపడతాననడం రుచించింది కానీ, మిగిలిన విషయాలు రుచించలేదు.....    
    ప్రసూన చెప్పమన్నట్లే మోహన్ కు చెప్పాడు___మోహన్ సి.ఐ.డి. ఆఫీసర్.....చిరంజీవి పేరు చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎవరో ఊహించగలిగాడు.    
    "ఆవిడే చెప్పిందా, సాంబశివం తనను ప్రేమిస్తున్నాడని?"    
    సాధ్యమయినంత నిగ్రహముతో అడిగాడు.    
    "అవును సార్!"    
    "మరి, ఆవిడ ఆ ప్రేమను అంగీకరించినట్లేనా?"    
    చిరంజీవి సిగ్గుపడిపోయాడు.    
    "నాకు తెలియదు సార్!" అని ఒక్క క్షణం ఆగి అన్నాడు.    
    "అలా అయివుండదు సార్? మనకు సహాయం చేస్తానని ఎందుకంటుందీ?"    
    "అంత మాత్రాన అయిపోయినట్లేనా?"    
    "నాకు తెలుసు సార్! ఆవిడ అలాంటిది కాదు!"    
    రోషంతో కచ్చితంగా అన్నాడు.    
    మోహన్ నవ్వి "చిరంజీవీ! ఎవరూ ఎవరికీ ఊరికే సహాయం చెయ్యరు! తను చెయ్యబోయే సహాయానికి ఆవిదెఅ కోరే మూల్యం మును ముందుగానే నిర్ణయించు__" అన్నాడు.    
    చిరంజీవి మోహన్ మాటలు ప్రసూనతో చెప్పాడు.    
    ప్రసూన రోషంతో "నేను అందించే సహాయాన్ని స్వార్ధంతో అమ్ముకోకుండా ఉండటమే నేను కోరే మూల్యం" అంది.    
    ఈ సమాధానముతో మోహన్ అనుమానాలు పటాపంచలయిపోయాయి. "సూనా! నీకీ అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఇచ్చే అవకాశాన్ని అందుకుంటాను" అనుకున్నాడు తనలో తను.    
    చిరంజీవిని పిలిచి ఒక రిస్ట్ వాచ్, ఒక పైటపిన్ను చూపించాడు......    
    "ఇది పైకి రిస్ట్ వాచ్ లా కనిపిస్తూనే అవసరమైనప్పుడు రికార్డర్ గా ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న శబ్దాన్నీ రికార్డు చేస్తుంది. ఈ పైట పిన్ను మధ్యలో ఉన్న లాకెట్ లో కెమెరా సిస్టమ్ ఉంది. ఎదుటి వ్యక్తులకు తెలియకుండా ఫోటోలు తీయవచ్చు. ఇవి రెండు ఆవిడకియ్యి, ఎలాంటి సహాయం చేస్తుందో చూద్దాం!'    
    ఆ వస్తువులు అతి జాగ్రత్తగా అందుకున్నాడు చిరంజీవి......    
    "జాగ్రత్త! చిరంజీవీ! ఎవరిని పడితే వాళ్ళను నమ్మకు!" హెచ్చరింపుగా అన్నాడు మోహన్......    
    "ఎందుకు సార్! మీకు లేని జాగ్రత్త నాకు చెపుతారు?"    
    "అదేమిటి?"    
    "అంతేమరి! మీకు నమ్మకం లేకపోతే ఈ వస్తువులు నాకిచ్చేవారా?"    
    మోహన్ ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకెత్తి చిరంజీవి భుజం తడుతూ నవ్వాడు.    
    సాంబశివం సుశీలకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. ఏ సంబంధమూ ఒకంతట అతనికే నచ్చలేదు. తన సుశీలకు చాలా చాలా అపురూపమైన వరుడు రావాలి. అదే అతని సంకల్పం. ఎలాగయితేనేం ఒక సంబంధం నచ్చింది. వరుడు డాక్టరు. చాలా అందంగా ఉంటాడు. మంచి కుటుంబం. ఈ సంబంధం లలితకు కూడా నచ్చింది. వరుడి ఫోటోను సుశీలకు చూపించి "చూడు! నీకు నచ్చితే పెళ్ళి చూపులకు పిలవమంటేనే పిలుస్తాను" అన్నాడు సాంబశివం.

 Previous Page Next Page