ఆమె సిగ్గుపడింది.
లేచి కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని, ఊరటపడ్డ మనసుతో కుర్చీలో చేరగిల పడింది.
* * *
హఠాత్తుగా తనని వెదుక్కుంటూ వచ్చిన స్నేహితురాల్ని చూసి ఆశ్చర్యపోయింది లీల.
"వారేవా! ఏమి చిత్రం! నేను కలగంటున్నానా మనూ! లెటరైనా డ్రాప్ చెయ్యకుండా యిలా వూడిపడ్డావేమిటి?" అంటూనే ఉక్కిరిబిక్కిరి అయేటట్లుగా కౌగిలించుకుంది.
"అబ్బ! రోడ్డుమీద అంతా చూస్తున్నారు. కాస్త యింట్లోకైనా రానీ! నీ యిష్టమొచ్చినంత గట్టిగా కౌగిలించుకుందువుగాని."
"చూడనియ్యవే. అందమైన యిద్దరమ్మాయిలు కావలించుకుంటే ఎంత అందంగా వుంటుందో తెలుస్తుంది" అంటూ స్నేహితురాలి చెయ్యి పట్టుకుని బరబర యీడ్చుకుపోయింది లీల.
"ఇదిగో యిదీ మాయిల్లు. యిది హాలు. అది డ్రాయంగ్ రూం. అక్కడే బెడ్ రూం. అదేమో కిచెన్. బాగుందా? అద్దె నూటయాభైలే."
"ఫస్ట్ క్లాస్ గా వుంది. అయినా మీరిద్దరేగా వుండేది. హాయిగా వుంటుంది."
"అది సరేగాని పిల్లా! ఈ అవతారమేమిటి? ఈ ఆగమనం ఏమిటి? ఏదైనా అర్జంటు పనిలాంటిది తగిలిందా? మీ వాళ్ళెవరైనా డేంజర్ లో పడ్డారా? ఏమిటి కథ?"
"అబ్బ నన్ను ఊపిరి పీల్చుకోనిస్తావా? అర్జంటు పనీలేదు. డేంజరూ లేదు. చిన్న డేమేజ్ లాంటి దొకటొచ్చింది" అంది మనోరమ అక్కడున్న సోఫాలో కూలబడి.
లీలకూడా ఆమెప్రక్కనే కూర్చుంది. "ఎవరికీ? నీకే! నీది లౌ మేరేజ్ కదే, ఇంకా డేమేజేమిటి? జాలీగా లౌలీగా స్పెండ్ చేయవలసిన కాలం."
"దూరపుకొండలు" అని నిట్టూర్చింది మనోరమ.
"అదేమిటేవ్! నిజంగానే ఏదో కిర్ కిర్ వున్నట్లుందే. అందుకేనా అంత చిక్కిపోయావు? వుండు కాఫీ తీసుకువస్తాను. తదనంతరం నీ ఉదంతమంతా వినిపింతువు గాని."
* * *
"అదా కథ" అంది లీల ఆశ్చర్యంగా.
"ఎందుకింత ఆశ్చర్యపడతావ్?" అని ప్రశ్నించింది మనోరమ.
"ఆశ్చర్యం కాక ఇంకేమిటి? స్వేచ్చకి నువ్విచ్చే నిర్వచనమేమిటి?"
"నువ్వు నా తెలివితేటల్ని పరీక్షించదలుచుకున్నావా ఏం?"
లీల నిట్టూర్చింది. "లేదు మనూ! నీ తెలివితేటల్ని నేను పరీక్షించటంలేదు. కాని ఎంతో తెలివైన వాళ్ళే ఒక్కోసారి చిత్రంగా తప్పడుగులు వేస్తుంటారు. సామాన్యులకుండే విచక్షణాజ్ఞానం కూడా అప్పుడు వాళ్ళకుండదు. అందుకే నా బాధ."
"ఓహో! నీ సానుభూతిమాత్రం కొనియాడదగింది సుమా. స్వేచ్చకి నిర్వచనం కదూ అడిగావు. ఆకాశంలో ఎగిరే పక్షిని కావాలి నేను. ఆకాశపు నీలిఅంచుని కావాలి నేను. నాలో జ్యోతి వుంది. అది అందంగా వెలగాలి. హద్దులూ, సరిహద్దులూ నాకు సరిపడవు. అడవిలో వంటరిగా పాక వేసుకొని అందులో మసిలే ఏకాంతం, నలుగురితో నవ్వుకుని పసిపాపలా నిద్రించగలిగే స్వచ్చత, గొంతెత్తి పాడుకునే అదృష్టం, వంటరినై ప్రకృతిలో చేసుకునే మయూర నృత్యం ఇవన్నీ కావాలి నాకు."
మనోరమ ఆవేశం, ఉత్తేజం చూసి లీల పకపకమని నవ్వసాగింది.
"ఎందుకు నవ్వుతారు?" అనడిగింది మనోరమ కాస్త కోపంగా.
"ఓసి స్వేచ్చాప్రియా!" అంది లీల గోముగా. "నువ్వో ఊహావాసిగా, అతీతపు వ్యక్తిగా చేసుకుని మాట్లాడకు. అనుభవశూన్యులు రాసే పుస్తకాల్లో మాటలు, దూరంగా వుండి రాసుకునే ప్రేయసి ప్రియలలేఖలు ఈ భావాలతో వుంటాయి. ఇది ప్రాక్టికల్ వరల్డ్. ఇందులో బంధం తప్పనిసరి."
"నువ్వు కూడా ముసిలిదానిలా చాదస్తపు మాటలు చెప్పకు లీలా."
"నేను చెప్పేవి చాదస్తపు మాటలు కాదే మనూ! అనుభవపూర్వకమైన వాక్కులు. బంధాలు లేకుండా జీవించాలనుకోవటం అదొక ప్రగల్భం అవుతుంది. అసలు ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనది ఈ బంధమే తెలుసా?"
మనోరమ స్నేహితురాలివంక పరిహాసంగా చూస్తోంది.
"అసలది లేనిదే మనిషి మనుగడే లేదు. మనం పనిచేయడానికీ, అన్నం తినడానికీ ఆఖరికి నిద్రపోవడానికి కూడా కారణం కన్పించదు. ఆ సంబంధం లేని స్త్రీలు, పురుషులు వంటరితనంతో ఎంత అల్లాడిపోతారో, పీడించబడతారో నీకు తెలీదు. స్వేచ్చ అనేదానికి తప్పు అర్థాలు కలిగించకు. ఉద్యోగిగా, వృత్తి చేసేవాడిగా, భార్యగా, భర్తగా ఏ విధంగానైనా సరే మనిషికి స్వేచ్చ పూర్తిగా లేదు. వుండకూడదు. ఉన్ననాడు మానవత్వపు మనుగడే లేదు. అంతు వుండదు స్వార్థానికి. అప్పుడు ప్రతిదీ స్వేచ్చ పేరిట చలామణి అవుతుంది. అది మీ తొడుగు అవుతోంది." లీల ఆగింది. స్నేహితురాలు ఏమీ మాట్లాడకపోయేసరికి ఓ క్షణమాగి మళ్ళీ ప్రారంభించింది.
"నృత్యం, సంగీతం, ఏదో ఒక కళ అభిరుచి వున్నవారికి అత్యంతావశ్యక మైనవే. కాని వాటికోసం జీవితాన్ని వదులుకోవటమా? రాజీపడక హద్దులు అఖ్కరలేదనుకుంటే మిగిలేది అశాంతే. అగ్నే. నిండుతనం లేక ఆ జీవితం చివికి చివికి ఆ నాట్యకత్తె అలసి సొలసి వేసిన తప్పడగులు లాగానో, ఆ గాయని గొంతుపోయి చేసిన అపశ్రుతిలాగానో వుంటుంది. స్వేచ్చకి యింత భయంకరమైన స్వరూపం యివ్వకు పిచ్చితల్లీ."
"పోవే" అంది మనోరమ ఆమె మాటల్ని త్రోసిపారవేస్తూ. "భర్త, పిల్లలు, అదే ప్రపంచం. అతని అభిరుచులకి లొంగిపోవటం. దీన్నేగా నువ్వు మధురతరమైనదనేది."