ఆమె అంతరంగం అహంకారంతో ఘార్ణిల్లుతోంది. అసలు తను ఈ వెధవని ఎందుకు తోడు తెచ్చుకుంది? విద్యావతి, చొరవగలది. తెలివితేటలు గలది ఒక్కతే తన గమ్యం చేరుకోలేదా? వీడు తనకి సాయపడేవాడా? అసలింత అనాలోచితంగా ఎందుకు ప్రవర్తించింది? ఏమయినా సరే ఇహ ఒక్కక్షణం కూడా వేడిని భరించలేదు. వీడి పీడ వదిలించుకోవాలి.
రాత్రంతా నిద్రలేకపోవటం వలన ఆమెకన్నులు మూసుకుపోతున్నాయి. ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది.
ఆమెకు తిరిగి మెలకువ వచ్చేసరికి మొట్టమొదటిగా స్ఫురించిన విషయమేమిటంటే కడుపులో కాలుతోంది. చేతికి వున్న రిస్టువాచిలో టైం చూసుకుంది. బాప్ రే! వొంటిగంట దాటిపోయింది. తాను ఓ మూడు గంటలసేపు నిద్రపోయిందన్నమాట. లేచి బెల్ నొక్కింది. వెయిటర్ రాగానే గదిలోకి భోజనం తీసుకురమ్మని చెప్పి వచ్చి కుర్చీలో కూర్చుంది.
భోజనం ముగించాక అయిదునిముషాలన్నా గడవకముందే వంటవాడు తలుపు తోసుకుని గదిలోకి వచ్చాడు. కిళ్ళీ గిల్లీ ఝమాయించి ఖుషీగా వున్నాడు.
"మీరు అన్నం తిన్నారా? ఓ అరగంట క్రితం వచ్చాను. తలుపు తడితే తెరవలేదు. నిద్రపోతున్నారేమో ఆనుకుని క్రిందకు వెళ్ళి భోంచేసి అలా తిరిగి వచ్చాను. బాగా నిద్రపట్టిందా?"
ఏమిటీ పరామర్శ? అతని ముఖం కనిపించగానే ఆమెలో క్రోధాగ్ని రగులుకుంటోంది "ఆఁ" అన్నది వెటకారంగా.
"అయితే మళ్ళీ పడుకోరుగా. నేను కాసేపు నిద్రపోతాను. కళ్ళు మూసుకుపోతున్నాయి" అంటూనే వాడు ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా మంచంవైపు పోతున్నాడు.
వెంటనే మనోరమ పరమ ఏవగింపుతో "ఛీ" అన్నది.
ఈ ఛీత్కారం విని తెల్లబోయినట్లు "ఏం! మీదేనా ప్రాణం? నాది ప్రాణం కాదా? నేను నిద్రపోకూడదా?" అన్నాడు.
"నేనిక్కడ వుండగా నువ్వు మంచంమీద పడుకుంటావా? నీ బుద్ధి పెడతల పట్టిందా? అంత నిద్ర ముంచుకువస్తుంటే పోయి ఆ మూల దొర్లు. అంత మతిలేకుండా మాట్లాడుతున్నావా?" అని అరిచింది కోపంగా.
ఈసారి అతను "మీ సంగతి నాకేం అర్థంకావటం లేదండోయ్" అంటూ ఖస్సుమని లేచాడు. "వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. ఏమిటి మీ దబాయింపు? ఈ దర్పమంతా మీరు నాతో లేచివచ్చినప్పుడేమైంది?"
"వాట్?" ఆమె కోపంతో, అవమానంతో ఉడికిపోయింది. "ఇడియట్! ఏమిటి పేలుతున్నావు? నేను నీతో లేచివచ్చానా?"
ఆమె ఉగ్రరూపం చూసి అతను క్షణకాలంపాటు వొణికిపోయాడు భయంతో. కాని ఆమె వంటరితనం, ప్రస్తుతం వున్న స్థితి వెంటనే స్ఫురణకు వచ్చి "అవును వున్నమాటంటే యింత ఉలుకెందుకూ? లేచి రాకపోవటం కాకపోతే మరి దీన్నేమంటారు? నామీద మనసై, నన్ను వల్లో వేసుకుని యిక్కడకు తీసుకువచ్చి యిప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారా? మీ గొప్పవాళ్ళ దగ్గర వున్న పాడుబుద్ధి ఇదే" అంటూ విజృంభించాడు.
వీడితోనా... వీడితోనా... తను...మనసయిందా? వల పన్నిందా?
ఆమె వినలేకపోయింది. అతి దారుణమైన ఈ సంఘటన... ఆమె వాడి దవడ ఎడా పెడా వాయించేద్దామనుకుంది. ముఖంలోకి, కళ్ళల్లోకి రక్తం పొంగింది. అణువు అణువునా వొణుకుతోంది. "గెటవుట్" అని గట్టిగా అరుద్దామనుకుంది.
కాని...
కాళ్ళలో బలం నశించిపోతున్నట్లుగా వుంది. తలంతా మంట, వేడి. కళ్ళు తిరుగుతున్నాయి. వాడ్ని భస్మం చేస్తున్నట్లుగా చూసిన ఆమె కన్నులు మూతలు పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా నిలద్రొక్కుకోలేక... చివరకు స్మృతితప్పి నేలమీద పడిపోయింది.
వంటవాడికి యిదంతా చూసేసరికి విపరీతమైన భయం వేసింది. అతనికిదంతా ఇలా ఎందుకు జరిగిందో ఏమీ పాలుపోలేదు. దగ్గరకు వచ్చి నేలమీద కూర్చుని ఆమెముఖంలోకి చూశాడు. ఆ స్థితిలో కూడా ఆమెను తాకి చూడటానికి ధైర్యం చాలలేదు. "అమ్మగారూ!" అని పిలిచాడు ఇంట్లోంచి బయలుదేరిన మొదటిసారిగా. ఆమెలో కదలిక లేదు. అతనికి గాభరా పుట్టింది! లేచి మూలనున్న కూజా తీసుకువచ్చి అందులోని నీళ్ళు చేత్తో ఆమెమీద చిలికాడు.
ఆమె కళ్ళువిప్పి వెంటనే ఎంతో అసహ్యపడుతూ లేచి కూర్చుని పమిట సవరించుకుని "నువ్వు వెంటనే నా కళ్ళముందు నుంచి పో. ఒక్కక్షణంకూడా యిక్కడ వుండొద్దు" అంది కోపం కురిపిస్తూ.
అతను చేతులు నలుపుకుంటూ "మిమ్మల్ని నమ్ముకుని నా ఉద్యోగానికి తిలోదకాలిచ్చుకొని వచ్చాను. యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోయేది?" అన్నాడు దీనంగా.
మనోరమ ఆలోచించింది. తన దగ్గరకూడా ఎక్కువ డబ్బులేదు. తనకి కొంతకాలంపాటు ఖర్చులకి ఆ పైకం అవసరం. ఏదో తోచి వెంటనే ఆమె కంఠాన వున్న రాళ్ళనెక్లెస్ తీసి అతని కాళ్ళదగ్గర గిరాటువేసి "ఇది తీసుకుపోయి ఎక్కడన్నా జాగ్రత్తగా అమ్ముకుని అవసరం గడుపుకో. మళ్ళీ ఎక్కడైనా పనికి కుదిరి ఎలాగో తిప్పలు పడు" అంది.
అతనది తీసుకుని జేబులో పడవేసుకుని "మరీ మీరు వొంటరిగా ఎలా వెళ్తారు? ఎక్కడికి పోతారు?" అని అడిగాడు.
"ఆ విషయాలన్నీ మీకనవసరం. ఇహ వెళ్ళు."
"పోనీ మెడ్రాస్ దాకా సాయం రమ్మంటారా? నేను మిమ్మల్ని వేధించను లెండి. అక్కడ దింపి ఎటైనా వెళ్లి బ్రతుకుతెరువు చూసుకుంటాను."
"అక్కర్లేదయ్యా మహానుభావా? నువ్వు ముందు యిక్కడినుంచి దయచేస్తే ఎంతో ఉపకారం చేసినట్లు. నన్ను విసిగించకు."
వంటవాడు ఇహనేమీ సాగదియ్యలేదు. తన బాధ్యత తీరిపోయిందనుకుని అక్కడ్నుంచి బయటపడి తనదారిన పోయాడు.
మనోరమ వెంటనే గట్టిగా ఏడ్చేసింది. "థూ. పాడు ప్రపంచం. థూ" ఆమె అలా ఎక్కువసేపు ఏడవకముందే ఆమె మనస్సు గట్టిగా ఎదురుతిరిగింది. చెంప సవరించుకుంది. రాత్రి భర్తకొట్టిన దెబ్బ అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని, భగభగ మండుతున్నట్లు వుంది. తను ఎందుకు ఏడవాలి పిరికిదానిలా? తాను ఎందుకు బయటకు వచ్చింది? తన గమ్యం ఏమిటీ? ఏమిటి దుఃఖం?"