"అభిరుచికి లొంగిపొవటమంటే నాకర్థంకాలేదు. వీటిని నువ్వు వ్యక్తిత్వం, బానిసత్వం అని పేర్లుపెట్టి మేగ్నిఫై చేసి చూడకు. ఒకళ్ళ సుఖంకోసం ఒకరు కాస్త స్వకీయవాంఛల్ని త్యాగం చేసుకున్నంతమాత్రాన వచ్చే అనర్థమేమీ లేదు. వాళ్ళకోసం మనం ఎంత త్యాగం చేసుకుంటున్నామో వాళ్ళూ మనకోసం అంత త్యాగంచేస్తూ వుంటారని గ్రహించాలి. సంస్కారమంతా మనదే అనుకోవటం కేవలం ప్రకర్ష. నాకు తెలిసినంతవరకూ దాంపత్యబంధాన్ని మించిన సత్యం భూమ్మీద మరొకటి లేదు. అది పొందలేని వాళ్ళు దానికోసం యెంత తహతాహలాడతారో, లైఫ్ ని యెంత హారిబుల్ గా ఫీల్ అవుతారో నీకు తెలీదు. యీ అదృష్టాన్ని నువ్వు చేజేతులా పోగొట్టుకోకు."
మనోరమ నిర్లక్ష్యంగా నవ్వింది. ఆ నవ్వుని చూసి లీల ఇహ తాను చెప్పి ప్రయోజనం లేదని ఊరుకుంది.
మనోరమ ఆ రాత్రి హాల్లో వంటరిగా పడుకుంది. లీల, ఆమెభర్త లోపల పడకగదిలో పడుకున్నారు. బయట చలిగాలి విపరీతంగా వేస్తోంది. దుప్పటి ఎంత పూర్తిగా కప్పుకున్నా ఆమెకు చలి ఆగటంలేదు. లేచి కిటికీ తలుపులన్నీ వేసేసింది. మళ్లీ వచ్చి మంచంమీద కూర్చుంది. రాత్రివేళ... ఊరుకాని వూళ్ళో ఎవరూ లేని ఈ హాల్లో ఆమెకు చాలా భయం అనిపించింది. ధైర్యం సడలిపోసాగింది. లీల ప్రక్కనే కొన్ని అడుగుల దూరంలో పెనిమిటితో పడుకుంది! ఆమె చెప్పిన మాటలు చెవుల్లో గింగిరుమంటున్నాయి. "ఆఁ సింగినాదం" అని త్రోసివెయ్యబోయింది. కాణీ ఆత్మవంచనలాగే వుంది.
యీ పాటికి కాకినాడలో వాళ్ళు ఏం చేస్తూవుంటారో అనుకుంది. తన భర్త ఉగ్రరూపం ధరించి కారాలు మిరియాలు నూరుతుంటాడు. అత్తగారూ, మామగారూ కంగారుపడిపోయి విజయనగరం ఉత్తరం రాసి వుంటారు. అక్కడి వాతావరణమంతా అతలా కుతలంగా వుండివుంటుంది.
ఇంతలో ఆమెకి మరో ఆలోచన వచ్చి గుండె ఝల్లుమంది.
తను వంటవాడితో లేచిపోయానని...
ఆమె తండ్రికి ఉత్తరం రాసింది. "నేను చేసిన పని పొరపాటని నేననుకోవటంలేదు. నేను స్వాభిమానిని. నన్ను గురించి మీరు చెడుగా భావించటం నాకిష్టంలేదు. శీలం విషయంలో నాకున్న పట్టింపు ఎవరికీ లేదు. మన కుటుంబానికి మచ్చ తెచ్చేపని ఎన్నడూ చెయ్యను. కాని నాకు స్వేచ్చాభావాలు వున్నాయి. అందుకని నా సున్నిత హృదయాన్ని అర్థం చేసుకోలేని నా భర్తని విడిచి ఇలా వచ్చాను. నాకు ప్రస్తుతం డబ్బు చాలా అవసరం. నాకు మీరు పంపగలిగినంత పైకం పంపిస్తే కృతజ్ఞురాలినయి వుంటాను."
లీలని చూస్తే ఆమెకు విచిత్రంగా వుంది. తనతోకూడ చదువుకునేటప్పుడు అంత పెంకెగా, గడుసుగా, పొగరుగా వుండే మనిషి ఇప్పుడు భర్త అంటే అంత ఆరాధిస్తూ బ్రతకటం ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అతని ప్రతిమాటా, ప్రతి చేతా ఆమెకు ఘనంగా కనిపించి ఉప్పొంగిపొవటమూ, వాళ్ళ కేరింతలు, ఒకరిని విడచి ఒకరు వుండలేకపోవడం, ఆ తన్మయత ఆమెకు జుగుప్సా కరంగా కనిపిస్తోంది. యెంత మారిపోయింది లీల! ఆమె ఆశ్చర్యానికి అవధులు లేవు.
ఆమెకు తండ్రి దగ్గర్నుంచి జవాబు వచ్చింది.
"నీ వుత్తరం అందింది. వ్యక్తిత్వం, సున్నిత హృదయం అనే పేర్లు చెప్పి నువ్వు చేసే పనిని సమర్థించుకోవటానికి ప్రయత్నించకు. నువ్వు నా కడుపున చెడబుట్టావని నిస్సందేహంగా భావిస్తున్నాను. చాలాకొద్దిరోజుల్లోనే అన్నిటికన్న సురక్షితమైన స్థానం, శాంతినిచ్చే స్థలం ఏమిటో, ఎక్కడో గ్రహిస్తావు. కాని అప్పటికి సమయం మించిపోతుంది. ఒక్కసారి అద్దంముందు నిల్చుని నువ్వు చేసిన పని సమంజసమైనదో కాదో అని చిత్తశుధ్ధితో ప్రశ్నించుకుంటే నిజం నీకే బోధపడుతుంది. నువ్వు డబ్బు అడిగావు. కన్నకూతురివి కాబట్టి... మమకారం చంపుకోలేక వెయ్యిరూపాయలు పంపిస్తున్నాను. తల్లిలేని పిల్లవనే జాలికూడా వుంది. ఆ కారణంతోనే నువ్వు ఎప్పటికైనా ఇంటికి తిరిగివస్తే క్షమించటానికి సిద్ధంగా వున్నాను."
మనోరమ నిట్టూర్పు విడిచింది. ఈ లోకంలో తననెవరూ అర్థం చేసుకోరేం? ఆఖరికి కన్నతండ్రికూడా.
* * *
ఆరునెలలయినా తిరక్కముందే ఆమెకు జీవితమంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఆమె లీల వాళ్లింట్లో ఎక్కువరోజులు వుండలేదు. అక్కడ తనకు తెలియకుండానే ఏదో ఈర్ష్య ఆమెను దహింపజొచ్చింది. ఎంత వద్దనుకున్నా బాధ, చికాకు కలిగేవి. మెల్లిగా ఆ ఇంటిని విడిచిపెట్టింది.
తనకు జీవితం కావాలి!
ఈ డబ్బు ఎన్నాళ్ళని వస్తుంది? అది ఖర్చు పెట్టేలోపునే తనధ్యేయం నెరవేరాలి. రాయపేటలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులో నివసిస్తూ ఆమె కర్తవ్యనిర్వహణకి పూనుకుంది. ఎవరి సహాయంమీదా ఆధారపడడం ఆమెకు రుచించదు. తనలో శక్తులున్నాయి, ఆకర్షణలు, గొప్పతనం వున్నాయి. సాధించలేదా వొంటరిగా?
రేడియోకి వెళ్లి అడిషన్ ఇచ్చింది. ఆమె గానమాధుర్యానికి ముగ్ధులయారు అక్కడి అధికారులు. అనతికాలంలో ఆమెకు పాడటానికి అవకాశం ఇచ్చారు.
మనోరమ రేడియోలో పాడింది.
శ్రోతలదగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాలు చూసి రేడియోవాళ్ళు ఎంతో గర్వపడ్డారు. ఆమె కంఠంలో ఫ్లాష్ వుందని గుర్తించారు. నెల నెలా ఆమెకి ప్రోగ్రాం ఇవ్వటానికి నిశ్చయించారు.
సహజంగా చొరవగలదీ, సౌందర్యవతి కావటంవలన ఆమె త్వరలోనే అనేకమంది స్నేహితుల్ని సంపాదించుకోసాగింది. క్లబ్బులకూ, సమావేశాలకూ విధిగా హాజరవుతూ తన పరిచయాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. ఒకసారి ఓ క్లబ్బులో జరిగే సమావేశంలో ఆమెతో పాడించారు. కూర్చుని వున్న జనమంతా మంత్రముగ్ధులయినట్లుగా విన్నారు. "యీమె తప్పకుండా సినిమాలలో చేరి రాణించవలసిన వ్యక్తి" అని తీర్మానించారు.
మనోరమ ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు.
ఓ కొత్తశకం ప్రారంభమయినట్లుగా అయింది.
రేడియోలో పాటలు పాడుతూ తను, రేడియో నాటికలు నటిస్తూ తను, నృత్య ప్రదర్శనలు ఇస్తూ అపూర్వ భంగిమల్లో తను, రంగస్థలంమీద అద్భుతంగా నటిస్తూ తను, ఇంట్లో దీక్షతో సాధనచేస్తూ బిజీగా తను, అట్టహాసంగా తను, ఆడంబరంగా తను.


