చంద్రరేఖకి శశి బాధ ఏమిటో అర్ధమవుతూంది. వాసు తొందర వల్ల సంసార సుఖంలో ఆమె సంతృప్తి పడకపోవడం, దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్ధలు. భార్యికి భయపడి వాసూ రోజూ రాత్రిళ్ళు ఇంటిదగ్గర కాకుండా ఎక్కడెక్కడో పడుకోవడం. ఆమెకి కోరికలు తీరక మానసికంగా దెబ్బతినడం. వీటన్నిటికి మూలం వాసూ ప్రతి విషయంలో మాదిరిగానే పడకలో కూడా తొందరపడడం.
వాసూతో రేపైనా మాట్లాడాలి. అటునుంచి నరుక్కొస్తేగానీ శశి సమస్యకు పరిష్కారం దొరకదు. వాసూని ఎలాగైనా కలుసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది చంద్రరేఖ.
అందుకే మరుసటిరోజు ఫ్యాక్టరీలో పనయిపోగానే ఇంటికి త్వరగా వచ్చింది. భోజనం వండడం పూర్తయ్యాక చిట్టిని పిలిచి "భూపతిరెడ్డి ఇంటిముందు కాపుకాయి, వాసూ ఇంటినుంచి బయల్దేరి ఎక్కడికో వెళ్ళి పడుకుంటాడు. అతన్ని వెంబడించి ఎక్కడ పడుకున్నదీ నాకొచ్చి చెప్పు. అర్జెంట్ పనుంది" అని పురమాయించింది.
చిట్టి అలాగేనని తల ఊపి బయల్దేరాడు. అతను వచ్చేవరకు ఒంటరిగా వుండడం బోర్ కొడుతుందని నాడార్ కొట్టుకి బయల్దేరింది చంద్రరేఖ.
వెన్నెల్లో చీకటి సరిగా కలవక అక్కడక్కడా చీకటి ముద్దలు ముద్దలుగా పేరుకుపోయినట్లు ఇళ్ళ నీడలు వీధిలోకి సాగుతున్నాయి. గాలి చలిదుప్పటిని కప్పుకుని వచ్చినట్లు చల్లగా తగుల్తోంది.
నైట్ క్వీన్ పరిమళం చెట్లలోంచి దూసుకొచ్చి ముక్కు మీద వాలుతోంది. అల్లం బర్ఫీ మిఠాయి పలకలను ఆకాశంలో ఎవరో ఆరబెట్టినట్లు తెల్లటి మబ్బులు బిగదీసుకు కన్పిస్తున్నాయి.
"చంద్రత్తా..చంద్రత్తా" ఎదురుగా వస్తున్న ఆకారం ఆమె దగ్గరికి వడివడిగా వచ్చింది.
"ఎవరూ? గంగాధరమా?" ఆ వూర్లో గంగాధరాన్ని పేరు పెట్టి పిలిచేది ఆమె ఒక్కతే. పెట్టుడు పేర్లు వ్యక్తుల్లో చాలా మానసిక క్షోభను కలిగిస్తాయని, వాటి ప్రభావం ఆ వ్యక్తులమీద ఎంతో వుంటుందని తెలిసిన ఆమె కనుక ఎవర్నీ నిక్ నేమ్లతో పిలవదు.
"ఏమిటయ్యా -అంత స్పీడ్ గా వచ్చావ్?" అని అడిగింది ఎదురుగా నిలబడి.
"ఒక రహస్యం చెప్పాలి" అతను మెల్లగా అన్నాడు.
"ఏమిటి?"
"నాతో శ్రీదేవి కాపురం చేస్తోంది -తెలుసా?" అన్నాడు ముఖాన్ని ఆమె ముఖం మీదికి వాల్చి.
అతని జబ్బు ఎంత ముదిరిందో తెలిసింది ఆమెకి. వెంట వెంటనే చేయగలిగింది కూడా ఏమీలేదు.
"అలానా" అంది చివరికి.
"అవునత్తా. మేమిద్దరం ఒకే ఇంట్లో -ఒక పడకలో -ఒకే కంచంలో- అలా భార్యాభర్తల్లా బతికేస్తున్నాం. శ్రీదేవి ఎంత గమ్మత్తుగా మాట్లాడుతుందో తెలుసా? ఎంత మత్తుగా నా వంక చూస్తుందో పసిగట్టగలవా?" అని మరింత మెల్లగా ఏదో అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నట్టు చెప్పాడు.
సినిమాకీ, నిజజీవితానికీ తేడా తెలియకపోవడంవల్ల జరిగే అనర్ధం ఈ కారణంవల్లే, సినిమా యాక్టర్లకు అంతమంది అభిమానులుంటారు కాబోలు.
"నే వస్తానత్తా. నేను ఒక్కక్షణం రాకపోతే పాపం శ్రీదేవి గుమ్మం దగ్గరే మామిడాకు తోరణంలా ఎదురు చూస్తుంటుంది" అని అంతే స్పీడ్ గా వెళ్ళిపోయాడు గంగాధరం.
ఇదేదో సినిమాలో సన్నివేశం అయివుంటుంది. చిరంజీవికోసమో నాగార్జున కోసమో - ఆ సినిమాలో ఎవరూ హీరో అయితే వాళ్ళకోసం శ్రీదేవి అలా వెయిట్ చేస్తూ నిలబడి వుంటుంది.
ఇది అతనిమీద బలంగా ముద్రపడిపోయి వుంటుంది. అందుకే అలా ఊహిస్తున్నాడు. ఇతని పిచ్చి వదిల్చే బాధ్యతకూడా తనమీదే వుంది అనుకుంటూ కొట్లువైపు నడిచింది చంద్రరేఖ.
నాడార్ ఆమెను చూసి "ఎన్నా వేణుం?" అని అడిగాడు.
"తెలుగునాటికి వచ్చి ఇంతకాలమైనా నీకు తెలుగెప్పుడు వస్తుంది?" అని నాడార్ వెర్రినవ్వుని చూస్తూ "తాంబూలం ఇవ్వు" అంది.
అతను తమలపాకులు, వక్కలు, సున్నం కలిపి ఇస్తే నోట్లో వేసుకుని "ఏలక ఒకటివ్వు" అని అడిగి తీసుకుంది చంద్రరేఖ.