15
హల్లో అజయ్ కాలేజీ పేపర్లు దిద్దుతున్నాడు.
సువర్చల ఓ లావుపాటి పుస్తకం పట్టుకొని అవపోసన పడుతున్నట్టుగా అత్యంత శ్రద్దగా, దీక్షగా చదువుతున్నది.
మధ్యాహ్నం మూడుగంట లవుతూంది.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
రోజూ ఆ సమయానికి వచ్చే ప్రేమీ వచ్చింది.
సువర్చల ఒకసారి తలెత్తిచూసి, "పాపా! ఒక గ్లాసు కూల్ డ్రింక్ తీసుకురామ్మా! ఐస్ కలిపి తీసుకురా!" అని చెప్పి మళ్ళీ చదవడంలో మునిగిపోయింది. ఎంతగా మునిగిపోయిందంటే "నాకూ ఒక గ్లాస్!" అని అజయ్ చిన్నగా కేకవేసి చెప్పడం వినిపించలేదు.
అయిదు నిమిషాల్లో రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకువచ్చి చెరోకటీ ఇచ్చింది. టేబిల్ మీద ఆ రోజు వచ్చిన మాగజైన్సు త్రిప్పసాగింది. త్రిప్పుతూనే అప్పుడప్పుడూ ఓరగా అజయ్ ని గమనించసాగింది.
అతడు ఏకాగ్రంగా తన పని చేసుకొంటున్నాడు. అతడి ఏకాగ్రతని సూచిస్తున్నట్టుగా అతడి చిన్న పెదవులు మరింత చిన్నవిగా అయ్యాయి, దగ్గరగా ముడుచుకొని. కళ్ళు లావుపాటి అద్దాల్లోంచి ముందున్న పేపర్లని చూస్తున్నాయి చేతిలోవున్న పెన్సిల్ తో అప్పుడప్పుడూ ఏదో రాస్తున్నాడు. పైన సీలింగ్ ఫాన్ తిరుగుతున్నా ప్రక్కనే తనకు గాలి వచ్చేట్టుగా టేబుల్ ఫాన్ ఉంచుకొన్నాడు. అతడు కూర్చొన్న ఆ తీరు చూస్తే పెద్ద మనిషిలా, బుద్దిమంతుడిలా కనిపిస్తాడు. కాని, అతడు ఎలాంటి పెద్దమనిషో నిన్నకళ్ళారా చూసింది. ఆ విషయంలో సువర్చలతో పోట్లాడాలనే వచ్చింది ప్రేమీ. ఆ సంగతి ఎత్తడానికి సందివ్వకుండా ఎవరి పనుల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. ప్రేమీ ఒకసారి పైకివెళ్ళి సువర్చల గది సర్ధింది. ఒకటి రెండు పనులు కల్పించుకు చేసింది. తిరిగి క్రిందికి వచ్చింది.
"ఆంటీ, ఏం పుస్తకమది?"
"యుగయుగాల భారతీయ మహిళ' నువ్వూ చదువు, పాపా! చాలా బాగా రాశారీమె. వేదయుగంనుండి ఈ అణుయుగం వరకు స్త్రీ జీవితాన్ని చక్కగా విశ్లేషించారు."
"ఆనాటినుండి ఈనాటివరకు ఆడది అన్యాయమౌతూనే ఉందిగా? అదేగా ఎవరు చెప్పినా?"
"వేదకాలం చాలా చక్కటిది స్త్రీలకు. వాళ్ళు ఎవరిమీదో ఆధారపడినట్టులేదు. యాగార్హత ఉండేది. ఇష్టమయితే పెళ్ళి చేసుకోవచ్చు. లేకపోతే లేదు. విధవలకు పునర్వివాహాలుండేవి. పిల్లల్లేని స్త్రీ విధవ అయితే పిల్లల కోసం మళ్ళీ పెళ్ళిచేసుకోవడం తప్పుకాదు. ఆశ్చర్యం ఏమిటంటే వీలున్నంతవరకు భర్త సోదరుడినే చేసుకోవాలి. ఇప్పుడా మాటవింటే 'రామ రామ' అంటూ చెవులు మూసుకొంటారుకదూ పెద్దలు?"
"స్త్రీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. కాని, ఒక విషయంలో మాత్రం ఇక ఎప్పటికీ మార్పు రాదేమో, ఆంటీ."
నిస్పృహగా అంటూన్న ప్రేమీ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది సువర్చల "ఏ విషయంలో మార్పు రాదంటావు?"
"వయసు కవ్వింపులకు లొంగి పెళ్ళికాకముందే బిడ్డ తల్లులు కావడం. సమాజభయంతో ఆ పిల్లల్ని కడుపులో వుండగానో, పుడుతూనో చంపేయడం. లేకపోతే ఏ అనాధశరణాలయాలలోనో, ఏ ఇంటి గుమ్మంలోనో వదిలేయడం. ఇది మాత్రం మారదుగా?"
"మీ అమ్మ కథ జ్ఞాపకం వచ్చిందా?"
"ఆమె లాంటి మరొకామె కథ! ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతూంది! నా క్లాస్ మేట్ జలజ మీకు బాగా తెలుసుకదూ? ఆమె అక్క మీనాక్షి ఇరవయ్యేళ్ళకె విధవ అయింది ఊరికే ఇంట్లో ఉంచడమెందుకని ఆమెను ఎం.ఎ.లో చేర్పించారు తల్లితండ్రులు. ఇప్పుడామె గర్భవతి. గర్భం ప్రసాదించినవాడు వివాహానికి సుముఖంగా లేడు. అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికి ముప్పు అందట డాక్టరు. ఇప్పుడేం చేయాలి? బ్రతుకు మీద తీపిచస్తే ఒంటి మీద కిరోసిన్ టిన్ను ఒంపుకొని ఒళ్ళు తగలబెట్టుకోవాలి! కాస్త తీపి ఉన్నదైతే ఆ బిడ్డను ఎక్కడో అజ్ఞాతంలో కని పారేసి రావాలి."
"ప్చ్. అలా ఎలా జరిగింది? ఈ చదువుకొన్న వాళ్ళు కూడా ఇంత తేలిగ్గా ఎలా బోల్తా పడతారబ్బా? భవిష్యత్తు ఏమిటన్న ఆలోచన రాదా?" విస్మయంగా బుగ్గన వేలుంచుకొంది సువర్చల.
"సృష్టి చిత్రంలో వయసు కవ్వింపు అది ఆ సమయంలో ఏ ఆలోచనా రాదేమో."
"అతడు వివాహానికి ఎందుకు సుముఖంగా లేడట?"
"అది అడగాల్సింది అజయ్ ని." ప్రేమీ గొంతు ఖంగుమంది.
"అజయ్ నా? అతడి కేం తెలుసు?" సువర్చల ముఖం పాలిపోయినట్టుగా అయింది.
"అతడికి తెలుసు. అడగండి ఆంటీ."
అజయ్ ముఖం కందగడ్డలా అయిందప్పటికే. "ఆమెకు గర్భం ప్రసాదించినవాడిని నేనేనని ఈ ప్రేమికారాణి రుజువు చేస్తుందటనా?" తల్లివంక తిరిగి కోపంగా అడిగాడు.
"ఆ సంగతి అవసరమైతే బిడ్డ పుట్టాక డాక్టర్లు రుజువు చేస్తారు." నిర్లక్ష్యంగా అంది ప్రేమీ. "తనకి తప్పించుకోవాలని ఉంటే తప్పించుకోనీ. అనవసరంగా తనకి సుఖాన్ని పంచిన ఆడదాన్ని వ్యభిచారిగా చిత్రంగా వద్దని చెప్పండి, ఆంటీ, మీ కొడుక్కి! మీనాక్షి ఏడుస్తున్నది ముఖ్యంగా ఇందుకే. 'తాళి కట్టినవాడికి తప్ప మరెవరికీ ఈ శరీరాన్ని అర్పించినా, దాన్ని అనుభవించిన మగవాడి దగ్గరి నుండి అందరూ కులటగా, లూజ్ కారెక్టర్ కలదాన్నిగా చూస్తా రెందుకు?' అని కుములుతుంది తాళికట్టి అర్ధాంగిని చేసుకోడానికి ఎవరూ వాసన చూడని స్వచ్చమైన కన్నెపిల్ల కావాలి. వల విసిరి అనుభవించడానికి మాత్రం ఎవరైనా ఫర్వాలేదు. ఏం మగజాతి ఇది?"
సువర్చల తొందరలేనట్టుగా నెమ్మదిగా పుస్తకం టీపాయ్ మీద పెట్టి లేచి కొడుకు ముందుకు వచ్చి నిలబడింది. సూటిగా అతడి కళ్ళలోకి గ్రుచ్చి చూస్తూ గంభీరంగా అడిగింది. "ఆ అమ్మాయితో నీకు సంబంధముందా లేదా? ఈ ఒక్కదానికీ జవాబు చెప్పు."