"అవును గురూ! నువ్వు మైండ్ పాడుచేసుకోకు. దాన్ని కట్టేసి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాం. జన్మంతా నీకు దాసిగా వుండేలా చేస్తాం" అన్నాడు గంగాధర్.
"నాకేం తక్కువ. అందం తక్కువా? పర్సనాలిటీ లేదా? ఆస్తికీ, అంతస్థుకీ లోటా?"
"అది బుద్దిహీనురాలు గురూ! నీ గొప్పతనం ఆలం...అర్ధం చేసుకోవటంలేదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి రేప్ చేసిపారెయ్యటమే" అన్నాడు చిన్నారావు గ్లాసులో మిగిలిన విస్కీ నంతా ఒక్కసారిగా ఒంపు కుంటూ. అతని కింతవరకూ ఆడపిల్లని రేప్ చేసే అవకాశం రాలేదు. ఆ అనుభవమెలా వుంటుందో చూడాలని ఎన్నాళ్ళబట్టో గుటకలు వేస్తున్నాడు.
రేప్! తానే చిన్న వయసులోనే ఎంతో మంది ఆడపిల్లల ననుభవించాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. కాని బలాత్కారంగా ఏ అమ్మాయిని అనుభవించేటంత అవసరమెన్నడూ కలగలేదు.
కాని ప్రజ్ఞ! ఆమెను చూస్తేనే మనసు ఉరకలెత్తుతోంది. శరీరంలోని ప్రతి అణువూ ప్రతి రక్తబిందువూ సెగలు చిమ్ముతోంది. ఆమె తనకి కావాలి. అంతే. తనదాన్ని చేసుకుని తీరాలి.
ప్రతాప్ కూడా మౌనంగానే వున్నాడు. అతనీ బ్యాచ్ లో వచ్చి చేరింది కేవలం ఒకే ఒక ఉద్దేశంతో. ఆ ప్రజ్ఞ అన్నయ్య తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. ఆభమూ శుభమూ తెలీని ఆ అమాయకురాలు కేవలం అతని కోసమై ఆత్మహత్య చేసుకుంది. ఆ కసితో అతన్ని చంపబోతే తననే పొడిచి యించుమించు మృత్యువుకు దగ్గరగా తీసుకెళ్ళి పరారీ అయిపోయాడు. వాడింక దొరకడు. వాడు తన కుటుంబానికి చేసిన అపకారానికి ప్రతీకారంగా వాడి చెల్లెలు జీవితాన్ని నాశనం చేసి పారెయ్యాలి. దాన్ని ఓ పువ్వుని నలిపినట్టు నలిపి పారెయ్యాలి. అందుకుగాను యోగిని, అతని శక్తినీ ఉపయోగించుకోవాలి.
ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవించింది.
"కాని యిక్కడ ఒక్క విషయం జరుగుతోంది" అన్నాడు యోగి తిరిగి ఆ నిశ్శబ్దానికి భంగం కలిగిస్తూ.
"ఏమిటది?" అన్నాడు అవధాని గ్లాసులో విస్కీ ఒంపుకుంటూ.
"మా అన్నయ్య ప్రజ్ఞతో చాలా యింటిమేట్ గా వుంటున్నాడు. వాళ్ళిద్దరి వ్యవహారం ముదురుతోన్నట్లుగా అనుమానంగా వుంది."
"దగ్గర దగ్గరగా జరుగుతూ వ్యవహారం దూరం తీసుకెడుతున్నారా?"
"అనే అనిపిస్తోంది. అన్నయ్య సంగతి నాకు బాగా తెలుసు. అతని మనస్సు నెవరూ యింతవరకూ ఆకట్టుకోలేదు. ఇప్పుడింత క్లోజ్ గా వున్నాడంటే బహుశా పెళ్ళివరకూ వెళ్ళవచ్చు."
"పర్వాలేదు, ఇంతకన్నా గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళని, ఒకరి కొకరు అతుక్కుపోయిన వారిని విడదీసి చిట్కాలు నాకు తెలుసు."
"ఏం చేస్తావు?"
"ప్రజ్ఞ కేరెక్టర్ మంచిది కాదనీ, ఆమెకు చాలామందితో అక్రమసంబంధాలున్నాయనీ ఉత్తరాల వర్షం కురిపిస్తాను, ఫోన్లు హోరెత్తిం చేస్తాను."
"అంత తేలిగ్గా నమ్మడని నా ఉద్దేశం. ఏమయినా ఆలస్యం జరగటం మంచిది కాదు. ఇవాల్టినుంచి సరిగ్గా మూడు రోజుల్లోపల ప్రజ్ఞ నాశనమై తీరాలి. ఈ ప్రయత్నంలో నేను ఓడిపోయి అన్నయ్యే దాన్ని పొందగలిగితే అన్నయ్యే నా ప్రథమ శత్రువు అవుతాడు. అప్పుడతని..."
మాట మధ్యలో ఆపేశాడు. కళ్ళు ఎర్రబడి నిప్పులురాలుస్తున్నాయి. ప్రపంచంలోని పైశాచికత్వమంతా అతని మొహంలో నిభిడీకృతమై వుంది. ఆ క్షణంలో అతనివంక చూసి ఎన్నో దుష్ట సంఘటనలను చవిచూసిన ఆ స్నేహితులు కూడా ఉలిక్కిపడ్డారు.
రాత్రి పన్నెండు దాటిపోయింది. రెండు బాటిల్స్ పూర్తిచేసి, స్నేహితులందరూ తూలుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. గదిలో యోగి ఒక్కడే మిగిలాడు. కాంచన లోపల్నుంచి వచ్చింది.
"యోగీ!" అని పిలిచింది.
కళ్ళు బరువుగా విప్పి ఆమెవైపు చూశాడు. "ఊ?"
"ఇంత తాగి యిప్పుడు యింటికేం వెడతావు. పడుకుందువుగాని రా" అంది. అతని బుజం మీద చెయ్యివేసి లేవదీస్తూ.
ఆమెనాధారంగా చేసుకుని లేచి నిలబడ్డాడు. ఒక్కొక్క అడుగూ కష్టంమీద వేసుకుంటూ ఆమె వెంట లోపలకు నడిచి వెళ్ళాడు.
కాంచన అతన్ని మంచంమీద పడుకోబెట్టి ప్రక్కనే కూర్చుని గాలి ఆడటానికన్నట్లుగా షర్టు పై గుండీ ఊడదీసింది.
"యోగీ!"
"ఊ"
"నువ్వు చేస్తోన్న పని చాలా తప్పు."
"నా...నిఘంటువులో...తప్పు...అనే పదం లేదు."
"ఓ ఆడదాన్ని సాధించాలని దేనికంత పంతం?"
"పంతం లేనిదే జీవితంలో...రుచి లేదు...కాంచనా!"
"నీక్కావల్సిన అన్ని రుచులూ నేనందిస్తాను. ఆ అమాయకురాలి జీవితం నాశనం చెయ్యకు."