అతనామె వంక దీనంగా చూశాడు. "నేను మానవత్వంలేని పశువుని కాదుగాని, నాకంత ధైర్యం, విశాల హృదయం లేవు ప్రజ్ఞా!" అన్నాడు.
భరించనలవికాని వ్యధతో, వేదనతో ఆమె ముఖం విషాదభరితమై పోయింది.
'మనుషులెంత స్వార్ధపరులు' అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూన్నట్టు.
చీకట్లో గోపీకృష్ణ ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ యింటిని సమీపిస్తున్నాడు. ఇంటి చుట్టుప్రక్కల పోలీసులుగాని, అస్మిత యింట్లో వాళ్ళుగాని కాపుగాచి వున్నారేమోనని అతనికి చాలా భయంగా వుంది. కాని చాలా అలసటగా, నీరసంగా వుండటంచేత యిహ బయట తిరగలేక పోతున్నాడు.
ఇల్లింకా యాభయి గజాల దూరంలో వుంది.
వీధంతా నిర్మానుష్యంగా వుంది. అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తోన్న గోపీకృష్ణ తృళ్ళిపడ్డాడు. అతని ప్రక్కకి మెరుపులా ఎవరో దూసుకొచ్చాడు.
"ఒరేయ్! నా చెల్లెలు చచ్చిపోవటానికి కారణమై వుండి తప్పించుకుపోదామనుకుంటున్నావా, నీ అంతుచూసి కాని వదల్ను" ఓ యువకుడు అతని మెడమీద చెయ్యివేసి నొక్కుతూ బలంగా క్రిందకి తోశాడు.
విసురుగా వెళ్ళి గోపీకృష్ణ క్రిందపడిపోయాడు.
ఏం జరుగుతుందో తెలీటం లేదు. మొహం మీదా, పొట్టలో దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మొహం చాలా చోట్ల పగిలి నెత్తురు కారుతోంది. కడుపులో ప్రేవులు బాధతో తోడేస్తున్నాయి.
"ఇంతటితో వదలనురా, నిన్ను చంపి పారేస్తేగాని నా కసి తీరదురా."
గోపీకృష్ణ ఆ స్థితిలో కూడా భయంతో వొణికి పోయాడు.
అవతలి వ్యక్తి చేతిలో తెల్లగా ఏదో మెరిసింది. కన్నుమూసి తెరిచేటంతలో అతను గోపీకృష్ణ మీదకు దూకాడు.
వంట్లో వున్న శక్తినంతా కూడదీసుకున్న గోపీకృష్ణ , మెరుపు వేగంతో ప్రక్కకు దొర్లాడు. కత్తితో పొడుద్దామని మీదకు దూకిన ఆ వ్యక్తి బ్యాలెన్స్ తప్పి ప్రక్కకి పడిపోయాడు.
గోపీకృష్ణ గభాల్న లేచి పరిగెత్తబోయాడు.
ఆ వ్యక్తి చప్పున రెండో చేత్తో అతని కాలు పట్టుకుని లాగాడు. గోపీకృష్ణ పట్టుతప్పి అతని మీద పడిపోయాడు. పడిపోతూ బలమంతా ఉపయోగించి పిడికిలి బిగించి అతని మొహం మీద ఓ ముష్టి ఘాతం ప్రయోగించాడు.
"వొరేయ్! నన్ను..." అంటూ ఆ వ్యక్తి చేతిలోని కత్తితో గోపీకృష్ణను పొడవబోయాడు.
గోపీకృష్ణ లాఘవంగా అతని చేతిని మణికట్టు దగ్గర పట్టుకుని నేలకేసి బాదాడు.
ఆ వ్యక్తి బాధతో గిలగిల్లాడి కత్తి వదిలేశాడు.
గోపీకృష్ణ చప్పున కత్తినందుకున్నాడు. తననెక్కడ పొడుస్తాడోనన్న భయంతో రెండుచేతుల్తో అతన్ని గట్టిగా పట్టుకోబోయాడు.
కత్తికోసం యిద్దరూ పెనుగులాడుతున్నారు. ప్రాణభయంతో గోపీకృష్ణ శరీరంలోని శక్తినంతా ధారపోసి పోరాడుతున్నాడు. అతనికి ఒక విషయం అర్ధమైంది. అవకాశమొస్తే అవతలి వ్యక్తి తనని పొడిచిపారేస్తాడు.
అతన్నుంచి తప్పించుకోవాలంటే అతన్ని పొడవాలి. లేకపోతే అతనికాహుతి అవ్వాలి.
ఒకే ఒక్కక్షణం...గోపీకృష్ణకు అవకాశం వచ్చింది. కత్తివున్న చెయ్యిమీద అవతలివాడి పట్టు తప్పింది.
గత్యంతరం లేదు _ ఆలోచించటానికి వ్యవధి లేదు. బలమంతా ఉపయోగించి అవతలవాడి ఛాతీలో పొడిచేశాడు.
"అమ్మో" అన్న హృదయవిదారకమైన ఆర్తనాదం.
గోపీకృష్ణ షాక్ నుంచి తేరుకున్నాడు. కత్తి వదిలేసి లేచి నిలబడి ఆ చీకట్లో పరిగెత్తసాగాడు.
15
ఓ మోస్తరు విశాలంగా వున్న ఆ గదిలో యోగి కాకుండా యింకా నలుగురు యువకులు కూర్చుని వున్నారు. అందులో ముగ్గురు అతనితో నిత్యం తిరిగేవారే. ఒకతని పేరు గంగాధర్. రెండో అతను అవధాని. మూడో అతను చిన్నారావు. నాలుగో యువకుడే ఆ బ్యాచిలోకి కొత్తగా వచ్చి చేరాడు. అతను ప్రతాప్ కత్తిపోటు ప్రమాదంనుంచి బయటపడి నాలుగు రోజుల క్రితమే హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయి వచ్చాడు.
అందరి చేతుల్లో విస్కీ గ్లాసులున్నాయి.
"ఇంతకాలం యీ ఊళ్ళో ఎదురు లేకుండా తిరిగాను. ఆఫ్ ట్రాల్! ఓ ఆడదాన్ని సాధించలేక పోవడమా? నాకు తల కొట్టేసినట్టుగా వుంది" అన్నాడు యోగి గ్లాసులో విస్కీని వొంపుకుంటూ.
"నువ్వనవసరంగా యీ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు గురూ! నువ్వు గమ్మునుండు. వ్యవహారమంతా మేము నడిపిస్తాం" అన్నాడు అవధాని. అవధాని మాటల్లో పస ఎక్కువ, పనితనం తక్కువ.పైగా మనిషి భయస్థుడు. కొన్ని కొన్ని స్వార్ధపుటాలోచన్లతో కుటుంబసబంధమైన వ్యవహారాలు పరిష్కరించుకునేందుకు అండగా పెట్టుకోవాలని యీ గ్రూప్ లో చేరాడు. తానెక్కువగా ఉపయోగపడటం కన్నా వాళ్ళను తన అవసరాలకోసం ఉపయోగించుకుంటూ వుంటాడు.