Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 45

    ఆమెకు కోపమొచ్చింది. ముందుకు వొంగి అతని మొహంమీదకు మొహం వంచి మునిపంటితో అతని పెదిమను గట్టిగా కొరికింది.

    కందిరీగ కుట్టినట్టు భగ్గుమంది. చిన్న రక్తపుచుక్క బయటకు చిమ్మింది.

    "రాక్షసీ!" అన్నాడు.

    "రాక్షసినే. ఆమెకుగాని, మీ అన్నగారికిగాని  అపకారం తలబెడితే  పొడిచి చంపుతాను."

    చెంప చెళ్ళుమంది. కళ్ళముందు చుక్కలు  మెరిశాయి.

    "అనవసరమైన విషయాల్లో జోక్యం  చేసుకోవటం మంచిది కాదు."

    అతని రెండు చేతులూ ముందుకు సాగి ఆమెను చుట్టివేసి మీదకు లాక్కున్నాయి.

    కళ్ళనిండా  నీళ్ళతో, అర్ధంలేని  నిస్సహాయతతో  ఆమె అతనిమీదకు వ్రాలి పైశాచిక శృంగారంలో పెనవెయ్యబడుతోంది.


               *                        *                    *


    చేతిలోని ఇన్ లాండ్ లెటర్ ని చదివి  టేబుల్ మీద పడేశాడు డాక్టర్ దయాకర్.

    ఎవరో అపరిచిత వ్యక్తి రాసిన ఉత్తరమది. ప్రజ్ఞా, తాను ఎలా ప్రేమించుకున్నారో, ఆ ప్రేమ మైకంలో ఎటువంటి అద్భుతమైన ప్రణయ కలాపాల్లో లీనమయ్యారో, జీవితంలో మరిచిపోలేనట్లుగా ఆమె తన కెటువంటి అమర సుఖాలనందించిందో  వివరంగా  రాశాడు. ఆమె తనకు ఎన్నో ఆశలు  కల్పించిందనీ,  యిప్పుడు ఆమె జీవితంలోకి దయాకర్  ప్రవేశించటం వల్ల  అతని  ప్రభావంలోపడి  తనను  నిరాకరిస్తోందనీ, యిది న్యాయంగాదనీ...యిలా చాలా చాలా రాశాడు.

    ఇంతలో టేబుల్ మీది ఫోన్ మ్రోగింది. రిసీవర్ అందుకుని "డాక్టర్ దయాకర్" అన్నాడు.

    "నేను మీకు అపరిచితుడ్ని" అతల్నుంచి ఓ కటువైన  స్వరం వినవచ్చింది.

    "ఏం కావాలి?"

    "నా స్నేహితుడు మీకో ఉత్తరం  రాశాడు. అందిందా?"

    "ఏ ఉత్తరం?"

    "ప్రజ్ఞ గురించి."

    "అందింది."

    "ఏం నిర్ణయం తీసుకున్నారు?"

    "ఆ ఉత్తరం చదివాక  ఆమె మీద వున్న  మమకారమింకా  ఎక్కువయింది."

    "అయితే అందులోని విషయాలు నమ్మటంలేదా?"

    "నమ్మక పోవటమే కాదు. అటువంటి  అవినీతికరమైన పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాసినందుకు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాను."

    "నిజం చెబితే మీకు అవినీతిగా వుంది."

    "నేనిష్టపడిన వ్యక్తి మీద నేరాలు చెప్పటానికి మీకు హక్కేముంది?"

    "నేరాలు కాదు. నిజం."

    "ఆమె నా మనిషి కాబోతున్నప్పుడు  మంచీ_చెడూ ఏ విషయం కూడా మాట్లాడే హక్కు మీకు లేదు."

    "ఆమె మీ మనిషి  కాబోతున్నదా ! ఆలోచించే మాట్లాడుతున్నారా?"

    "అన్నీ ఆలోచించుకునే  మాట్లాడుతున్నాను."   

    "బహుశా  నా గురించి  నీకు తెలీదనుకుంటాను" అన్నాడీసారి_'నువ్వు' అని సంబోధిస్తూ.

    "నీలాంటి  నీచుల గురించి  తెలుసుకునే  అవసరం లేదు."
   
    "ఇలా మాట్లాడినందుకే  యిద్దరు  ముగ్గురు శాల్తీలకు  భూమ్మీద నూకలు చెల్లిపోయాయి. ఓ ఎస్ ఐ. నా మీద తిరగబడ్డానికి  ప్రయత్నించినందుకు వాడి మొహంమీద తారు గుమ్మరిస్తే  జీవితాంతం రూపం పోగొట్టుకుని బతికే దుర్గతి ఏర్పడింది."

    "బెదిరిస్తున్నావా?"

    "ప్రజ్ఞకు  నువ్వు దూరం కాకపోతే  జరగబోయే  ఘాతుకాన్ని  హెచ్చరిస్తున్నాను"

    "నువ్వు, నీలాంటి నీచులు  వెయ్యిమంది  ఎన్ని హెచ్చరికలు  చేసినా ప్రజ్ఞకు నేను దూరం కాను, కాబోను" అంటూ దయాకర్ విసురుగా రిసీవర్  పెట్టేశాడు.

    ఓ నిమిషం తర్వాత మళ్ళీ ఫోన్ మ్రోగింది. అతను ఫోన్ వంక చూస్తూ వూరుకున్నాడు. రిసీవర్ మీద చెయ్యి వెయ్యలేదు.

    కాసేపు మోగి  ఆగిపోయింది.

    మళ్ళీ ఫోను.

    అతను అలాగే చూస్తూ ఊరుకుండిపోయాడు. రిసీవర్ తీసి ప్రక్కనే పెట్టేద్దామా అనుకున్నాడు. కాని అతన్లోని సంస్కారం  ఒప్పుకోలేదు. పైగా తాను డాక్టరు. ఎమర్జన్సీ కాల్స్ వస్తూ వుంటాయి.

    ఫోనాగిపోయింది. 
     
    రెండు నిమిషాలు గడిచాయి.

    ఫోన్ మళ్ళీ మ్రోగసాగింది.

    ఇహ  ఊరుకోలేక  రిసీవర్  చేతిలోకి తీసుకొని  చెవిదగ్గర పెట్టుకున్నాడు. వెంటనే  అతని ముఖ  కవళికలు మారిపోయాయి.

    "అయ్యగారూ ! అయ్యగారూ!"  అంటోంది యింట్లోంచి  పనిమనిషి గొంతు  చాలా ఆందోళనతో. "మీరేనా యిందాకట్నుంచీ  ఫోన్ చేస్తున్నానండీ. ఎవరూ అందుకోవడం లేదు."  

 

 Previous Page Next Page