Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 43

   
    శేఖర్ తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న దగ్గిరనుంచీ అంతులేని ఆనందంతోను, అవ్యక్తమైన ఆందోళనతోనూ, మనసు ఉద్వేగాలతో ఊగిపోతూ ఉండటంచేత సుశీల సరిగా నిద్ర పోలేకపోతోంది. ఆ కారణంచేత లలిత సాంబశివం గదిలోకి వెళ్ళటం గమనించింది. చాలా ఆనందించింది. ఆ క్షణంలో తన ఆనందం ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది-శేఖర్ కి ఫోన్ చేసింది.    
    "శేఖర్! నాకు చాలా చాలా ఆనందంగా ఉంది."    
    అవతలివైపు నుండి శేఖర్ కంఠం కూడా చాలా ఉత్సాహంగా వినిపించింది.    
    "నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సుశీ! మన ప్రయాణానికి ఏర్పాట్లన్నీ ఇంచుమించు పూర్తయినట్లే! ఇంకొక్క పదిహేనురోజుల్లో డేట్ కూడా నిర్ణయమయి పోతుంది....."    
    తనలోతను నవ్వుకుంది సుశీల.
    
                                     20
    
    హోటల్ లో దొంగనోట్ల మారకం జరుగుతోందే కాని ముద్రణ జరగటంలేదని గ్రహించాడు మోహన్. సాంబశివాన్ని  సాధ్యమయినంతగా కనిపెట్టి హోటల్ కు ఇంటికేకాక సాంబశివం వెళ్ళే ప్రదేశాలు తెలుసుకోమని చిరంజీవికి చెప్పాడు. చిరంజీవి చురుకైనవాడు. సాంబశివం కార్యక్రమాలగురించి పూర్తి రిపోర్టు మోహన్ కు అందించాడు.    
    "సాంబశివం రోజూ క్లబ్ కు వెళతాడు సార్? ఖరీదైన క్లబ్ లన్నింటిలోను ఆయనకు మెంబరుషిప్ ఉంది. బార్ కు కూడా వెళతాడు. ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళడు కాని ప్రముఖులయిన రాజకీయనాయకులతో ఎలాగో ఒకలాగా స్నేహం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు, వాళ్ళను పార్టీలకు ఆహ్వానిస్తాడు. ఏం చిత్రం! ఒక ఇంట్లో ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ కి వెళుతుండగా ఒకటి రెండుసార్లు చూశాను......"    
    చిరంజీవి మొదటిమాటలన్నీ యధాలాపంగా విన్న మోహన్ చివరి మాటలు వినగానే ఎలార్టుగా అయాడు.    
    "ఎవరిదాయిల్లు?"    
    "తెలియదు సార్! ఎప్పుడూ తాళంవేసి ఉంటుంది. ఇంటిముందు ఘూర్ఖామాత్రం ఉంటాడు. ఇల్లు చిన్నది కాని కాంపౌండ్ విశాలంగా ఉంటుంది. పెద్ద గార్డెన్, ఆ సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండేది తోటమాలి అనుకుంటా."    
    "నాకా ఇల్లు చూపించగలవా?"    
    "ఓ యస్......."    
    ఆరోజే చిరంజీవితో కలిసి ఆ ఇంటికి వెళ్ళాడు మోహన్ ఆ యింటిని చూడగానే అతని నవనాడులు క్రుంగిపోయాయి. ఆ యిల్లు మోహన్ కి బాగా తెలుసు, అది చాలా పలుకుబడి ఉన్న ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిది. అతను ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటారు. ఎప్పుడైనా వచ్చినపుడు ఈ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు మాత్రం ఈ ఇల్లు సందడిగా ఉంటుంది మిగిలిన సమయాల్లో తాళంవేసి ఉంటుంది. ఇదివరలో ఈ విషయం అతిమామూలుగా తోచింది మోహన్ కి! ధనవతులకు దేశంలో అనేకచోట్ల ఇల్లు ఉండడంలో ఆశ్చర్యంలేదు. డబ్బుంటే లక్ష్యం లేదు గనుక కొన్ని కొన్ని ఇళ్ళు అద్దెకివ్వకుండా వాళ్ళకిందే ఉంచుకుంటారు.    
    కానీ, ఇప్పుడు - సాంబశివం ఆ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ కి వెళుతున్నాడనే విషయం విన్నాక అనేక ఆలోచనలు ముసురుకున్నాయి. సాంబశివం తర తమ భేదాలెన్నక సేవకులతో స్నేహం చేసే రకంకాదు, ఏదైనా పని ఉన్నా అలాంటి వాళ్ళను తన కాళ్ళదగ్గిరకు రప్పించుకుంటాడేగాని తానై వెళ్ళడు.    
    ఎన్ని అనుమానాలున్నా ఏమైనా, తనా ఇంటిని సోదా చెయ్యటానికి వీల్లేదు. ఆ వ్యక్తి తలచుకుంటే తన లాంటి వాళ్ళను ఏమైనా చేయగలడు. అందుకు భయం లేదు. కానీ తనది అనుమానం మాత్రమే. అది నిజమని దృఢ పరుచుకోవడానికి ఆధారాలు దొరకాలి! అలాంటి ఆధారం దొరికితే రైడ్ చెయ్యటానికి ఎవ్వరికీ భయపడడు. కానీ ఏమీచేయకుండా తను ఎటు అడుగు కదిపినా, ఆపదలూ, అవమానాలూ, కొనితెచ్చుకోవడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.    
    కానీ, తన అనుమానం నిజమో, నిరాధారమో ఎలా తెలుస్తుంది? నిజమే అయితే సాంబశివం తగిన జాగ్రత్తలోనే ఉంటాడు. సాంబశివం దగ్గర నమ్మకం సంపాదించుకొన్న వాళ్ళు ఎవరైనా ఉంటె గాని ఇది సాధ్యంకాదు.    
    విషయం అర్ధంచేసుకున్న చిరంజీవి ఆలోచనలో పడ్డాడు అతనికేదో మెరుపులా స్ఫురించింది. "కొంచెం టైమివ్వండి, సార్! నేనొక ఉపాయం ఆలోచిస్తాను-" అన్నాడు.    
    "ఆలస్యమవుతున్నకొద్దీ పరిస్థితి మరింత పాడవుతుంది. చిరంజీవి!" చికాకుగా అన్నాడు.

 Previous Page Next Page