Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 44


    మధ్యాహ్నం ఒంటిగంటకల్లా వచ్చాడతను మళ్ళీ.
    "మయూరీ! ఇదిగో నా కారుతాళం చెవి. మీరు వెళ్ళి కారులో కూర్చోండి! నేనువస్తున్నాను" తాళంచెవి తన ముందుపడేశాడు.
    మయూరి తాళం చెవి అందుకుంది.
    ఇద్దరూ కలసి వెళ్ళటం ఆఫీస్ స్టాఫ్ కి అనుమానంకలిగిస్తుందని అతని భయం. కారు డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చుందామె. మరో రెండునిమిషాల్లో వచ్చేశాడతను.
    కారు గండిపేట వేపు బయలుదేరింది. అక్కడే భోజనం చేయసాగారిద్దరూ.
    "ఇందాక మీరో మాటన్నారు.......మానసికవత్తిడి అని! ఏమిటది?"
    "మీకు చెప్పినందువల్ల మీ మనసు కూడా పాడవుతుంది."
    "అయినా సరే మయూరీ! ఐ వాంట్ టు నో! మీకేమయినా సహాయం చేయగలనేమోచూడాలి!"
    "మీరనుకుంటున్నట్లు నేను అన్ మారీడ్ కాదు! కొద్ది నెలలక్రితం నాకు పెళ్ళయింది!"
    రమేష్ ఆశ్చర్యపోయాడు.
    "మై గాడ్! మీరు మారీడా?"
    "చెప్పాను కదా! కొద్దినెలల క్రితం మా వాళ్ళంతా బలవంతంచేస్తే పెళ్ళికి వప్పుకున్నాను. తీరా పెళ్ళయ్యాక తెలిసింది. వాడు పెద్ద గూండా! ఎన్నో హత్యలుచేశాడు. వాడి మీద ఎన్నో పోలీస్ కేస్ లు ఉన్నాయ్. పైగా తాగుబోతు, వ్యభిచారి, ఒకటికాదు, వాడికి లేనిదుర్గుణాలు లేవు"
    రమేష్ తెల్లబోయివింటున్నాడు.
    "అన్నీ తెలిశాక నేను నిర్ణయం తీసుకున్నాను. వాడిని వదిలి నాజీవితాన్ని నేను గడపాలని! అందుకే మా ఇంటికొచ్చిఉండిపోయాను. ఇది జరిగి అయిదారు నెలలు అవుతోంది. ఈలోగా వాడునన్ను బలవంతంగా కాపురానికి తీసుకెళ్ళడానికి ఎన్నో పద్దతుల్లో ప్రయత్నాలు చేశాడు. అయినా గానీ నేను లొంగలేదు. ఇంకనీకూ నాకూ సంబంధంలేదని చెప్పాను.
    విడాకులు తీసుకోబోతున్నానన్నాను.
    విడాకుల కొప్పుకోవాలంటే తనకు ఐదు లక్షలు కాష్ కావాలన్నాడు.
    నా దగ్గర లేదుపొమ్మన్నాను.
    అప్పుడప్పుడు వచ్చి అయిదు లక్షలు ఇమ్మని బెదిరిస్తూంటాడు. లేదా తనతో కాపురానికి రమ్మంటాడు. వాడు వచ్చిన రోజంతా మనసు బాగోకవిపరీతంగా ఆలోచించేసరికి తలనొప్పి పట్టుకుంటుంది."
    రమేష్ కి ఆమె కథ వినేసరికి ఆనందం, జాలీ రెండూ కలిగినయ్.
    ఆమెను శాశ్వతంగా తనతోనే ఉంచుకుంటే బావుండుననిపించింది. ఒక వేళ ఆమె కోరితే ఆమెను రెండో భార్యగా చేసుకోడానికి కూడా తనకు అభ్యంతరంలేదు.
    కానీ ఆమె భర్తను వదిలించుకోవటం ఎలా?
    అయిదు లక్షలంటే సామాన్య మయిన విషయం కాదు గదా! అయినా ఆమెకు విడాకులిస్తే తనకేం- ఇవకపోతే తనకేం? తనకు కావలసింది మయూరి. ఆమెని కనీసం ఒక్కసారయినాగానీ అనుభవిస్తే గానీ తనకు మనశ్శాంతి ఉండదు.
    "మయూరీ! నీకు ప్రస్తుతం మనశ్శాంతి కావాలి! సమస్యలన్నీ మర్చిపోయి ఆనందంగా  గడపాలి! ఈరోజు మనం ఇక్కడే కాటేజ్ లో ఉండిపోదాం! ఏమంటావ్?"
    "అమ్మో! ఇంకేమయినా ఉందా?" భయంగా అంది.
    "ఏమిటలా భయపడుతున్నావ్?"
    "నేను సాయంత్రం ఆరు గంటలకల్లా ఆఫీస్ నుంచి బయటకురాకపోతే వాడికి తెలసిపోతుంది. ఇంకెవరితోనే ఎక్కడికోవెళ్ళానని!"
    "తెలిస్తే తెలియనీ! ఏం చేస్తాడు?"
    "వాడి సంగతి మీకు తెలీదు. ముందే వార్నింగిచ్చాడు. ఇంకెవరితోనయినా సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిందంటే అతనినీ నిన్నూ కూడా చంపేస్తానని హెచ్చరించాడు. ఆ భయంతోనే మీకుదగ్గరవాలని ఉన్నాదూరంగా మసులుతున్నాను."
    రమేష్ కి ఆమె మీద జాలీప్రేమా కలిగినయ్.
    చప్పున ఆమెను దగ్గరకు తీసుకుని పెదాలమీద ముద్దుపెట్టుకున్నాడు. కానీ ఆ పెదాల వేడి చవిచూశాక అర్ధమయిందతనికి.
    ఆమె కూడా విరహంతోకాగిపోతోంది. తనపొందుకోసం పరితపించిపోతోంది. ఆమె చేతులుఅతని మెడను చుట్టేసినయ్.
    తనకంటే ధైర్యంగా, బిడియంలేకుండా కలబడి ముద్దుపెట్టుకుంటోంది.
    ఆమె స్పర్శ శరీరమంతా అలుముకుపోతూంటే రమేష్ కి ఆమె మీద కోరికమరింత పెరిగిపోతోంది.
    'క్లిక్' మన్న చప్పుడువిని ఇద్దరూ ఉలిక్కిపడికౌగిలి విడివడ్డారు.
    ఎదురుగ్గా కెమెరా పట్టుకునినిలబడి వున్నాడు ఓ వ్యక్తి. ఇద్దరూ తేరుకునేలోగానే మరో రెండు స్నాప్ లు కొట్టాడతను.
    రమేష్ భయంగా, కోపంగా లేచి నిలబడ్డాడు.
    "ఏయ్ ఎవర్నువు? ఏం చేస్తున్నావ్" అంటూ అతని దగ్గరకు నడిచాడు.
    అతను అప్పటికే కెమెరాని బాగ్ లో పెట్టేసుకున్నాడు.
    "మంచి సీను కదా! అందుకనితీశాను" నవ్వుతూ అన్నాడు.
    రమేష్ చటుక్కున అతని చొక్కా పట్టుకున్నాడు.
    "ఏయ్......మర్యాదగా ఇటివ్వు ఆ రీలు."
    "భలేవాళ్ళే! వీటి ఖరీదు ఎంతనుకున్నారు? లక్షరూపాయలు. చెయ్యితీయండి కాలర్ మీదనుంచి! నేనూ కరాటే బ్లాక్ బెల్ట్ నే!"
    రమేష్ అతనిని బలంగాకొట్టబోయాడు గానీ అతను అమాంతం గాల్లోకెగిరి నడుము మీద తన్నాడు.
    రమేష్ వెల్లకిలా పడ్డాడు. అతని తలకుగట్టి దెబ్బే తగిలింది. 'అబ్బా' అంటూ కిందపడి మళ్ళా లేచి కూర్చోడానికి ప్రయత్నించసాగాడు.
    ఆ వ్యక్తి రమేష్ దగ్గరకొచ్చాడు "అలా బలప్రదర్సన వద్దని చెప్పానా? లక్ష కాష్ కి ఇచ్చేస్తాను." ఊరికే గొడవపెట్టుకోకు.
    రమేష్ లేచి నిలబడ్డాడు.
    మళ్ళీ ఎటాక్ చేయడానికి భయం వేసింది.
    అతను ఓ కార్డ్ రమేష్ మీదకు విసిరేశాడు.
    "ఇదిగో - నా అడ్రస్! తీరిగ్గా కలుసుకుని మాట్లాడుకుందాం?"
    అతను వెళ్ళిపోతూంటే కార్డ్ అందుకుని చూస్తూండిపోయాడు రమేష్.
    మయూరి భయంతో వణికిపోతోంది.
    "అరె నువ్వెందుకలా భయపడుతున్నావ్?"
    "ఈ ఫోటో నా భర్తకు అందిందంటే మనిద్దరికీ మర్డర్ చేసేస్తాడు అంత నీచుడు."
    రమేష్ కి కూడా భయంవేసింది.
    "నీ భర్తకెలా అందుతుంది?"
    "ఏమో! వీడు లక్ష అడుగుతున్నాడంటే నాకేదో అనుమానంగా వుంది."
    "డోంట్ వర్రీ! వాడిని నేను టాకిల్ చేస్తాన్లే-"
    "ఇంక వెళ్ళిపోదాం పదండి! నాకేదో భయంగా వుంది."
    ఆమె చేయి పట్టుకుని కారు దగ్గరకు నడిపించుకెళ్ళాడతను.

 Previous Page Next Page